Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు


చూస్తూ.. చూస్తూ కొత్త సంవత్సరం వచ్చేసింది. సాధారణంగా అందరూ చేసే పనేమిటంటే, కొన్ని కొన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు తీసేసికుంటారు. వచ్చిన గొడవేమిటంటే, ఇవే నిర్ణయాలు  గత పది పదిహేనేళ్ళగానూ తీసికుంటూనే ఉండుంటారు. ఇది ఏ ఒక్కరి గురించేకాదు, అందరూ ఒకే గూటికి చెందిన పక్షులం. అందువలన ఎవ్వరూ, “ గుమ్మిడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోనక్కరలేదని మనవి. చదువుకునే కుర్రాళ్ళు.. కొత్తసంవత్సరంలో ఇంకా బాగా చదివేయాలనుకుంటాడు.. ఓ బడుగు జీవుడు, ఈ ఏడాది అస్సలు అప్పులు చేయకూడదనుకుంటాడు. అస్తమానూ శలవులు పెట్టి, పని ఎగ్గొట్టే చిరు ఉద్యోగి – ఈ  ఏడాది, ఛస్తే శలవు పెట్టకూడదనుకుంటాడు. ప్రతీ రోజూ ఏదో అల్లరి చేసి చివాట్లు తినే వాడు, కొత్త సంవత్సరంలోనైనా, బుధ్ధిగా ఉండాలనుకుంటాడు. ఈ నిర్ణయాలు చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, మరీ ఇలా అందరూ “ రాముడు మంచి బాలుడు “ గా మారిపోతే, దేశం గతి ఏమౌతుందో అని.

తెలుగు వారికి కొత్త సంవత్సరం “ఉగాది “ కే ప్రారంభం అయినా, ఇంగ్లీషు కాలెండరు  ధర్మమా అని, సంవత్సరం మారగానే అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే హడావిడిలో ఉంటారు. ఈ సందర్భంలో, చిన్ననాటి  రోజులు గుర్తుచేసికోవడంలో అదో ఆనందం.

చెప్పాలంటే, కొత్తసంవత్సరం ఏదో మార్పు తెస్తుందని కాకపోయినా, ఏదో ఒక శుభమైనా జరగకపోతుందా అనే ఆశ ప్రతీవారిలోనూ ఉంటుంది. ఆరోజుల్లో, ఏ తెలిసిన ఫాన్సీ దుకాణానికో, మందుల షాపు కో వెళ్ళి, ఎన్ని కొత్త క్యాలెండర్లు సంపాదించగలిగితే అంత గొప్ప గా ఉండేది. కొత్త సంవత్సరానికి ముందురోజే, ఇంట్లో ఉన్న పాత క్యాలెండర్లు, తీసేసి, చుట్ట చుట్టి దాచుకోడం.  వాటిలో ఏ దేవుళ్ళ బొమ్మలైనా ఉంటే, వాటిని ఫ్రేము కట్టించుకోడం. హాలు నిండా ఈ దేవుళ్ళ పటాలే.  చదువుకునే పిల్లలలైతే, సినిమా తారల క్యాలెండర్లకోసం నానా తిప్పలూ పడేవారు. ఇవి కాకుండా, విదేశీ తారల క్యాలెండర్లు కూడా వచ్చేవి. నాకు బాగా గుర్తు—ఆరోజుల్లో ఏదో కంపెనీ వారు  హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో బొమ్మతో ఓ క్యాలెండరు వేశారు. మొత్తానికి ఓ స్నేహితుడి ద్వారా అది సంపాదించాను.. తను ఆ క్యాలెండరు నాకు  ఉదారంగా ఇవ్వడానికి కారణం ఉంది—ఆ క్యాలెండరు చూసి వాళ్ళింట్లో చివాట్లు పెట్టారుట. నాకు చదువుకోడానికి, విడిగా ఓ గదుండడం ధర్మమా అని, ఆ క్యాలెండరు నాకిచ్చాడు. అప్పుడప్పుడైనా వచ్చి, ఆ క్యాలెండరు చూసి చొంగ కార్చుకోవచ్చుకదా అని. అయినా ఆ ముచ్చట ఎన్నాళ్ళుందీ… ఓ రోజు మా నాన్నగారు, నా గదిలో గోడకు వేళ్ళాడుతూన్న ఆ క్యాలెండరు చూసి, చివాట్లేసి, దాన్ని కాస్తా తీసేశారు. చెప్పొచ్చేదేమిటంటే, ఊరికే క్యాలెండర్లు తెచ్చేసికోడం కాదు, కాలమాన పరిస్థితులు కూడా కలిసిరావాలి.

