Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue142/401/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

‘‘క్షమించండి స్వామీ. మీరెవరో తెలీదు గాని అసాధారణ పురుషులని బోధ పడినది. కాని నా నిర్ణయం మారదు.  సహ్యాద్రికి పోజాలను. శలవు.’’ అన్నాడు.

‘‘ఆలోచించు మిత్రమా. నీవుగా వెళ్తే శ్రమ తప్పును. తానుగా పిలుచుకొంటే శ్రమ తప్పదు.’’

‘‘శ్రమా.... నా దైవం ఆ కృష్ణ పరమాత వుండగా శ్రమ ఏటికి? పోయి వచ్చెద స్వామీ’’ అంటూ నమస్కరించి చర చరా మండపం దిగి పోయాడు ధనుంజయుడు.

‘‘పోయిరా మిత్రమా. ఆ తిక్క శంకరుడు నిన్ను వదులునా ఏమి? నీ తిక్క కుదర్చ గలడులే’’ వెనక నుంచి గొణిగాడు మాధవ స్వామి.
ఆలయ ఆవరణ దాటిన ధనుంజయుడు మండపం వైపు తిరిగి చూసాడు. ఇంతలోనే ఎటు పోయాడో గాని అక్కడ మాధవ స్వామి లేడు. ఆ తర్వాత వేణు గానమూ విన్పించలేదు.

***********************************************

మరు నాడు`

వేకువనే బయలు దేరిన రాజ కుమారుడు ధనుంజయుడు భళ్ళున తెల్లవారేసరికి రామగిరి మూడు యోజనాల దూరంలో వున్నాడు. శ్వేతాశ్వం గరుడ ఉదయపు గాలికి పోటీ పడి వాయు వేగంతో పరుగులు తీస్తోంది. చుట్టూ పచ్చని పోలాలు కనువిందు చేస్తున్నాయి. పనులు చేస్తున్న రైతు జనాలు పాడుకొంటున్న పాటలు శ్రావ్యంగా వినవస్తున్నాయి. పల్లెలు, గ్రామాలు దాటుకొంటూ ఎక్కడా ఆగకుండా ప్రయాణం ముందుకు సాగుతోంది.

దారి పోడవునా రాత్రి గుడి వద్ద జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూనే వున్నాడు. మాధవ స్వామి శతాధిక వృద్ధుడు ఎవరాయన? తన కోసం ఎదురు చూడ్డం ఏమిటి? భీమ శంకరం వెళ్ళమని సలహా యివ్వటం ఏమిటి? తిరిగి చూస్తే కనబడకుండా ఎటు పోయాడు? అంతా విచిత్రంగా వుంది. అదేమిటో తను రత్నగిరి విడిచినప్పట్నుంచీ అన్నీ విచిత్రాలే జరుగుతున్నాయి. మనసు అపర్ణుడి వైపు మళ్ళింది. నిన్న మధ్యాహ్నం పరిచమయ్యాడు. సాయంకాలం వీడ్కోలు తీసుకున్నాడు. ఎక్కడి వాడో ఎక్కడికి వెళ్ళాడో ఇదమిద్ధంగా తెలీదు. కాని కొద్ది పరిచయం లోనే చెరగని ముద్ర వేసాడు. ఈ ప్రయాణంలో అలాంటి వాడు పక్కనుంటే ఎంతో బాగుండేది.

పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు ధనుంజయుడు. మార్గం పొడవునా వృషభ శకటాలు, అశ్వికులు, బాటసారులు ఎదురు పడుతున్నారు. కొండగుట్టల వెంట పచ్చని పొలాల వెంట వంపు తిరిగిసాగుతూ అనేక పల్లెలు గ్రామ నధిగమించిస్తోంది మార్గం.

సాయంత్రానికి అనేక యోజనాల దూరం ప్రయాణించి కను చీకటి వేళకు ఒక పల్లెను చేరుకున్నాడు. ఆ పల్లెను దాటితే తిరిగి అడవి దారి ఆరంభమవుతుంది. ఇంకో రెండు దినాలు ఇలాగే సాగితే సరిహద్దు దాటి మాళవ రాజ్యంలోకి వెళ్ళి పోగలడు.

రాత్రికి పల్లెలో మజిలీ చేసిన ధనుంజయుడు. మరునాడు సూర్యోదయం తోనే తిరిగి బయలుదేరాడు. చిక్కని అడవి మార్గంలో ప్రవేశించింది అశ్వం. ఆ పగలు రెండో యామం వరకు వాతావరణం బాగానే వుంది. సూర్యుడు నడిమింట కొచ్చే వేళకి వాతావరణం మారి పోయింది. ఉత్తరం నుండి నల్లటి మబ్బులు క్రమ్ముకు రానారంభించాయి. అంత వరకు వెచ్చగా వీచిన వేడిగాలులు ఉన్నట్టుండి చల్ల బడి పోయాయి. గాలి విసురు హెచ్చింది. చూస్తుండగానే ఆకాశం మేఘావృతమైంది. ఝంఝామారుతం వీస్తోంది. వృక్షశాఖలు అల్లల్లాడి పోసాగాయి. తుఫాను సూచనలు కన్పిస్తూ గాలి జివ్వున వీస్తోంది. వర్షం పడే లోపలే ఏదో ఒక అనువగు చోటుకి చేరుకోవాలనుకున్నాడు. అంతలోనే చినుకు చినుకుగా చిరుజల్లు ఆరంభమైంది. గాలి విసురుకు ఫెళ ఫెళ మంటూ చెట్లకొమ్మలు విరిగి పడుతున్నాయి.    ఉరుములు, మెరుపులతో ఆకాశం బీభత్సంగా మారిపోయింది. వీదురు గాలికి అశ్వం వేగం మందగించింది. వాతావరణానికి ఎదురీది ముందుకు సాగవలసి వస్తోంది.

అంతలో పెద్ద మెరుపు మెరిసింది.

సమీపంలో ఎక్కడో పిడుగు పడింది.

భూమి బీటలు వారుతోందా అన్నట్టు`

పిడుగుల శబ్ధంతో దిక్కులు పిక్కటిల్లాయి. నభోంతరాళాలు మారు మ్రోగాయి. అంతే` అశ్వం గరుడ బెదిరి పోయి అదుపు తప్పింది.
ఒక్క సారిగా పక్కకు తిరిగి మార్గం విడిచి ఎడం పక్కగా అడవి లోకి దౌడు తీసింది. దాన్ని అదుపు చేయాలన్న ధనుంజయుని ప్రయ్నతమేదీ ఫలించ లేదు. దారి తెన్ను లేని అడవిలో ఇష్టం వచ్చినట్టు  పరుగు తీస్తూనే వుంది. అదే సమయంలో చిటచిట చినుకులతో భారీ వర్షం ఆరంభమైంది.

ధనుంజయుడు ఎంత మాత్రం వూహించని సంకట స్థితి యిది. గాలివాన అంతకంతకూ ఉధృతమవుతోంది గాని ఎక్కడా తగ్గే సూచనలు కన్పించటం లేదు. ఫెళ ఫెళార్భాటాలతో చెట్లకొమ్మలు విరిగి పడుతున్నాయి. మహావృక్షాలు కూలిపోతున్నాయి. తను ఎటు పోతున్నాడో తెలీదు. అశ్వాన్ని ఇష్టానికి వదిలేసి కూచున్నాడు.

అశ్వం పోతున్న వేగానికి ఛెళ్ళున చెట్ల కొమ్మలు తాకి వంటి మీద చిన్నచిన్న గాయాలేర్పడుతున్నాయి. పట్ట పగలే చీకట్లు ముసిరాయి. వాతావరణం బీభత్సంగా వుంది.

‘‘హే కృష్ణా... ఏమిటయ్యా యిది? ఎటు వెళ్ళే వాడిని ఎక్కడకు మళ్ళిస్తున్నావ్? ఏమి అర్థం గాకున్నదే. ఇది యేమి లీల స్వామి. దారి చూపించుము.’’ అంటూ తన దైవం వేణు గోపాలుని మనసులోనే వేడుకున్నాడు.

అదే సమయంలో మొన్న రామగిరి గుడి మండపంలో కన్పించిన వృద్ధుడు మాధవ స్వామి మాటలు కూడ గుర్తుకొచ్చాయి. ఒకవేళ ఇది ఆ భీమశంకరుని మహత్తు కాదు గదా! తొలి సారిగా మదిలో అనుమాన బీజం మొలకెత్తింది.

సమయం ఎంత గడిచిందో తెలీదు.

లోతట్టు అడవి లోకి ఎంత దూరం వచ్చేసాడో తెలీదు.

సాయం కాలానికి గాని అశ్వం అదుపులోకి రాలేదు. నిలువునా తడుస్తూ గడగడ వణికించే చలి గాలిలో ముందుకు సాగుతున్నాడు. కీకారణ్యంలో కౄర మృగాల  ఉనికి తెలుస్తోంది. తను వెళ్ళాల్సిన మార్గానికి ఏ దిశలో, ఎంత దూరంలో వున్నాడో తెలీదు. ఘోరాటవిలో నర సంచారమన్నది ఎక్కడా కన్పించటం లేదు. నిలువునా తడుస్తున్న ధనుంజయుని చలిగాలి గడ గడ వణికిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాత్రికి నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది. తలదాచుకోడానికి అనువైన చోటు కన్పించటం లేదు. దారి తెన్నూ లేని అడవిలో ఇష్టానికి ముందుకు పోతోంది అశ్వం.

అయితే ఏమూలనో అదృష్టం కొంచెం కరుణించినట్టుంది. కాసేపట్లో చీకట్లు ముసురుకుంటాయనగా ఏనాటిదో పాడు పడిన ఒక ఆలయం కన్పించింది. వెంటనే అశ్వాన్ని అటు మళ్ళించాడు. మండపంతో బాటు ఆలయం చాలా భాగం శిథిలమైనప్పటికీ గర్భ గుడి బాగానే వుంది. అది ఏ దేవుడి గుడో అర్థం కాలేదు. గర్భ గుడిలో విగ్రహం లేదు. ధ్వంసమై వుంటుంది. కొన్ని ఎండుకట్టెలు ఓ మూలన పడున్నాయి.
ముందుగా పొడి దుస్తులు ధరించి, తడి దుస్తులు పిండి ఆరేసాడు. లోపలంతా శుభ్రం చేసి ఎండు కట్టెలతో నెగడు మండించాడు. అశ్వంతో సహా రాత్రికి ఆ గుడిలోనే తలదాచుకున్నాడు. గుడి తలుపు మూసి వెంట తెచ్చుకున్నవే తిన్నాడు. కంబళి నెగడు పక్కన పరుచు కొని వెచ్చగా పడుకున్నాడు. కొంత అలసట తీరింది.

రాత్రంతా వర్షం పడుతూనే వుంది.

సమయానికి ఆశ్రయమిచ్చిన ఆ పాడు బడిన గుడి ఆ క్షణంలో ఇంద్ర భవనం కన్నా మిన్న అన్పించింది. ధనుంజయుని ఆలోచనలు కొద్ది రోజులు వెనక్కి మళ్ళాయి.

***********************************************

కత్తులు మరొక్క మారు కణేలన మ్రోగాయి.

అది రాచకనగరునానుకొని వున్న విశాల ప్రదేశం. రాజ కుటుంబానికి చెందినవారు యుద్ధ విద్యల్ని అభ్యాసించే ప్రదేశం. నేలంతా ఎర్రమన్ను, ఇసుక ఒత్తుగా వేసి చుట్టూ కొద్దిపాటి ఎత్తుగా గోడకట్టబడింది. అక్కడ ప్రస్తుతం రత్నగిరి యువరాజు ధనుంజయుడు, మాళవ యువరాజు ఇంద్రజిత్తు తమ ఖడ్త విద్యానైపుణ్యాన్ని పరీక్షిచుకోడానికి ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు.

అప్పటికి రెండుమార్లు ఇంద్రజిత్తు చేతినుండి ఖడ్గం జారిపడింది. మూడోసారి తిరిగి తలపడ్డారు. ఉదయపు లే ఎండకు పొడవాటి ఖడ్గాలు శ్వేతనాగుల్లా మెరుస్తున్నాయి. ఇరువురి శరీరాలు శ్వేదంతో నిండి వున్నాయి.

మూడవసారి కూడ ధనుంజయుని ముందు ఎక్కువసేపు నిువలేకపోయాడు ఇంద్రజిత్తు. ఖడ్గ ఛాలనంలో మెళకువలు తెలిసిన ధనుంజయుని విచిత్ర ఖడ్గ ప్రహరానికి ఇంద్రజిత్తు ఖడ్గం జారింది. చివ్వున తారాచువ్వలా నింగికి ఎగసి నిలువునా వచ్చి జండాకొయ్యలా భూమిలో దిగబడింది.

తన ఓటమికి ఇంద్రజిత్తు కించిత్తకూడ బాధపడలేదు. ఫక్కున నవ్వుతూ` ‘‘బావా!’’ అంటూ వచ్చి ధనుంజయుని వాటేసుకొని అభినందించాడు. 

‘‘నీముందు ఎవరూ నిలువజాలరని నాకు తెలుసు బావా. నిను ఓడించాలంటే ఆరుమాసములు నేను రత్నగిరిలోనే వుండి నీ నుండి శిక్షణ పొందవలె’’ అన్నాడు.

‘‘ఉండిపోరాదూ. అవంతి వెళ్ళి నీవు చేయు రాచకార్యమేమున్నది’’ అన్నాడు నవ్వుతూ ధనుంజయుడు.

‘‘నా సంగతి సరి బావా. అదో...నా చెల్లెమ్మ స్వయం ప్రభాదేవి ఇటే వచ్చుచున్నది. ఖచ్చితముగా నీ కోసమే... నా ఖడ్గ ప్రహరాలను తప్పించుకోగలిగావు గాని, తన వాడి చూపుల నుండి తప్పించుకోలేవునులే. వెళ్ళు వెళ్ళు’’ అంటూ హాస్యమాడాడు ఇంద్రజిత్తు.
ఇంద్రజిత్తు సోదరి మాళవరాజ్య యువరాణి అయిన స్వయంప్రభ. చక్కగా సింగారించుకొని పసిడి బొమ్మలా మెరిసిపోతోంది. కరకంకణాలు కాలి అందియలు మృదుమధురంగా రవళిస్తూండగా అల్లన వచ్చి అంతదూరంలో గోడపక్కన ఆగి ధనుంజయుని ఓరకంట వీక్షిస్తూ` ‘‘బావా... రమ్ము. ఇటురమ్ము’’ అంటూ వీణమీటినట్టు తీయని స్వరంతో పిలిచింది.

తన ఖడ్గాన్ని నేలకు గ్రుచ్చి ఒక వస్త్రభాగంతో శ్వేదాన్ని అదుముకొంటూ చెంతకు వెళ్ళాడు ధనుంజయుడు.

మాళవ రాజదంపతులు హర్షవర్థనుడు వసుంధరాదేవిలు. యువరాజు ఇంద్రజిత్తు, యువరాణి స్వయంప్రభతో కుటుంబసమేతంగా రత్నగిరికి విచ్చేసి వారములు దినము గడచినవి. రత్నగిరి ప్రభువు ధర్మతేజనకు తన సోదరి పట్ల ఎనలేని ప్రేమ. వారి రాకతో రత్నగిరి కోటలో మరింతగా ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ధనుంజయుడు, ఇంద్రజిత్తు మధ్య బంధుత్వంతోబాటు మంచి స్నేహం కూడ వుంది. ఎప్పటికయినా రత్నగిరి గద్దెమీద ధనుంజయుని పక్కన కూచునే పట్టమహిషి తన కూతురేనని మాళవ మహారాణికి గాఢ నమ్మకం. ఆ నమ్మకానికి పరీక్షా సమయం సమీపించింది.

‘‘ఊఁ... వచింపుము స్వయంప్రభా. అంతఃపురము విడిచి ఉదయమే ఇటు వచ్చితివేమి?’’ గోడమీద కూచుకుంటూ అడిగాడు ధనుంజయుడు.

‘‘నీ కోసమే బావా!’’ అంది సిగ్గుతో.

‘‘నా కోసమా....’’

‘‘అవును. నీ కోసమే. ఈ విషయం నీకు తెలుసునా?’’

‘‘ఏ విషయము?’’

‘‘మన వివాహ విషయము.’’

‘‘వివాహమా... మనకా....’’

‘‘అవును. రాత్రి చాలా సమయము మన వివాహము గురించే పెద్దలు చర్చించినారు. ఈ ఉదయము కూడ ఈ విషయము చర్చకు వచ్చినది.’’

‘‘బాగు బాగు. నీవు సమ్మతించినావా?’’

‘‘ఇదియేమి ప్రశ్న? నీకు సమ్మతము కాదా?’’

‘‘పెద్దలు ఏమనుచున్నారు?’’

‘‘మనకు సమ్మతమైన వెంటనే ముహూర్తము నిశ్చయించెదరట బావా. నిక్కము వచింపుము. నన్ను వివాహమాడుట నీకు సమ్మతము కాదా?’’

‘‘కాదు స్వయంప్రభా. మన వివాహము జరుగదు.’’

ధనుంజయుని నిర్ణయం వినగానే స్వయంప్రభ సొగకళ్ళలో గిర్రున నీరు సుడులు తిరిగింది. 

‘‘బావా! నేను అందముగా లేనా? వన్నె చిన్నెలు లేవా? నీకు తగినదానను గానా? ఏల ఈ నిరాదరణ? వరసయిన బావవని చిన్నప్పటినుండి నిన్నే ఆరాధిస్తున్నానే...’’ ఆపైన చెప్పలేక చిన్నగా ఏడ్చేసింది. బాధను చూసాడు ధనుంజయుడు.

ఆ సంభాషణ వింటున్న ఇంద్రజిత్తు కూడ ఆశ్చర్యం నుండి తేరుకుంటూ దగ్గరకొచ్చాడు.

‘‘బావా! ఇది నీ మనసులో మాటేనా లేక మరదలని ఉడికింపనెంచితివా? మీ వివాహంతో రత్నగిరి మాళవ రాజ్యాల బంధుత్వం మరింత బలపడుతుందని ఎప్పటినుండో అనుకొంటున్నదే గదా...’’ అనడిగాడు.

‘‘క్షమించు బావా’’ అన్నాడు బాధగా ధనుంజయుడు.

‘‘మీరంతా నన్ను అపార్థం చేసుకున్నారు. నా మనసులో మాటను గూర్చి ఎవరూ ఎన్నడూ అడగలేదు. నీకో సోదరి ఉన్నందుకు ఎప్పుడూ అసూయ చెందేవాడిని. ఎందుకో తెలుసా? రత్నగిరికి నేనొక్కడినే ఏకైక వారసుడ్ని. నాకు సోదరులుగాని అక్కచెల్లెండ్రుగాని ఎవరూ లేరు. ఆ లోటు తీర్చుకోవటం కోసమే నీ సోదరిని నా సోదరిగానే భావిస్తూ వచ్చాను. అందుకే స్వయంప్రభ నా మరదలయినా ఎన్నడూ మేళమాడలేదు. ఛతురోక్తులు పలుకలేదు. మరో దృష్టితో ఏనాడూ వీక్షింపలేదు. ఎంతగా సొంత మరదలయినప్పటికీ సోదరిగా భావించిన అతివను ఎలా వివాహమాడగలను. ఇది అసంభవం....’’

‘‘లేదు బావా. నీ వాక్కు నిజము కాదు.’’ అంటూ మధ్యలోనే అరిచింది స్వయంప్రభ. ధనుంజయుని మాటాడనీయలేదు.

‘‘నీ మాటలు అసత్యము. నేను నీకు నచ్చలేదు అంతియే. ఆ మాట చెప్పకుండా ఏవో సాకులు చెబుతున్నావు. ఇక ఏమీ చెప్పకుము. చాలును బావా. ఇంతకాలము నీ మీద ఆశలు పెంచుకున్నందుకు తగిన బుద్ధి చెప్పినావు. చాలు.’’ అంటూ కన్నీళ్ళు తుడుచుకొని చిన్నగా రోదిస్తూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధనుంజయుడు నిశ్చేష్టుడయ్యాడు.

ఇంద్రజిత్తు ధనుంజయుని భుజం తట్టాడు.

‘‘నిన్ను నేను అర్థం చేసుకోగలను బావా. కాని స్వయంప్రభ గాని మా యొక్క మాతాపితరులుగాని అర్థం చేసుకోగలరనుకోను. నీమీదే ఆశలు పెంచుకున్న ఈ పిచ్చిపిల్ల అక్కడ ఏమి రగడ చేస్తుందో ఏమిటో. నేను వెళ్ళి నీ తరఫున చెప్పిచూస్తాను.’’ అంటూ తనూ వడివడిగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ధనుంజయుడు భారంగా నిట్టూర్చి`

అక్కడినుండి తన మందిరానికి బయలుదేరాడు.

అయితే ఈ సమస్య సమసిపోయేది కాదని తెల్సుసు. అపోహలకు, అపార్థాలకు దారి తీస్తుందని తెలుసు. అదే జరిగింది.
అవంతి మహారాణి వసుంధరాదేవి కూతురి కన్నీళ్ళు చూడగానే భగ్గుమంది. కోపంతో యాగీ చేసింది. రత్నగిరి రాజదంపతులకు ఏంచేయాలో పరిస్థితినెలా చక్కదిద్దాలో అర్థం కాలేదు. వెంటనే యువరాజు ధనుంజయుని పిలిపించారు.

ధనుంజయుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అవంతి వారికి కావలసింది అభిప్రాయాలు కాదు. ధనుంజయునితో స్వయంప్రభ వివాహం. ఇటు కొడుక్కి నచ్చచెప్పలేడు అటు సోదరికీ నచ్చచెప్పలేని సంకటస్థితి మహారాజు ధర్మతేజునిది.

అపోహు, అపార్థాు రానేకూడదు. వస్తే కతు కన్నీళ్ళు తప్పవు. అలిగిన వసుంధరాదేవి అప్పటికప్పుడు స్వదేశానికి ప్రయాణమైంది. భర్త మహారాజు హర్షవర్థనుడు భార్యావిధేయుడుగాబట్టి మౌనం వహించాడు. అవంతి రాజకుటుంబం వెంట వచ్చిన పరివారం వెంటనే రథాలను, అశ్వాలను సిద్ధం చేసి ప్రయాణ ఏర్పాట్లు చేసారు. వసుంధరాదేవిని శాంతింపజేయటం ఎవరివల్లా కాలేదు. ఆఖరికి అన్నవదినలు కానుకగా బంగారుపళ్ళెరంలో ఇస్తున్న చీరలు, రత్నాభరణాలను నేలకు విసిరికొట్టిందామె.

‘‘సంతోషంగా పుట్టింటికి వచ్చిన నన్ను కన్నీళ్ళతో సాగనంపుతున్నారు. ఇంకనూ ఈ లాంఛనాలు అవసరమా? నా కన్నీళ్ళు వృధా పోవు. ఇంతకింత ఇక్కడ కన్నీరు కార్చే రోజు వస్తుంది. మీ కుమారుడు మా కుమార్తెను మించిన ఎలాంటి రంభను వరిస్తాడో చూచెదముగాక.’’ అనరుస్తూ బయలుదేరింది.

చివరిగా వెళుతూ ఇంద్రజిత్తు ధనుంజయుని చేయి అందుకున్నాడు. ‘‘క్షమించు బావా. నీ మేనత్త కోపం నీకు తెలియనిది కాదు. ఈ కోపతాపాలు ఎంతకాం. అన్నీ సర్థుకుంటాయి. త్వరలోనే నేను వస్తాలే’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
ముందు ఒక అశ్వికదళం వెనుక ఒక అశ్వికదళం రక్షణగా అనుసరిస్తుండగా మూడు రథాలమీద అవంతీ రాజ కుటుంబం తరలి రత్నగిరి వదిలి వెళ్ళిపోయింది.

మహారాజ మందిరంలో జరిగిన ఈ గొడవ`

అక్కడి పరిచారికలకు తప్ప ఒరుకు తెలీదు.

వాళ్ళు ఎవరికీ చెప్పరు. సరిగ్గా`

ఇది జరిగిన వారం దినముల తర్వాత` 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్