Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue141/398/telugu-serials/vedika/vedika/

 

పని వాళ్ళని పంపేసి, తానే మాకు ‘టీ’ తీసుకుని వచ్చింది ఆంటీ.  

 

‘టీ’ కప్పందుకుని తాపీగా నా వంక చూసారు అంకుల్.  “మీరు లండన్ ట్రిప్పులో ఉండగా, మా ఇంట జరిగిన అనర్ధాల గురించి వినే వుంటావు.  నీ అంచనాలు నీకుంటాయి.  అసలు జరిగింది నీకు చెప్పితేనే, నా గుండెలోని బాధ తగ్గి, మాకు ఊరట కలగవచ్చునని నా ఆలోచన....,” అన్నారు...

 

అంకుల్ జీవితాన్ని కుదిపేసిన సంఘటనల వెనుక అసలు నిజాలు, కారణాలు తెలుస్తాయని ఆత్రుతగా వింటున్నాను. 

 

“మీరంతా లండన్ వెళ్ళాక, రాణి పెళ్లి విషయం పై దృష్టి పెట్టాను.  తనకి అన్నివిధాలా సరి తూగే సంబంధం తెస్తానని బుజ్జగించి చెప్పినప్పుడు, సంతోషంగానే ఉంది రాణి. పకపకా నవ్వింది కూడా.  పైగా ఏమందో తెలుసా?...

‘హీరో ఉదయ చంద్రని చేసుకోవాలని ఉందంటే, .....కుదుర్తుందా డాడీ? నాకు వరుడుగా అతన్ని తేగలవా?’  అంటూ అల్లరిగా అడిగిందమ్మా నా కూతురు,” అంటూ సన్నగా నవ్వారు....

“...హీరో ఉదయ చంద్ర హైయెస్ట్ పెయిడ్ హీరోయే కాక, పేరు పరపతి ఉన్న కుటుంబంలోని వాడు..  అమెరికాలో ఇంజినీరింగ్ చదివాడు. వెరీ స్మార్ట్  ఫెల్లో,  నీకోసం తప్పక ప్రయత్నిస్తాను” అంటూ రాణికి ఆ క్షణంలో ఇంచుమించు మాటిచ్చాను కూడా,” కప్పు నుండి ‘టీ సిప్ చేసారాయన..

నా వంక చూసి పేలవంగా నవ్వారు.

“రాణి విషయంలో ఏదీ సులభంగా సాగదు కదా తల్లి,” అని తరువాత జరిగిన సంగతులు ఒకింత బాధ పడుతూ ఏకరవు పెట్టసాగారు.

 

“నేను మాటిచ్చినట్టే, గట్టి ప్రయత్నాలు చేస్తున్నానని తెలుసుకొని, ఓ రోజు పొద్దున్నే నా వద్దకు వచ్చింది రాణి.  ‘హీరో ఉదయ చంద్రని వరుడుగా తెమ్మనడం, ఒక జోక్  అని,  తనకి జీవిత భాగస్వామి కావలసిన వాడు, తన మనసుకి నచ్చినవాడు, ‘జగదీష్’ మాత్రమేనని,  తన వివాహం అతనితో జరిపించే  ప్రయత్నం చేయమని’ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది,”  మాట తడబడుతూ, అంకుల్. 

 

విని, ఒక్కసారిగా నా గుండె జారినట్టయ్యింది.  అది గ్రహించిందో ఏమో, పక్కనే కూర్చున్న  ఆంటీ నా భుజం పైన చెయ్యి వేసింది. 

....మరి ఆ తరువాత ఏమయింది? .... అని గుండె వేగంగా కొట్టుకుంది...

 

బెరుకుగా, సంశయంగా ఆయన వంక చూసాను.

“ఏం చేస్తాను చెప్పు...తప్పదుగా తల్లీ.   అందుకే, సంబంధం తీసుకొని, మేము ఆశగానే ఢిల్లీ వెళ్ళాము.  తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది. వచ్చే యేడు నీకు-జగదీష్ కి నిశ్చితార్ధం జరగనుందని.   అయితే,  ఇప్పుడప్పుడే రాణికి, ఆ విషయం, తెలియడం  శ్రేయస్కరం కాదని జగదీష్ అన్నదానితో, మేము పూర్తిగా అంగీకరించాము. 

నిరాశ నిస్పృహలతో ఇల్లు చేరాము,” ఆగి ఆంటీ వంక చూశారాయన. 

 

అంటీ నా చేయి తన చేతిలోకి తీసుకున్నారు. “రాణికి,  నీపట్ల ఉన్న అసహనం, జగదీష్ పట్ల ఉన్న ప్రేమ, తెలుసును కాబట్టి, విషయం దాచాలనే అనుకున్నాము. 

జగదీష్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, రాణికి అబద్దం చెప్పాము,”  అని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేక కొంగులో ముఖం దాచుకుంది.   సముదాయించడానికి ప్రయత్నించాను...

కొద్దిసేపటికి కోలుకుని, తలెత్తి నా వంక చూసిందామె.  

 

“జగదీష్, పెళ్ళికి సుముఖంగా లేడని విని అవమానంగా భావించింది రాణి.  అక్కడినుండి మొదలయ్యాయి, దానితో మా అగచాట్లు.  మీ అంకుల్ ని అనరాని మాటలందది..  ఆయన్ని చేతకాని వాడని తిట్టింది.  బిడ్డ కోరికలు తీర్చలేని తల్లితండ్రులు ఉన్నా లేకున్నా ఒకటేనంది..  ఒక మాట కాదు. దానికి మా మీద ఇంతటి ద్వేషం ఎందుకో కూడా అర్ధం కాదు.  ‘జగదీష్’ ఏదో అంగట్లో వస్తువన్నట్లు, అతన్ని తనకి భర్తగా తేలేక పోతే, వాళ్ళ నాన్న పరువు తీస్తానని, తను చస్తానని బెదిరించింది,” మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుందామె.

                                     

అంకుల్ కూడా ఆమెని సముదాయించారు... నేను గ్లాసు లోకి నీళ్ళు వొంపి ఆంటీ చేతికందించాను.

“బాధ పడకు నీరూ,  కనీసం నీవన్నా ధైర్యంగా ఉండాలి,” మందలించినట్టుగా అంకుల్.

 

“అవును ఆంటీ.  అయినా రాణి కోప తాపాలు మనకి తెలిసినవే కదా.  మీరు జగదీష్ విషయం అలా చెప్పినా, ఇంకోలా చెప్పినా,  తను అప్ సెట్  అవడం సహజమే... .

ఏమైనా,  ఇంట్లోనే, మీ మధ్య ఉండ వలసిన ఈ గొడవని, పోలీస్ వరకు ఎందుకు తీసుకు వెళ్లినట్టు?  అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకుంది రాణి?” నెమ్మదిగా తగ్గు స్వరంలో అడిగాను...

 

ఆయన మౌనంగా  కిందకి చూస్తూండి పోయారు... చెప్పడానికి ఆయన ఎంత సంశాయిస్తున్నారో అర్ధమయింది.  కొద్ది క్షణాలకి తలెత్తి నా వంక చూసారు...

 

“ఏం చెప్పనమ్మా? వారం రోజులు ఓపిక పట్టాక, రాణి మితి మీరిన చేష్టలు, గుణ పాఠం చెబుతానని బెదిరించడాలు, భరించలేక పోయాను.  భయ పడితే లాభం లేదని,  ఓ సగటు తండ్రిలా వ్యవహరించాను.  నా ఆధీనంలో ఉన్న దాని బ్యాంక్ అకౌంట్స్  ఫ్రీజ్ చేసి, కార్లని స్టూడియోకి తరిలించి, గట్టిగా మందలించాను. 

నేననుకున్నట్టుగా,  ఏ గొడవా చేయలేదు సరికదా, ఆ తరువాత నాలుగు రోజులు, రాణి నెమ్మదిగానే ఉంది... వచ్చి మాతోనే భోంచేసి, టి.వి చూసేది.

తనలో మార్పు వచ్చిందని సంతోషించాను.  

మరో వారం వరకు కూడా దాన్ని గమనించాను.   ఆ శని వారం పొద్దున్నే మాతో గుడికి వచ్చి, రోజంతా మాతోనే  ఉంది.  ఎన్నడూ లేనిది, మీ ఆంటీతో పాటు కిచెన్ లోకి వెళ్లి, వంట కూడా చేసింది..

రాణిలో వచ్చిన మార్పుతో, అవధుల్లేని ఆనందాన్ని చవి చూసాము ఆ రోజున మేము. 

మా జీవితాల్లో కొత్త సంతోషాలు వస్తాయని,  నమ్మకంగా అనిపించింది,”  నా వంక తదేకంగా చూసారు...

“ఆ మరునాడు,  రాణి పక్కన కూర్చుని, హీరో ఉదయ చంద్ర సంబంధం మాట్లాడతానని, అన్నీ సవ్యంగా జరిపిస్తానని, జగదీష్ విషయం మరిచి పొమ్మని, బుజ్జిగించాను,”

చెప్పడం ఆపారు...

                                                                         

నా గుండె మరో సారి వేగంగా కొట్టుకుంది. 

ఆయన ముఖంలో నిస్పృహ కనబడింది....

“ఆ రోజునే, అర్ధరాత్రి దాటాక, ఫ్రెండ్సుని పిలిపించుకుని వాళ్ళతో వెళ్ళిపోయింది.  తెల్లారాక, బాహాటంగా నా మీద యుద్దమే ప్రకటించింది నా ఒక్కగానొక్క బిడ్డ,” అంటూ కళ్ళు తుడుచుకున్నారు...

 

విషయమంతా విని, అచేతనమయిపోయాను.

కొద్ది నిముషాలకి ఎవరో తట్టినట్టు కోలుకున్నాను.  ఇక విన్నది చాలంది నా మనస్సు.

మెల్లగా తలెత్తి అంకుల్, ఆంటీల వంక చూసాను...

నేలచూపులు చూస్తూ,  దిగులుగా అయిపోయిన  వారివురినీ కూడా తేలిక పరచాలని గుర్తొచ్చింది.

 

కాసిన్ని నీళ్ళు తాగి, గొంతు సవరించుకున్నాను. “అంకుల్, ఆంటీ, మీ మనస్సులోని బరువు కాస్తైన తగ్గుంటుంది! ఇక ఇవాళన్నా  ఆ విషయాలు పక్కన పెట్టి, ఇక్కడి నుండి కదలండి.  అమ్మవారి గుడి తెరిచే ఉంటారు...  దారిలో మాట్లాడుకుంటూ వెళదాము,”  అంటూ పైకి లేచి ఆంటీకి చేయందించాను..

**

మీనాక్షి అమ్మవారికి, ప్రత్యేకంగా నేయించిన చీర-సారె సమర్పించి, అర్చన చేయించాము.  తీర్థ ప్రసాదాలు తీసుకుని, ఆలయ ప్రాంగణంలో ఓ పక్కకి, విశ్రాంతిగా కూర్చున్నాము. 

కాసేపట్లో మొదలవబోయే ‘గీత ప్రబోధకి’ ఎదురుగా ఉన్న హాల్లోకి జనం వెళుతున్నారు.

 

నానుండి కొబ్బరులు అందుకున్న అంకుల్, నా రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకున్నారు.  తడి కళ్ళతో నా వంక చూసారు.  ఆయన బేలతనం నన్ను కలవరపెట్టింది.

 

“అమ్మా కళా, నా కళ్ళకి నీవు అమ్మవారిలాగానే ఉన్నావు.  ఆ తల్లి అనుగ్రహం పొందిన దానివి నువ్వు.  ఈ రోజు నీతో గడిపే సదవకాశం కూడా ఆ దేవతే మాకు కల్పించిందేమో!”  క్షణం సేపు కళ్ళు మూసుకున్నారు.  ఉబికి వస్తున్న కంటి తడిని ఆపుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

**

దుఃఖించ వద్దని అంటీ కూడా వారించాక,  కాసేపటికి తేరుకున్నారాయన.

నా రెండు చేతులని మరింత పొదవి పట్టుకున్నారు.

 

“నిన్నిలా అడుగుతున్నందుకు నన్ను క్షమించు తల్లీ.   మా గడ్డు సమస్యలని దూరం చేయగల శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా... పరిస్థితులని సరిదిద్ది, మా జీవితాల్లోకి సుఖశాంతులని  తేగలవు.  పెద్ద మనసు చేసుకొని ఆలోచించు. 

జగదీష్ పై నీకున్న ప్రేమని త్యాగం చేసి, అతని మనస్సు మన రాణి వైపు మొగ్గేలా చేయగలవు,” నా చేతులు వదిలి నాకు నమస్కరించారు.

నివ్వెరపోయాను.... నాచేతుల్ని  గబుక్కున వెనక్కి తీసుకున్నాను.  తల గిర్రున తిరిగినట్టయ్యింది. 

తెలియని ఉద్వేగంతో, కళ్ళనిండా నీళ్ళు నిండాయి.  గుండెల నిండా గుబులు కమ్ముకున్నట్టుగా అనిపించి, బాధతో, తల వంచుకున్నాను....

**

“పదమ్మా, ఇక వెళదాము,” అంటూ, నా భుజం మీద నీరూఆంటీ చేయి వేయడంతో, స్పృహలోకి వచ్చాను.

కళ్ళు తుడుచుకొని, దిగాలుపడి కూచునున్న అంకుల్ వంక చూసాను.   ఆయన ‘త్యాగమంటూ’ నన్నలా అడిగారంటే, ఆయన మానసిక స్థితి ఎంతగా బలహీన పడిందో అర్ధమయింది.  నీట మునిగే వాడు గడ్డి పరకనైనా ఆశ్రయిస్తాడన్నట్టు,  ఆయన నాముందు చేతులు జోడించి తమ జీవితాలని చక్కదిద్దమనడం ఊహించలేని విషయం.. 

ఆయన్నీ పరిస్థితిలో చూడవలసి రావడం మా దురదృష్టం.

 

ఇక, నా పరిస్థితికి బాధ పడాలో, ఆయన స్థితికి జాలి పడాలో తెలీడం లేదు.  మొద్దు బారిన మనసుతో, పక్కనే నేల మీదనున్న వాకింగ్-స్టిక్ తీసి, ఆయన చేతికందించాను.

 

ఇంతలో, గీత బోధ మొదలవ బోతున్నట్టు కూడా, మైకులో అనౌన్స్ మెంట్ విని, లేచి అటుగా నడిచాము.

**

ఓ గంట సేపు సాగిన గీత బోధ గురించి మాట్లాడుకుంటూ,  గుడి నుండి బయలుదేరి, అరగంటలో ‘నటేషన్  పార్క్’ చేరాము...

ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణంకి, భిన్నంగా,  మనస్సులో మాత్రం అలజడిగా అశాంతిగా  ఉంది....

 

కారు దిగి పార్క్ లోనికి నడిచాము...దారికి ఇరు వైపులా పరిమళాలు వెదజల్లుతున్న పువ్వులని చూస్తూ, నీరూ ఆంటీ కబుర్లు చెబుతూనే ఉంది...

జగదీష్ తో, ఇదే పార్క్ కి వచ్చినప్పటి సంఘటన మనసులో మెదిలింది. 

 

పార్క్ లోపలి వరకు వెళ్లి, అప్పటి ఆ గజేబో లోనే కూర్చున్నాము...

 

చేతిలోని వాటర్ బాటిల్ అంకుల్ కి అందించాను.  

“మీరు  ఇదివరకు, రోజూ రెండు మైళ్ళన్నా నడిచే వారంట కదా.  కొద్ది రోజులుగా మానేసారంట.  ఇక అలా కుదరదు అంకుల్... ముందుగా ఇవాళ, ఈ వాకింగ్ ట్రైల్  మీద, మీరిద్దరూ నాతో  రెండు రౌండ్స్ నడవాలి.  అదీ, మీ వాకింగ్ స్టిక్  లేకుండానే.  రేపటి నుండి మళ్ళీ  మీ వాకింగ్ ఎక్సర్ సైజు మొదలు పెట్టాలి,” ఆయన్ని ఛాలెంజ్ చేస్తూ నేను...

 

బాటిల్ నుండి వాటర్ సిప్ చేసి, నా వంక నిశితంగా చూసారు అంకుల్.  “నా మీద కోపంగా లేవంటే, ఇవాళ నీతో తప్పకుండా నడుస్తాను.  ఇక నుండీ రోజు నడుస్తాను కూడా. కాని నా ఆసరాకి వాకింగ్ స్టిక్ లేక పోతే కష్టం కళా,” అన్నారు చిరు నవ్వుతో...

 

“...మీ పక్కనే ఆసరాగా నేనున్నాగా! నా ఆసరా తీసుకోండి.  నేనూ మీ కూతురినే అంటారుగా! పైగా మీ మీద నాకు కోపం ఎందుకు అంకుల్?”  అన్నాను నవ్వుతూ.

**

కబుర్లు చెబుతూ, ట్రాక్ మీద రెండు రౌండ్స్ కూడా చక్కగా నడిచారు అంకుల్, ఆంటీ.

అక్కడి నుండి పార్లర్ కి వెళ్లి ఐస్ క్రీం తిన్నాము....

చీకటి పడ్డాక ఇల్లు చేరాము...

 కొత్తగా రిలీజ్ అయిన కామెడీ మూవీ స్టార్ట్ చేసి, ఏదైనా టిఫిన్ చేస్తానంటూ కిచెన్ లోకి వెళ్ళింది ఆంటీ. 

మొదటి సీన్ నుండే మూవీని అంకుల్ తో పాటు, నేనూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను.

**

మూవీ కంప్లీట్ అవగానే, టిఫిన్ చేయడానికి డైనింగ్ వద్ద చేరాము.

“ఈ రోజంతా ఎంతో ఆహ్లాదంగా గడిచిందమ్మా కళా,” అంది నీరూ ఆంటీ, తను చేసిన అటుకుల ఉప్మా ప్లేటులో వడ్డిస్తూ.

“నాలుగు నెల్లగా అంధకారంగా  మారిన జీవితాల్లో వెలుగుని నింపావు ఇవాళ,” అన్నారు అంకుల్.

“మీరిక ఉదాసీనంగా ఉండడం మానేసి, చలాకీగా మారాలి.  మీరే మా అందరి జీవితాల్లో వెలుగుని నింపారు.  ఇక ముందు కూడా మీరే మాకు మార్గదర్శకంగా ఉంటారు,” అన్నాను ఆయనతో. ..... 

 

సన్నగా నవ్వుతూ తలాడించారు...  ఆంటీ అందించిన మెడిసిన్ వేసుకొన్నారు.

టిఫిన్ తినబోతూ క్షణమాగి నా వంక చూసారు.

“అవునూ, మరి సెల్వన్ గారి మూవీ సంగతేమిటి?  ఎందుకు ఆసక్తి  లేదన్నావు?”  అడిగారాయన....

 

ఆయనడిగిన విషయం పై పెద్ద అభిప్రాయమంటూ లేదు నాకు...

కొద్ది క్షణాలు ఆలోచించాను...

“మీరన్నట్టు, కళా రంగంలో నాకు ఎనెన్నో అవకాశాలు... నిన్ననే నాకు తేజశ్విని గారి నుండి కూడా మెసేజ్ అందింది.... వారున్న  ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి, అమెరికా అంతటా ఫండ్-రైజింగ్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నారట.   ఆ టూర్ లో పాల్గొనమని అడుగుతూ,  వివరాలతో పేపర్స్ పంపారామె.  ఇవాళే వాటిని నాన్నకిచ్చాను. 

ఇకపోతే, మీరు చేయమంటే, ఈ ఫిలిం చేసి, అమెరికా ప్రయాణ ప్రయత్నంలో ఉంటాను అంకుల్,” అని చెప్పి ఆయన సలహా కోరాను....

 

ఆయన  చేయమనే నచ్చ చెప్పడంతో, అందుకు ఒప్పుకున్నాను.  

భోంచేసాకా,  వారి వద్ద  సెలవు తీసుకుని ఇంటిదారి పట్టాను....

***

అంకుల్ ఆంటీలతో గడిపిన ఆ ఒక్క రోజు నాలో ఎన్నెన్నో ఆలోచనలు, అలజడులు సృష్టించింది.   త్యాగం,నిస్వార్థం, బాధ్యతల గురించి గీత బోధ నుండి విన్నది పదేపదే నెమరు వేసుకున్నాను. 

 

రేయింబవళ్ళు అలోచించాను. 

రాణి సంబంధం తీసుకుని, అంకుల్ వాళ్ళు ఢిల్లీ వచ్చిన విషయం, జగదీష్ నాకు ఎందుకు చెప్పలేదు?....  నేను కష్ట పెట్టుకుంటాననా? అంకుల్ కి మాకు మధ్య నున్న సంబంధ బాంధవ్యాలు మారకూడదనా? అని ఆలోచించాను.

‘మరి నేను మాత్రం, ఏం చేస్తున్నాను?’ అన్న ప్రశ్న ఉదయించింది...

జగదీష్ విషయంగా, అంకుల్ నా నుండి ఆశిస్తున్న త్యాగం గురించి  అమ్మా వాళ్లకి చెప్పడానికి సంశయిస్తున్నాను...

చెబితే, వారి వైఖరి మారి, అంకుల్ పట్ల వాళ్ళు  కోపాన్ని పెంచుకుంటారేమో  అన్న భయం...

అంకుల్ పట్ల ద్వేషం భావ్యం కాదన్న  ఆలోచన.

అందుకే, నేనూ జగదీష్ లాగానే,  విషయాన్ని దాస్తున్నాను ...అని నన్ను, నేను సమాధాన పరుచుకున్నాను. 

 

అయినా ఇందులో అంకుల్ తప్పుందా అని కూడా ఆలోచించాను..న్యూ ఇయర్స్ లంచ్ రోజున, కోటమ్మత్త నా పెళ్లి ప్రస్తావన తెచ్చినా, జగదీష్ తోనే నా పెళ్ళవుతుందన్న స్పష్టత అయితే,  ఆమె ఇవ్వలేదు మరి....

అందుకే, రాణి సంబంధం తీసుకుని, అంకుల్ ఢిల్లీ  వెళ్ళగలిగారు.  అయినా, తమ బిడ్డ  కోరడంతో అంకుల్ అలా చేయడం కూడా సమర్ధనీయమే.  ఆయన్ని తప్పు పట్టే ప్రసక్తే లేదు.  

‘ఏమైనా అంకుల్ ఆరోగ్యం కుదుట పడాలి.  వారింటి పరిస్థితులు చక్కబడాలి.  అందుకు నా వంతు సాయం చేసి, అంకుల్ నీరూ ఆంటీల ఋణం తీర్చుకోవాలి’....అన్న నిశ్చయమే బలంగా నాలో మిగిలి పోయింది...

**

మూవీ డైరెక్టర్ సెల్వన్ సార్ తో ‘స్టోరీ సెషన్’ కి అంకుల్ కూడా కూర్చున్నారు. 

ఇన్ స్పైరింగ్  స్టొరీ అనిపించింది.  త్యాగం, ప్రేమ, బాధ్యతల నడుమ నలిగి పోయే ఓ నర్తకి కథ.   అన్ని విషయాలు మాట్లాడి డేట్స్ కూడా నిర్ణయించారు.   మొత్తం పనంతా డిసెంబర్ లోగా అవ్వాలని సూచించారు అంకుల్.   యు.ఎస్.యే  ట్రిప్పుకి  అడ్డం అవ్వకూడదని కండిషన్ పెట్టారు నాన్న.

 

మూవీ గురించి సంప్రదింపులు జరిపి, అంకుల్, నా చేత అగ్రీమెంట్ సైన్ చేయించారు.  ఆశీస్సులందించి చేతి కర్ర సాయంతో నడిచి వెళుతున్న ఆయన్ని చూసి, నా కళ్ళు చెమర్చాయి.

ఇంత సేపూ  మాతో పాటు మీటింగులో కూర్చున్న కోటమ్మత్తకి, ఈ సినిమా వ్యవహారమంతా నచ్చింది.  భూషణ్ అంకుల్ ని మెచ్చుకుందామె.

అంకుల్ కి నా పట్ల ఉన్నది నిజమైన ఆప్యాయత అని వాఖ్యానించింది. 

ఔనన్నారు  నాన్న.

రాణి కాస్త కుదుట పడి, అంకుల్  బాగా  కోలుకున్నాక,  ఆయన ఆశీర్వాదంతోనే, ఇంట నిశ్చితార్ధ శుభ కార్యం జరుపుకోవాలన్నారు ఆయన.

 

విని, నాలో నేను నవ్వుకున్నాను..

రాణి కుదుట పడాలంటే, నా ఆశలని వదులుకోవాలేమో అన్న నిర్లిప్తత కలిగింది నాలో...

**                                                            

జరుగుతున్న విషయాల  గురించి జగదీష్ కి చెప్పినప్పుడు, చాలా సంతోషించాడు... కొత్త సినిమా షూటింగ్ జరిగేప్పుడు రెండు రోజులైనా  రావడానికి ప్రయత్నిస్తానన్నాడు.  

ప్రతి సంభాషణలో అంకుల్ హెల్త్ గురించి, వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతాము...

ఆయన కోలుకుంటున్నారని, ఆయన ముఖాన తిరిగి సంతోషాలు చూడగలమనే చెబుతుంటాను, జగదీష్ కి.

‘అంకుల్ వాళ్ళ పరిస్థితి ఎలాగైనా మెరుగయితే తప్ప, మనం సంతోషంగా ముందుకు సాగలేము’ అని నేనన్న దానికి, జగదీష్ పూర్తిగా ఏకీభవించాడు.

...........................

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam