Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Lipoma & Ayurvedic Treatment in Telugu | లైపోమా కొవ్వు గడ్డలు | Dr. Murali

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి కైలాశ దర్శనం ​( నాలుగవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

himagiri kailasa darshanam 4th part

( స్వయంభు నాథ్ బౌద్దస్ధూపం )

45 కిమీ... నడక అనగానే గుర్రాలు వుంటాయా నడవలేని వారికోసం అని అడగకుండా వుండ లేకపోయేను . మా టూరు గైడు ( నేపాలు బోర్డరుదాటేంత వరకు వున్నతని పేరు ) దోర్జీ గుర్రాలు కావలసిన వారు ముందుగా పేరు రాయించుకుంటే టిబెట్టు నుంచి మాతో కూడా వచ్చే చైనా గైడు ముందుగా బుక్ చెయ్యగలుగుతాడని చెప్పి ఒక గుర్రానికి ₹8000 పోర్టరుకి మరో మూడువేలు అంటే మన బేక్ పేక్ లు మొయ్యడానికి అవుతుంది అని వివరించేడు .

గుర్రాలు తక్కువగా వున్నందున ముందుగా బుక్ చేసుకోకపోతే గుర్రాలు దొరకవని , మన బేక్ పేక్ లలో ఆరు కేజీ ల కన్నా యెక్కువ బరువైన సామానులు పెడితే హెల్పర్లు మొయ్యరని , మనం బేగులు పట్టుకొని గుర్రాల మీద కూర్చుంటాము అంటే గుర్రాల వాళ్ళు వప్పు కోరని కూడా చెప్పేడు . మేం అయిదుగురం అయిదు గుర్రాలకి డబ్బులు యిచ్చేసేం . హై అల్టిట్యూడు వల్ల కలిగే యిబ్బందులు మరోమారు వివరించి ముఖ్యంగా టిబెట్టు లో యెవ్వరితోనూ గొడవలు పడొద్దని , డ్రైవర్లు చైన్ స్మోకర్లు వారిని సిగరెట్టు కాల్చొద్దు అని అంటే వాళ్ళకి కోపం వస్తుందని , అలా కోపంవచ్చినప్పుడు యాత్రీకులని నడి రోడ్డు మీద దింపి వెళ్ళిపోయిన సందర్బాలు వున్నాయని , చైనా గైడు తో యే విధమైన గొడవలు పెట్టుకోవద్దని , అతను ఫిర్యాదు చేస్తే చైనా ప్రభుత్వం అతనికి అనుకూలంగా వుంటుంది , మా పాసు పోర్టులు అతని చేతులో వుంటాయి కాబట్టి జాగ్రత్తగా వుండ వలసిందిగా ఒకటికి రెండు సార్లు హెచ్చరించేరు . ప్రస్తుతం కైలాశపర్వతం దగ్గర వాతావరణం యెలా వుంది అన్న మా ప్రశ్న కి కొంచెంసేపు మౌనం వహించిన తరువాత సాధారణంగా ఈ ప్రశ్న యెవరూ అడుగరు కాబట్టి మేము యెప్పుడూ వాతావరణం గురించి మాట్లాడలేదు . మీరు అడిగేరు కాబట్టి చెప్తున్నాము , ప్రస్తుతం రెండురోజులుగా హిమపాతం జరుగుతోంది యాత్ర ఆపివేయ బడింది . మనం అక్కడికి చేరే సమయానికి వాతావరణం బాగుంటుంది . యాత్ర మొత్తం వాతావరణం మీద ఆధార పడి వుంటుంది కాబట్టి వాతావరణం బాగుండాలని యాత్ర సాఫీగా సాగాలని మీ మీ యిష్టదైవాలని ప్రార్ధించుకోండి , మనతో పాటు వచ్చే హెలపర్లు యెవరెస్ట్ అధిరోహించడానికి వచ్చిన వారితోపాటు వెళ్ళిన వారు కాబట్టి మీరు భయపడవలసినది యేమీ లేదు అని చెప్పేరు . తరవాత మా గ్రూపులో డాక్టర్సు వుంటే చెప్పమన్నారు . మా చెల్లెలు మరిది గారు యిద్దరూ డాక్టర్లు అయినా మా మరిదిగారు డాక్టరని చెప్పేం . అంటే మా చెల్లి తను డాక్టరునని చెప్పొద్దంది . అలా చేసి యెంత మంచి పని చేసిందో నాకు తర్వాత అర్ధమైంది .

మా దోర్జీ మాతో కూడా తెచ్చే మందులని చూపించి యింకేమైనా అవుసరపడతాయేమో కనుక్కొని యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు తోటి యాత్రీకులకు వినిపించమని అడిగేరు . మా మరిదిగారు యింగ్లీషులో వివరిస్తూ వుంటే హిందీలో చెప్పమని హరియాణా నుంచి వచ్చిన మా తోటి యాత్రీకులు కోరగా నేను వారికి హిందీ అనువాదం వినిపించేను .

రాత్రి పది వరకు సాగిన మా గోష్టిని ముగించి బఫే రాత్రి భోజనం చేసి మా మా రూములు చేరేం . మరునాడు పొద్దున్నే ఆరుకి టీ కప్పులతో సుప్రభాతం పలికేరు మా సహాయకులు . 8 నుంచి పొద్దున్న ఫలహారాలు నాలుగైదు రకాలు , తాగడానికి నాలుగు రకాలు పళ్ళరసాలు , టీ , కాఫీలతో పెట్టేరు .

మా సొంత ఖర్చులతో పశుపతినాథ్ , గుహ్యేశ్వరీ దేవి మందిరం చూడ్డానికి వెళ్ళేం .

స్వయంభు నాథ్ బౌద్దస్ధూపం

ఇప్పుడు మేము ముందురోజే చూసేసిన స్వయంభు నాథ్ గురించి వివరిస్తాను . 

ఖాట్మండు లోయ లో వున్న అతి పురాతనమైన కట్టడాలలో యిది ఒకటి . నేపాలీ భాష లో " సింగ్గు  " అంటే శ్వయంభూ అని అర్ధం . దీనిని కోతుల మందిరం అనికూడా అంటారు . ఇది బౌద్దస్ధూపం . కొండ మీద నిర్మింప బడింది . దీనిని  చేరుకోడానికి 365 మెట్లు యెక్కి చేరుకో వచ్చు , యీ కొండకు మరో వైపున వున్న రోడ్డు ద్వారా కారులో కూడా చేరుకో వచ్చు . కారు లోంచి కాలు కింద పెట్టగానే మాకు కనిపించిన దృశ్యం లెక్కలేనన్ని కోతులు యెక్కడ పడితే అక్కడ గోడలమీదా , చెట్ల మీదా , యిలా ప్రతీ చోటా కోతులే . ముందు జాగ్రత్త గా మేము మాబేగులు , కెమేరాలు కారులో పెట్టుకొని వచ్చేం . మా డ్రైవరు " నరబహద్దూరు " ఈ కోతులు స్వయం దేవతలని యెవ్వరికీ హాని చెయ్యవని చెప్పేడు . పచ్చని చెట్ల మధ్య తెల్లని బౌద్దస్ధూపం అల్లంత దూరం నుంచి చూపరులను ఆకట్టుకుంటుంది .

ముఖ్య ద్వారం దగ్గర రెండు వైపులా రెండు సింహాలు స్వాగతం పలుకుతూ వుంటాయి . చుట్టూ  చిన్నచిన్న రాతి గోపురాలు , బౌద్ద సన్యాసులు వుండేందుకు గదులు , స్కూలు వున్నాయి . తెల్లటి రంగు వేయబడిన పెద్ద స్థూపం . స్థూపం పై భాగంలో నాలుగు వైపులా కళ్ళు ముక్కు ఆకారాలు పెయింటు చెయ్యబడి వున్నాయి . కింద భాగంలో బుద్దుని విగ్రహం వుంది , మద్యభాగంలో నాలుగు వైపులా నాలుగు బుద్దుని విగ్రహాలు వున్నాయి . స్థూపానికి కుడిచేతి వైపునుంచి ప్రదక్షిణ చేసుకోవాలి , చాలా బౌద్ద మందిరాలలో వున్నట్లు యిక్కడ కూడా మందిర ప్రాకారం చుట్టూ పెద్ద కర్రతో చేసిన గంటలలాంటివి వుంటాయి ,ఆ పక్క నుంచి వెళుతున్న చిన్న పెద్ద ఆ గంటలను చేతితో తిప్పుతూ ముందుకి తోస్తూ వెళుతున్నారు . మేంకూడా చేత్తో తిప్పేము .

ఈ మందిరం క్రీస్తుపూర్వం తొమ్మిది వందల సంవత్సరానికి చెందినది . క్రీస్తుపూర్వం  గోపాల వంశావళి అనే గ్రంధం ప్రకారం వ్రజదేవ మహారాజు క్రీస్తుపూర్వం 500 సం.. లకి పూర్వం శిధిలావస్థ లో వున్న యీ మందిరాన్ని పునఃనిర్మించేడు . క్రీస్తుపూర్వం మూడువందలలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి ఈ మందిరాన్ని దర్శించు కున్నట్లు ఆధారాలు వున్నాయి . ఈ కోవెల బౌద్దులు పరమపవిత్ర తీర్థస్థలం గా భావిస్తారు . ముఖ్యంగా టిబెట్టు బౌద్దులకు యిది ముఖ్యమైన పవిత్ర స్థలం . బౌద్దుల పుణ్యక్షేత్రాలలో బోధినాథ్ మొదటిది యిది రెండవదిగా చెప్తారు . క్రీస్తుపూర్వం నుంచి యీ మందిరాలు హిందూరాజులు దర్శించుకొని , కావలసిన మరమ్మత్తు పనులు చేయించి బౌద్ధమతం పై తమకున్న శ్రధ్దని చాటుకున్నారు . అందులో ముఖ్యంగా పదిహేడు వేలకి చెందిన ప్రతాపమల్లుడు యీ కోవెలకు సులువుగా చేరగలిగడానికి వీలుగా 365 మెట్లతో దారి నిర్మంచి , పైన వున్న తెల్లని మందిరాన్ని నిర్మించేడు . 2008 లో కాలిఫోర్నియా లో వున్న  ' టిబెటిన్ న్యింగ్మా మెడిటేషన్ సెంటరు ' వారి సహాయంతో మొత్తం స్థూపం పై భాగాన్ని యిరవై కేజీల బంగారం వుపయోగించి బంగారు పూత పనులు 2010 లో పూర్తి చేసేరు .

బౌద్దుల పరమపవిత్రమైన గ్రంధం స్వయంభూ పురాణం ప్రకారం మంజుశ్రీ అనే బోదిసత్వునికి తపస్సు చేసుకుంటూ వుండగా ఓ సరస్సు అందులో వున్న కలువపువ్వు దానికిందన వున్న స్థూపం కనిపించగా అతను ఆ సరస్సును వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చి సరస్సులోని నీటిని కాలువలద్వారా ప్రవహింప జేయగా కలువ పువ్వు పర్వతంగా మారి స్థూపం స్వయంగా బయటికి ప్రకటిత మయ్యిందట . అప్పటి రాజు ధర్మాకరుడు సరస్సు వున్న ప్రదేశం లో పట్టణం నిర్మించేడు . మంజుశ్రీ స్వయంభూ స్థూపం వద్దనే వుండి బౌద్ద మత ప్రచారం చేసుకొని బుద్దునిలో కలసిపోయేడుట .

మంజుశ్రీ అందరు బౌద్ద సన్యాసుల వలె తలపై జుత్తు తీసేవాడు కాదుట . బాగా పెరిగిన అతని జుత్తులో పేలు నివాసం వుండేవని అతను అవతారం చాలించిని తరువాత ఆ పేలు కోతులుగా పుట్టి అతనిచే నిర్మించబడ్డ ఆ ఆరామములను కనిపెట్టుకొని వుంటున్నాయని , వాటికి కూడా బౌద్దసన్యాసులకు వున్నంత సహనం , కరుణ దయగుణం వున్నాయని అంటారు .

స్థూపం పైన నాలుగు వైపులా పెయింటు చెయ్యబడ్డ కళ్ళు బుద్దుని కళ్ళని ఒకటి కరుణకు మరొకటి దయకు ప్రతీకలని ఆరెండింటికి పైన వున్న కన్ను బుద్దుని జ్ఞాన నేత్రమని బుద్దుడు బోధ చేసేటప్పుడు భూలోక వాసులు అతని యెదురుగా కూర్చొనే వారు , స్వర్గలోక వాసులు  జ్ఞాననేత్రం ప్రసరించే కాంతిని ఆధారముగా చేసుకొని అక్కడకు వచ్చి వినేవారుట , పాతాళ వాసులు పాపభారముతో పాతాళలోకం నుంచి బయటికి వచ్చి బోధ వినలేరు కాబట్టి జ్ఞాననేత్రం బుద్దుని బోధలు వారి వరకు చేర్చి వారిని పాప విముక్తులుగా చేసేదట

పదమూడు అంతస్తులు జీవి మోక్షసిధ్ది కి దాటవలసిన పదమూడు స్థితులను సూచిస్తుందని బౌద్దుల నమ్మకం . స్వయంభూ స్థూపం యొక్క మొదలు భాగం భూమికి ప్రతీక , స్థూపం మీద వున్న అయిదు బుద్ద విగ్రహాలు తంత్రయానం ప్రకారం అయిదు శక్తులకు ప్రతీకలు . మధ్య భాగంలో వున్నది ' విరోచన బుద్దవిగ్రహం ' దీనిని మూలశక్తి అని అంటారు యిది ముఖ్యమైనది . చైతన్యానికి ప్రతీక అయిన  ' అక్సోబ్య బుద్దవిగ్రహం ' తూర్పు వైపున వుంటుంది . జ్ఞానశక్తికి ప్రతీక అయిన 'రత్న సంభవ దక్షిణం వైపున వుంటుంది . పడమర వైపున వున్న అమితాభ బుద్దవిగ్రహం పేరుప్రఖ్యాతులకు ప్రతీక , ఉత్తరంవైపున వున్న అమోఘసిధ్ధి బుద్దవిగ్రహం నిర్ధారణ శక్తికి ప్రతీక . 

మందిరం చుట్టూవున్న కర్ర తో చేసిన గంటలలాంటి వాటి పైన బౌద్ద మంత్రాలు వుంటాయి . వాటిని తిప్పితే అవి తిరిగినన్ని  మార్లు వాటిని చదివి నంత ఫలితం వస్తుందని బౌద్దు ల నమ్మకం .

ఈ మందిరం కూడా భూకంపం వల్ల చాలా దెబ్బ తింది .

ఆ రోజు మధ్యాహ్నం హొటలు రూం లో విశ్రాంతి తీసుకున్నాం . రాత్రి యెనిమిదిన్నరకి డిన్నరు సర్వ్ చేసేరు . దోర్జీ మా పెద్ద బేగులని రాత్రి పన్నెండు గంటలకి మా గది బయట పెట్టమని పొద్దున్న నాలుగింటికి బస్సు బయలుదేరు తుందని , మమ్మల్ని నాలుగు గంటల కంటే ముందు వచ్చి బస్సులో కూర్చమని చెప్పేడు . మూడు గంటలకి మాకు మా మా రూములకి బెడ్ టీ పంపిస్తామని బయలు దేరడానికి ముందు పేక్డ బ్రేక్ ఫాస్టు యిస్తామని చెప్పి వెళ్ళి పోయేడు .

మేం చాలా బుద్దిగా మా సామానులు సర్దుకుని మా పెద్ద బేగులు బయట పెట్టి నిద్ర పోదామని ప్రయత్నించేము . మావారికి నిద్రాదేవి పిలుస్తే పలుకుతుంది . నాకు మా చెల్లెలు యిచ్చిన నిద్ర మాత్ర వల్ల కాస్త నిద్ర పట్టింది . అప్పటికే చాలా ఉత్తరభారత యాత్రలు చేసిన అనుభవంతో ఆ రోజు తలలు రుద్దుకొని బయలు దేరుదాం అని నేను మా చెల్లెలు డిసైడ్ అయేం . మళ్ళా స్నానం చేసే భాగ్యం యెప్పుడో . సరిగ్గా మూడు గంటలకి బెడ్ టీ వచ్చింది . వెంట వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు కానిచ్చుకొని బయట పడేసరికి నాలుగు అయింది . అప్పటికి పది మంది తయారయి వచ్చేరు . మిగతా వాళ్ళు యింకా రాలేదు . బస్సులో అనుకూలంగా వున్న సీట్లలో కూర్చున్నాం . ఈ లోపున గుజరాతీ మహిళ పేరు భారతి అని చెప్పినట్లు గుర్తు యెర్రని ధారం మా చేతులు కట్టి యిది మనకు రక్ష ని కలుగ జేస్తుందని చెప్పింది . అందరూ బస్సు యెక్కేసరికి అయిదున్నర దాటింది . హోటలు వాళ్ళు ఒక సమోసా , కచోడి , స్వీటు , నాలుగు బిస్కెట్స్ , యాపిలు , అరటి పండు వున్న పేకెట్స అందించేరు . మొత్తానికి ఆరు గంటలకి ' బం భం భోలే ' అనే నినాదాలతో బస్సులు బయలు దేరేయి .

అంతా ఘాఠ్ రోడ్డు కావడం తో మెల్లగా నడుస్తున్నాయి బస్సులు . అక్కడక్కడ ఓ మోస్తరు వాన పడుతోంది . పచ్చటి వృక్షాలతో నిండి వున్నాయి కొండలు . జనావాసాలు చాలా తక్కువగా వున్నాయి . వర్షం యెక్కువయేసరికి మా గుండెలలో రైళ్ళు పరుగెట్టేవి . పంటలు , పళ్ళ చెట్లు లేవు . ఈ ప్రాంతపు ప్రజల జీవనం చాలా కష్టం అని అనిపించింది . కొడారి గ్రామం చేరేక మా అంచనా నిజమని తేలింది . ఎలాగైతేనేమి పన్నెండింటికి కోడారి గ్రామం చేసుకున్నాము . దారంతా బురద బురదగా వుంది . మా దోర్జీ మా దగ్గర రూపాయలు తీసుకొని వాటికి తగిన చైనా కరన్సీ యిచ్చేరు . మా మా బేగులు తీసుకొని అరకిలోమీటరు దూరం లో వున్న బోర్డరు కి చేరి మా గ్రూపు వాళ్ళంతా వరుసగా నిలుచుంటే పాసు పోర్టు చెక్ చేసిన తరువాత నేపాలుకి చైనా ఆక్రమిత టిబెట్టుకి మధ్య నున్న ' ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ' దాటుతామని , అక్కడ ఫొటోలు అవి తీసుకోకూడదని హెచ్చరించేరు .

ఎవరి బేగులు వారు మోసుకుంటూ నడక ప్రారంభించేము . ఏడు నుంచి పదేళ్ళ పిల్లలు మా బేగులు మోసి పెడతామని వెంటపడసాగేరు . అంత చిన్నపిల్లల చేత మోయించలేక వద్దంటే అయిదురూపాయలకి రెండు బేగులు మోస్తామని బేరాలాడసాగేరు . మా మరిది అయిదు రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే ముష్టి వద్దు బేగు యివ్వండి మోస్తాను అప్పుడు డబ్బులు తీసుకుంటాను అన్నాడు ఆ బుడతడు . మారు మాట్లాడ కుండా మా బేగులు వాళ్ళ చేత మోయించుకొని పదేసి రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టేం .అప్పుడు  వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందానికి మా కళ్ళల్లో నీళ్ళు వచ్చేయి . సరిహద్దు గ్రామాలలో ప్రజలు పడే బాధలు మనం యే పుస్తకాలలోనో చదువుతాం . ప్రత్యక్షం గా చూస్తే యెంత ఘోరంగా వుంటుందో తెలుస్తుంది . రెండు మూడేళ్ళ పిల్లలు తిండి అడుక్కుంటూ కనిపించేరు . మా దగ్గర మిగిలి పోయిన ఆహారం ఆ చిన్న పిల్లలకి యిచ్చేం .

ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ చేరేం రెండు కొండలని కలుపుతూ వేసిన బ్రిడ్జ్ కింద ' సూర్యకోసి ' నది ప్రవహిస్తోంది . ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ పూర్తిగా చైనా వారి ఆధీనం లో వుంటుంది . చైనా వారి అనుమతి పొందిన తరువాత మేం బ్రిడ్జ్ దాటి చైనా భూభాగం లో అడుగు పెట్టేము . అక్కడ చైనా గైడు మా వీసాల కోసం ప్రయత్నించ సాగేడు . అందరం కస్టమ్స ఆఫీసు దగ్గర వెయిట్ చెయ్యసాగేం . మా దోర్జీ వచ్చి ఓ నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి కూర్చమని ( నేలమీద ) సలహా యిచ్చేడు . కాస్త సేపు తటపటాయించినా చివరకు కూర్చున్నాం . మొత్తం అయిదు వందలదాకా వున్నారు యాత్రీకులు . ఒకొక్క గ్రూపు వెరిఫికేషన్ కోసం లైను కడుతున్నారు . మూడేసి గ్రూపులకు ఒకే మారు చెక్ జరుగు తోంది .

మరో పక్క రోజూ పనులకోసం సరిహద్దు దాటి వెళ్ళే వారికి వేరే క్యూ వుంది .

అందరం కూర్చొని మాట్లాడు కుంటున్నప్పుడు కొంత మంది మాట్లాడు కునే మాటలు చెవులలో పడ్డాయి . ఇలాంటి వారు కూడా వుంటారా ? అని అనుకోకుండా వుండలేకపోయేను . విషయం యేమిటంటే అయిదేసి రూపాయలకి బేగు మోయించు కున్నాం కదా ? అందులో ఒక ఆవిడ తన నాలుగు సంచులని పదిహేను రూపాయలకు బేరమాడి సామాను మోయించు కొంది . అసలు కొడారి నివాసులకి బ్రిడ్జ్ దగ్గర వరకే ప్రవేశం . అది దాటితే చైనా ప్రభుత్వపు చర్యలకు బాధ్యులవుతారు . కాబట్టి వారు బ్రిడ్జ్ వరకే వస్తారు ఈమె కష్టమ్స్ ఆఫీసు వరకు తెమ్మంది , అలా వీలు కాని పక్షం లో డబ్బులు యివ్వను అని ,  ఆ పిల్లాడు సగం డబ్బులయినా యివ్వమని యేడుస్తున్నా వచ్చేసానని చెబుతూ వాళ్ళ చెల్లి యింకా గడుసుదిట అందుకని ఆమె సామానులు తెచ్చిన అబ్బాయికి లెంపలు వాయించి మరీ వచ్చిందట . నేను వాళ్ళిద్దరినీ గుర్తు పెట్టుకోమని మా వాళ్ళకి చెప్పేను . యెందుకంటే ఆ ఆడవాళ్ళు చేసిన పనికి వాళ్ళు యెక్కువ పోగొట్టుకోవాలి అని నేను మనసులో అనుకున్నాను .

సాయంత్రం నాలుగున్నరకి మా యిమిగ్రేషన్ పూర్తయి బయట పడ్డాం . బయట మా చైనా గైడు పేరు ఛాంగ్మై . అతను గ్రూపులో సభ్యులని బట్టి కారు కేటాయించేడు . మాకు పది మంది కూర్చునే వీలున్న వేను యిచ్చేరు . యాత్ర పూర్తి అయి మేము మళ్ళా ఆ ప్రదేశానికి వచ్చేంత వరకు అదే కారు లో ప్రయాణం చెయ్యాలి .

మిగిలిన వివరాలు వచ్చేవారం

మరిన్ని శీర్షికలు
humour interview