Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue142/400/telugu-serials/vedika/vedika/

విజిటింగ్  ఆర్టిస్ట్ గానే కాక,  వాళ్ళ ఇన్స్ టిట్యూట్ కి గెస్ట్ - లెక్చరర్ గా, నాకు, తేజశ్విని గారు ఫార్మల్  ఆహ్వానం కూడా పంపడంతో, నాన్న సంతోషంగా ఉన్నారు...


అందుగ్గాను , స్పాన్సర్ షిప్ పేపర్స్ అందజేశారామె.

ఈ విషయంగా, జగదీష్ తో కూడా సుధీర్గంగా ప్రస్తావించారు.

నేను అమెరికాకి వచ్చే అవకాశం నిజమని తెలిసిన విక్రమ్, ఎంతగానో  సంతోషించాడు.  ఫోన్ చేసినప్పుడల్లా, సరదా కబుర్లు మాత్రమే కాకుండా,  నా రాక కోసం అమెరికాలో , తామంతా ఎదురు చూస్తున్నామంటూ అక్కడి విశేషాలు  కూడా చెప్పసాగాడు.

**

ఓ సంక్లిష్టమైన కథని తెరకెక్కించడం మామూలు విషయం కాదు.   కుటుంబ సంరక్షణ బాధ్యతల్లో, ఓ యువతి ఎదుర్కున్న సమస్యలు, చేయవలసిన త్యాగాలు, ప్రేమించిన వాడిని  సైతం వదులుకున్న వైనమే,  సెల్వన్ సార్  రాసిన కథ ఇతి వృత్తం...

ఆకర్షణలకి లోబడకుండా విలువలని కాపాడుకుంటూ, కర్తవ్యాలని గుర్తు చేసుకుంటూ ఒక ఉత్తమురాలిగా నిలబడిన కళాకారిణి ‘దేవకీ’ కథని అద్బుతంగా మలుస్తున్నారాయన...

షూటింగ్  మొదలైంది.

‘మౌన గీతం’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమా షూట్ లో, నేను, అమ్మ కూడా పూర్తిగా నిమగ్నమయ్యాము.

పాటలు, దుస్తులు, నృత్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.  మా శేషు మాస్టారు ఒక సంప్రదాయ నృత్యాన్ని కూర్చారు... నా చిన్నతనం డాన్స్ క్లాసుని గుర్తు చేసుకుంటూ, ఆయనతో డాన్స్ ప్రాక్టీసు – ఆ పాట షూటింగ్ సరదాగా గడిచాయి....

వంచకుడైన కన్నతండ్రి  నుండి కుటుంబాన్ని కాపాడుకునే దేవకీ పాత్రలో, లీనమై నటించానని యూనిట్ అంతా మెచ్చుకున్నారు... దేవకీ  పాత్ర పోషించడం, నాకు ఎన్నో విలువలని బోధించింది...

**

నా నిజ జీవితంలోని గడ్డు సమస్యని ఎలా ఎదుర్కావాలో తెలీడం లేదు.  భూషణ్ అంకుల్ అభ్యర్ధనకి తల ఒగ్గి జగదీష్ జీవితం నుండి తప్పుకోవాలా?

అలా చేసి,  నా ఒక్కగానొక్క ప్రాణ స్నేహితుడుని,  ప్రాణంలా ప్రేమించే నా జగదీష్ ని వొదులుకోవాలా?

లేదంటే, నాకు, మా కుటుంబానికి జీవితానిచ్చి, నన్ను ఈ స్థాయికి చేర్చిన అంకుల్ ని వ్యక్తిగతంగా, మానసికంగా మరింతగా పతనమవ్వనివ్వాలా?

వారి కుటుంబ పరిస్థితి చక్కబడకపోయినా, సంబంధం లేనట్టే సాగిపోవాలా?

సమయం దొరికినప్పుడల్లా నా మనసుని తొలిచేస్తున్న ప్రశ్నలివే...

ఏమైనా,  ‘మౌన గీతం’  షూటింగ్  చూడాలన్న జగదీష్ రెండు రోజుల్లో చెన్నై వస్తున్నాడు.  అతని గుండెలపై ఒదిగి పోయి,  నా భయాలు, సందేహాలు చెప్పుకోవాలని ఆరాటంగా ఉంది..... జగదీష్ చెప్పే మాటలతో స్వాంతన పొందాలి.  

జగదీష్ తో సమయం గడిపేందుకు ఓ రోజు శలవు అడిగితే, సెల్వన్ గారు ‘ఓకే’ చేసారు.,  

**  

జగదీష్ రాకతో నా మనసే కాదు, వాతావరణం కూడా ఆహ్లాదంగా మారింది..

పొద్దున్నే, జగదీష్ తో ఇంటి నుండి బయలుదేరాను. బ్రేక్ ఫాస్ట్ ఒక చోట, లంచ్ ఒక చోట చేసాము.  మధ్యలో హ్యాండ్లూం సారీ ఎగ్జిబిషన్ క్కూడా వెళ్ళాము.

నా చేయి పట్టుకుని మైళ్ళ దూరం నడిపించాడు జగదీష్.

చిన్న పిల్లల్లా కాసేపు ‘జూ’ లో కూడా తిరిగాము.

అక్కడక్కడ నన్ను జనం గుర్తుపడుతుంటే,  నవ్వుతూ నన్ను కారు వరకు పరిగెస్తున్నాడు కూడా.

సన్నటి తుప్పర పడుతూనే ఉంది.  మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంది.  జగదీష్ నా చేయి పట్టినప్పటి నుండి గుండెల నిండా ధైర్యం నిండి పోయింది...

చీకటి పడుతుండగా నటేషన్ పార్క్  చేరాము.... దూరంగా అక్కడక్కడ మాత్రమే జనం తిరుగుతున్నారు...

క్రిందటి సారి మేము కూర్చున్న అదే గజేబో వద్దకు వెళ్లి, కొద్ది క్షణాలు మౌనంగా చుట్టూ పరికించి చూసాడు జగదీష్...

పోయిన సారి కంటే కూడా లాన్  వత్తుగా, నేల మీద పచ్చని తివాచీలా పరుచుకునుంది.

నా కాళ్ళకున్న సాండిల్స్ తీసేయడంతో, పాదాలకి చల్లగా, హాయిగా అనిపించింది ..
జగదీష్ కూడా షూజ్  విప్పేసి, గజేబో ఎదురుగా ఉన్న లాన్ మీద వెల్లకిలా పడుకున్నాడు...

“నువ్వూ ఇలా రా, కాసేపు ఆకాశం లోని తారల్ని లెక్క పెడదాం,” అంటూ చేయి చాచాడు....

వెళ్లి, చాచి ఉన్న అతని చేతి పై, అతనికి దగ్గరగా ఒరిగాను.

తలెత్తి, ఆకాశం వంక చూసాను.  నక్షత్రాలు కుట్టిన నీలిరంగు చీరలా ఉంది.   తారల్ని లెక్కెడుతూ, కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాము.


జగదీష్  సెల్-ఫోన్ రింగయి ఆగిపోయింది.   కొద్ది క్షణాలకి మళ్ళీ కాల్ వచ్చింది...

ఆన్సర్ చేసాడు... “హలో,”  ఫోన్ స్పీకర్ మీద ఉంచాడు.  అవతలి నుండి రాణి...


“డిన్నర్ కి త్వరగా వస్తున్నావుగా,” అంది

“లేదు,  కాస్త లేటవుతుంది. బయటెక్కడో ఉన్నాను. ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి రావాలి కదా,” జవాబిచ్చాడు...

“రేపటి ప్లాన్ ఏంటి? బ్రేక్ ఫాస్ట్, లంచ్ మా ఇంట్లోనే...” ఆగింది...


“బ్రేక్ ఫాస్ట్ కి ఉంటాను... ఆ తరువాత, మీ డాడీ, మామయ్యా, నేను కలిసి చంద్ర షూటింగ్ చూడ్డానికి వెళతాము.  అది రేపటి నా ప్రోగ్రాం...

మళ్ళీ మాట్లాడుతా.  ఇక్కడ కాస్త బిజీగా ఉన్నాను,” అంటూ ఫోన్ పెట్టేసాడు జగదీష్...


అసహనంతో ఉడికిపోయింది మనసు.... జగదీష్ జీవితం నుండి, ఆసలెప్పటికైనా, తనని తను వేరు చేసుకుంటుందా రాణి?  అన్న ప్రశ్న మెదిలింది నాలో.

‘అయినా, త్వరలోనే జగదీష్ ని పెళ్లి చేసుకొని, రాణి అర్ధంలేని నడవడిని సునాయాసంగా కట్టడి చేయవచ్చు’  అన్న తలంపు కలిగింది..

.. వెంటనే, భూషణ్ అంకుల్ – ఆంటీల శ్రేయస్సు సంగతి ఏమిటన్న ప్రశ్నతో... తల వేడెక్కిపోయింది.


“చంద్రా,  ఇలా మౌనంగా ఉన్నావే?” అంటూ జగదీష్ నా భుజం పై తట్టడంతో, ఆలోచనల నుండి బయటపడ్డాను...

“చెప్పు ఏమాలోచిస్తున్నావు?” అడిగాడు... “నీ మనసులో ఏమున్నా చెప్పు చాంద్,” అన్నాడు...

ఇక నోరు మెదపకుండా ఉండడం నా వల్ల కాలేదు...

రాణి విషయంలో నాకున్న సంశయం, అంకుల్ విషయంలో  ఉన్న ఆవేదన బయటపెట్టాను... అలజడితో నేనెంత అచేతనమవుతున్నానో ఏకరువు పెట్టాను...

నన్ను దగ్గరగా పొదివి పట్టుకుని, కళ్ళు తుడిచాడు జగదీష్.


కాసేపు మళ్ళీ మా మధ్య మౌనం....

నా వైపు వొరిగి, నుదిటిపై ముద్దు పెట్టాడు.   లేచి కూర్చున్నాను.  నా వెనుకే తనూ పైకి లేచి, నా చేయందుకున్నాడు.... “నాతో రా,  అక్కడ కూర్చుని మాట్లాడుదాము,” అంటూ గేజేబో దిశగా నడిచాడు...

బెంచీ పై జగదీష్ కి దగ్గరిగా జరిగి, అతని భుజం పై తల ఉంచి, “చెప్పు,” అన్నాను.


నా చేతులని తన గుప్పిట్లోకి తీసుకుని,  “నీ చేతివేళ్ళ లాగానే, నీ మనస్సు కూడా అతి సున్నితం.  ఇతరుల బాగోగుల పట్ల, వారి జీవితాల పట్ల నీవు కనబరిచే సానుభూతి నన్ను ఆశ్చర్యపరుస్తుంది.  నీలోని ఈ నిస్స్వార్ధతే నాకు నచ్చుతుంది.  నీతో జీవితం పంచుకోగలగడం నిజంగా నా అదృష్టం చాంద్,”  అంటూ నా తలపై తట్టాడు.


“ఔనా?” నవ్వాను...

“అదట్లా  ఉంచితే, మన విషయంలో, నీవన్నవి - అనుకుంటున్నవి  కరక్టే.. నా ఆలోచన కూడా అదే...  భూషణ్ అంకుల్ వాళ్ళ కుటుంబ పరిస్థితి మనకి ఓ గడ్డు సమస్యే అయింది... నీవిలా బాధపడతావనే నీ నుండి ఓ విషయం దాచాను.  మీ అమ్మావాళ్ళ నుండి కూడా,”  అంటూ, రాణి పెళ్లి సంబంధం తీసుకొని, అంకుల్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళిన సంగతి చెప్పాడు....

అతని చెంపపై చేత్తో మృదువుగా తాకాను.

“నేనర్ధం చేసుకోగలను.  మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు చెడగూడదనే అనుకునుంటావు,” అన్నాను...


“నీవు అర్ధం చేసుకుంటావని  నాకు తెలుసు,” నా భుజాల చుట్టూ చేయివేస్తూ జగదీష్.  “అంకుల్  మన విషయం తెలుసుకున్నప్పుడు, .. ఏమన్నారో తెలుసా?” అడిగాడు.


“ఏమన్నారేమిటి?  నా గురించైతే మాత్రం మంచే చెబుతారాయన,” అన్నాను నవ్వుతూ.


“కళారాధన తప్ప నీ మనసులో  ప్రేమ, పెళ్లి అలోచనలు  ఉంటాయని ఊహించలేక పోయారట.  మొత్తానికి నన్ను, అమ్మ వాళ్ళని కూడా అభినందిస్తూ, కొద్దికాలం రాణికీ విషయం తెలియక పోవడమే అందరికీ శ్రేయస్కరం అని అంగీకరించారు,” అన్నాడు...


అమ్మవారి గుడిలో, అంకుల్ కి నాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది...

ఆ సంగతి  మాత్రం నా గుండెల్లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను.....


ఇంతలో మళ్ళీ జగదీష్ సెల్ రింగయింది.  ఈ సారి కాల్, అమ్మ నుండి.

అంకుల్ వాళ్ళ డిన్నర్ కి కలిసే వెడదాము.. వచ్చేయండంటూ, ఫోన్ చేసింది....


“పద మరి,” పైకి లేచి చేయందించాడు జగదీష్....

**

ఇంటికి వెళ్లి, ఫ్రెష్ అయ్యి, డిన్నర్ కి కదిలేప్పటికి, కాస్త లేట్ అయింది.  అత్త, వినోద్ రాననడంతో, మేము నలుగురం మాత్రమే బయలుదేరాము.

                                                                                                

ఇంటి గేటులో నుండి లోనికి వెళ్ళేప్పటికి,  సిటౌట్ లో కూర్చునున్న రాణి ఎదురొచ్చి, జగదీష్ చేయందుకుంది.

అతని పక్కన మేమంతా ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా, “ఏమిటింత లేట్?

నేను స్టార్వింగ్,” అంది గోముగా.

రాణి పట్టు నుండి తన చేయి విడిపించుకుని, “ముందు అంకుల్, ఆంటీని కలిసాక, ఆలస్యం  లేకుండా డిన్నర్ ఎంజాయ్ చేద్దాము,”  అంటూ హాల్లోకి దారి తీసాడు జగదీష్.

**

ఎప్పటిలా డైనింగ్ వద్ద కూడా, జగదీష్ పక్కన చేరి, మాటలు, వడ్డనలు సాగించింది రాణి.

కబుర్లు  చెప్పుకుంటూ అందరూ భోం చేస్తున్నారు. నాకు మాత్రమే ముద్ద మింగుడు పడటంలేదు.


కాసేపటికి, అందరి సంభాషణ, నా సినిమా షూటింగ్ దిశగా సాగింది.

నా  పర్ఫార్మెన్స్  గురించి, సెల్వన్ సార్ చాలా ఇంప్రెస్  అయ్యారని చెబుతూ,  “చంద్రకళ  అమెరికాలో సెటిల్  అయి, అక్కడ కళారంగంలో కొనసాగుతుందని ఆయనతో అన్నావంటగా,  సత్యం,” నాన్న వంక చూస్తూ అడిగారు అంకుల్...


“అవును మాటల్లో అన్నాను.  మా చంద్రకళ ప్రపంచ ఖ్యాతి గడించి, మేటి కళాకారిణి అవ్వాలన్న నా కోరిక...ఎప్పటిదో కదా!  నీ చేయూతతో, నా అంచనాలకి మించి,  ఈ దేశంలో ఆర్టిస్ట్ గా ఎదిగింది.  శంఖులో పోస్తేనే తీర్దం అవుతుందన్నట్టు,  అంతర్జాతీయంగా కూడా, తను గుర్తింపు పొందాలని నా ఆకాంక్ష.  అందుకు, తేజశ్విని గారిలా  అమెరికాలో సెటిల్ అయినా,  తప్పేముంది.   అయినా, పిల్లలు మనకన్నా ప్రయోజకులయ్యారుగా! ఇక వారి నిర్ణయాలు వారిష్టం,” నవ్వుతూ నాన్న.


నాన్న ఆలోచన సరయినదేనన్నారు అంకుల్....

“కాకపోతే,  ఒకటి మాత్రం నిజం.... కళాకారుల  సంగతేమో గాని,  కుర్ర డాక్టర్ల కళ్ళు, కలలు మాత్రం అమెరికా వైపే ఉంటాయి.  అవునా జగదీష్?” అడిగారు అంకుల్ జగదీష్ ని...


తినడం ఆపి నింపాదిగా అంకుల్ వంక చూసాడు జగదీష్...

“లేదు అంకుల్, నేను మాత్రం అందుకు భిన్నంగా, ఇక్కడే ఇండియాలోనే ఉండి మెడిసిన్ ప్రాక్టీస్ చెయ్యాలంటాను,”  అన్నాడు జవాబుగా..

అది విన్న భూషణ్ అంకుల్, గబుక్కున నా వంక చూసారు... ‘జగదీష్ ఆశయాలు, మరి, మీ నాన్న  ఆలోచనలకి  భిన్నంగా ఉన్నాయే?” అన్నట్టుగా ఉన్నాయి ఆయన చూపులు...


నేను చూపు మరల్చుకున్నాను....


“ఏమైనా మన కళ చాలా అదృష్టవంతురాలు... చిన్నప్పటినుండీ చూస్తున్నాగా! తను కోరున్నవన్నీ  తన  వద్దకి  నడిచొస్తాయి.  ఇష్టమైన  వాటినే  అనుసరిస్తూ, జీవితాన్ని ఆస్వాదిస్తుంది చంద్రకళ,” నవ్వుతూ అంకుల్...

“పోతే,  ఇకపై, సామాజిక  స్పృహతో  తన  వంతు  సేవ, సహకారం, త్యాగం  కూడా చేస్తూ, ఓ మంచి జీవనాన్ని సాగించాలి మన కళ,”  ముగించారు అంకుల్.

ఆయన ప్రతి మాటలో, నాకెన్నెన్నో  అర్ధాలు తోచాయి...

**

అక్కడి నుండి బయటపడి ఇల్లు చేరేప్పటికి పదకొండయ్యింది.  

ఇంట్లోకి అడుగు పెట్టగానే, హాల్లో  కోటమ్మత్త ఎదురయి, “చంద్రా, నీకు నాలుగైదు సార్లు అమెరికా నుండి ఫోన్ వచ్చింది.  నిన్ను వెంటనే చేయమన్నారట తేజశ్విని గారు,” చెప్పింది.

“అవునక్కా, ఎంత లేటయినా నీతో తప్పక ఫోన్ చేయిస్తానని చెప్పాను ఆమెకి.  అయినా, నీ సెల్-ఫోన్ నీ దగ్గరుండదే?”  అప్పుడే హాల్లోకి వచ్చిన వినయ్  నాతో...

“సరేలేరా బాబు, సారీ....  నేను కాల్ చేస్తాలే...” అన్నాను అందరితో పాటు హాల్లో కూర్చుంటూ....

**

హాల్లో ఉన్న హౌజ్ - ఫోన్ నుండే తేజశ్విని గారికి కాల్ చేసాను..

ఆవిడ వెంటనే ఫోన్ ఆన్సర్ చేసారు...

నాకు మాట్లాడ్డానికి కూడా సందివ్వకుండా, ఆవిడ ఆనందంగా వెల్లడించిన   విషయాలు, నాకూ అంతే సంతోషాన్నిచ్చాయి.

అంతా విని, “మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మేడమ్.   మా పేరెంట్స్ తరఫున కూడా థాంక్యూ వెరీ మచ్,” చెప్పి ఫోన్ పెట్టేసి, అందరి వంక చూసాను.


నన్నే తదేకంగా చూస్తున్నారు వారంతా.  ఓసారి గట్టిగా ఊపిరి తీసుకున్నాను.

“నాన్నా, అమ్మా,  మీ ఆశయాలు, నా కలలు పూర్తిగా నెరవేరినట్టే..  నాకోసం, తేజశ్విని గారు పెట్టిన స్పాన్సర్షిప్ ఆప్లికేషన్, ఆక్సెప్ట్  చేసారంట, నాకు ‘స్పెషల్ స్కిల్స్ కేటగిరీ’ లో ‘అమెరికా వీజా’ వచ్చేసినట్టే.  ముందైతే, కనీసం ఏడాది పాటు అక్కడ ఉండవచ్చునట.  మనిష్టమట.  కావాలంటే, మూడేళ్ళ వరకు పోడిగించవచ్చట..  అంతేకాదు,  టి.టి.డి దేవస్థానం వారి సహకారంతో మొత్తం పది ఫండ్-రైజింగ్  ప్రోగ్రాములు ఏర్పాటయ్యాయట కూడా,”  వివరించి, లేచి వెళ్లి అమ్మ, నాన్న, అత్త పాదాలంటి ఆశీర్వాదం తీసుకున్నాను..


“మరి మా ఇద్దరి కాళ్ళు మొక్కవా? నీవు ఇంత పైకి రావడానికి మా ప్రయత్నం మేము చేయలేదా?” అంటూ వినోద్ చేయందుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు జగదీష్.

“ఆగండి పెడతాను,” అంటూ వెళ్లి నాన్న రూములో నుండి అయన వాకింగ్ స్టిక్ తెచ్చాను....

అందరూ పెద్దగా నవ్వడం మొదలు పెట్టారు.


“ఏమైనా, హార్టీ కంగ్రాచ్యులేషన్స్, చాంద్.. వెరీ ప్రౌడ్ ఆఫ్ యు,” వెళ్లి పక్కనే కూర్చున్న నా భుజం పై తట్టాడు, జగదీష్.

“ఇంక మేము గుర్తుండము, నీకు....  అసలయినా మమ్మల్ని వదిలి అలా వెళ్ళిపోతే మా సంగతి ఏమిటి?  నీ నృత్యమే నీ ఫస్ట్  ప్రైయారిటీనా?” ఉడుక్కున్నాడు..

జవాబిచ్చే ముందు క్షణం  ఆలోచించాను.

“అంతేకదా! నేను అమితంగా నృత్యకళని ప్రేమిస్తాను కాబట్టి, ఆ కళామ్మతల్లి నన్ను ఆదరిస్తూనే ఉంది.  అలాగే మరి నిన్ను అమితంగా,,,, ప్రేమించే,,,,”  ఇంకా అనబోయేలోగా జగదీష్ నా చెవి పట్టి ఆపేసాడు...


“అదేమీ కాదు జగదీష్ బాబు, నృత్యం దాని రక్తంలో ఉంది... దాని మనసులో మాత్రం నువ్వే ఉన్నావయ్యా,”  అంది అమ్మ.

ఇదంతా వింటున్న కోటమ్మత్త,  నిశ్చితార్ధం ఎప్పుడన్న ప్రస్తావన తెచ్చింది...

నేను, జగదీష్ ముఖాలు చూసుకున్నాము.


జగదీష్ మౌనంగా ఉండడాన్ని గమనించి, నాన్న కల్పించుకున్నారు.


“అదేముంది? మన చేతిలో పని... ఇప్పుడే కదా అమెరికా అవకాశం గురించి తెలిసింది.   డాన్స్, వ్యక్తిగత జీవితం, రెండూ ముఖ్యమే.  ఒకదానికొకటి ఎప్పుడూ అడ్డు కాకూడదు.  కాబోదు.  ఎలాగూ కాస్త సమయం ఉంది కాబట్టి,  జగదీష్ తో మాట్లాడి, అమెరికా విషయం సహా, ప్లాన్ చెయ్యాలి.  ఈలోగా భూషణ్ పరిస్థితి కూడా కుదుటపడుతుంది.  అప్పుడు వాళ్ళని కూడా కలుపుకొని మరీ నిశ్చితార్దం వేడుకలు జరుపుకోవచ్చు.  ఏమంటావ్ జగదీష్?”  అడిగారు  నాన్న...


“మీరనేది కరెక్టే మామయ్యా.. చంద్ర కెరియర్, నా చదువు చక్కగా సాగడంతో పాటు  భూషణ్ గారి విషయం కూడా ముఖ్యమే మనకి... కాబట్టి, అన్నీ అలోచించి చేద్దాము,” జవాబుగా జగదీష్.


అమ్మ కూడా ఔనంది.  “భూషణ్, నీరూ గార్లని, మన జీవితాల నుండి అసలెలా వేరు చేయగలం?  ఏదైనాగాని, సరయిన సమయం సందర్భం చూసి, ముందుకు సాగాలి మరి,” వివరించింది అమ్మ.    

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali