Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

తిరుప్పావై - వనం వెంకట వరప్రసాద రావు

tiruppavai

18 వ పాశురం 

ఉన్డు మదకళిత్త నోడాద తోళ్ వలియన్ 
నన్ద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కన్దం కమళుమ్ కుళలీ కడై తిఱవాయ్
వన్దెఙ్గుమ్ కోళియళైత్తనగాణ్; మాదవి 
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినఙ్గళ్ కూవినగాణ్ 
పన్దార్ విరలి; ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప
వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్ 

మదగజములతో పోరాడగలిగినవాడును, మదగజమువంటి బలిష్ఠుడును, మదగజములను ఎన్నింటినో కలిగినవాడును, యుద్ధములో వెనుదీయని భుజబలము గలవాడును అగు నందగోపుని కోడలా!  సుగంధమును వెదజల్లుచున్న కేశపాశమును కలిగిన ఓ నీళాదేవీ! తలుపు గడియను తొలిగించుము. అంతటా కోళ్ళు కూయుచున్నవి. మాధవీలత అల్లుకున్న పందిరిమీద గుంపులు గుంపులుగా చేరిన కోకిలలు కూయుచున్నవి. కావున, తెల్లవారినది! చూడుము! చేతిలో బంతిని ధరించిన దానా! మీ బావ గుణములను కీరించుటకు వచ్చితిమి. నీవు సంతోషముగా లేచివచ్చి, ఎఱ్ఱని తామరపూవులను బోలిన చేతులకు ధరించిన అందమైన కంకణములు ‘ఘల్లు ఘల్లు’న ధ్వని చేయునట్లుగా తలుపులను  తెరువుము!   

మదగజమగు భుజబలమున
మదగజమును గెలువగలుగు మదగజబలమున్
పదునుగ సేనలగలిగిన
కదనములను వెనుదిరుగని ఘన శూరునకున్
నందునికి ముద్దుకోడల!
నందనవన సౌరభముల నందు సుకేశీ! 
సుందరి మా కుందరదన
లందరి వీనుల కువిందు లందెల సడులన్ 
వడిగొని దయగొని తలుపుల
గడియ తెరిచి వినుము కోళ్ళ ఘనమగు ద్వనులన్       
గడుసరి కోయిల గుంపుల 
సడులకు మాధవి లతయది సభయై మురియన్ 
బంతులనాటల గొను పూ
బంతిరొ నీ మేనబావ పంకజనాభున్
యింతులమిటు వ్రత విధమున
ఇంతల నంతల పెరిగిన వింతల వటువున్
నీబావను నిఖిలాశ్రయు  
నా బాలుని నటనల హరి నాది ననాదిన్
ఆబాలము గోపాలము 
నేబాధల సుడియక గన నేర్చిన కుశలున్ 
పూజల భజనల పొగడగ
మాజననము కలిగెననెడి మర్మము దెలియన్
మోజులుగొని చేరితిమిట 
గాజులు ఘల్లన తెరువుము గడియను కరుణన్  
ఎఱ్ఱని కలువల కన్నులు 
నెఱ్ఱని యరచేతులెఱ్ఱనెఱ్ఱని పెదవుల్
వెఱ్ఱుల జేయగ మురియుచు 
కుఱ్ఱల గావగ తెరువగ గూడును గడియన్
నీలా తెరువుము గడియను
వేలాయుధపాణిఁ నందుఁ వెలది యశోదన్ 
కాలాతీతుల నిరువుర 
లోలాక్షీ పొగడవలెను లోకము కొరకున్  

19 వ పాశురం 

కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ 
మెత్తెన్ఱ పఞ్చశయనత్తిల్ మేలేఱి,
కొత్తలర్ పూఙ్గుళల్ నప్పిన్నైకొఙ్గై మేల్
వైత్తుక్కి డన్దమలర్ మార్ పా!వాయ్ తిఱవాయ్
మైత్తడ ఙ్గణ్ణినాయ్! నీ యున్మణాళనై
ఎత్తనైపోదుమ్  తుయిలెళ వొట్టాయ్ కాణ్!
ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్ 
తత్తువ మన్ఱుత్తకవేలో రెమ్బావాయ్ 

చుట్టూ దీపపు గుత్తులు వెలుగుచుండగాఏనుగు దంతపు కోళ్ళు కలిగినఐదు మేలు గుణములు కలిగిన పానుపుపైపూలగుత్తులను సిగలో అలంకరించుకుని పడుకుని ఉన్న నీళాదేవి స్తనములపై నిదురించుచున్నవిశాల వక్షస్థలము కలిగిన శ్రీకృష్ణానోరు తెరిచి  మాటలాడుమువిశాలములైన కాటుక కనులున్న ఓ నీళాదేవీఎంతసేపని నీ ప్రియుని లేవనీయవుయింతమాత్రము ఎడబాటును ఓర్వలేకపోవుట నీ స్వరూపమునకునీ స్వభావమునకు తగదు! 

గుత్తులు దీపములు వెలుగ
మత్తగజపు దంతములను మలచినఘనమౌ 
ఉత్తమమగు కోళ్ళను గల 
మెత్తని దైదగు గుణముల మేలగు శయ్యన్ 
గుత్తులు విరిసిన విరులను 
ఒత్తుగ సిగ ముడిచిన సతి ఒడి పానుపుగన్ 
మెత్తని కుచముల మెత్తల 
మత్తుగ నిదురల గొనుటల మరగిన ఘనుడా 
వెడద యురము గల రేడా 
విడుమిక మౌనము పలుకుము వింతగునమ్మా 
గడసరి కాటుక కన్నుల 
పడతీ నే సైపననుట పతి ఎడబాటుల్ 
ఒక నిముషమునైనను పడ
తుక విభునెడబాయననుట తుంటరిదనమౌ 
సకలజ్ఞవు యిది నీకిం 
చుకరూపము గాదు కాదు చూడగ గుణమున్

20 వ పాశురం

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు 
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు 
వెప్పఙ్గొడుక్కుమ్  విమలా! తుయిలెళాయ్!
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్ 
నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్!
ఉక్కముమ్ తట్టొళియుమ్ తందున్ మణాళనై
ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్ 

ముప్పది మూడు కోట్ల దేవతలకు ఆపద వాటిల్లకముందే యుద్ధభూమిలో వారికి రక్షణగా ముందునిలిచి, వారికి శత్రుభయమును తొలిగించే ఓ బలశాలీ! ఆర్జవము కలవాడా! రక్షణనిచ్చు స్వభావము గలవాడా! బలవంతుడా! నీ ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి, ఆ శత్రువులకు భయజ్వరములను కలిగించువాడా! పవిత్రుడా! మేలుకొనుము! బంగారు కలశములవంటి వక్షోజములను, దొండపండువంటి క్రిందిపెదవిని, సన్నని నడుమును కలిగిన ఓ నీళాదేవీ! పరిపూర్ణురాలా! మహాలక్ష్మీ సమానురాలా! మేలుకొనుము! విసురుటకు విసనకర్రను, చూచుకొనుటకు కంచుటద్దమును మాకు ప్రసాదించి, నీ వల్లభుడైన శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడునట్లు కరుణించుము!   ముప్పది మూడగు కోటుల  

గొప్పగు దేవతల కెపుడు కొంచెపుదనమున్ 
ముప్పును కలుగక గాతువు 
ఇప్పగిదిని నిదుర వలదు ఈశ్వర! కరుణన్ 
ఆర్జవమును బలమును గల 
దుర్జనగజసింహమ! వలదుర యిక నిదురల్ 
గర్జనలను గొని వెడలుము! 
తర్జన భర్జనలు వలదు తగదిక తడయన్ 
కంపము గలుగగ రిపులకు 
నింపుగ పులకలు మొలయగ నీదాసులకున్  
చెంపల చారెడు కెంపుల 
సొంపుల కలువల కనులవి సోకుగ విరియన్  
మేలుకొనిన మేలగు నల
మేలుపతీ! నిఖిల భువన మేలగ కలుగన్ 
ఖేలగ బొలయగ జేసెడు 
మూలపురుషులకు మొదలగు మూలము నీవే! 
అంబా! పసిడి మిసిమి కుచ  
కుంభా! యో గగనమధ్య కుందరదన యో
బింబాధర! పరమపురుషు
నిం బాడగ వలెను నీల నిదురలు విడుమా

21 వ పాశురం 

ఏత్తక్కలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్ 
ఆత్తప్పడైత్తాన్ మగనే! యఱివుఱాయ్;
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్ 
తోత్తమాయ్ నిన్ఱశుడరే, తుయులెళాయ్;
మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే 
పోత్తియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలో రెమ్బావాయ్

పొదుగుల క్రింద ఉంచిన కడవలు చర చర నిండి పొంగి పొరలునట్లు, ఆగక, ధారలుగా పాలు  స్రవించు ఉదారములైన అసంఖ్యాకములైన బలిష్ఠములైన ధేనువులను కలిగిన నందగోపుని కుమారుడా! శ్రీకృష్ణా! మేలుకొనుము! అత్యుత్తమ  ఢవంతుడా! పరబ్రహ్మస్వరూపా! ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞా దృఢత్వము కల మహా మహిమాన్వితా! ఈ లోకములో ఉదయించిన జ్యోతిస్వరూపా! మేల్కొనుము! నీ రా క్రమమునకు  లొంగిన  శత్రువులు నీ వాకిట జేరి, నీ దాసులై, నీ పాదారవిందములను ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను విడిచి ఉండలేక, నీ పాదములనే స్తుతించి మంగళాశాసనములు చేయుటకు వచ్చితిమి!    

పాలను పిదికెడి తరిఁ గో
పాలుర కడవలను పొంగి పారెడు నటులన్ 
పాలొసగెడు ధేనువులను 
వేలగలుగు నందతనయ! వేణువినోదీ!  
మా ప్రభుడవు ! మధుసూదన! 
విప్రవినుత! విమల! కృష్ణ! విలసిత తేజా!
అప్రతిభులు రిపులును మే
మున్ ప్రణతుల బొగడి భువన మోహన కృష్ణా !  

బలముడిగిన రిపులపగిది 
కలి దురిత లతా లవిత్ర! కరివరదుడ! వా
కిలి జొరిబడితిమి గావుము         
మెలకువ గొనుమిక వసుధకు మేలగు కృష్ణా! 

22 వ పాశురం 

అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన 
బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కట్టిల్ కీళే 
శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్ 
కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే 
శెఙ్గణ్ శిఱిచ్చిఱిదే యెమ్మేల్ విళియావో ;
తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్ 
అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్ 
ఎఙ్గళ్ మేల్ చాబ మిళిన్దేలో రెమ్బావాయ్ 

సుందరమైన విశాలమైన పృథ్విని ఏలిన రాజులు తమ అహంకారమును విడిచి, తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు, మేము కూడా అభిమానమును విడిచి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము. చిన్ని గజ్జె ముఖములాగా, తామరపూవులాగా వాత్సల్యముచే ఎర్రగానున్న నీ కనులను   మెల్ల మెల్లగా విచ్చి మాపై నీ దృక్కులను ప్రసరింపజేయుము. సూర్య చంద్రులిరువురూ  ఒకేసారి ఉదయించినట్లుగా విరిసిన నీ నేత్రముల దృష్టిని మాపై ప్రసరించినచో మా 
శాపములన్నీ తొలిగిపోవును! 

అందమగు  విశాల ధరణి 
యందున గల నృపతులెల్ల అహములు తొలగన్ 
పొందుగ సింహాసనమున 
వందిత నరసింహ నీవు వగవకుడనుటన్ 

క్రిందుగ గుంపులు గూడిన 
చందమునను మేము నీదు శరణము గొనుటన్ 
అందియవలె అరవిరిసిన 
సుందరకమలములకనుల శుభములు బరగన్ 
అరుణారుణ నయనములను 
కరుణారస వృష్టి గురిసి గావుము కృష్ణా! 
తరుణారుణ చంద్రోదయ 
గరిమల గన తొలగుమాకు ఘన శాపములున్ 

23 వ పాశురం 

మారి మలై ముళఞ్జిల్ మన్ని క్కిడన్దుఱఙ్గుమ్
శీరియ శిఙ్గ మఱివిత్తుత్తీవిళిత్తు
వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి
మూరి నిమిర్ న్దు ముళఙ్గి ప్పుఱప్పట్టు
పోదరు మాపోలే; నీ పూవై ప్పూవణ్ణా! ఉన్ 
కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ 
శీరియ శిఙ్గాసనత్తిరున్దు,యామ్  వన్ద 
కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్ 

ఓ గానుగ పూలవంటి శరీర కాంతి గలవాడా! వర్ష ఋతువంతయూ పర్వత గుహలో గడిపిన సింహము తీక్ష్ణములైన చూపులను అటునిటు ప్రసరించి, పరిమళమును కలిగిన తన రోమములను నిగిడించి, అటునిటు దొర్లి, లేచి, శరీరమును దులుపుకుని, వెనుకకు ముందుకు శరీరమును సాగదీసి, గర్జించి, గుహనుండి వెలువడి వచ్చినట్లు, నీవు నీ భవనమునుండి బయటకు వేంచేసి, నీ మనోహరమైన, శ్రేష్ఠమైన సింహాసనములో కొలువుదీరి, మేము వచ్చిన కారణమును విచారించుమని ప్రార్థన చేయుచున్నాము!   

గిరిబిలమున వర్షఋతువు 
జరిగెడివరకును మలయక జడతను నిదురల్ 
మరిగినదగు ఘనసింహము  
సరగున మెలకువను దెలియు సరణిని నీవున్  
సటలపరిమళములు చెలగ 
అటునిటు ఝళిపించి లేచి ఆవురుమనుచున్
కటువగు క్రూరపు చూపులు  
అటునిటు బరగంగ యంగలార్చగ యథముల్
సాగుచు మై విరుచుకొనుచు
బాగుగ గర్జనలు చేసి బయలను వెడలన్
సాగెడి కరణిని నీవును
రాగదవే భవనము విడి రక్షణ లిడగన్
గానుగ పూలను తొలకరి  
వానల మేఘములబోలు వన్నెల తనువున్ 
ఓ నగధర! యో నరసఖ!  
నీ నిజ సింహాసనమున నిండగు కరుణన్ 
మా కార్యము నెరవేర్చుము 
లోకాధిప! సుజన భక్త లోలుప కృష్ణా! 
హే, కామిత ఫలదాయక!  
పాకారి ప్రముఖ ! వినుతుడ! పంకజనాభా!

24 వ పాశురం 

అన్ఱి వ్వులగ మళన్దాయ్! అడిపోత్తి;
చ్చెన్ఱఙ్గు త్తెన్నిలఙ్గై శెత్తాయ్! తిఱల్ పోత్తి;
పొన్ఱ చ్చగడ ముదైత్తాయ్! పుగళ్ పోత్తి;
కన్ఱు కుణిలా వుఱిన్దాయ్ కళల్ పోత్తి;
కున్ఱుకుడై యావెడుత్తాయ్! గుణమ్ పోత్తి;
వెన్ఱు పగై కెడుక్కుమ్నిన్ కైయిల్ వేల్ పోత్తి;
ఎన్ఱెన్ఱున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్ 
ఇన్ఱి యామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్   

అలనాడు, వామనావతారంలో ఈ లోకమును కొలిచిన నీ పాదములకు మంగళం! సుందరమైన  లంకను  చేరి, లంకానగరమును ధ్వంసము చేసిన నీ బలమునకు మంగళం! శకటాసురుని  రూపము మాసిపోవునట్లు కాలితో తన్నిన నీ కీర్తికి మంగళం! మాయదూడ రూపంలో ఉన్న  ధేనుకాసురుడిని, వడిసెలలో రాయిని విసిరినట్లు గానుగచెట్టు రూపములోనున్న రాక్షసుని మీదకు విసిరి, ఆ ఇద్దరినీ అంతము జేసిన నీ దివ్యపాదములకు మంగళం! గోవర్ధన పర్వతమును గొడుగును పట్టినట్లు ఎత్తిన నీ వాత్సల్య గుణమునకు మంగళం! శత్రువులను  జయించి నాశనము చేసిన నీ వేలాయుధమునకు మంగళం! అని బహువిధములుగా నీ  వీరచరిత్రను స్తుతించి ‘పర’ను పొందుటకు మేమిలా వచ్చినాము! మమ్ములను  అనుగ్రహింపుము!    

వడుగుగ జగముల గొలిచిన
గడసరి పదములకునగును ఘన మంగళముల్
మిడి చెడ పదితలలపురుగు
నడిచిన భుజబలుని కగును నతి మంగళముల్
బండిని తన్నిన పదముల
గండర గండనికినమరు ఘన మంగళముల్
బండగ దూడను విసరిన
కండల వడిసెల పదముల కగు మంగళముల్
మాయల ధేనువు నడచిన
మాయలపరమాయకనుజ! మరి మంగళముల్
మాయల వర్షపు గొడుగుగ
మాయగ కొండను గొను గరిమకు మంగళముల్ 
ఖేలగ నగి గిరిని చిరుత
వేలన గొని నేను గలను వేగమె చేరన్
జాలుదు మిము గావగ పరి
పాలకుడను పరుడను పశుపాలకునగుటన్
అని పిలచిన దయదలచిన 
నిను గొలుతుము నీకు నుతులు నిఖిల శరణ్యా!
ఘన కరుణలు సుజనులకగు
సునిశితమగు, రిపుల వధకు, శూలాయుధమున్
వేలాయుధ! వేద వినుత!
కాలాధిప! కమలనాభ! కడు మంగళముల్
లీలామానుషవిగ్రహ!
మేలౌ పరనొసగుము పరమేశా కరుణన్ 

(కొనసాగింపు తరువాయి సంచికలో)

***వనం వేంకట వరప్రసాదరావు   

మరిన్ని శీర్షికలు
book review