Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pampineedaaru

ఈ సంచికలో >> కథలు >> నారిమణి.

naareemani

(గత సంచిక తరువాయి భాగం )

వస్తుంది ఒకరు కాదు. ఇంకా చాల మంది వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఒక వేళ ఉగ్రవాదులు కాదుకదా.  భయంతో అటు ఇటు చూసింది. ఎదురుగా పెద్ద చెట్టు కనిపించింది. చప్పున పరిగెత్తుకుంటు వెళ్ళి ఆ చెట్టు వెనుక దాక్కుంది.

సరిగ్గా రెండు నిమిషాల తరువాత పదిమంది మనుష్యులు అటువైపు వచ్చారు. వాళ్ళంతా చాల రఫ్ గా మొరటుగా ఉన్నారు.  పైగా వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు ఉగ్రవాదులని ఆమెకు అర్ధమైపోయింది.  దాంతో భయంతో బిక్కచచ్చిపోయింది బిచాని. ఇదే ఉగ్రవాదులు తన భర్తను దారుణంగా చంపటం ఆమె మరచిపోలేదు.

అందరు బిచాని దాక్కున్న చెట్టు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళలో ఒకడు నాయకుడిలా ఉన్నాడు చుట్టు చూస్తూ అన్నాడు. 

“మనని పట్టుకోవటానికి భారత ప్రభుత్వం మేజర్ మాలిక్ ను అతని అనుచరులను పంపింది. వాళ్ళంతా మనంకోసం ఇక్కడే తిరుగుతున్నారని మన మెసింజర్ చెప్పాడు. అందరు జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ప్రాణాలు పోతాయి” అన్నాడు.

“ఏం భయపడవలసిన అవసరంలేదు. నిజంగా ఆ మాలిక్ మనకు ఎదురుపడితే అంతటితో వాడి పని సరి. వాడి శవాన్ని వాడి అనుచరుల శవాలను భారత ప్రభుత్వానికి కానుకగా ఇద్దాం”అన్నాడు వాళ్ళలో ఒకడు.

అందరు ఒక్కసారిగా గట్టిగా  నవ్వారు.

విశ్రాంతి తీసుకోవాలని అందరు ఆ చెట్టు దగ్గర కూర్చున్నారు. బిచాని శరీరం భయంతో వణికిపోయింది. ఉగ్రవాదులు ఇక్కడ ఉన్న విషయం మాలిక్ అతని సిబ్బందికి తెలియకపోవచ్చు. తమ కోసం పదిమంది ముష్కరులు ఎదురుచూస్తారని మాలిక్ కాని అతని సిబ్బంది కాని ఊహించిఉండరు. ఇక్కడికి వస్తే మాత్రం ఉగ్రవాదులు వాళ్ళను ఊరికే విడిచిపెట్టరు. ఇద్దరి మద్య పెద్ద  యుద్ధమే జరుగుతుంది. ఉగ్రవాదుల గురించి బిచాని బాధపడటంలేదు. మాలిక్ సిబ్బంది గురించి భయపడుతోంది.  తన భర్త లాగా మిలిట్రి వాళ్ళు ప్రాణాలు పొగోట్టుకోకూడదని ఆమె ఉద్దేశం. ఆలా జరగాలంటే ఆమె అక్కడనుంచి తప్పించుకుని మాలిక్ దగ్గరికి వెళ్ళాలి. అతనికి ఉగ్రవాదుల గురించి చెప్పాలి. కానిఎలా.

మెల్లగా తల తిప్పి చూసింది. అందరు గట్టిగా మాట్లాడుకుంటు కూర్చున్నారు. నిజానికి బిచాని అక్కడ నుంచి తప్పించుకోవాలంటే వెనుక వైపు పారిపోవచ్చు.  కాని నేలకింద ఎండిన ఆకులు చాల ఉన్నాయి. చిన్నగా నడిచిన చప్పుడు వినిపిస్తుంది. అందుకే ఏం చెయ్యాలో తోచక  బిచాని తలడిల్లిపోతుంది. అయిన వెళ్ళక తప్పదు కనుక కొంచం ధైర్యం చేసి వెనక్కి తిరిగింది. చిన్నగా నడుస్తూ ముందుకు సాగిపోయింది. ఆమె కాళ్ళకింద ఎండిన ఆకులు చప్పుడు చేస్తున్నాయి. కాని  ఉగ్రవాదుల మాటల చప్పుడులో అది ఎవరికి వినిపించలేదు. ఒక నిమిషాం పాటు మెల్లగా నడిచిన బిచాని ఒక్కసారిగా పరుగు అందుకుంది. వేగంగా కదులుతున్న ఆమె కాళ్ళ చప్పుడు సన్నగా ఉగ్రవాదుల చెవిలో పడింది. ఎవరో పరిగెడుతున్నారని గ్రహించి అందురు తుపాకులు తీసుకుని వెనక్కి తిరిగారు. రేసు గుర్రంలా పరిగెడుతున్న బిచాని వాళ్ళకు లీలగా కనిపించింది.

వెంటనే ఒక ఉగ్రవాది తుపాకి గురి చూసి కాల్చాడు. గురి తప్పిందో లేదో తెలియదు కాని ఆ గుండు మాత్రం బిచానికి తగల లేదు. పరిగెత్తి పరిగెత్తి ఒకచోట అలసటతో కూర్చుంది.  తాడు విప్పి బాబును చేతుల్లోకి తీసుకుంది. బాబు శరీరం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ఉగ్రవాది పేల్చిన గుండు బాబుకు తగిలింది. నిద్రపోతున్న ఆ పసివాడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు ముద్దలా ఉన్న బాబు శరీరాన్ని చూసి బిచాని నిర్ఘాంతపోయింది.  బాబు శవాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక్కాసారిగా కదలి పోయింది.  ఇంకా కొంచం సేపు దుఖ్ఖంతో కుమిలి పోయేది బిచాని. కాని ఈ లోగా వెనుక నుంచి ఉగ్రవాదులు తరుముకొస్తున్నచప్పుడు వినిపించింది. బాబు శవాన్ని ఎత్తుకుని వేగంగా ముందుకు పరిగెత్తింది. ఎంతసేప పరిగెత్తిందో తెలియదు. ఎదురుగా ఒక పాడు బడిన గుడి కనిపిస్తే అందులోకి వెళ్ళింది.

“ఎవరు నువ్వు “ అంటు గంభీరంగా వినిపించింది.

బిచాని భయంతో తలతిప్పి చూసింది. ఎదురుగా మిలిట్రి డ్రస్సు వేసుకున్న ఒక సైనికుడు కనిపించాడు. వెంటనే మరో పదిమంది సైనికులు ఆమెను చుట్టుముట్టారు. వాళ్ళకు నాయకుడిగా వ్యవహరిస్తున్న అతను బిచాని దగ్గరికి వచ్చాడు.

“ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు”అడిగాడు.

బిచాని జరిగినదాంతా చెప్పింది. రక్తపుముద్దలా మారిన తన బాబును చూపించింది.  మాలిక్  షాక్ తో బిగుసుకుపోయాడు. మిగత సైనికుల పరిస్ధితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. వాళ్ళందరు బిచాని వైపు అబ్బురంగా చూశారు.

“ఉగ్రవాదులు ఇటువైపు వస్తున్నారని చెప్పావు. నువ్వు వెళ్ళి ఎదురుగా ఉన్న పాడుబడిన గుడిలో దాక్కో. మేము ఉగ్రవాదులను నాశనం చేస్తాం”అన్నాడు మాలిక్.  బిచాని ఏడుస్తూ బాబు శవాన్ని తీసుకుని గుడిలోకి వెళ్ళింది.  కాని అందరు ఊహించినట్టు ఏం జరగలేదు. ఉగ్రవాదులు అటువైపు రానేలేదు.  మాలిక్ తన అనుచరులతో గుడిలోపలకు వచ్చాడు. బిచాని చేతుల్లో ఉన్న బాబును తీసుకుని అప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ పసివాడు నిజంగా గొప్పవాడు అదృష్టవంతుడు. తన కన్నతల్లికి తగలవలసిన గుండుకు అడ్డంపడి తన ప్రాణాలు తీసుకున్నాడు.  శవాన్ని ఇంటికి తీసుకువెళ్ళే అవకాశం లేదు. చుట్టుపక్కల ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. ఏ క్షణంలో అయిన దాడి చెయ్యవచ్చు. అందుకే అందరు కలసి బిచాని కొడుకుకి కడసారి వీడ్కోలు చెప్పారు. గుడి ప్రాంగణంలో నే బాబును పాతిపెట్టారు.

బిచాని పూర్తిగా శోకసముద్రంలో మునిగిపోయింది. కొంతకాలం ముందు భర్త పోయాడు. ఇప్పుడు కన్నకొడుకు పోయాడు. తను ఎవరికోసం బతకాలో ఆమెకు అర్ధం కాలేదు. అత్తగారికి తను అంటే ఇష్టంలేదు. తన కన్నకొడుకు అర్ధాంతరంగా చనిపోవటానికి తనే కారకురాలని ఆవిడ భావిస్తోంది.  ఆ మాటలు వింటు ఇంకా బతకాలని లేదు బిచానికి. ఇంతకాలం కొడుకుకోసం అత్తగారు పెట్టిన అవమానాలు భరించింది. కాని ఇప్పుడు కొడుకు కూడా పోయాడు. ఇక తను ఎవరికోసం బతకాలి.

అప్పుడప్పుడు తుపాకుల మోతలు వినిపిస్తున్నాయి. మాలిక్ అతని అనుచరులు ఎలాంటి ప్రమాధం అయిన ఎదురుకోవటానికి సిద్దంగా ఉన్నారు.  రాత్రి గడిచింది. మాలిక్ అతని అనుచరులు రిలాక్స్ పడుకున్నారు. కాని బిచానికి ఎందుకో నిద్ర రాలేదు. ప్రతి క్షణం ఉగ్రవాదలు రూపాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.  తన భర్త చావుకు పసివాడి చావుకు కారకులైన వాళ్ళను అంత తేలికగా విడిచి పెట్టకూడదని నిర్ణయించుకంది బిచాని. తన ప్రాణాలు పోయిన వాళ్ళను మాత్రం ఖచ్చితంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంది.  అందుకే సమయం కోసం వేచి ఉంది. ఆ సమయం రానే వచ్చింది. అప్పుడు సమయం ఎంతయిందో తెలియదు.  దూరంగా అడుగుల చప్పుడు వినిపించింది. బిచాని చప్పున లేచి కళ్ళు చించుకుని ముందుకు చూసింది.  ఆ చీకటిలో సహితం ఉగ్రవాదలు రూపాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళందరు ఆయుధాలు సరిచేసుకుంటు గుడివైపు వస్తున్నారు. వాళ్ళు గుడిలోకి వస్తే ఏమవుతుందో బిచానికి తెలుసు. మాలిక్ అనుచరులకు ఉగ్రవాదులకు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఉగ్రవాదులు తప్పకుండ మరణిస్తారని బిచానికి తెలుసు. కాని మిలిట్రి వాళ్ళలో కూడా ఎవరికైన ప్రాణాలు పోవచ్చు.

ఉగ్రవాదులు అందరు చనిపోవాలి. కాని మిలిట్రి వాళ్ళలో ఒక్కరు కూడా చావకూడదు. కనీసం గాయ పడకూడదు. ఇది బిచాని నిర్ణయం.  మాలిక్ అతని సిబ్బంది గాఢనిద్రలో ఉన్నారు. ఉదయం నుంచి యడతెరిపిలేకుండ ఉగ్రవాదుల ఆచూకి కోసం తిరగటం వల్ల బాగా అలసిపోయారు. బిచాని ముందు మాలిక్ ను నిద్రలేపి విషయం చెప్పింది. అతను మిగత వాళ్ళను హెచ్చరించాడు. అందరు ఆయుధాలు సరిచేసుకుని సిద్దమయ్యారు. కాని అంతకంటే ముందే బిచాని గుడిలోంచి బయటకు వచ్చి నిలబడింది. అప్పుడే ఉగ్రవాదులు ఆమెకు కూతవేటు దూరంలో వచ్చారు. వాళ్ళను చూడగానే పిచ్చిదానిలా రెచ్చిపోయింది బిచాని.

“రండిరా రండి. ఇంకా ఎంతమంది అమాయకులను చంపుతారు. నన్ను చంపండి. మీకు ధైర్యం ఉంట

నన్ను చంపండి”అంటు వేగంగా ముందుకు పరిగెత్తింది. మాలిక్ ఆమెను హెచ్చరించబోయాడు. కాని అంతకు ముందే ఆమె రేసుగుర్రంలా ఉగ్రవాదల వైపు పరిగెత్తింది. కుడిచెయ్యి వెనక్కి పెట్టుకుని వస్తున్న బిచానిని చూసి ఉగ్రవాదులు అలర్ట్ అయ్యారు. ఆమె బాంబుతో తమ మీదకు వస్తుందని అనుమాన పడ్డారు. వెంటనే  ఉగ్రవాదుల నాయకుడు తన సిబ్బందికి సైగ చేశాడు. అంతె మరుక్షణం తుపాకులు ఢాం ఢాం అంటు నిర్విరామంగా మోగాయి.

రక్తంతో పూర్తిగా తడిసిపోయింది బిచాని. ఆమె శరీరం నిర్జివంగా నేలమీద వాలిపోయింది. క్షణంలో ఆమె ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఆ చీకటిలో తుపాకుల మోత ఏ వైపు నుంచి వచ్చాయో మాలిక్ అతని సహచరులు గ్రహించారు. అటువైపు తుపాకుల మోత అయిపాగానే మాలిక్ అతని సహచరులు కాల్చారు. తుపాకుల మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోగా ఉగ్రవాదలు శరీరాలు చిన్నాబిన్నం అయింది. అందరు రక్తపు ముద్దలా మారి నేలమీద పడిపోయారు.

ఉగ్రవాదులు అందరు చచ్చిపోయారని నమ్మకం కలగగానే మాలిక్ తన సహచరులతో బిచాని దగ్గరికి వెళ్ళాడు. ఆమె కళ్ళు విశాలంగా తెరుచుకని ఉన్నాయి. పెదవుల మీద ఏదో గొప్ప విజయం సాధించినట్టు విచ్చుకుని ఉన్నాయి. మాలిక్ కళ్ళు తడిఅయ్యాయి. స్టిఫ్ గా నిలబడి మిలిట్రి పద్దతిలో ఆమెకు సెల్యుట్ చేశాడు. మిగత సిబ్బంది కూడా అదే చేశారు.

సమాప్తం.

మరిన్ని కథలు
nee goyyi neke