ఏది ఉన్నా లేకపోయినా, వెంకట్రామా ఎండ్ కో వారి తెలుగు క్యాలెండరైతే, ప్రతీ ఇంట్లోనూ ఉండాల్సిందే. ముహూర్తాలూ వగైరా చూసుకోడానికి ఉపయోగించేవి.  ఇంకో రకం పెద్ద పెద్ద అంకెలతో ఉండే క్యాలెండర్లమీద  వాడిక పాల లెక్కలూ వగైరాలుండేవి. పాత క్యాలెండర్లమీద ఉండే అంకేలు జాగ్రత్తగా కత్తిరించి, లైబ్రరీ పుస్తకాలమీద అంటించేవారు. ఇవన్నీ ఓ ఎత్తూ, డయరీలు ఓ ఎత్తూనూ. డయరీ సంపాదించగలిగాడంటే, చాలా పలుకుబడి ఉన్నట్టన్న మాట.  కొద్ది సంవత్సరాల క్రితం దాకా, రీడర్స్ డైజెస్టు వారు, ఓ బుల్లి డయరీ ఇచ్చేవారు.  ఎడ్రసులు రాసుకోడానికి ఉపయోగించేవి. హాయిగా చొక్కా జేబులో పట్టేది కూడానూ.

ఇప్పుడంటే ఎస్.ఎం.ఎస్ లతో కానిచ్చేస్తున్నారు కానీ, మొన్న మొన్నటిదాకా  గ్రీటింగ్స్ పంపడం తప్పనిసరిగా పాటించేవారు. ఈరోజుల్లో వాటి జాడే లేదు. గ్రీటింగు కార్డు కొనే స్థోమత లేకపోయినా, కనీసం ఓ పోస్టు కార్డుమీదైనా శుభాకాంక్షలు తెలిపేవారు. ఇంక ఆఫీసుల్లో అయితే,  జనవరి ఒకటో తారీకున ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకోవడంతోనే సరిపోయేది.. ఆఫీసుల్లో కంపెనీల వారు టోకుగా డయరీలూ, పెన్నులూ ఇచ్చేవారు.

పైన చెప్పినవన్నీ, సంసారపక్షంగా ఉండేవారు చేసేవి. కానీ ఈ రోజుల్లో, కొత్తసంవత్సరం ముందురోజునుండీ, సంబరాలు ప్రారంభం. సరీగ్గా అర్ధరాత్రి అయేసరికి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుని, ఫుల్లుగా మందు కొట్టేసి, ఏ తెల్లవారు ఝాముకో, కొంపలకి బయలెదేరడం. మనం మర్నాడు పొద్దుటే పేపర్లలో చదవడం, ఫలానా చోట, కారు అదుపుతప్పి బోల్తాకొట్టిందనో, బైక్కుమీద వెళ్తూన్న వాళ్ళని ఏ కారో గుద్దేసిందనో… పీకలదాకా తాగి వాహనాలు నడిపితే  జరిగేదదేకదా మరి? అయినా క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి….

సర్వేజనా సుఖినో భవంతూ…

మరిన్ని శీర్షికలు
vastu vastavalu