Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue143/403/telugu-serials/vedika/vedika/

నా అమెరికా ప్రయాణంకి, మూడునెలల వ్యవధి ఉంది.   

నా కోసం  ‘నట్టువాంగం’ శిక్షణ  ఏర్పాటు చేసింది అమ్మ.  జతులు చెప్పడం నాకు కష్టం కాదు.  అయినా, అమరేశ్వర్ మాస్టారి అజమాయిషీలో, తాళం తప్పకుండా జతులు చెప్పడంతో,  మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.....  

అమెరికా వెళ్ళాక, నృత్యంలో శిక్షణ ఇవ్వడానికి నాకు కావలసిన మ్యూజిక్ సమకూర్చే పనిలో ఉంది అమ్మ.  ఆ రికార్డింగ్...కూడా ఇంకా చేయ వలసి ఉంది.  

మరో పక్క, విడుదలకి సిద్దమవుతున్న మా ‘మౌనగీతం’ మూవీ ప్రొమోషన్ తో,  కూడా బిజీ అయిపోయాను.  

ఎంత బిజీగా ఉన్నా -  జగదీష్ తో నా అనుబంధం, జరగవలసిన మా నిశ్చితార్దం, నా ప్రేమని త్యాగం చేయమంటూ భూషణ్ అంకుల్ చేసిన అభ్యర్దన నా ఆలోచనల్లో, నిత్యం మెదులుతూనే ఉంటాయి....  

** 

రాణి విషయంగా, మీడియాలో గొడవ జరిగాక, నలుగురిలోకి రావడమే మానేసిన భూషణ్ అంకుల్, ఇప్పుడిప్పుడే ఓ కొత్త ఉత్సాహంతో వ్యవహరిస్తున్నారు.   

నా అమెరికా పర్యటన సందర్భంగా, టూర్ వివరాలు అనౌన్స్ చేయడానికి, ప్రెస్-మీట్ ఏర్పాటు చేసారు. 

‘చంద్రకళ అభినందన సభ’ అన్న అందమైన ఆహ్వానాలు పంచారు... మీడియా కవరేజ్ భారీగా ఉండేలా సిటీ అంతా ఆహ్వానాలు వెళ్ళాయి...   

**   

ప్రెస్-మీట్ చాలా హంగామాగా మొదలయింది....  

మేళ-తాళాలతో,  ప్రత్యేకంగా ఏర్పాటయిన ‘వేదిక’ పై వరకు, ఎర్రని  తివాచిపై, నన్ను  నడిపించారు... వేద పఠనం నడుమ, సత్కరించి, ఆశీర్వదించారు.  అభినందనలు తెలియజేసారు...  

అంకుల్ ని అంత ఉత్సాహంగా, చూడ్డం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.   ఆయన అలాగే కొనసాగాలని మనసులోనే దేవుణ్ణి ప్రార్ధించాను. 

నా గురించి నాలుగే నాలుగు వాఖ్యాలు మాట్లాడుతానంటూ, మైక్ ముందుకు వచ్చారు అంకుల్. 

క్షణం సేపు నా వంక తదేకంగా చూసి మాట్లాడ్డం మొదలు పెట్టారు... 

“చిరంజీవి చంద్రకళని అభినందించి సత్కరించుకోగలగడం మన అదృష్టం.  నిజం చెప్పాలంటే, కళా రంగంలో నేను సాధించిన విజయాల్లో- నాకు మంచి అనుభూతినిచ్చి, నాకెంతో గర్వకారణమైనది,  కళాకారిణిగా చంద్రకళ ఎదుగుదలే.   

చంద్రకళ మా పట్ల, సొంత బిడ్డలా మెలుగుతూ ఆప్యాయతలు పంచుతుంది కూడా.  ఆమె ఇలాగే  సంతోషాలు పంచుతూ , కళా రంగాన అనుకున్నది సాధిస్తూ, సుఖంగా ఉండాలని కోరుకుంటాను,” అంటూ ముగించారు అంకుల్...  

లేచి, అయన పాదాలంటి నమస్కరించాను. 

ప్రత్యేక వక్తగా – తమ్ముడు వినోద్, నా గురించి మాట్లాడుతూ, మధ్య మధ్యలో నా పై ఫిర్యాదులు చేస్తూ, అందరినీ నవ్విస్తూ చక్కగా ప్రసంగించాడు.  

నీరూ ఆంటీ చేయూతతో, కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు, భూషణ్ అంకుల్.   

అల్పాహార విందుతో, మీట్ ముగిసింది... 

** 

అమెరికా ప్రయాణం మూడు రోజులుందనగా,  అంకుల్ వాళ్ళతో కాస్త సమయం గడపాలనిపించింది.  స్టూడియోలో పనయ్యాక, వచ్చి కలుస్తానని వారికి తెలియజేసాను...  

నా రాక, నా మాట అంకుల్ కి ఊరటనిస్తాయన్న నీరూ ఆంటీ మాటలు గుర్తు చేసుకుంటూ, స్టూడియో నుండి, వాళ్ళింటి వైపు కారు మళ్ళించాను... 

రద్దీగా ఉన్న రోడ్డుపై నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్ తో పాటే నేను.....  

రేడియో వాల్యూం తగ్గించి, కారు అద్దాలు క్రిందికి దించాను... 

వారం క్రితం, రాం మామయ్యా, మణత్తయ్య వచ్చి వెళ్ళడాన్ని గుర్తు చేసుకొన్నాను.  పని వత్తిడి వల్ల,  వాళ్ళతో నేను ఎక్కువ సమయం గడపలేక పోవడం బాధగా అనిపించింది.... ఉన్న రెండు రోజులూ, వారు, నా పట్ల ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మెలగడం ... చాలా ఆనందాన్నిచ్చింది. 

ఎలాగైనా, మరీ ఆలశ్యం కాకుండా, మా వివాహం జరిపించాలని కూడా అమ్మ వాళ్ళతో ప్రస్తావించారు వాళ్ళు.  

నాకు సెండాఫ్ ఇవ్వడానికి జగదీష్ వచ్చినప్పుడు కూడా, పెళ్లి  విషయం చర్చించమని మరీ మరీ చెప్పి వెళ్ళారు అత్తయ్యా వాళ్ళు.  

ఇలా ఆలోచిస్తూనే, అంకుల్ వాళ్ళ ఇంటి వరకు వచ్చేసాను... 

బయటే పార్క్ చేసున్న రాణి కారు వెనుకే, నా కారు పార్క్ చేసాను.  

అప్పుడప్పుడు  తారస పడినా, రాణి మునుపటి కన్నా కూడా నాతో ముభావంగా ఉంటుంది’ అనుకుంటూ కారు దిగి, గేటులో నుండి, ఇంట్లోకి నడిచాను.. 

ఆంటీ,అంకుల్  ఇద్దరూ సిటింగులోనే ఉన్నారు... వెళ్లి ఎదురుగా కూర్చున్నాను.   

తలొంచుకుని పేపర్స్ రాసుకుంటున్న అంకుల్ తలెత్తి చూసారు. 

“రామ్మా కళా, నీ పని మీదే ఉన్నాను.  అమెరికాకి వెళ్ళిన ఆరు నెల్లకి, మళ్ళీ నువ్వు ఇండియాలో అవార్డ్ అందుకోడానికి వచ్చేయాలి,” అన్నారు చేతిలోని పేపర్స్ పక్కకి పెడుతూ.  అర్ధం కాలేదన్నాను... “ఇంకా అమెరికా వెళ్ళనే లేదు.  అప్పుడే తిరిగి రావడం గురించి మాట్లాడుతున్నారే..  

మీరేమంటున్నారో  అర్ధమయ్యేలా చెప్పండి,” నవ్వుతూ ఆంటీ ... 

“నిజమే కదా!” పెద్దగా నవ్వారు అంకుల్... 

“కళకళలాడుతూ వచ్చి, కిలకిలా నవ్వుతూ మనతో కబుర్లాడి, మన గుబుళ్లు దూరం చేసే చంద్రకళ, దూర దేశం వెళ్ళిపోతుంది అంటే దిగాలుగా ఉంది కదా! అందుకే, అప్పుడే అమ్మాయి తిరిగి రావడం గురించి ఆలోచిస్తున్నాను,”  అన్నారాయన, తలెత్తి నా వంక సూటిగా చూస్తూ..   

“మీ ఆలోచన బాగుంది... దానికి మీ ప్లాన్  కూడా చెప్పండి,”  అంది ఆంటీ.   

“చెప్పండి అంకుల్, వెళ్ళక ముందే, మళ్ళీ వచ్చేసే టైం ఎలా ఫిక్స్ చేస్తున్నారు?” నవ్వుతూ అడిగాను, పని పిల్ల తెచ్చిన ‘టీ’ అందుకుంటూ...... 

“ఏం లేదమ్మా,  ‘మౌన గీతం’ సినిమాలో నీ పర్ఫార్మెన్స్ కి, కనీసం ఫిల్మ్ ఫేర్ వారి ‘క్రిటిక్స్ అవార్డ్’ వస్తుందని, నా అభిప్రాయం.  ఆ సబ్జెక్ట్ అటువంటిది. 

పోతే, గ్యారంటీగా మాత్రం, ప్రభుత్వం వారి  ప్రతిష్టాత్మక ‘హంసిని’ అవార్డు, నిన్నే వరిస్తుంది.  దానికి, నేను నామినేషన్ పంపుతున్నాను...  కళారంగంలో నీ కృషికి, ఆ అవార్డు అందడంలో, ఇప్పటికే ఆలస్యం అయింది..  ఈ అవార్డులు ప్రకటించడానికి  ఆరునెల్ల టైం ఉంది.  అదీ సంగతి,”  వివరించారాయన. 

ఆయన ఇంకా నా ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నందుకు ఆశ్చర్యమనిపించింది.

“ఇంకా కూడా మీరు నా గురించి ఇలా ఆలోచిస్తూనే ఉన్నారు,”  అన్నాను కృతజ్ఞతతో.... 

“భలే పిల్లవే, అది నా డ్యూటి.  నీ అభివృద్ధి నా ఆశయం కదా తల్లీ... అంతేకాక, మా శ్రేయస్సు  కూడా నీ చేతుల్లో ఉంచి, నీకు అదనపు భారమయ్యాము కూడా,” అంటూ వాపోయారాయన... 

“అలా అనకండి అంకుల్.  మీరు సంతోషంగా ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.  అన్ని విషయాలు సర్దుకుంటాయి..మీరే చూస్తారుగా,” నమ్మకంగా పలికాను. 

గుండెల మీద చేయుంచుకొని, తలాడించారు అంకుల్..  “పదమ్మా కాస్త ఏమన్నా తిందాము... నాకు ఆకలిగా ఉంది.  ఆంటీ నీకిష్టమైన టిఫిన్లు చేయించింది,” అంటూ పైకి లేచారు. 

డైనింగ్ లోకి వారిని అనుసరించాను.... 

నాకిష్టమని, అటుకుల ఉప్మా, దహీవడ చేయించుంచింది, ఆంటీ... 

ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటూ,  టిఫిన్లు ఎంజాయ్ చేసాము. 

మరి కాసేపు కూర్చుని, మళ్ళీ  అమెరికా నుండి తిరిగొచ్చాకే వారింట భోంచేస్తానంటూ, వారి వద్ద సెలవు తీసుకున్నాను.. 

** 

ఢిల్లీ నుండి వస్తున్న జగదీష్ ని పికప్ చేసుకోడానికి నాన్న ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు. 

నేను ప్యాకింగ్ చేసుకుంటుంటే, నా బెడ్ మీద కూర్చుని... బట్టలు మడతలు వేయసాగింది అమ్మ. 

ఓ పక్క నా భవిష్యత్తు గురించి సంతోషంగా ఉన్నా, మరో పక్క ఒకింత దిగులుగా కూడా ఉందామె... 

కోటమ్మత్త కూడా అదే తంతు.    వినోద్ మాత్రమే హ్యాపీగా ఉన్నాడు... తన మీద కన్నేసి ఉంచే  అక్క డిటెక్టివ్,  ఏకంగా ఇండియా నుండే వెళ్ళిపోతుందనట....... 

ప్యాకింగ్ ఫినిష్ చేసాక, నా టి.వి ప్రొడ్యూసర్స్ కి, గురువు గారికి, సెల్వన్ సార్ కి ఫోన్లు చేసి, వీడ్కోలు చెప్పాను.  

ఫోను పెట్టేసి వెనక్కి తిరిగేప్పటికి, ఎదురుగా జగదీష్, వెనుకే నాన్న..... 

** 

రెండు రోజుల పాటు జగదీష్ కబుర్లతో సందడిగా గడిచింది.... 

తను కొత్తగా నేర్చుకున్న కర్రీస్ కూడా చేసాడు... అంతా మెచ్చుకుంటూ తిన్నారు కూడా... 

నాకిష్టమని, పాయసం చేయడం నేర్చుకున్నానన్నాడు.... 

తన కాబోయే అల్లుడు ఇంత బాగా వంట చేయడాన్ని మెచ్చుకుంది అమ్మ.  

ఇక మరునాడు నా ప్రయాణమనగా,  సాయంత్రమయ్యాక,  అమ్మవారి గుడికి వెళ్ళొచ్చి, భోంచేసాము.   

అందరం మాట్లాడుతూ హాల్లో కూర్చునుండగా, అంకుల్, ఆంటీతో పాటు రాణి కూడా వచ్చింది..  

ఎన్నడూ లేనిది, చాలా సంతోషంగా నా వద్దకు వచ్చి నా చేయందుకుంది రాణి.... 

“హార్టీ కాంగ్రాచ్యులేషన్స్.   ఈ అమెరికా అసైన్మెంట్ ఒప్పుకుని నీ కెరియర్ ని మరో లెవెల్ కి తీసుకెళుతున్నావు...బెస్ట్ విషస్,” నా పక్కనే కూర్చుంటూ రాణి.... 

అమ్మ వంక చూసాను... నాకు కలిగిన ఆశ్చర్యాన్ని బయటకి తెలియనీయకుండా  రాణికి ‘ధన్యవాదాలు’ చెప్పాను. 

మునుపెన్నడూ లేని ఆప్యాయత చూపిస్తూ కబుర్లు చెప్పసాగింది... 

కాసేపటికి, పైకి లేచి నా చేయందుకుంది... 

“పద, వచ్చే ముందు అందరికీ ఐస్ క్రీం ఆర్డర్ చేసాను.  వెళ్లి పికప్ చేద్దాము... 

నీకు స్పెషల్ గా ‘మాంగో కసాట’  కూడా చెప్పాను....  మళ్ళీ ఎప్పుడు తినగలవో... మా పార్లర్ లోని ‘మాంగో కసాట’,” నన్ను బయటకి నడిపిస్తూ రాణి..

“మేము వెళ్లి పికప్ చేస్తాముగా!” ఆఫర్ చేసాడు జగదీష్ 

“నో, నో, దగ్గరేగా, పది నిముషాల్లో వచ్చేస్తాము.  ఇది మా ‘గర్ల్స్ టైం’,” నా చేయి విడువకుండానే ముందుకి కదిలింది రాణి... 

“నేను కూడా వద్దా?  .. అయితే, నాకు మాత్రం ఎక్స్ ట్రా  ఆర్డర్ ‘బనానా స్ప్లిట్’ తీసుకురండి,” వెనుక నుండి వినోద్... మాకు వినబడేలా... 

** 

మామూలుగా వెళ్ళే దారిన కాకుండా, కారుని హైవే దిశగా తిప్పింది... 

“విషయం ఏమిటి? రాణి... నాతో ఏమన్నా మాట్లాడాలా? “ అడిగాను... 

“ఔను, నీతో మాట్లాడే అవకాశం ఇదేనని అనిపించి, అమ్మా వాళ్ళని మీ ఇంటికి బయలుదేరదీసిందే నేను.  లేదంటే,  నీ ఫ్లైట్ రేపు సాయంత్రం కనుక, పొద్దున్నే వద్దామనుకున్నారు వాళ్ళు.  రేపు నేను బిజీ.  అందుకే ఇలా,” అంది జవాబుగా..... 

“సరే, విషయం చెప్పు,” కాస్త అసహనంగానే నేను... 

“చూడు కళా, నీవంటే, జగదీష్ కి చాలా ప్రేమని నాకు తెలుసు.. అలాగే, నీవంటే మా నాన్నకి కూడా ప్రేమే..  ఇప్పటివరకు, వారిద్దరు నీకు చేయని సాయం లేదు...నీ సంతోషం కోసం వారు పడని పాట్లు లేవు. 

ఇక ఇప్పుడు, వారి సుఖ సంతోషాల గురించి,  నీవు, ఆలోచించవలసిన సమయం వచ్చింది... 

మా నాన్నావాళ్ళ సుఖసంతోషాలంటావా!  అవి కేవలం నా బాగోగుల మీద ఆధారపడి ఉంటాయి.  నేను సుఖంగా, సంతోషంగా ఉంటేనే, వారు బాగుండేది...  

ఇకపోతే, మన జగదీష్ విషయం.... 

అతనికి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖ సంతోషాల్ని అందించ గల ఏకైక వ్యక్తిని నేను.. అతని  అదృష్టమేమో గాని, పేరు, పరపతి, హోదా అందం అన్నీ ఉన్న నేను, తన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను.  

ఇదంతా కాక, ఈ క్షణాన మా మెడికల్ ఇన్స్టిట్యూట్ కి అతన్ని అధిపతిని చేయగలను...,” క్షణం సేపు పక్కకి తిరిగి నా వంక చూసి, తిరిగి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టింది. 

రాణి గుణం, అతిశయం తెలియంది కాదు.  అయినా,  ఆమె మాటలు నాకు తూటాల్లా తగిలాయి...ఇంకా ఏం వినాలో, ఏమనాలో తెలీడంలేదు. 

ఇంతలో, మళ్ళీ నోరు విప్పింది రాణి... 

“...మా అమ్మా వాళ్ళ పట్ల కాని, జగదీష్ పట్ల గాని నీకు నిజంగా ప్రేమ, దయ ఉంటే,  జగదీష్ ని వదులుకో.  జగదీష్ నా వాడైతే,  అతనే కాదు, నీ భూషణ్ అంకుల్, ఆంటీ కూడా సుఖంగా ఉంటారు.... అదీకాక, ఇప్పటికైనా వాళ్లకి  నీనుండి  విముక్తి  కల్పించు.. అదే అందరికీ మంచిది,” దురుసుగా రాణి.... 

 కొద్ది క్షణాలు మౌనంగానే ఉన్నాను... ఎక్కువసేపు తమాయించుకోలేక పోయాను... 

“చూడు రాణి... నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.  ఇతరుల ఇష్టాయిష్టాలు, సుఖ సంతోషాలు నీ గుప్పిట్లో ఉన్నాయనుకోడం, ఇతరుల జీవితాలని శాసించాలనుకోవడం సరయనవి కావు... నీ దృక్పథంలో మార్పు రావాలని కోరుకుంటాను... 

నా విషయంగా అంటావా? ఔను మా బావ, మీ నాన్న కూడా నాకు ఎంతో కావలసిన వాళ్ళు..  

వీరితో  నాకున్నవి సత్సంబంధాలు.  గౌరవం – ఆప్యాయత – అవగాహనలతో  కూడుకున్నవి.  ఇకపోతే నా జీవితం ఎలా నడవాల్సి ఉందో, అలాగే జరుగుతుంది,” అన్నాను ధృడంగా. 

“ఇక చాలు కళా.  నీ ఉపన్యాసాలు వినే ఓపిక లేదు నాకు. వొళ్ళు మండుతుంది నీ మాటలు వింటుంటే... నేనేమంటున్నానో  నీకు తెలుసు.  నాకేం కావాలో కూడా నీకు తెలుసు. 

అదీగాక,  ఇప్పుడు నీకైనా ఏం తక్కువని.  గారెల బుట్టలో నుండి తంతే, బూరెల బుట్టలో పడ్డట్టు,  అమెరికాకి వెళ్ళే చాన్స్ సంపాదించేసావు  కదా,” అక్కసుగా రాణి.... 

“కాబట్టి, అక్కడే ఎవరినన్నా పెళ్లి చేసుకొని, సెటిల్ అయిపో... ,” పార్లర్  ఎదురుగా సడన్  బ్రేకుతో కారుని పార్క్ చేసి, దిగి విసురుగా  పార్లర్ లోనికి వెళ్ళింది. 

** 

పార్లర్ నుండి ఇంటికెళ్ళేప్పుడు, ఇద్దరం మౌనంగా ఉండిపోయాము.  షార్ట్-కట్ లో, ఐదు నిముషాల్లో ఇల్లు చేరాము.  

అందరికీ తను తెచ్చిన ఐస్క్రీం కప్స్ అందించి, ఈ సారి జగదీష్ పక్కన కూర్చుంది రాణి... 

అందరూ సరదాగా మాట్లాడుతూ, ఐస్ క్రీం తింటున్నారు.  నాకెంతో ఇష్టమైన ‘మాంగో కసాటా’ మాత్రం చేదుగా అనిపించి, గొంతు దిగడం లేదు.  మరునాడు నా సెండాఫ్ కి, తప్పక రమ్మంటూ, మా ఎదుటే, జగదీష్ రాణిని వొత్తిడి చేయడం, నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. 

మరి కాసేపటికి, వీడ్కోలు చెప్పి వాళ్ళు వెళ్ళాక, “ఆ అమ్మాయి ప్రవర్తన, ఏ నిముషంలో ఎలా ఉంటుందో చెప్పలేము, అలాంటి ఆమెని ఎయిర్ పోర్ట్ కి రమ్మని ఎందుకు బాబూ బలవంతపెట్టావు?” జగదీష్ ని అడిగింది కోటమ్మత్త.

“ఆ అమ్మాయి తన ప్రవర్తన మార్చుకుంటుందని, పిన్ని.   

మొండితనం, అసూయ, ఆవేశం తగ్గించుకుంటుందని ఓ ప్రయత్నం,” అన్నాడు జవాబుగా..... 

రాణి ప్రవర్తన మెరుగు పరచడం, జగదీష్, తన బాధ్యతగా అనుకుంటున్నాడని అర్ధమయింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali