Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఒక్క ఫ్లాప్‌కే ఐరెన్‌లెగ్ అనే ముద్ర వేసేస్తారా? - లావ‌ణ్య త్రిపాఠి

ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది.. అన్న‌ట్టు లావ‌ణ్య త్రిపాఠీకీ ఓ లెక్కుంది.
వ‌చ్చింది క‌దా, అని ప్ర‌తి సినిమా ఒప్పుకోద‌ట‌!
నాకేంటి?  అందులో నేనేంటి?  అనే విష‌యాల‌కే ప్రాధాన్యం ఇస్తుంద‌ట‌.
స్టోరీ మార‌లేదు.. నా క్యారెక్ట‌ర్ మార‌లేదు.. క‌నీసం కాస్ట్యూమ్ అయినా మార్చొచ్చు క‌దా అని అడుతుంద‌ట‌..
అదీ నిజ‌మే క‌దా??  
కొత్త‌ద‌నం కోసం మ‌న‌మే కాదు.. లావ‌ణ్య త్రిపాఠీ కూడా అల్లాల్లాడిపోతుంటుందేమో?
నా అదృష్టం కొద్దీ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన అన్ని పాత్ర‌లూ వేటిక‌వే డిఫ‌రెంట్ అంటోంది. సోగ్గాడే చిన్ని నాయ‌నాలోనూ అలాంటి స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా ల‌వ‌ణ్య‌తో స్మాల్ చిట్ చాట్‌. 

* హాయ్ లావ‌ణ్య‌..
- హాయ్‌..

* 2015 రిజ‌ల్ట్ తో హ్యాపీగా ఉన్నారా?
- పూర్తిగా.. ఎందుకంటే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. దాంతో పాటు నాగార్జున గారి సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కింది. నిజంగానే అంత పెద్ద స్టార్‌తో క‌ల‌సి న‌టించే అవ‌కాశం ఇంత తొంద‌ర‌గా ద‌క్కుతుంద‌నుకోలేదు.

* భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర‌వాత ఆఫ‌ర్లు బాగా పెరిగాయా?
- అదేంటోగానీ... నా విష‌యంలో ఆఫ‌ర్లు ఎప్పుడూ త‌గ్గ‌లేదు.. అలాగ‌ని గంపెడు అవ‌కాశాలు ఒకేసారి వ‌చ్చిప‌డిపోలేదు.. అంత స్టేబుల్‌గా ఉంది. అందాల రాక్ష‌సి త‌ర‌వాత ఎలా ఉన్నానో.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర‌వాత కూడా అలానే ఉన్నా. మ‌ధ్య‌లో దూసుకెళ్తా నిరాశ ప‌రిచింది.. అయినా స‌రే.. ఆఫ‌ర్ల‌లో ఎలాంటి మార్పు రాలేదు.

* హిట్టు, ఫ్లాపు ప్ర‌భావం మీ మీద అంత‌గా లేదంటారు..?
- అలాగ‌ని కాదు, న‌టిగా న‌న్ను బాగా గుర్తించార‌నిపిస్తోంది. సాధార‌ణంగా ఓ సినిమా ఫ్లాప‌యితే క‌థానాయిక‌ల్ని ఐరెన్ లెగ్ అని తిడుతుంటారు..  ఒక్క సినిమాకే అలా అంటే ఎలా? అలాగైతే... దూసుకెళ్తా త‌ర‌వాత నాకు అస‌లు సినిమాలే రాకూడ‌దు క‌దా? 

* హిట్టు సినిమాలో న‌టించిన క‌థానాయిక‌ల‌కు ఆ క్రెడిట్ హీరోల‌తో పాటు స‌మానంగా ద‌క్కుతోందంటారా?
- హీరోల‌తో పాటు నాక్కూడా స‌మానంగా వాటా రావాలి అని క‌థానాయిక‌లేం అనుకోరు. అయినా స‌రే.. వాళ్ల‌కు రావాల్సిన గుర్తింపు వాళ్ల‌కు వ‌స్తోంది. లేదంటే త‌మ‌న్నా, స‌మంత‌, అనుష్క‌లాంటివాళ్లు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యేవాళ్లా?

* మీడియా మీ గురించి ఏమ‌నుకొంటుందో.. ఆరా తీస్తుంటారా?
- త‌ప్ప‌కుండా.. ఎందుకంటే సినీ రంగంలో ఉన్న‌దాన్ని.. మీడియా ఫోక‌స్ నాపై ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుసు. అలాంట‌ప్పుడు ఎవ‌రేం మాట్లాడుకొంటున్నారో, ఎవ‌రేం రాస్తున్నారో తెలుసుకోవాలి క‌దా?

* భ‌లే భ‌లే త‌ర‌వాత పారితోషికాలేమైనా పెంచారా?
- అదేం లేదండీ. నాకు క‌థే ముఖ్యం.. ఎంత తీసుకొంటున్నామ‌న్న సంగ‌తి తర‌వాత‌

* స్టార్ సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చినా క‌థేంట‌ని అడుగుతారా?
- అప్పుడు అడ‌గ‌లేం. ఎందుకంటే మ‌హేష్‌బాబు సినిమాలో హీరోయిన్ ఛాన్సనుకోండి.. అప్పుడు మ‌నం క‌థ గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎందుకంటే.. మ‌హేష్ బాబు సినిమా చేస్తున్నారంటే.. అందులో విష‌యం ఉన్న‌ట్టే లెక్క‌. అలాంట‌ప్పుడు నేను కూడా క‌థ గురించి ఆలోచించ‌డంలో అర్థం లేదు. 

*  క‌థానాయిక‌గా న‌టిస్తూ.. మ‌ధ్య‌లో మ‌నం లాంటి సినిమాలో కామియో చేశారెందుకు?
- మ‌నం చాలా గొప్ప సినిమా. దానికి తోడు ఏఎన్నార్‌గారి చివ‌రి చిత్రం.. అలాంటి సినిమాలో ఆఫ‌ర్ అందుకోడం నిజంగా నా అదృష్టం.. ఆ స‌మ‌యంలో నా పాత్ర ఏమిటి? అని ప‌ట్టించుకోలేదు. 

* నాగార్జున‌తో క‌ల‌సి న‌టించారు... ఎలా ఉంది ఆ అనుభ‌వం..
- ఆయ‌న నిజంగానే టాలీవుడ్ కింగ్‌.. రెండు పాత్ర‌ల్లో ఆయ‌న చూపించిన వైవిద్యం నాలాంటి అప్ క‌మింగ్ హీరోయిన్ల‌కు ఓ పాఠం. అంత సీనియ‌ర్ అయినా.. ఎప్పుడూ పొగ‌రుగా మాట్లాడ‌లేదు. ఆయ‌న ఎప్పుడూ న‌వ్వుతూ ఉంటారు. ఆ న‌వ్వు నాకు బాగా న‌చ్చింది.

* చీర‌క‌ట్టులో చాలా ప‌ద్ధ‌తిగా క‌న‌పిస్తున్నారు..
- ఇందులో నా పేరు సీత‌. ఆ పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఉండాలి క‌దా. నిజానికి నాకు చీర‌లు క‌ట్ట‌డం పెద్ద‌గా అల‌వాటు లేదు. ఈ సినిమా కోసం చీర‌లు క‌ట్టుకోవాల్సివ‌చ్చింది. చీర‌లో బాగున్నానో లేదో ప్రేక్ష‌కులే చెప్పాలి.

* లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారా?
-  నేను చేస్తే చూస్తారా (న‌వ్వుతూ). నిజానికి సినిమా అంతా నేనే న‌డ‌పాలి.. అన్న స్వార్థం నాకెప్పుడూ లేదు. క‌థ‌లో నా పాత్ర‌కంటూ కాస్త ప్రాధాన్యం ఉంటే చాలు. ఈమ‌ధ్యే ఓ కొత్త సినిమా ఒప్పుకొన్నా. అందులో నా పాత్ర చుట్టూనే క‌థ న‌డుస్తుంది. అలాగ‌ని లేడీ ఓరియెంటెడ్ మూవీ కాదు.

* ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా ఎప్పుడు?
- ఈ నెలాఖ‌రులోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సో.. జ‌న‌వ‌రి నా ల‌క్కీ మంత్‌!  రెండు సినిమాలొస్తున్నాయి. రెండూ హిట్ట‌యితే 2016లోనూ టేకాఫ్ అదిరిపోయిన‌ట్టే.

* ఓకే ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ..

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review