Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

కడలి

 

గోడ గడియారం ఐదు గంటలు కొట్టింది.

కూర్చుని, కూర్చుని  నడుం నొప్పిగా అనిపించింది .

చదువుతున్న ఫైల్ పక్కన పెట్టేశాను.

తలంతా బరువుగా, మెదడు మీద ఎవరో కొలిమితో కొడుతున్నట్టు వాడిగా, వేడిగా ఉన్న భావన.

దాదాపు నాలుగు గంటల నుంచి  ఆ కేసు స్టడీ  చేస్తున్నానేమో బాగా అలసి పోయాను .

రివాల్వింగ్ చెయిర్ వెనక్కి తోసి లేచాను. ఆఫీస్  రూమ్ లోంచి హాల్లోకి రాగానే టి వి సీరియల్ చూస్తున్న సత్యవతి గభాల్న లేచి నిలబడి టి తెమ్మంటారా అమ్మా అనడిగింది.

సత్యవతికి ఎన్నిసార్లు అలా లేవద్దని చెప్పినా వినదు. వాల్ క్లాక్ వైపు చూసి చంద్ర ఇంటికొచ్చే టై అయింది అనుకుంటూ ఆయన వచ్చే టైం అయిందిగా వచ్చాక  తాగుతాలే కాసేపు నడుం వాలుస్తా అంటూ బెడ్ రూమ్ వైపు నడవబోతు వెనక్కి తిరిగి అన్నాను '' ఎంతసేపలా కూర్చుంటారు కాసేపు పడుకోండి. మీకు కూడా వయసు పెరుగుతోంది, తరగడం లేదు. '

సత్యవతి నవ్వింది టి వి సీరియల్ చూస్తుంటే కాలక్షేపం అయిపోతోందమ్మా . పర్లేదు ఇపుడు పడుకుంటే రాత్రంతా జాగారం చేయాలి అంది.

ఏం  సీరియల్ టి వి వైపు చూసాను.  యాడ్స్ వస్తున్నాయి.  సత్యవతి కి టి వి ఉంటే చాలు గంటలు, గంటలు గడిపేస్తుంది. నాకు వార్తలు తప్ప మరో ప్రోగ్రాం తెలియదు.  నా బుర్ర పాడు చేసిన కేసు సంగతి మరచి పోవాలనిపించింది.

ఆవిడ అంత ఆసక్తిగా చూసే సీరియల్ ఎంటై ఉంటుందా అని యాడ్స్ అయిందాకా చూస్తూ  కూర్చున్నాను. కొద్ది నిమిషాల్లో సీరియల్ మొదలైంది.

బాగా అలంకరించుకున్న ఒక యువతి కళ్ళ కాటుక చెదరకుండా ఏడుస్తోంది. ఆమె మెడను చుట్టుకుని వెడల్పాటి రాళ్ల నెక్లెస్, పొడుగాటి హారం, మరో ముత్యాల హారం , మెరిసి పోతున్న చీర, చేతుల నిండా రక రకాల గాజులు, పెద్ద పూలదండ తలలో నుంచి, రెండు వైపులా మెడ మీదుగా గుండెల మీదకి జారుతోంది.

ఇంతలో అదే విధంగా మరి కొంత ఎక్కువ  మేకప్ లో ఉన్న మరో యువతి వచ్చి ఏడుస్తున్న యువతిని చూస్తూ విషపు నవ్వు నవ్వి, ఏడువు బా  గా ఏడువు. నీ గుండె పగిలేలా ఏడువు .. ఏడ్చి, ఏడ్చి నీ  ఆశలన్నీ ఆ ఏడుపులో కొట్టుకు పోయేంతగా  ఏడువు. లేకపోతే నా వాడిని, నా సర్వస్వం అనుకున్నవాడిని ని మొగుడిని చేసుకుంటావా? చూస్తాను ఎలా కాపురం చేస్తావో చూస్తాను.  అంటూ ఆమె మొహం మీద చిటికెలు వేసి సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో ని మొగుడిని నా వైపు తిప్పుకుని,  నీ ఎదురు గానే   కాపురం చేస్తాను. అప్పుడు నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు కాదు, రక్తం కారాలి. అప్పుడు, అప్పుడు నా పగ తీరాలి.

ఏంటండి ఇలాంటివా మీరు చూసే సీరియల్స్ . ఇంత చంఢాలంగా రాస్తున్నారా. వీటికి సెన్సార్ లేదా. పూర్తిగా చట్ట విరుద్ధం కదండి  నిర్ఘాంత పోతూ అడిగాను.

నాకేం తెలుసమ్మా ఎదో కాలక్షేపానికి చూస్తాను. లోకంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలుసు? అందావిడ అమాయకంగా .

నాకింక క్షణం కూడా అక్కడ ఉండి  సీరియల్ చూసే ధైర్యం లేక పోయింది.

ఎందుకండి ఇలాంటివి చూసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు అన్నాను కుర్చీలోంచి లేస్తూ.

ఆవిడ నవ్వి  " చూస్తాను కానీ మనసులో పెట్టుకోను. ఇపుడు మన సహస్రమ్మ ప్రోగ్రాం వస్తుందిగా అది చూసి టి వి ఆపేస్తాను" అంది.

"ఓ సహస్ర  ప్రోగ్రాం వస్తుందా"  అన్నాను లోపలికి వెళ్ళిపోతూ. నాకు చాల గిల్టీగా అనిపించింది. నా బిజీ లైఫ్ లో స్వంత కూతురు చేస్తున్న కార్యక్రమాలు ఒక్కటి కూడా చూడ లేక పోయినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. సహస్ర మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేసి దాదాపు ఏడాది నుంచి మీడియాలో ఉంది. యాంకర్ గా, కార్యక్రమ నిర్వాహకురాలిగా బాగా పేరు తెచ్చుకుంది. కోర్టులో నా సహ లాయర్లు కొందరు సహస్ర చేసే కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, తనని పొగుడుతుంటారు కూడా . నేను చాలా మామూలుగా విని ఊరుకుంటాను.

సహస్ర అప్పుడప్పుడు నిష్టూరంగా అంటూనే ఉంటుంది. నీకు, డాడికి నా ప్రోగ్రాం చూసే టైం ఎక్కడుంటుందిలేమ్మా. మీరు బిజీ. నేనేదో పిచ్చి ప్రోగ్రామ్స్ చేసుకునే వెర్రిదాన్ని అని. దాని నెత్తి మీద మొట్టి, పిచ్చి వాగుడాపవే అని కొట్టి పారేయడం తప్ప ఎప్పుడు చూడలేదు. ఇంకోసారి  తప్పకుండా చూడాలి.  ప్రస్తుతం ఈ  సీరియల్ చూసిన దెబ్బ నుంచి నన్ను నేను కాపాడుకోవాలి.

మంచం మీద వాలాను. నడుం ఎంతగా నెప్పిగా ఉందో వాలాక కానీ తెలియ లేదు.

నిన్న నా దగ్గరికి వచ్చిన ఒక విచిత్రమైన కేసు చదివి, చదివి  బుర్ర వేడెక్కి పోయింది . సత్యవతి అన్నట్టు ఈ లోకంలో ఏం జరుగుతోందో ఉహించలేక పోతున్నాము. టి.వి. లో క్రైం వార్తల్లో ఎన్నో దారుణాలు చూస్తూ ఒక క్రిమినల్ లాయర్ అయిన నేనే వణికి పోతుంటాను. అలాంటిది  అత్యంత భయంకరమైన కేసు నాకు వచ్చింది. ఇన్నేళ్ళ నా సర్వీసులో ఇంత భయంకరమైన కేసు నేను డీల్ చేయలేదు.

ఎన్నో విడాకుల కేసులు తీసుకున్నాను. కొందరిని కలిపాను, కొందరికి తప్పని సరి పరిస్థితిలో విడాకులు ఇప్పించాను.

అనుమానం భర్తలు, శాడిస్ట్ భర్తలు , గృహ హింస కేసులు,  ఇష్టం లేని వివాహాలు, స్వేచ్చ కోరుకునే అమ్మాయిలు ఇలా ఎందరో నా దగ్గరకు వచ్చారు. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, అంతకన్నా ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు, ఇలా ఎన్నో రకాల వాళ్ళున్నారు.

నెలకి పదో, పదిహేనో కేసులు. వివాహం అయిన పది రోజులకే విడాకులు కావాలంటూ వచ్చిన వాళ్లెందరో.  ప్రేమించిన  వాడిని కాక పెద్దలు కుదిర్చి, బలవంతంగా వివాహం జరిపిస్తే అతని తోటే నువ్వంటే నాకిష్టం లేదు అని చెప్పి విడాకులు కోరిన అమ్మాయిలు,  పెద్దలు కులం, గోత్రం, జాతకాలు, కుటుంబ నేపధ్యం చూసి పద్దతిగా చేసిన అమ్మాయికి తను కోరుకున్న చదువు లేదనో, నాగరికంగా లేదనో వంక  పెట్టి విడాకులు కోరిన అబ్బాయిలు, చేసుకున్న వాడు  తనని సంతృప్తి పరచడం లేదని  విడాకులు కోరుకున్న అమ్మాయిలు, వీరంతా ఒక ఎత్తు.

నేను ఇవాళ చదివిన కేసు ఒక ఎత్తు.

ఎటు  పోతోంది ఈ వ్యవస్థ? అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటూ, ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఇలా ఎందుకు దిగజారి పోతున్నారు?

అభివృద్ధి చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానం యువతలో  ఇలా నేర ప్రవ్రత్తిని కలిగించడానికి కారణం ఏంటి?

ఇష్టం లేక పోతే విడాకులు ఇవ్వడానికి చట్టం అభ్యంతర పెట్టడం లేదు. ఇదివరకన్నా ఇప్పుడు విడాకులు త్వరగా లభిస్తున్నాయి . అలాంటప్పుడు విడిపోక కట్టుకున్న భార్యని  అలా హింసించడం సంస్కారమా? అంత పెద్ద డాక్టర్ తనతో సమానంగా చదువుకుని, తనతో సమానంగా, అంతకన్నా ఎక్కువగానే  సంపాదిస్తున్న భార్యని అంత దారుణంగా .....

మైగాడ్ ...


నాకు ఆలోచించడానికే ధైర్యం సరిపోడం  లేదు.  ఈ కేసు ఎలా చేయగలను?

పెళ్ళికి ముందు ప్రేమించడం నేరమా ?  పెద్దవాళ్ళు ఆమె ప్రేమ ఒప్పుకోకపోతే అది ఆమె తప్పా?

పెళ్లి కాగానే భర్తని నమ్మి నిజాయితీగా నిజం చెప్పడం ఆమె చేసిన పాపం అయింది.

మగవాడు మాత్రం పెళ్లి కాక ముందు, పెళ్లి అయాక కూడా అడ్డంగా తిరిగేయచ్చు. ఎంత మందినైనా ప్రేమించవచ్చు, వాడుకుని వదిలేయచ్చు. కానీ ఆడపిల్ల ప్రేమించకూడదా? ఇది అన్యాయం కాదా!  ప్రేమిస్తే నేరం చేసినట్టా?

ఎవరు చెప్పారు అలా? ఏ చట్టం లో ఉంది? నాకు తెలిసి ఎక్కడా లేదు.

ప్రతి వాళ్ళ మనసు పెళ్ళి కాక ముందు తెల్ల కాగితం లాంటిదే . నచ్చిన వాళ్ళ పేరు రాసుకునే హక్కు అందరికి ఉంది.  కారణం చేతనైనా పెళ్లి కాకపోతే ఇంక ఆ మనసు చెత్త కాగితం అయినట్టా?

దారుణం, aఆ వెధవని ఏం చేస్తే పాపం ఉంటుంది? ఏం చేసినా పాపం లేదు.

ఒక అమాయకురాలిని, నయ వంచనతో, ఆమెకి తెలియకుండా ఓహ్..... నో .....

వాడిని నాలుగు రోడ్ల కూడలిలో ఉరి తీయాలి.  కానీ చట్టం సాక్ష్యాలు కావాలంటుంది.

సాక్ష్యాలు దొరకకుండా చేసే నేరాలు ఎన్నో.  ఆ నేరస్తులు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. డబ్బు, పరపతి, క్రిమినల్ మెంటాలిటి ఉన్న అతను తప్పించుకుంటాడని ఆ అమ్మాయి భయపడుతోంది. ఆమె భయంలో అసహజం ఏమి లేదు. కాకపోతే ఆసంఘటన జరిగింది అమెరికాలో కాబట్టి ఆమె అక్కడే వాడి మీద కేసు ఫైల్ చేసి వచ్చింది. 

చావు తప్పి కన్ను లొట్టబోయి వచ్చింది కానీ, పాపం  ఆ అమ్మాయి నూరేళ్ళ జీవితం నవ్వుల పాలైంది. అవమానంతో, గుండె పగిలే దుఖంతో అటు ఆమె  తల్లి, తండ్రులు, ఆమె కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి.

ఎలా ఆమె బతికేది. ఆమెకి న్యాయం చేయాలి. నేరం వాడు చేస్తే, శిక్ష ఆమెకి వేయడం అమానుషం. నో... నేను ఆమెని తిరిగి తలెత్తుకుని బతికేలా ;చేస్తాను. ఎస్ చేస్తాను. వాడికి అత్యంత భయంకరమైన శిక్ష పడేలా చేస్తాను.

అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్య అని కూడా చూడకుండా ఆమె మాన మర్యాదలు బజారుకెక్కించిన, చదువుకున్న రాక్షసుడిని ఉరికే వదలకూడదు. ఈ  కేసు నేను టేకప్ చేసి తీరాలి.

సమాజంలో  హోదా, అంతస్తు కలిగి పెద్ద మనిషిగా చెలామణి అవుతూ, నీచంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న వాడి నిజ స్వరూపం  అందరికి తెలియచేస్తాను. వాడి సంస్కారం వెనక, చదువు వెనక ఎంత నీచమైన బుద్ధి ఉందో అందరికి చెప్తాను.

అదృష్టం బాగుండి , ఆమెకి తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం ఆమెని రక్షించింది . లేక పొతే ఆమెకి చావే శరణ్యం అయేది. ఆడదాని అందం వ్యాపార వస్తువు అయిపోతోంది. మగవాడు తలచుకుంటే ఎంత కైనా తెగిస్తాడన్నమాట.  ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆమె జీవితం ఏమై పోయేది? ఆమెని ఈ సమాజం బతకనిచ్చేదా? మాటలతో కుళ్ళ బొడిచి చంపేసేది..

జరగదు అలా జరగనివ్వను. వాడికి ఎంత పరపతి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా నన్ను కొనలేడు.

నాకు తెలుసు ఈ దేశంలో చట్టం, న్యాయం సులభంగా అమ్ముడు పోగలవు. కానీ నేను అమ్ముడుపోను. అయినా ముందు వాడు అమెరికా దేశ సరిహద్దులు దాటి రావాలిగా. అక్కడి; న్యాయ వ్యవస్థ ఉక్కు పిడికిట్లో ఈ పాటికే పిప్పి అయిపోయి ఉంటాడు.

నా ఆలోచనలు ఆగడం లేదు.  నా శరీరం విశ్రాంతిగా మంచం మీద వాలినా నా మెదడు మాత్రం కార్ఖానా లాగా హోరెత్తి పోతోంది.. ఇవి అంతం లేని ఆలోచనలు. ఇంతగా ఏ కేసు నన్ను కదిలించలేదు. చాలా యాంత్రికంగా, ప్రొఫెషనల్ గా అన్ని కేసులు చేశాను. 

కానీ ఇది నన్ను ఉన్మాదిలా మార్చేస్తోంది.

ఈ జనరేషన్ పిల్లలు ఇలా, ఇంత క్రిమినల్స్ గా మారడానికి కారణాలు అన్వేషించాలనిపిస్తోంది. అందులో మొదటిది

టి..  వి.  సీరియల్స్, గేం షోలు,  గోరంతను, కొండంత చేసి, హారర్ మూవి లాగా వార్తలను చూపించే తీరు, ఏది చూసిన రోతే. అసహ్యమే.  ఇంతకు ముందు  నేను చూసిన సీరియల్ గుర్తొచ్చింది.

ఎథిక్స్ లేని సీరియల్, ఎక్కడ బతుకుతున్నాము? సభ్యతా, సంస్కారం ఉన్న సామాజిక వ్యవస్థ లోనా?  నీతి, నియమాలు లేని ఆటవిక సమాజంలో నా ?  వివాహం అనేది సంస్కారవంతమైన సామజిక ఒడంబడిక. కానీ ఇదేంటి? సీరియల్స్ తీసే వాళ్ళకి కుటుంబం లేదా? భార్యా భర్తల బంధం అనే దానికి విలువ లేదా?

లేక  సీరియల్స్ తీసేవాళ్ళు, రాసేవాళ్ళు కూడా క్రిమినల్స్ అయి ఉండచ్చా?

ఎంత ప్రేమిస్తే మాత్రం తోటి యువతి పెళ్లి చేసుకున్న వాడిని తన వాడిగా చేసుకుంటానని సవాలు చేసే అమ్మాయిలు నిజ జీవితంలో ఉంటారా? ఇలాంటి మనస్తత్వాలను కొత్తగా సృష్టించేది టి.వి వాళ్ళే కదా!  ఇంటర్నెట్ లు, ఎన్నో వెబ్ సైట్ లు . ఆదునిక విజ్ఞానం మనిషిని ప్రగతి పధం లోకి నడిపించాలి. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి. విజ్ఞానం జీవితాలను ప్రకాశవంతం చేయాలి.

ఇలాగా!  ఈ విధంగా అయితే ఈ సమజం ఏమైపోతుంది? వీటి ప్రభావంతో  యువకులు ఇలా తయారవడం ఎంత వరకు సమంజసం! 

ఇలాటి సంఘటనలు  జరిగితే ఆడపిల్లలు పెళ్లి అంటేనే భయపడి పారిపోతారు. పెళ్ళంటే ఒక తీయటి కలగా కాక ఒక పీడ కలగా మారే పరిస్థితి రాకూడదు. ఆడపిల్ల తల్లిగా అలా ఆలోచి స్తుంటే నా మనసంతా అందోళనతో నిండిపోయింది.

ఎక్కడుంది ఆడపిల్లలకి  భద్రత?   సమాజంలో లేదు,  కార్యాలయాలలో లేదు, ఆఖరికి కుటుంబంలో కూడా భద్రత లేకపోతె ఎక్కడ బతుకుతుంది.?

కన్న వాళ్ళను, తోడబుట్టిన వాళ్ళను అందరిని వదిలి తనని నమ్మి, తన ఇంటికి వచ్చి,  సర్వస్వాన్ని భర్త కోసం త్యాగం చేసే భార్యని ఎలా చూసుకోవాలి?  అంతవరకు ముక్కు, మొహం తెలియని వాడికి మూడు ముళ్ళు, ఏడడుగులు తో తనని తను నిలువు దోపిడిగా సమర్పించుకునే భార్య అందాలని   రహస్య కెమెరాల ద్వారా బహిర్గతం చేయడం ఆత్మహత్యా సదృశం అని తెలియక పోవడం వాడి దౌర్భాగ్యమే.

శృంగారం ఒక మధురమైన సృష్టి కావ్యం. దానిని వికృత చేష్టలతో భయంకరం చేస్తే ఏ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంటుంది!

ఏది ఏమైనా నేను ఆ అమాయకురాలికి న్యాయం చేసి తీరాలి. ఇంకొక మగాడు ఇంత అమానుషంగా ప్రవర్తించకుండా అసాధారణమైన తీర్పు ఇచ్చేలా చూడాలి. ఒక లేడి లాయర్ గా ఇది నా బాధ్యత.

అలా అనుకున్నాక కొంచెం శాంతిగా అనిపించింది.

సంయూ!   చంద్ర పిలుపు వెనకాలే అతని మెత్తని అడుగుల శబ్దం వినిపించింది.

 

ఆ తర్వాత.............వచ్చేవారం...............

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్