Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
himagiri kailasa darshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తిరుప్పావై - వనం వెంకట వరప్రసాద రావు

tiruppavai

తిరుప్పావై 

25 వ పాశురం 

ఒరుత్తి మగనాయ్ పిఱున్దు, ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరిక్కిలానాగిత్తాన్ తీఙ్గు నినైన్ద 
తరుత్తై ప్పిళ్ళైప్పిత్తు కఞ్జన్ వయిత్తిల్ 
నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై 
అరుత్తిత్తు వన్దోమ్! పఱై తరుతియాకిల్,
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి 
వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్ 

ఒకామెకు బిడ్డవై జన్మించి, ఒకే రాత్రిలో వేరొకామెకు బిడ్డవై దాగి, పెరుగుచుండగా, సహింపక కీడును తలపెట్టిన కంసుని ఆలోచనను తలక్రిందులుచేసి, ఆ కంసుని కడుపులోని నిప్పువలె అతడిని దహించినవాడా! ఆశ్రిత వ్యామోహితుడా! నిన్ను యాచించుటకు వచ్చినాము. శ్రీమహాలక్ష్మికి తగిన ఐశ్వర్యమును, వీర్యమును కలిగిన నిన్ను గానముచేసి, మా శ్రమ తీరి  ఆనందించుచున్నాము! 

ఒకతెకు కలుగుటనిట మరి
యొకతెకునట గలుగుటనగ యొప్పెను నీకున్
వికసనమిట, కడుపున సెగ
లొక కంసునికట, నటమటలోటమి తెగుటల్ 

కరుణాకర! శ్రితవత్సల!
పరనొసగుము పరమపురుష! పద్మాశ్రయుడా!
సిరికి తగిన వరుడ, గరుడ
తురగుడ, మురహరుడ! అఘవిదూర అనంతా!

26వ పాశురం

మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;
మేలైయార్ శెయ్వనగళ్;వేణ్డువన కేట్టియేల్;
ఞాలత్తై యెల్లాం నడుఙ్గ మురల్వన 
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే 
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడు డైయనవే,
శాలప్పెరుమ్ పఱై యే, పల్లాణ్డిశైప్పారే,
కోలవిళక్కే, కొడియే, వితానమే,
ఆలినిలైయాయ్! అరుళేలో రెమ్బావాయ్

ఆశ్రిత వ్యామోహము గలవాడా! ఇంద్రనీల మణి కాంతులను కలిగిన దేహముగలవాడా, వటపత్రశాయీ! మార్గశిర వ్రతస్నానమునకు కావలసిన పరికరములను అర్ధించుటకు వచ్చితిమి. ఈ స్నానమును, వ్రతమును మా పూర్వీకులు ఆచరించిరి. నీవు వినినచో మాకు కావలసిన పరికరములను చెప్పెదము, వినుము స్వామీ! ప్రపంచమంతా వణికిపోయేట్లు పెను శబ్దమును జేసే, పాలనుబోలిన తెల్లని, నీ పాంచజన్యము వంటి శంఖములు, విశాలములైన 'పర'యనెడి వాయిద్యములు, నీ మంగళగానము చేయడం కోసం భాగవతులు, మంగళ దీపములు, ధ్వజములు, చాందిని కావలయును. స్వామీ! దయజేసి ఈ పరికరములనిమ్ము!

నీలమణీ! నిరుపమ కరు
ణాలయ! వటపత్ర శాయి నారాయణ! గో
పాలక! నతపాలక! సం
చాలక! మా వ్రతమునకగు సంబారములన్

సుందర దరహాస! గతము
నందున మా ముందు తరము నందలి వారల్
పొందగ నిను మార్గశిరం
బందున జేసిన పయనపు పాంథులమగుటన్

పరికరముల, నుపకరణల,
కరివరదుడ! దయలనిడుము కాదనవనుచున్
ఎరుగుదువని ఎరిగియు విను
మెరిగింతుము వివరములను మెలతలమెలమిన్ 

వంచనలెరుగని వారల
కించనులకు సకలమిచ్చు కీర్తులు నిజమౌ
పంచన జేరినవార మ
చంచలమగు భక్తిఁ పాంచజన్యము లనగన్ 

తెల్లనివెల్లల తెలతెల
తెల్లముగను కొల్ల గొనెడి తెల్లని శంఖుల్
ఎల్ల జగము ఝిల్లన సం
ధిల్లెడు సడి నిడ తడబడ దిక్కు లవెల్లన్
పరమపురుష! పరలనిడుము

పర మంగళ గానములకు భాగవతయతుల్
సిరి మంగళ దీపములను
శరణాగతులకు ధ్వజములు చాందిని చాలన్

27వ పాశురం 

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా! ఉన్దన్నై 
పాడి ప్పఱై కొణ్డు యాం పెఱు శమ్మానమ్,
నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాక
చ్చూడగమే, తోళ్ వళై యే, తోడే, శెవిప్పూవే,

పాడగమే, యెన్ఱనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆది యుడుప్పోమ్; అదన్ పిన్నే పాల్ శోఱు 
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గై వళివార
క్కూడి యిరున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్ 

నీతో కూడని వారిని, నిన్ను వ్యతిరేకించేవారిని, నీపట్ల విముఖులను జయించేవాడా!  గోవిందుడు అనెడి నామము గలవాడా, కళ్యాణగుణములు గలవాడా! నిన్ను కీర్తించి, వ్రతసాధనమగు 'పరను'పొంది, నీతో మేము పొందదలచిన సన్మానము లోకులు అందరూ పొగిడేలాగా ఉంటుంది. మా కరములకు దివ్యములైన గాజులు, మా బాహువులకు కంకణములు,  మా చెవులకు కమ్మలు, బంగారు చెవిపూవులు, మేలైన చీరలు, రవికలు, కాలికి ఘల్లుమనే మువ్వలను నీవు ప్రసాదించాలి. పాలతోవండిన దివ్యాన్నములపై నేతి వర్షములు కురిపించి చేసిన ప్రసాదమును, క్షీరాన్నమును నీ సరసన ఘనముగా కూర్చుండి, మా మోచేతులమీదుగా ధారలుగా కారుతుండగా ఆ పాయసాన్ని  త్రాగాలి! యిదే మా వ్రతఫలితముగా మేము పొందేట్లు వరమివ్వు స్వామీ!

కూడనివారలనొంచెడి
వాడవు గోవింద! సుగుణవంతుడ! నిన్నున్
పాడి పరను సన్మానము
వేడెదమిది యొకటి గలదు వేడుక మాకున్

లోకము కొనియాడునటుల
మాకరముల గాజులు మరి మా బాహువులం
దౌ కంకణములు కమ్మలు
మాకర్ణములంద నందమౌ చెవి పూవుల్ 

మేలగు చీరలు రవికలు
కాలికి వలె యందెలు ఘలు ఘల్లని మొరయం
పాలను నేతులఁ సాదపు
కాలువ మోచేతు లంది కారుచు నుండన్

కూరుచు నుండియు ఘనతగ
నీరదనిభ గాత్ర, తినుట నీదగు సరసన్,
కోరిక గలదిదియు నొకటి
వారిధి శయనా! దయగని వరమిది యిమ్మా!

28వ పాశురం 

కఱవైగల్ పిన్ శెన్ఱు శేర్ న్దుణ్బోమ్ 
అఱివొన్ఱు మిల్లాద వాయ్ క్కులత్తు, ఉన్దన్నై 
ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియం నాముడై యోమ్;
కుఱై వొన్ఱు మిల్లాద కోవిన్దా!ఉన్దన్నోడు 
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు,
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై 
చ్చిఱుపే రళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీతారాయ్ పఱై యేలో రెమ్బావాయ్ 

పశువులను వెన్నంటి అడవికి చేరి, తిని శరీరాన్ని పోషించుకునే వారము, ఏ ఒక్కటీ తెలియని గోపకులములో జన్మించిన వారము మేము. మా వంశములో నీవు జన్మించినావు అనే పుణ్యమునకు నోచుకున్నవారము. ఏ లోపమూ లేని గోవిందా! ప్రభూ! నీతో మా సంబంధము యిక్కడితో పోగొట్టుకోగలిగేది కాదు. లోకమర్యాద నెరుగని పిల్లలము, ప్రేమతో నిన్ను చనువుగా, చిన్న పేరుతో పిలిచామనే కోపమును చూపించి, మమ్ములను అనుగ్రహించడం మానకు. మా వాంఛితమైన ‘పర’ను ప్రసాదింపుము!    

పశువులగొని యడవికిజని
యశుచులుగనె పానములను యాహారములన్ 
పశువులవలె మెసగు ఉదర
వశులము గద కుశలమతులె పశుకాపరులున్?

మావాడల గొనినాడవు
దేవా! నీ జననమునకి దేజన్మలదో
హే! వాసవ, భవ,శివనుత! 
మావారల దోయిది మరి మా పుణ్యంబో! 

శ్రితకల్మష నాశక! యే
గత జన్మల బంధమొ యిది గద కరివరదా!
మితిమీరిన ప్రేమల పరి
మితులను మరచితిమి మేము మిము పిలచుటలన్

మరియాదలు మన్ననలును
సరినెరుగనివారము గడసరులము గామిన్
సరిజేయుము సరకుగొనక
పరనొసగుము పరమపురుష! పంకజనాభా!

29వ పాశురం 

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్ 
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్డు ఙ్గులత్తిల్ పిఱన్ద నీ
కుత్తేవ లెఙ్గళై కొళ్వా నన్ఱుకాణ్; గోవిన్దా!
ఎత్తైక్కు మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో 
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోమ్,
మత్తై నఙ్గామఙ్గళ్ మాత్తే లోరెమ్బావాయ్.

పూర్తిగా తెల్లవారకముందే వచ్చి మిమ్ము సేవించి, సుందరములైన తామరపూవులవంటి మీ పాదములను స్తుతించి మంగళాశాసనములు చేయుటలోని ప్రయోజనమును, ఆంతర్యమును వినుము స్వామీ! పశువులను మేపినతర్వాతే తాము భుజించెడి గోపకులములో పుట్టిన మీకు మేము చేసే ఆంతరంగిక సేవలను స్వీకరింపక పోవడం తగదు. గోవిందా! మేము నేడు ‘పర’ను తీసుకుని వెళ్ళడం కొరకు వచ్చినవారము కాము కదా! మీతో ఎన్నటికీ విడిపోని, ఏడేడు జన్మల బంధము కావలెను! మీకే దాసులము కావలెను! మాకు యే యితర వాంఛలూ లేకుండా చేయుము స్వామీ! 

బంగరు తామర పూవుల
రంగుల తలపించు వర చరణముల భజనల్
మంగళ కీర్తనములుగొను
టం గలదొక వాంఛ తీరుటన్నది ఫలమౌ

జాలినిగొని మాలిమితో
ఆలను మేపిననుగాని అన్నము తినగన్
జాలని వాడవు గద గో
పాలకుడవు నతజన పరిపాలకుడగుటన్

గొనననుటలు తగదిది దయ
గని గొన దగునాంతరంగికంబుల సేవల్
తనివియు తీరదుగ పరను
గొనుటలనది తీరు పొందు గొనుటలనిన్నున్

వేడెద మిడుమిదియె వరము
వీడక నీ పదభజనలె విత్తములనుచున్
పాడుచు నీ గుణ కీర్తన
గూడగ నేడగు భవముల కూరిమి నిన్నున్

30వ పాశురం 

వఙ్గక్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జి
అఙ్గ ప్పఱైకొణ్డవాత్తై, యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న 
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే 
ఇఙ్గిప్పరిశురై ప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్ 
ఎఙ్గుమ్ తిరువరుళ్ పెత్తిన్బుఱువ రెమ్బావాయ్   

ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును చిలికిన శ్రీపతిని, బ్రహ్మరుద్రాదులను నియమించువాని, చంద్రునివంటి ముఖములు, దివ్యాభరణములు కలిగిన గోపికలు చేరి, స్తుతించి, ఆ వ్రేపల్లెలో ‘పర’ అనే వాయిద్యమును, భగవద్దాస్యమును పొందిన విధమును జగత్తుకు అలంకారముగా ఉన్న  విల్లిపుత్తూరులో జన్మించినది, ఎల్లప్పుడూ చల్లని తామర పూసల మాలను ధరించియుండే  ‘భట్టనాథుల’వారి పుత్రిక అయిన గోదాదేవి చెప్పినది, గోపికాసంఘము అనుభవించినది,  ద్రావిడ భాషలోనున్న ఈ ముప్పది పాశురముల మాలికను క్రమము తప్పకుండా పఠించేవారు, ‘నాలుగు భుజములు, వాత్సల్యముతో నిండిన ఎఱ్ఱని కన్నులు, దివ్యమైన ఖమండలమును కలిగిన  పెద్ద పర్వత శిఖరమువంటివాడు, ఐశ్వర్య పరిపూర్ణుడు, శ్రీపతి ఐన శ్రీమన్నారాయణుని సాటిలేని కరుణచే, ఈ లోకములో అంతటా ఆనందమును అనుభవింతురు!      

పడవల నెలవౌ క్షీరపు
కడలిని మధియించినట్టి కమలా కాంతున్
గడకొని శివభవులకు నా
థుడు హరియని తెలిసిన మెలతుక లట నెరుకన్

గోకులమున వ్రతమునొకట
నా కలువల రేని గెలుచు నగవుల జిలుగుల్
శ్రీకర మంగళ గుణముల
సోకగు యాభరణములను శోభలు వెలయన్

పరయది జగములకొరకై
పరమపురుషు దాస్యము తము బడయుటకొరకై
తరుణులు చేసిన విధమును
ఎరిగించెను శుభముల సిరి ఎల్లరికగుతన్

ధన్వి నినుడు విల్బుత్తురు
తన్వి గళమునందు గలది తామర పూసల్
తన్విమలపుమాలగ పొం
గన్విష్ణుని చిత్తుడు తను గా తండ్రి యనన్ 

గొప్పగ, ద్రావిడవేదము
తెప్పగ, తరియించ సుధల దేలిచి పరమౌ
ముప్పది పాశురముల నొక
నప్పిన్నది యందజేసె నందగ పరమున్ 

ఆపక గోపికల పగిది
నీ పలుకుల పరవశుడగు నీశుడు వశుడౌ
పాపపు ఘనతిమిర మడగు
నా పరముని సన్నిధియగు నానందమగున్

కొండలరాయని భుజముల
యండలు గలుగును కొరతల యంతము గలుగున్
రెండగు ఎఱ్ఱని కొలకుల
నిండగు దయ హరి ముదముల నిండుగ గురియున్

గురు కరుణలు పితరునివగు
కరుణలు ఘనమగుచును సిరి కాంతుని కరుణల్
విరివిగ కురిసిన వరముల
విరులివి గొనుడయ్య ‘విప్ర’ వినయుని నెనరుల్

~*~*~* జగజ్జనని గోదాదేవి విరచితమైన 'తిరుప్పావై' సంపూర్ణము ~*~*~*

(అమ్మ ఆండాళ్ దివ్య పదములకు నమస్సులు!)

***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu