Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue141/397/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

రత్నగిరి మీద ఒక భయంకరమైన కుట్రకు బీజం పడిన రోజు అది. ఎదుటి వారి కష్టాలను, బాధలను తమకు అవకాశాలుగా మలచుకునే గుంట నక్కలున్నంత వరకు మంచి వారికి వెతలు తప్పవు. గాంధారాధీశుడు శతానీకుడు, రత్నగిరి ఉప సైన్యాధ్యక్షుడయిన బాహ్లీకుడు ఇరువును చేతులు కలిపి నడపనున్న ఈ దారుణ మారణ కాండ ఫలిస్తుందా? లేక విఫలమవుతుందాన్నది కాలమే నిర్ణయించాలి.

తన వెనక జరుగుతున్న కుట్రలేమీ తెలీని రత్నగిరి రాకుమారుడు ధనుంజయుడు అదే రోజు సాయంత్రం ముని మాపు వేళ దాటిన కొద్ది సేపటికే రామగిరి గ్రామ పొలిమేరలకు చేరుకున్నాడు. అతడి అశ్వం గరుడ గ్రామ వీధుల్లో అడుగు పెట్టే సరికి బాగా చీకటి పడిరది.

రామగిరిని ఓ మోస్తరు పెద్దగ్రామమనే చెప్పుకోవాలి. గ్రామమంతటా పండుగ వాతావరణం కన్పిస్తోంది. విశాలమైన బాటలు ఇరు వంకలా తీర్చి దిద్దినట్టున్న గృహ సముదాయాలు. ప్రతి యిల్లు శోభనంగా అలంకరించి వాకిట ముగ్గులు తీర్చి దీపాలంకరణ చేయబడ్డాయి. ప్రతి ముంగిట కాగడాల కాంతులు వెలుగు నింపుతున్నాయి. నూతన వస్త్రాలు ధరించిన గ్రామ బాలబాలికలు కళకళలాడుతూ వీధుల్లో ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. గుడికి వెళ్ళొస్తున్న స్త్రీ, పురుష, బాల, వృద్ధులనేకులు ప్రధాన వీధిలో ఎదురవుతున్నారు.

అదంతా చూస్తున్న యువరాజు ధనుంజయునికి అప్పటిగ్గాని గుర్తుకు రాలేదు... ఆ రోజు కృష్ణాష్టమి. శ్రీకృష్ణుల వారి జయంతి అని. స్వయంగా తను ఆ మాధవయ్య భక్తుడు. తను రత్నగిరిలో వుంటే ఈ పండుగ చాలా వేడుకగా జరిపించేవాడు. తన గురువు దైవం ఆపద్బాంధవుడు అంతా ఆ స్వామిగా భావించి కొలిచేవాడు. ఆలోచిస్తూనే అశ్వాన్ని నెమ్మదిగా పోనిస్తున్నాడు ధనుంజయుడు. యువరాజుగా తనను తెలిసిన వారు గాని, గుర్తించ గల వారు గాని రామగిరిలో ఎవరూ వుండే అవకాశం లేదు. ఒకవేళ గ్రామకొత్వాలుకు తెలుసేమో గాని అతని గురించి తనకు తెలీదు. సాధ్యమైనంత వరకు తన గురించి ఎవరికీ తెలీకుండా ఉండటమే మంచిది. తెలిస్తే ఆ మర్యాదలు భరించి ప్రయాణం అపుకోవటం తనకి కష్టం.

అయితే ఉత్తమాశ్వం మీద ఆ రాత్రి వేళ పున్నమి చంద్రుడిలా విజయం చేస్తున్న ధనుంజయుని చూస్తున్న గ్రామ పౌరులు ఎవరో ఉన్నత వంశీకుడని గ్రహించి పక్కకు తొలగి దారి ఇస్తున్నారు. ఇక వయసు పడుచులయితే అతడి నుండి చూపు తిప్పుకోలేక మదన తాపంతో తిరిగి తిరిగి అతడ్ని చూస్తూనే వున్నారు.

గ్రామ మధ్యంలో నాలుగు వీధుల కూడలికి కాస్త ఇవతలగానే కుడి పక్కన వుంది బాటసారులు విడిది గృహంగా చెప్పుకునే సత్రం ఒకటి. సువిశాలమైన ఆవరణలో అనేక గదులతో కూడిన పెద్ద మండువా లోగిటిని వసతి గృహంగా మార్చి నిర్వహిస్తున్నాడు దాని యజమాని.

రాత్రికి బస చేసేందుకు తనకు ఒక గది, తన స్నానపానాలకు, అశ్వ సంరక్షణకు అన్నింటికి కలిపి రుసుం చెల్లించాడు ధనుంజయుడు. తన తోలుసంచులు ఆయుధాలు అన్నీ గదిలోకి చేర్చాక అశ్వాన్ని నౌకర్లకు వప్పగించాడు. సత్రంలో అప్పటికే చాలా మంది విడిది చేస్తున్నారు. తను రత్నగిరి రాకుమారుడన్న విషయం బయట పడకుండా చాలా జాగ్రత్త వహించాడు ధనుంజయుడు. చక్కగా వేడి నీట స్నానం చేసి, పొడి దుస్తులు ధరించగానే ప్రయాణ అసట తీరింది. గుడికి వెళ్ళి వచ్చి భోంచేసే ఉద్దేశంతో గదికి బీగం వేసుకుని బయటి కొచ్చాడు.

సత్రం యజమాని వృద్ధుడు.

‘‘అయ్యా! తమరే దేశ రాజకుమారులో గాని సామాన్యులు మాత్రం కారు. దేశాటన చేస్తూ మా గ్రామానికొచ్చినారా?’’ అంటూ కుతూహం ఆపుకో లేక అడిగాడు.

‘‘అలా అనుకున్నా తప్పు లేదు గాని ఇక్కడ కృష్ణ జయంతి బాగా జరుపుతున్నట్టున్నారే. ఆలయం ఇక్కడికి ఎంత దూరంలో వున్నది?’’ అనడిగాడు ధనుంజయుడు.

‘‘ఎంతోనా... కుడి పక్క వీధిలో కాస్త ముందు కెళితే కన్ను పండువుగా ఆలయం కన్పిస్తుంది నాయనా. ఆ కోలాహమంతా అక్కడి నుంచే. వేణుగోపాలుని గుడి దర్శించాల్సినదే. అదో... కోలాట భజన ఆరంభం కానుంది. మా వూరి కుర్రాళ్ళు కోలాటం బాహుగొప్పగా వుంటుంది.’’

‘‘అయితే పోయి చూడాల్సిందే. తిరిగి వచ్చాక భోజనం చేస్తాను’’

‘‘తప్పకుండా వెళ్ళిరండి బాబూ. కాస్త ఆస్యమైనా ఇబ్బంది లేదు. మీకు చక్కని అతిథ్యంతో వేడి వేడి భోజనం వడ్డించేందుకు మా వాళ్ళు సిద్ధంగా వుంటారు.’’

సత్రం యజమానితో మాట్లాడి వీధిలోకి కాలి నడకన బయలుదేరాడు ధనుంజయుడు. గుడి దిశగా నడుస్తుంటే భజన పాటలు విన్పిస్తున్నాయి. ఆ పాటల వెంట అద్భుతమైన వేణు గాణం కూడా పరవశింప చేస్తోంది.

కొద్ది సేపట్లోనే ఆలయ ప్రాంతాన్ని చేరుకున్నాడు. వీధికి పెడగా ఎడమ పక్కన విశాలమైన ఆవరణలో కనువిందు చేస్తోంది వేణుగోపాలస్వామి ఆ
యం.

ఆలయం తూర్పు ముఖంగా ఉండగా`


కుడి పక్కగా పదహారు స్తంభాలతో ఎత్తయిన ఆలయ మండపం వుంది. ఆ ప్రాంతమంతా తిరునాళ్ళ వాతావరణంతో సందడిగా వుంది. పచ్చని పందిళ్ళు వేసి మామిడాకు తోరణాలు కట్టారు.

ఆలయ సోపానాలకు ఎదురుగా`

వెయ్యిన్నొక్క జ్యోతులతో కూడిన అఖండ దీప చెమ్మాయి నిలబెట్టబడుంది. ఆ దీపాలశోభ తిలకించడానికి రెండు కళ్ళు చాటం లేదు. ఒక దీప వృక్షంలా విస్తరించి వుంది. గాలికి జ్యోతులు ఆరి పోకుండా నాలుగు పక్కలా తెల్లని వస్త్రంతో తెరలు కట్టి లోన ఒక మనిషి వాటి సంరక్షణ చూస్తున్నాడు.

తెరలకు ముందు చాపలు పరచ బడ్డాయి. వాటి మీద కోలాట బృందం గురువు కూచుని పాడుతుంటే నలుగురు పక్క కూచుని వాద్య సహకారం అందిస్తున్నారు. ఇక యాభై జోడీలుగా వంద మంది గ్రామ యువకులు కోలాటంలో వున్నారు. రంగు రంగుల దుస్తులు ధరించి కాళ్ళకు గజ్జెలు కట్టారు. మూడు జానల పొడవుంటే కోలాటం కర్రలు చేత బట్టారు. గురువు గారి పాటకు అనుగుణంగా కర్రలు తాటిస్తూ, వంత పాడుతూ వలయాకారంలో తిరుగుతున్నారు. లయగా కదిలే కుర్రాళ్ళ కాళ్ళ గజ్జెల మోతలు, కోలాటల కర్రల శబ్ధాలు వాద్య ఘోష పాటను రక్తి కట్టించి చూపరులను ఆకర్షిస్తున్నాయి.

భక్తులు గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. పరవశంతో చుట్టూ చేరి తన్మయంతో కోలాటాన్ని చూసే వాళ్ళు చూస్తున్నారు. రాజకుమారుడు ధనుంజయుడు కూడ అక్కడికి రాగానే కాసేపు అలా చూస్తుండి పోయాడు. కాస్త విరామం తర్వాత మరో పాట అందుకున్నారు గురువు గారు. కోలాటం ఆరంభమైంది. గురువు గారి పాటకు అంతా ముక్త కంఠంతో వంత పాడుతూ కోలాటం ఆరంభించారు.

అందా
ల  బాలకిట్టయ్యా ` గోపాల బాలా రారా
కిట్టయ్యా ` గోపాల బాల కిట్టయ్యా

ఆయ్‌ ` చిడతెయ్‌ ` చిడతెయ్‌
అందాల బాలుడమ్మా ` నవనీత చోరుడమ్మా
నందునింట పెరిగినాడు ` నందా కిశోరుడమ్మా
యశోధా తనయూడమ్మ ` యదుకుల తిలకుడమ్మ
అందాల బాల కిట్టయ్యా ` గోపాలా బాలా రా రా.
ఆఁ......

నెమలి ఈక కట్టుకోని ` మురళి చేత పట్టుకొని
కాలీ గజ్జెలు మ్రోగ ` గోప బాలను చేరి
అల్లరంటె అల్లరంట ` రేపల్లె నందడంట
ఉట్టి మీద పెరుగు కుండ ` గూటి లోన వెన్న ముంత
ఎట్టి పట్ట వెన్నదొంగ ` ఎవరికీ దొరకడమ్మ
గొల్లా భామల తోడ ` గంతులేయు చిలిపి వాడు
కరుణ తోడ కాచు వాడు ` కరుణామయుడు వాడు
నల్లా నల్లాని వాడు ` రాధా మనోహరుండు
అవతార పురుషుడే ` శంఖూ చక్రాల సామి
లీలా వినోదుడే ` వేణుగోపాలసామి
అందాలా బాలా కిట్టయ్య ` గోపాల బాలా రా రా.

రస మయ వేణు గానం కోలాటంతో చేరి భక్తులకు అలౌకిక భక్తి భావాన్ని పరవశాన్ని కలిగిస్తోంది. కాసేపు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన ధనుంజయుడు ఆలయ ప్రవేశం చేసి పురజనులతో బాటు వరుసలో వెళ్ళి స్వామిని దర్శించాడు. పూలు, పళ్ళు సమర్పించాడు. తను బయలుదేరిన పనిలో కార్యసిద్ధిని, విజయాన్ని కలిగించమని వెన్నంటి వుండి సహకరించమని ఆ వేణుగోపాలుని మనసారా ప్రార్థించుకున్నాడు. ప్రసాదం స్వీకరించి బయటి కొచ్చేసరికి కోలాటం కొనసాగుతూనే వుంది. అప్పుడొ విశేషాన్ని గమనించాడు ధనుంజయుడు.

వేణు గానం వినవచ్చేది కోలాటం గురువు దగ్గర్నుంచి కాదు, పక్కనున్న మండపం అరుగు నుంచి వస్తోంది. అక్కడి చిరు చీకట్లోలో మండప స్థంభాన్ని ఆనుకొని కూచున్న ఓ వ్యక్తి మురళి వాయిస్తున్నాడు.

అంతా యిక్కడ వుండగా అతను మాత్రం అక్కడ విడిగా ఎందుకున్నాడు? అతను కోలాట బృందం మనిషి కాడా? పరిశీలించిన ధనుంజయుడికి ఆశ్చర్యం గొలిపిన విషయం...

ఆ వ్యక్తి శతాధిక వృద్ధునిలా వున్నాడు. తెల్లగా నెరసిన గిరజాల జుత్తు భుజాల మీద పడుతోంది. కొద్దిగా మాసిన గడ్డం, నల్లని మేని ఛాయతో, ఆ వయసులో కూడా ఆకర్షణీయంగా వున్నాడు. నుదుట త్రిచూర్ణం ధరించి, మెడలో పూమాల ధరించాడు. కావి పంచె కట్టి భుజాన కండువా వేసుకున్నాడు.

‘‘ఆ పెద్దాయన ఎవరు? అద్భుతంగా వేణు గానం చేస్తున్నారు?’’ పక్కనున్న ఒక వ్యక్తిని అడిగాడు ధనుంజయుడు.

‘‘అయ్యా! ఆయనెవరో, వూరేదో, పేరేదో తెలీదు. కను చీకటి పడు వేళ ఆలయానికొచ్చాడు. వేణు గానంతో పులకింపజేస్తున్నాడు. ఎవరింటా భోం చేయలేదు. పాలు తాగి ఆలయ ప్రసాదం ఆరగించాడు. అంతకు మించి వివరములు తెలియవు’’ బదులిచ్చాడతను.

ఇంతలో కోలాటానికి కొద్దిసేపు విరామం యివ్వబడింది. మండపం లోని వృద్ధుడు తన వద్దకు రమ్మని ధనుంజయునికి చేయి వూపాడు. ఇక్కడ ఇంత మంది వుండగా ఆయన తననే ఎందుకు పిలుస్తున్నాడు? ఒకింత ఆలోచించి మండపం సోపానాలెక్కి వృద్ధుని చేరుకున్నాడు.

‘‘రావయ్యా మిత్రమా. రా కూర్చొనుము. నీ కోసమే ఎదురు చూస్తుంటిని సుమా!’’ అన్నాడు దరహాసంతో వృద్ధుడు.

ధనుంజయునికి ఏమీ అర్థం కాలేదు. ‘మిత్రమా’ అంటున్నాడు. తన వయసెక్కడ ఆయన వయసెక్కడ? పైగా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఈయన్ని ఏమనుకోవాలి? సన్యాసి అనుకోవాలా, హరి భక్తుడనుకోవాలా, సిద్ధుడనుకోవాలా లేక పిచ్చి వాడనుకోవాలా? ఎవరైనా గానీ పిచ్చి వాడు మాత్రం కాడు. వేణువుతో గానామృతం కురిపిస్తున్న వాడు పిచ్చివాడెలా అవుతాడు? ఆయనతో ఒకింత సంభాషిస్తే గాని విషయం ఏమిటో తెలీదు.

‘‘స్వామీ! మీరెవరో నాకు తెలియదాయె. నా కొరకు మీరు ఎదురుచూచుట ఇదియేమి వింత?’’ ఎదురుగా బాసిం పట్టు వేసి కూచుంటూ అడిగాడు. ఆ పలుకులకు చిద్విలాసంగా నవ్వాడా పెద్దాయన.

‘‘ఇది వింత కాదయ్యా మిత్రమా. మనం బాగా పరిచయస్థులమే. నీవు నాకు బాగా కావలసిన వాడవు గదా. ఇక్కడికి తప్పక వచ్చెదవని నాకు తెలుసు.’’

‘‘ఇంతకూ తమరెవరు స్వామి?’’

‘‘నన్ను మాధవస్వామి అంటారులే. అందరికీ నేను తెలీక పోవచ్చును. కాని అందరూ నాకు తెలిసినవారే.’’

‘‘మీ మాటలు కడు విచిత్రముగ నున్నవి స్వామీ. అయిననూ నాతో మీకేమి పని?’’

‘‘వూహుఁ... నీతో నాకే పనీ లేదయ్యా. నాతోనే నీకు పని వున్నది.’’

‘‘మీతోనా!’’

‘‘అవును. నాతోనే. నీకు దిశానిర్దేశం గావింప వలసిన పని వున్నది. అయిననూ నన్ను నీవు ఆర్చెడి వానివా తీర్చెడి వానివా అనుకొనుచున్నావు కదూ! ఆర్చెడు వానినీ నేనే. తీర్చెడి వానినీ నేనే. బోధ పడినదా?

‘‘లేదు స్వామీ. మీ మాట అంతరార్థం ఒకింతయు బోధ పడకున్నది.’’

‘‘అవును. బోధపడదు. అర్థము జేసుకొనెడి వయసు కాదు నీది’’

ఇంతలో కోలాట బృందం తిరిగి కోలాటం ఆరంభించారు. కొత్తపాట మొదయింది. మాధవస్వామి కొద్దిసేపు మురళి వాయించాక ఆపి యువరాజు ధనుంజయుని వంక చూసాడు.

‘‘యువరాజా. నాకు తెలీక అడుగుచున్నాను. నీవు ఆ వేణుగోపాలుని భక్తుడవుగదా. మిత్రునిగా, సఖునిగా, ఆపద్బాంధవునిగా ఆయన్ని నమ్మి కొలిచే భక్తుడవాయె. మరి ఆయనకును నాకును గల భేదమేమిటో చెప్పు చూతము’’ అనడిగాడు.

తనకు తెలియకుండానే ఒకింత ఉలికి పాటుకు గురయ్యాడు ధనుంజయుడు. అది వూహకు అందని విషయం. ఇక్కడ ఎవరికీ తెలీని విషయమిది. తను యువరాజని, వేణుగోపాలుని భక్తుడని ఇంత స్పష్టంగా పలికాడంటే ఈ శతాధిక వృద్ధుడు సామాన్యుడు కాడు. పిచ్చివాడు అంతకన్నా కాడనిపించింది.

‘‘స్వామి! ఆయన దైవము. మనం మానవమాతృలం. అదేగా బేధము’’ అంటూ బదులిచ్చాడు.

ఫక్కున నవ్వాడు వృద్ధుడు.

‘‘పొర బడితివి జూచినావా మిత్రమా? ఆయన కూడ మనలాగ మానవుడే. శరీరమును విడిచిన పిమ్మటే ఆయన్ని దైవంగా జేసినారు. లీలా వినోదుడు గదా నల్లనయ్య. ఆయనకు నాకును బేదం ఏమున్నది? ఆయన నల్లనయ్య, నేను నల్లనయ్యనే. అయనా పూమాల ధరించువాడు. నేనూ ధరించితిని. ఆయన మురళీధరుడు, వేణుగానలోలుడు, నేనూ వేణు గాన ప్రియుడినే. ఆయన పేరు మాధవ స్వామి అయితే నా పేరును అదియే గదా. మరి నేను వేరు ఆయన వేరు అనుట ఉచితమా? కాదనిన ఆయన శిఖిపింఛమౌళి. అది నాకు లేదు. అంతియే కదా బేధము?’’ అన్నాడు.

ఈసారి వృద్ధుని మాటలు ఒకింత నవ్వు పుట్టించాయి ధనుంజయునికి. అబ్బో. ఈ వృద్ధునికి అతిశయం ఎక్కువే. ఏవో కొన్ని మహిమలున్నంత మాత్రాన మానవుడు దేవుడు కాగలడా? సందేహం లేదు ఒకింత పిచ్చి కూడ వున్నదీ స్వామికి.

‘‘పోలికలెందుగ్గాని స్వామీ. నాకు దిశా నిర్దేశము గావింప పని వున్నాదంటిరే. దానికి అర్థమేమి? నేను వెళ్ళు మార్గము సరి కాదందురా?’’ అనడిగాడు.

‘‘సరియే... నీ మార్గము సరియే. లక్ష్యమును సరియేను. అయినను ఒక ముఖ్య విషయము మరచినావే.’’

‘‘ముఖ్య విషయమా....?’’‘‘అవును మిత్రమా. అతి ముఖ్యమైన విషయము. మరచితివి! నీ పితృభక్తి శ్లాఘనీయము. తండ్రిని బ్రతికించుకొని పితృ రుణం తీర్చనెంచితివి, మెచ్చతగు విషయం. కాని నీ తండ్రి ధర్మతేజుడు పరమ శివ భక్తుడు గదా. జ్యోతిర్లింగములో ఒకటగు సహ్యాద్రి మీది భీమశంకరుని దర్శించకుండా ఏ పనీ ఆరంభించడే. నీవు ముందుగా చేయాల్సినది ఢాకినీ వనానికి పోయి భీమశంకరుని సేవించాలి గదా. అనారోగ్యమున కోట విడిచి రాలేని నీ తండ్రి తరఫున భీమశంకరుని అర్చించి కార్య జయము కలిగించమని ప్రార్థించి ఆ శివుని ఆశీస్సుతో బయలుదేరుట మంచిది మిత్రమా....’’

‘‘లేదు స్వామీ! అది జరగని పని’’ మాధవ స్వామి సలహాను మధ్యలోనే తిరస్కరించాడు ధనుంజయుడు.

‘‘ఏలా జరుగదు మిత్రమా?’’ చిరునవ్వుతో అడిగాడు మాధవస్వామి.

‘‘స్వామీ. నిజముగా ఆ భీమశంకరుడు అంతటి శక్తిమంతుడయితే నిజముగా భక్తవత్సుడయితే నా పితృ దేవునకీ వ్యాధి సోకి వుండదు. తీరని వ్యాధితో నరక యాతన పడు వారు కాదు. శివుని పట్ల నాకు విశ్వాసము లేదు. అందుకే ఢాకినీ వనానికి వెళ్ళు ఉద్దేశ్యము లేదు’’ అని బదులిచ్చాడు.

‘‘పోనీ నీవు కొలుచు ఆ వేణు మాధవ స్వామి అంత శక్తిమంతుడా?’’ మేఘ గంభీర స్వరంతో వెంటనే ప్రశ్నించాడా వృద్ధుడు.

‘‘వూహుఁ.... అంత శక్తిమంతుడే అయితే నీ ప్రార్థనలాలకించి నీ తండ్రి గారిని వ్యాధి నుండి విముక్తుడ్ని చేయాలి గదా. వూహుఁ... చేయడు. ఎందుకంటే ఇది సంచిత కర్మఫలం. అనగా గత జన్మ ననుసరించి వచ్చిన పాప ఫం. దీనికి గతంలో మీ వంశానికి నాగరాజొసగిన శాపం తోడయినది. అనుభవింపక తప్పదు. ఎందుకు చెబుతున్నానో ఆలోచించుము మిత్రమా.’’

‘‘వీర విద్యలతో బాటుగ దేవభాషను ఇతర భాషలను నేర్చితివి. వేద వేదాంగములను చదివితివి. శివకేశవులకు భేదము లేదను సత్యము నెరుంగవా? పద్మ పురాణం స్పష్టంగా చెబుతున్నది గదా!

శో॥         శైవంచ వైష్టవం రూప మేకరూపం నరోత్తమ ।
               ద్వయోశ్చైవాంతం నాస్తిః ఏకరూప మహాత్మనోః
               శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।
               శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్‌ంశివః

అలా శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు వుంటారు. వారిరువురికి భేదం లేదు. కాబట్టి నామాట విను మిత్రమా. బీమ శంకరుని దర్శించి వెడుట నీ తండ్రికిని నీకును క్షేమము, జయకరము.’’ అంటూ హితబోధ చేసాడు వృద్ధ మాధవస్వామి. కాని ఆయన మాటలు ధనుంజయునికి రుచించలేదు. శివుని దర్శింప మనసంగీకరించలేదు. చివ్వున లేచాడు.

 

.........................ఈ ఉత్కంఠ వచ్చేవారం దాకా.................

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali