Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dabbu kosam

ఈ సంచికలో >> కథలు >> మరుజన్మ

marujanma

  పూర్వం ఒక అరణ్యంలో ఆశ్రమం కట్టుకుని నివాసం ఉండేవాడు బ్రహ్మానందుడు అనే ముని. ఆయన అనేక నియమాలు పెట్టుకున్నాడు. వాటిలో ముఖ్యమైనవి  అహింస, శాంతి, సహనం. వాటిని తూ.చ. తప్పకుండా పాటించేవాడు. అక్కడ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేది. దాంతో  ఎన్నో రకాల జంతువులు, పక్షులు , సర్పాలు తమ జాతి బేధం మరచిపోయి అక్కడే తిరుగుతూ, బ్రహ్మానందుడు అందించే ఆహారం  తింటూ జీవనం సాగిస్తుoడేవి. ముఖ్యంగా ఆ ప్రాణులకు  ప్రాణభయం లేకపోయింది.  ముని ఆశ్రమంలో ఉన్న రక్షణ మరెక్కడా ఉండదని ఆయా జీవులు అనుకునేవి. అందుకే ఆశ్రమ పరిసరాలలో  స్వేచ్చగా తిరుగుతుoడేవి.

బ్రహ్మానందుడుకి సమస్త భాషలూ వచ్చును. ఆయన అన్ని జంతువుల తోటీ , పక్షుల  తోటీ , సర్పాల తోటీ ధారాళంగా మాట్లాడేవాడు. అయినా  కూడా ఏ జంతువునూ, పక్షినీ  తన నియమాలతో  శాసించేవాడు కాదు.

పక్షులు కానీ, జంతువులు కానీ వాటిలో వచ్చిన చిన్న చిన్న తగాదాల విషయంలో మరొకరి మీద ఫిర్యాదు చేయడానికి వస్తే “నాకు ఎవరి గురించీ చెప్పవద్దు. ఎవరి పాపం వారినే కొడుతుంది. ఈ జన్మలో చేసిన పాపాన్ని బట్టి మనకు వచ్చే జన్మ ఉంటుంది.” అని చెప్పేవాడు.

ముని ఆశ్రమంలో జీవుల్లో ఒక నక్క, ఒక కోడి, ఒక పిల్లి కూడా ఉండేవి. ఈ మూడు జీవులది  చాలా చెడు మనస్తత్వం. అవి ఏరోజూ ఆశ్రమ నియమాలు పాటించేవి కావు. నక్కయితే  అప్పుడప్పుడు ఆశ్రమం బయటకు పోయి జంతువులను తినేసి వచ్చేది. కోడి కూడా క్రిమి కీటకాలను దొంగచాటుగా తినేది. పిల్లి కూడా చిన్న ప్రాణులను వేటాడి తిని కడుపు నింపుకునేది. తమ విషయం ఎవరికీ తెలియదన్నట్టు దర్జాగా తిరిగేవి.

తమ ప్రవర్తన ఎలాగున్నా ఈ మూడు ప్రాణులకూ ఇతరుల తప్పు గురించి మితిమీరిన అసహనం ఉండేది.ఆ అసహనాన్ని ఎన్నాళ్ళో దాచుకోలేక పోయాయి.

ఒకసారి ముని దగ్గరకు వెళ్ళింది కోడి.  “గత జన్మలో ఏ  పాపం చేసిందో ఆ పాడు పిల్లి ఈ జన్మలో ఇలా పుట్టింది. ఇప్పటికీ దాని పాడు బుద్ధులు పోలేదు. ఆకలితో నిమిత్తం లేకుండా ఎలుకల్ని వేటాడుతుంది. దానికి వచ్చే జన్మలో ఏ రూపం వస్తుంది?” అని అడిగింది.

బ్రహ్మానందుడు కోడి మాటలకు బదులివ్వకుండా నవ్వి వూరుకున్నాడు.

కోడి వెళ్ళిపోగానే పిల్లి వచ్చింది. అది కూడా మునితో “ఆ నక్క  బహు జిత్తుల మారిది. మీకు తెలియకుండా అడవిలోకి వెళ్లి జంతువుల్ని చంపి కడుపు నింపు కుంటోంది. అది చేసిన పాపాలకు వచ్చే జన్మలో దానికి ఎలాంటి రూపం వస్తుంది?” అని అడిగింది.

అప్పుడు కూడా ముని సమాధానం చెప్పలేదు. కేవలం నవ్వి ఊరుకున్నాడు.

తరువాత రోజు సమయం చూసుకుని నక్క ముని దగ్గరకు వచ్చింది. “మన ఆశ్రమంలో పెరుగుతున్న కోడికి ఎక్కడ లేని దుర్బుద్ధి ఉంది. మీరు వేసే  గింజల్ని మీరు చూస్తున్నప్పుడు తింటోంది. మీరు తపస్సులోకి వెళ్ళగానే మన ఆశ్రమంలో దొరికే క్రిమి కీటకాలని తింటోంది. ఇక్కడ జీవహింస చేయకూడదని మీరు నియమం పెట్టినా అది పాటించడం లేదు. అది చేస్తున్న పాపం ఇంతా అంతా కాదు. అలాంటి పాపికి వచ్చే జన్మలో ఏ రూపం వస్తుందో చెబితే వినాలని నాకు ఆనందంగా ఉంది” అంది వినయం నటిస్తూ.

అప్పుడు కూడా ముని నోరు విప్పి మాట్లాడలేదు.

ఈ మూడు ప్రాణులూ కూడా పట్టు విడవకుండా తరచుగా మునిని మరుజన్మ గురించి అడుగుతుంటే ఒక రోజున బ్రహ్మానందుడు మూడింటిని దగ్గరకు పిలిచాడు. ఆయన రమ్మని పిలవగానే మూడున్నూ ఎగిరి గంతేసాయి. ఆయన చుట్టూ చేరాయి.

“ఈ రోజు మీ సందేహాలు తీర్చదలిచాను “ అన్నాడు బ్రహ్మానందుడు.

మరోజన్మ గురించి తెలుసుకోవడానికి మూడు ప్రాణులూ ఎక్కువ ఆసక్తి చూపించాయి.

“ఏ ప్రాణి అయినా ఇతరుల తప్పు గురించి మాట్లాడే ముందు తన తప్పు గురించి ఎక్కువ ఆలోచిoచాలి. ఏ తప్పూ చేయని ప్రాణికి మాత్రమే ఇతరుల తప్పు గురించి మాట్లాడే అర్హత ఉంది. నాతో మాట్లాడే ముందు మీ ముగ్గురూ ఈ విషయం ఆలోచించారా?” అనడిగాడు బ్రహ్మానందుడు.

అవి అడ్డంగా తలూపాయి. “ఈ నీతులు  మేము ప్రతి రోజూ మీ నోటి వెంట వింటున్నాము. మరు జన్మ గురించి  మేమడిగిన దానికి మాత్రమే బదులివ్వండి “ అన్నాయి మూడు ప్రాణులూ ఒకేసారి.

వాటి అసహనానికి ముని నవ్వుకున్నాడు. ”అంత తొందర పనికిరాదు. మంచి విషయం తెలుసుకునేటప్పుడు ఓపిక అవసరం. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతాను. మీ ముగ్గురిలో  ఉన్న కోడి తన ఆలోచనలను పిల్లి ప్రవర్తన గురించి ఊహిస్తూ పిల్లికి కలగబోయే మరు జన్మ గురించి కలలు కనేది. అలాగే పిల్లి కూడా నక్క గురించి ఆలోచించేది. నక్క కూడా  తక్కువ జాతిది కాదు. నక్క ఎప్పుడూ కోడికి కలగబోయే మరుజన్మ గురించి అనుకునేది. ఆ కారణం వల్ల  మీ ముగ్గురూ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిoచేవారో మరు జన్మలో ఆ రూపంలోనే జన్మిస్తారు. ఈ జన్మలో, మీరేమైనా పుణ్యకార్యాలు చేసి ఉంటే ఆ జన్మలో సుఖపడతారు. లేదా ఆయా జన్మలతో పాటు గత జన్మలోని పాపాలు కూడా మిమ్మల్ని బాధించి అష్టకష్టాలు పడతారు” అన్నాడు ముని. 

ముని చెప్పిన మాటలు విన్న మూడు ప్రాణులూ హడలి పోయాయి. ఆ రోజునుంచీ అవి ఇతర ప్రాణుల గురించిన ఆలోచన మానివేసాయి. అంతేకాదు ఆశ్రమం విడిచి పెట్టి బయటకు వెళ్లి తినడం , తోటి ప్రాణుల్ని హింసించడం, చంపి తినడం మానివేసాయి.  అవి కూడా ముని విధించిన నియమాలు పాటిస్తూ, ఈ జన్మలో చేసిన పాపానికి పరిహారంగా  పుణ్యం సంపాదించాలని ప్రయత్నిస్తూ మిగతా కాలమంతా బుద్ధిగా గడిపాయి.

బ్రహ్మానందుడు ఆ మూడు ప్రాణుల్లోనూ వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాడు. 

మరిన్ని కథలు
nirmala aakasam