Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue143/405/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

అది వసుంధరా దేవి నోటివాక్కో లేక విధి లిఖితమో గాని రత్నగిరి కోటలో కన్నీరు ప్రవహించే క్షణాలు ఆరంభమయ్యాయి. ఈ రోజు ఉదయం మహారాజ ధర్మతేజుడు నిద్ర లేచే సరికి వీపు మీద కంది గింజ ప్రమాణంలో బుడిపె లేచి ఎర్రగా కంది వుంది. అది రెండు రెక్క గూళ్ళ మధ్యన సరిగ్గా వెన్నుమీద లేచి చిన్నగా సలుపుతోంది. రాజ వైద్యులు పరీక్షించారు. అది సాధారణ కణితి అనుకున్నారు. ఎందుకంటే, వ్రణాలు అనేక రకాలు. అవి పక్వానికొస్తే గాని నిర్థారణ చేసుకోవటం కష్టం. అది అణగి పోయేందుకు ఏవో లేపనాలు, మందులు వాడారు.

రోజులు గడుస్తున్నాయి గాని మందుల దారి మందులది. కణితి దారి కణితి అవుతోంది. పక్షం దినాలయ్యే సరికి నిమ్మకాయ సైజుకు పెరిగి వ్రణంగా మారింది కణితి. ఎర్రగా గట్టిగా నెత్తురు ముద్దలా వుండి భరింప రాని వేదన ఆరంభమైంది.

రాజ వైద్యులిరువురూ ఆయుర్వేదంలో అపర ధన్వంతరీలనదగ్గ ఘనాపాటీలు. వ్రణం పక్వానికి రావటం లేదు. దాని తీరు చూస్తుంటే వారికి తొలిసారిగా అనుమానం మొదలయింది. ఇది రాచపుండు కాదు గదా! ఎప్పుడో అరుదుగా ఏర్పడే ఈ రాచపుండునే పుట్ట వ్రణం అని కూడ అంటారు. నాటికి ఈ వ్రణాన్ని గుణ పరిచే మూలికలేవీ కనుగొనబడ లేదు. ఇది క్రమంగా పిలకలు వేస్తూ ఒక పక్క పగిలి రసి ఓడుతూ మరో పక్క పెరుగుతూ క్రమంగా ఒక పుట్టలా వీపు మీద విస్తరిస్తోంది. బాధితుడు బ్రతికుండగానే నరక యాతన అనుభవిస్తాడు. ఆరు మసాలు మించి బ్రతకడు. రాజ వైద్యులు ఎన్నో గ్రంధాలు తిరగేసి చికిత్సలు చేస్తున్నా ప్రయోజనం లేక పోయింది.

మహారాజు తన రాజ మందిరంలో తల్పానికే పరిమితమయ్యారు. మహారాణి కనకాంబిక దుఖ్ఖానికి అంతులేదు. రాజుగారి రాచ పుండు గురించి ప్రజలకు తెలిస్తే ఆందోళన చెందుతారని ఈ విషయాన్ని గోప్యంగా వుంచారు. ఈ లోపల అవంతీ నగరం నుండి యువరాజు ఇంద్రజిత్తు వచ్చి ఒకసారి చూసి వెళ్ళాడు. ఇదే సమయంలో త్రిలింగ దేశం నుండి, కరునాడు నుండి ఆయుర్వేదంలో తల పండిన వృద్ధ వైద్యులు రప్పించబడ్డారు. అప్పటికి రాచపుండు ఏర్పడి రెండు మాసాలయింది. వైద్యులు మహారాజు ధర్మతేజుని వ్రణాన్ని క్షుణ్ణంగా పరీక్షించి అది పుట్ట వ్రణమని తేల్చి చెప్పారు. బాధా నివారణకు కొన్ని మందులు వాడమని, ఓ విషయం తేల్చి చెప్పారు.

‘‘మహారాజా. ఇది తీరని వ్యాధి. పూర్తిగా నివారణకు ఎలాంటి చికిత్సయు లేని మొండి వ్రణము. మీకు ఆరోగ్యం చేకూరడానికి ఒకే ఒక మార్గం వున్నది. ఈ వ్రణము నాగ దోషము వలన ఏర్పడుతుంది. ఎవరైనా ఒక సాహసికుడు నాగ లోకం వెళ్ళి దివ్య నాగమణిని మరో నాలుగు మాసముల లోపు తేగలిగినచో వ్యాధి గుణమగును. నాగమణి మహిమ వలన క్షణాలలో ఈ రాచ పుండు హరించి పోయి సంపూర్ణ ఆరోగ్యము చేకూర గలదు’’ అంటూ సలహా యిచ్చారు.

నాగలోకము!

ఎక్కడ వుందది?

ఎక్కడో ఉత్తర ఈశాన్య ప్రాంతపు అడవులలో అక్కడికి మార్గముందని వైద్యులు చెప్పారు గాని, ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. అయినప్పటికీ తను వెళ్తానన్నాడు యువరాజు ధనుంజయుడు. కాని ఈ పరిస్థితిలో రాజ్య క్షేమం కోసమైనా యువరాజు కోటలోనే ఉండాలని శాసించాడు ధర్మతేజుడు. అంతే కాదు, నాగలోకం నుండి దివ్య నాగమణిని తెచ్చిన సాహసికునికి అర్ధరాజ్యం బహుకరింప బడునని రాజ్యంలో దండోరా వేయించాలనీ నిర్ణయం తీసుకున్నాడు.

కాని యువరాజు ధనుంజయునికి మనసు అంగీకరించ లేదు. తండ్రి పడే బాధను చూస్తూ తల్లి దుఖ్ఖాన్ని చూస్తూ ఒక అసమర్థునిలా తను కోటలో వుండలేడు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి అభీష్టానికి విరుద్ధంగా దివ్య నాగమణి కోసం తనే బయలుదేరాడు.

తన మందిరంలో తండ్రి ధర్మతేజుని పేర ఒక లేఖ వుంచి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని వేకువనే తన అశ్వం గరుడనధిరోహించి రత్నగిరి వదిలి వేగంగా సాగిపోయాడు.

మధ్యాహ్నం వేళగాని ధర్మతేజునికి ఈ విషయం తెలియ లేదు. లేఖ చూడగానే హతాశుడయ్యాడు. వెంటనే యువరాజును వెనక్కు తీసుకు రావలిసిందిగా ఆజ్ఞాపిస్తూ దళపతి కరివీరుని ఆజ్ఞాపించాడు.

వంద మంది అశ్వికులతో కూడిన సైనిక దళంతో ఆ సాయం కాలమే కరివీరుడు యువరాజు కోసం బయలు దేరి, ఎక్కడా ఆగకుండా ప్రయాణించి మూడో రోజు యువరాజు ధనుంజయుని కలుసుకో గలిగాడు.

***************************

గాలి వానకు పాడుపడ్డ ఆలయంలో తల దాచుకున్న యువరాజు ధనుంజయునికి ఎడతెగని ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో కూడ తెలీదు. ఎంత సమయం గడిచింది కూడ తెలీదు.

అంతలో`

‘‘మిత్రమా ధనుంజయా. నిద్ర పోయినది చాలును. ఇకలెమ్ము’’ అంటూ ఒక ఆత్మీయ పిలుపు అతడ్ని నిద్ర లేపింది. అదే పిలుపు, ఆలయ మండపంలో కన్పించిన వృద్ధ మాధవ స్వామి పిలుపు.

దిగ్గున లేచి కూచున్నాడు ధనుంజయుడు.

ఎదురుగా చేతిలో వేణువును విలాసంగా తిప్పుతూ మాధవ స్వామి. తన ముందే బాసిం పట్టు వేసి కూచుని దరహాసం చేస్తూ కన్పించాడు. అయితే ఇప్పుడున్నది రాత్రి తను బస చేసిన శిథిలాలయం కాదు, దివ్య ప్రభతో ప్రకాశిస్తున్న అద్భుతమైన ఆలయం. చుట్టూ దేదీప్య మానంగా జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. మాధవ స్వామి వెనుక కొద్ది దూరం లోని ఆలయ మూల విరాట్టు స్థానంలో వేణు గోపాలుని విగ్రహం చిరునవ్వు చిందిస్తోంది. పూల మాలాంకృతుడైన స్వామి ముందు పూజలు జరిగినట్టుగా ధూప నైవేద్యాలతో అగరు, కస్తూరి, పునుగు సువాసనలతో ఆ ప్రాంతం పరిమళ భరితంగా వుంది.

ధనుంజయునికి ఏమీ అర్థం కావడం లేదు. శిథిలాలయంలో నిద్రించిన తను ఇక్కడికెలా వచ్చాడు? మాధవ స్వామి తిరిగి తన ముందు కన్పించటం ఏమిటి? ఏం జరుగుతోంది? లేచి కూచుంటూ`

‘‘స్వామీ... మీరా!’’ అన్నాడు అప్రయత్నంగా.

‘‘అవునయ్యా. నేనే.’’ బదులిచ్చాడు వృద్ధ మాధవ స్వామి.

‘‘ఇక్కడున్నారేమి?’’

‘‘ఎక్కడైనా వుంటాను. సందేహమే?’’

‘‘శిథిలాయంలో కదా నిద్రించితి. ఇచట కెలా వచ్చితిని?’’

‘‘పిచ్చివాడా! నేనెచటనున్న అదియే నా దేవాలయము గదా’’

‘‘మీ మాటలు కడు విచిత్రముగా నున్నవి’’

‘‘చిత్రము చేయువాడను. మాటలూ చిత్రములే గాని, నా పలుకులు పెడ చెవిన పెట్టినావు గదా. రామ గిరి నుండే నేరుగా సహ్యాద్రికి పోయిన ఇప్పుడు నీకీ శ్రమ దమాదులున్డేవి కాదు గదా’’

‘‘అవును స్వామీ. ఇది నా తప్పిదమే. మీరే దారి చూపాలి. సహాద్రికి వెళ్ళి ఆ భీమ శంకరుని దర్శించెదను’’

‘‘తథాస్తు. నీ సంకల్పమును ఆ శంకరుడు నెరవేర్చ గలడు. అంతయు మన మంచికే యని గ్రహింప వలె. శుభమగు గాక. పోయి వచ్చెదను.’’ అంటూ లేచాడు.

‘‘స్వామీ! ఇన్ని తెలిసిన మీరు నాకు నాగ లోకము చేరుటకు మార్గము తెలుప వచ్చును గదా.’’ అడిగాడు ధనుంజయుడు. వెను తిరిగి చూసి మంద హాసం చేసాడు మాధవ స్వామి.

‘‘మిత్రమా! కష్టే ఫలి అన్నారు గదా పెద్దలు. కర్మలు ఆచరించుట నీ వంతు, ఫలితాన్ని నాకు వదిలెయ్‌. నీ శ్రమ వృధా పోదు.’’ అని చెప్పి అలా నడుచుకొంటూ వెళ్ళిపోయాడు వృద్ధుడు. ధనుంజయుడు చూస్తుండగానే ఆ వృద్ధ మాధవ స్వామి వేణు గోపాలుని విగ్రహంలో ఐక్యం చెందాడు.

అప్పటిగ్గాని ధనుంజయునికి అసలు విషయం బోధ పడ లేదు. వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తూ తన ఆరాధ్య దైవం ఆ వేణుగోపాలుడే. ఆయన్ని గుర్తించలేని తన అవివేకాన్ని నిందించుకున్నాడు. రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ` ‘‘హే పరంధామా... మాధవా... మధుసూదనా... వాసుదేవా... నన్ను నీ సఖుడిగా ఆదరించి, నా కోసం వచ్చినావా ప్రభూ రాధా మనోహరా రుక్మీణీ వల్లభా... వేణు గోపాలా...’’ అంటూ స్తుతించ సాగాడు.

అదే సమయంలో బయట పక్షుల కిలకిలారావాలకు చట్టున మెలకూ వచ్చేసింది. కల నుంచి బయట పడి కళ్ళు తెరిచాడు ధనుంజయుడు. జరిగిందంతా కలయని తెలీగానే ఆశ్చర్య పోయాడు. శిథిలాలయం గర్భ గుడిలో రాత్రి ఎక్కడ నిద్రించాడో అక్కడే ఉన్నాడతను. పక్కన నెగడు ఎప్పుడో ఆరి పోయింది. బయట వర్షం కూడ లేదు. లేచి తలుపు తెరిచి బయటకు చూసాడు. తెల్లవారింది. కాని ఆకాశంలో మబ్బులు అలాగే వుండి పొద్దు కన్పించటం లేదు. వర్షం నిలిచి పోవడంతో అడవంతా మృగ సంచారం ఆరంభమైంది. పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తున్నాయి.

అసలే కీకారణ్యం. ఆపైన పొద్దు కనబడక పోవటంతో దిక్కు తెలియటం లేదు. తన సామాన్లు సర్దుకొని అశ్వం మీద వేసి అశ్వాన్ని బయటకి తీసుకొచ్చాడు. సోరకాయలో మిగిలిన నీళ్ళతో ముఖం కడుక్కుని దొరికిన ఫలాలు తిన్నాడు. ఎందుకైనా మంచిదని అల్లెతాడు బిగించి విల్లును సిద్ధం చేసి భుజాన తగిలించుకుని అశ్వాన్ని అధిరోహించి ముందుకు అదిలించాడు. ఆలయ ప్రాంతం నుండి బయలు దేరింది అశ్వం.

నిన్నటి గాలి వానకు అడవంతా చిందర వందర గానూ బీభత్సంగాను వుంది. అనేక వృక్షాలు నేల కూలాయి. వృక్ష శాఖలు విరిగిపడ్డాయి. దిక్కు సంగతి అలా వుంచి ముందుకు పోడానికి వీలుగా ఒక దారంటూ కన్పించటం లేదు. ఎటు వీలుంటే అటు దారి చేసుకుని అశ్వాన్ని ముందుకు పోనిస్తున్నాడు.

సింహ శార్థూలాది కృర మృగాలకు, వృక్షాలను అధిరోహించే చిరుతలు, నల్లపులులు, ఎలుగుబంట్లకు నిలయం ఆ అడవి. ఇక గుంపుగా సంచరించే ఏనుగుల గురించి చెప్పనక్కర్లేదు. వాటి అరుపులు వినవస్తున్నాయి. కాస్త ఏమరు పాటుగా వున్నా ప్రాణహాని తప్పదు. వేయి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇంతలో`

వృక్ష శాఖల మీద పక్షలు కలకలం అధికరించింది. కొమ్మలవెంట ఏవో దూకుతున్న అలికిడవుతోంది. యధాలాపంగా అటు చూసిన ధనుంజయుడు ఉలికి పడ్డాడు.

పాములు... ఎటు చూసినా విషనాగులు.

ఒకటి కాదు రెండు కాదు.

అసంఖ్యాకమైన పాములు. వృక్ష శాఖల వెంట కన్పిస్తున్నాయి. అవి అసాధారణ విష నాగులు. వృక్ష శాఖల వెంట సంచరిస్తాయి. ఒక చెట్టు నుండి మరో చెట్టు మీదికి దూకే ఎగిరే పాములు. వీటికి రెక్కలతో పని లేదు. మడిచి వదిలిన ఉక్కు తీగలా శరీరాన్ని బిగించి వదిలి చివ్వున గాలిలో ఎగిరి దూకుతాయి. సుమారు యాభై ధనువుల దూరం వరకు అవలీలగా ఎగరగలవు. అవతల వృక్ష శాఖలను చుట్టుకొని పక్షి గూళ్ళను గాలించి గుడ్లను మ్రింగేస్తుంది.

అసలివి ఒకే ప్రాంతంలో వృక్షాలనాశ్రయించి వుండటం అరుదైన విషయం. వాటి కదలికలు అసహజంగా కన్పిస్తున్నాయి. ఎటు చూసినా వందలాది పాములు కన్పిస్తున్నాయి. అవి తనను లక్ష్యంగా చేసుకొని తన అశ్వం వెంబడే పైన కొమ్మల మీద ఎగురుతూ అనుసరిస్తున్నాయి. తనను దిగ్బంధనం చేస్తున్నట్టున్నాయి.

అవన్నీ ఒకేసారి తన మీదకు దాడి చేస్తే తనతో బాటు తన అశ్వం గరుడ కూడ ప్రాణాలతో నిలవటం కష్టం. అసలివన్నీ నిజ పాములేనా లేక ఆ రోజు లాగే ఇది కూడ నాగాల ఆటవికుల ఓజో తాంత్రిక విద్యా ప్రయోగమా! అశ్వాన్ని అదలిస్తూ ధనుంజయుడు ఆలోచిస్తుండగానే సమీప శాఖల మీద పాములు రెండు తొందరపడ్డాయి. ఇంత లావున నోరు తెరిచి బుసలు కొడుతూ పగ బట్టినట్టు కుప్పించి గాల్లోకి ఎగిరాయి.

తననే లక్ష్యంగా చేసుకుని ఎగురుతూ సూటిగా అవి తన మీదికే వస్తుండటం గమనించగానే అప్రమత్తుడవుతూ సర్రున ఖడ్గం దూసాడు ధనుంజయుడు. కన్ను మూసి తెరిచేలోన మీద పడబోతున్న పాములు రెండూ తలలు తెగి అవతల పడ్డాయి.

ఖడ్గానికి అంటిన నెత్తురు చూడగానే ఇది నాగాల ఓజో మాయ కాదని, నిజ సర్పాలని గ్రహించాడు. అంటే... వాటికవి తన మీద పగతో రావాల్సిన పని లేదు. వెనక వుండి ఎవరో వీటిని తన వైపు ప్రేరేపిస్తున్నారు. ఎవరది? నాగరాజా? ఆలోచించే వ్యవధి లేదు. చూస్తుండగానే మరో అయిదు సర్పాలను ముక్కలుగా ఖండించాడు.

ఒకటి కాదు రెండు కాదు, అడవిలోని ఈ జాతి పాములన్నీ రాత్రికి రాత్రి యిక్కడికి కేంద్రీకృతం చేయబడి వుండాలి. ఇవి తనను చుట్టు ముట్టక ముందే దూరంగా వెళ్ళిపోవాలి. ఆలస్యం చేయకుండా అశ్వం కళ్ళాలు బిగించి బలన్గా తన్నాడు.
‘‘పదరా గరుడా! క్షణం ఆలస్యమైనా మన ప్రాణాలు నిలువవు. ఈ విపత్కర పరిస్థితిని అధిగమించాలంటే నీ శక్తి చూపించాలి. పరుగెత్తూ’’ అనరిచాడు. అంతే`

యజమాని ఉద్దేశం గ్రహించినట్టు ఒక్కసారిగా ఎగిరి నాలుగు కాళ్ళమీద దౌడు ఆరంభించింది గరుడ. అదే సమయంలో సర్పాలు కూడ దాడి ఆరంభించాయి. శర పరంపరలా వృక్ష శాఖల నుండి దూసుకు రాసాగాయి. తన ఖడ్గాన్ని నిర్విరామంగా తిప్పుతూ వచ్చిన వాటిని వచ్చినట్టు తెగ నరక సాగాడు.

పాములకు అందకుండా`

పొదలను విరగ ద్రోసుకుంటూ`

ఇష్టం వచ్చినట్టు పరుగు తీస్తోంది అశ్వం.

తమను సమీపిస్తున్న ఎగిరే పాముల్ని గాలిలో వుండగానే తన ఖడ్గానికి బలి పెడుతున్నాడు ధనుంజయుడు. ఒక వృక్ష శాఖల నుండి మరో వృక్ష శాఖల మీదికి అవలీలగా దాటుకొంటూ మందలు మందలుగా ఎగిరి వస్తూనే వున్నాయా విష నాగులు.  లాగి వదిలిన బాణంలా`
దూసుకు పోతూనే వుంది అశ్వం గరుడ. వెళ్తున్న దారి పొడవునా ఖండిత సర్పాల నెత్తురుతో ఎర్ర బారుతోంది. వచ్చేవి వస్తూనే వున్నాయి, చచ్చేవి ఛస్తూనే వున్నాయి. శరీరాలు ముక్కలయినా కూడ కొన్ని సర్పాలు ప్రాణాలు శిరస్సున వుంచుకొని గుర్రం వెళ్తున్న మార్గాన్ననుసరించి నేలమీద నెత్తురొడుతూనే భీకరంగా బుసలు కొడుతూ పాకి వస్తూనే వున్నాయి.

అయినా సరే`

పగ సాధించే తీరుతాం అన్నట్టుగా.

గుర్రం వేగంతో సమంగా వృక్ష శాఖల వెంట దండెత్తి వస్తున్నట్టుగా ఎగిరెగిరి దూకి తరుముకొస్తూనే వున్నాయా పాములు.
ఇంతలో ఎగువన`

మరో ప్రమాదం పొంచి వుండటం గమనించాడు ధనుంజయుడు. అక్కడో శాలి వృక్షం శాఖల మీద మాటు వేసి కూచునుందో నల్ల పులి.
అతి ప్రమాద కరమైన ఆ పులి వున్న చెట్టు వైపే దౌడు తీస్తోంది అశ్వం. చుట్టూ దట్టమైన వృక్షాలు లతలు, పొదల కారణంగా అశ్వాన్ని మరో పక్కకు మళ్ళించే అవకాశం కూడ అక్కడ లేదు. కొద్ది క్షణాలు ఏం చేయాలో తోచలేదు ధనుంజయునికి. ఎగువన`
వృక్ష శాఖల మీది నల్ల పులి అప్పటికే అశ్వాన్ని గమనించింది. వేట కోసం దూకటానికి సిద్ధపడుతోంది.

విల్లుకు బాణం సంధించే సమయం గాని, అవకాశం గాని ధనుంజయునికి లేదు. అటు చూస్తే ఒకటీ అరా ఇంకా పాములు దూకుతూనే వున్నాయి. అశ్వం పిడుగు పాటులా దూసుకు పోతూనే వుంది. వెంటనే ఖడ్గాన్ని ఎడమ చేతిలోకి మార్చుకొని తిప్పుతూ కుడి చేత్తో శూలం అందుకున్నాడు. చూస్తూండగానే వృక్షాన్ని సమీపించింది అశ్వం. కొమ్మ పైన మాటు వేసిన నల్ల పులి కూడ దూకడానికి సిద్ధంగా వుంది. అదే సమయంలో జీను మీద లేచి గురి చూసి బలంగా శూలాన్ని విసిరాడు ధనుంజయుడు.

అతడి గురి తప్పదు.

గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్ళిన శూలం సూటిగా పోయి నల్లపులి గుండెల్ని చీల్చుకుంటూ దిగబడింది. బాధతో భీకరంగా గాండ్రిస్తూ విలవిలా తన్నుకొని దబ్బున కింద పడింది. క్షణాల్లో దాని ప్రాణాలు ఎగిరి పోయాయి. ఈ లోపల అశ్వం పులిని దాటేసింది. ధనుంజయుడు అశ్వం పైనుండి వంగి లాఘవంగా తన శూలాన్ని లాక్కున్నాడు. పులిని కొంత దూరం లాక్కొచ్చి వదిలింది శూలం. ఈ సారి ఓ చేత్తో ఖడ్గాన్ని, ఓ చేత్తో శూలాన్ని తిప్పుతూ వచ్చిన పాముని వచ్చినట్టు తెగటార్చుతూ అశ్వాన్ని ఇష్టానికి వదిలేసాడు. మరి కొద్ది సేపట్లోనే సర్పాలు క్రమంగా వెనక బడ్డాయి. అశ్వం ముందుకు పోతూనే వుంది. దాని వేగం మందగించ లేదు. గిట్టల శబ్ధం కొండ గుట్టల వెంట అడవిలో ప్రతిధ్వనిస్తోంది.

అదే సమయాన`

మరో శబ్ధాన్ని కూడ పసి గట్టాయి ధనుంజయుడి చెవులు. తనకు ఎడం పక్కగా చెట్టు పుట్ట వెనక జరజర పాకుతూ ఏదో వేగంగా వస్తున్న శబ్ధం. చాలా సేపటి వరకు శబ్ధం విన్పిస్తూనే వచ్చింది. కాని ఆకారం మాత్రం కన్పించ లేదు. ఎందుకైనా మంచిదని కళ్ళాలు బిగించి అశ్వాన్ని దౌడుతీయిస్తున్నాడు. ఎంత దూరం అలా ముందుకు సాగి పోయాడో తెలీదు గాని అడవి కాస్త పల్చబడి రాతినేల ప్రాంతాన్ని సమీపిస్తుండగా అప్పుడు... అప్పుడు కన్పించిందా ఆకారం. దాన్ని చూడగానే ఉలికిపడ్డాడు.

జీవితంలో ఎన్నడూ చూడని`

ఒక అరుదైన దృశ్యాన్ని చూస్తున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika