Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

కడలి

 

 గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue143/404/telugu-serials/kadali/kadali/

సత్యవతి ఈ పాటికి వంట గదిలో వుంటుందని ఊహిస్తూనే హాల్లోకి నడిచాను.

నేననుకున్నట్టే చంద్ర వచ్చేసరికి సత్యవతి మా ఇద్దరికీ ప్లేటులో జంతికలు, టీ కప్పులు తెచ్చి పెట్టింది.

చంద్ర వచ్చి నా పక్కన సోఫాలో కూర్చుని కప్పందుకున్నాడు.

" బ్యాక్ యార్డ్ లో కూర్చుందాం పద " అంటూ జంతికల ప్లేటు తీసుకుని బ్యాక్ యార్డ్ వైపు నడిచాను.

" వెంటనే ఈ విషయం  శేషుకి చెప్పాలి. ఫోన్ చేద్దామా? " కేన్ ఛెయిర్ లో వాలుతూ అన్నాడు చంద్ర.

అతని ఉత్సాహం చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. "ముందు పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా నువ్వింతగా ఎగ్జైట్ అవడం బాగేదు చంద్రా! ఇవాళ సహస్ర కి చెప్పి దాని అభిప్రాయం తెలుసుకోవాలి ఆ తరువాతేగా ఎవరికైనా చెప్పేది. అయినా, శేషుతో మాట్లాడదాం చాలా రోజులైంది కూడా.. వాడికెలాగా అక్కా, బావలు గుర్తు రారు.. మనం గుర్తు చేద్దాం..అన్నాను.

"మీ తమ్ముడు మిలీనియర్, మనం చాలా మామూలు వాళ్ళం.. అతనికి మనం కనిపించకపోడంలో అర్ధముంది." అన్నాడు చంద్ర.

"మిలీనియర్ అయినా, మల్టీ మిలీనియర్ అయినా వాడు నా తమ్ముడు.. ఆ తరువాతే ఏదైనా " అంటూ ఫోన్ తీసుకుని నెంబర్ కలపసాగాను. వాయిస్ మెయిల్ కి వెళ్ళింది.

"దొర గారు బిజీగా వున్నట్టున్నారు వాడే చేస్తాడులే.. వాడి చెవిలో విషయం వేసి , వీలైతే ఆ కుర్రాడి ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమందాం" అన్నాను.

చంద్ర నా వైపు నిరుత్సాహంగా చూస్తూ సందేహంగా అన్నాడు " సహస్ర ఒప్పుకోదంటావా? ఇంత మంచి సంధం ఒప్పుకోదా? " నేనన్న మాటలు అతని మనసులో బలంగా పడిపోయాయనిపించింది.   

చిరునవ్వుతో అన్నాను. "ఒప్పుకోదని అన్నావా? దానికి చెప్పాలి కదా."

" నిజమేలే ఏంటో అశోక్ తో మాట్లాడిన దగ్గర్నుంచీ నాకు ఒళ్ళు తెలియడంలేదు."

"ఎందుకు అమెరికా సంబంధం అనా" ఉడికిస్తూ అన్నాను.

"అమెరికాలో వుండడం కాదు సమ్యూ! దానికేముంది ఎవరు బడితే వాళ్ళు వెళ్తున్నారు అమెరికాకి. అది కాదు విషయం కుర్రాడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం , మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, అశోక్ నా స్నేహితుడు, వాడెలా వుంటాడు బాలీవుడ్ హీరోలా వుంటాడు వాడి భార్య కూడా సినిమా స్టార్ లా వుంటుంది. ఖచ్చితంగా కుర్రాడు అందగాడై వుంటాడు పైగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనమ్మాయిని ఎలా చూసుకుంటారో అనే దిగులు వుండదు."

"చంద్రా డోంట్ బీ సో ఎగ్జైటెడ్ నీ వాలకం చూస్తుంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి నిశ్చయ తాంబూలాలు తీసుకునేలా వున్నావు. దాంతో మాట్లాడాక మిగతా విషయాలు ఆలోచిద్దాం సరేనా? ఈ విషయం పక్కన పెట్టి ఇవాళ ఇంకా విశేషాలేంటో చెప్పు. "తనని ఆ మూడ్ నుంచి బైటకి తీసుకు రావడానికి మాట మార్చాను.

"చంద్ర ఛెయిర్ లో వెనక్కి వాలి పెదవి విరుస్తూ అన్నాడు." ఏముంది సాఫ్ట్వేర్ ఉద్యోగం లో ? నీలాగా రోజొక కొత్త జీవితం కనిపించదు కదా."

చంద్ర అనేది నిజం అనిపించింది. అంతేగా రోజొక కొత్త కేసు, రక రకాల సమస్యలు, రక రకాల మనుషులు, మనస్తత్వాలు.. నిట్టూరుస్తూ అన్నాను, కాలం మారిందంటే ఏంటో అనుకున్నా కానీ నాలుగు పాదాల ధర్మానికి కొన్ని వందల, వేల కాళ్ళూ, చేతులూ వచ్చి అడ్డ దారుల వెంట పాక్కుంటూ ఎటో వెళ్ళిపోతోందనిపిస్తోంది." చంద్ర ఆసక్తిగా చూసాడు.

చందూ! నేనింతవరకు టేకప్ చేసిన కేసుల్లో కనీసం వంద పైగా విడాకుల కేసులుండి వుంటాయి. నేను విడాకులు ఇప్పించినవి పాతిక మిగతా వాళ్ళందరిదీ చాలా సిల్లీ సమస్యలుగా తేల్చేసి కోర్టు గుమ్మం ఎక్కకుండానే కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కలిపాను. కానీ , రాను రానూ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా చిన్న సమస్యలు అత్యంత క్లిష్టమైనవిగా, హేయమైనవిగా మారిపోయి ఖచ్చితంగా విడాకులిప్పించాల్సిన పరిస్థితికి నన్ను లాక్కెళుతున్నాయి.

నా మాటలకి చందూ సాలోచనగా తలాడిస్తూ అన్నాడు. " అసలా అమ్మాయి వాడికి తన ప్రేమ కథ చెప్పకుండా వుంటే బాగుండేది పిచ్చిపిల్ల..

అమాయకత్వం.. అతనేదో ఈ అమ్మాయి నుంచి రహస్యం రాబట్టడానికి గేం ప్లాన్ చేసి నా కాలేజ్ రోజుల్లో నేనో అమ్మాయిని ప్రేమించాను. ఆమె లేకపోతే జీవితం లేదనుకున్నాను కానీ, తను హ్యాండిచ్చింది. ఇప్పుడనిపిస్తోంది నా ప్రేమ ఫేయిల్ అవక పోయివుంటే నువ్వు నా జీవితం లోకి వచ్చేదానివా? అని చెప్పాట్ట.

అయ్యో నా మొగుడు ఇంత నిజాయితీగా వున్నప్పుడు నేను నా ప్రేమ కథ దాచడం మోసం చేయడం కదా అనుకుని ఈ పిచ్చిది చెప్పేసింది.. నేనూ ప్రేమించాను.. అతని కులం, అంతస్థు మాకు తూగవని మా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు అని. అంతే టార్చర్ స్టార్ట్.

" సో వాట్ ? పెళ్ళి కాక ముందు జీవితం ఆమె స్వంతం అప్పుడు. ఎవరినైనా ప్రేమించవచ్చు. ఏ కారణం చేత పెళ్ళి కాకపోయినా ఇప్పుడు ఆ కారణం గా టార్చర్ పెట్టడం మీనిన్గ్ లెస్? అయినా ఈ పెద్దవాళ్ళ చాదస్తాలకే సగం అమ్మాయిల జీవితాలు బలయ్యేది" విసుగ్గా అన్నాడు.

ఆ తరువాత నుంచీ అమ్మాయికి అసలు క్యారెక్టర్ అంటే ఏంటో తెలియనట్టు, ఎవర్నీ బడితే వాళ్ళనే ఆమె మోహించేస్తున్నట్టు ఎవరితో మాట్లాడినా అనుమానమంట.. బైటకి తీసికెడితే ఎవర్నీ చూడొద్దంటాడంట. ఒకటి కాదులే నీకిస్తాను కేసు చదువు. కొన్ని రోజులు ఆ అమ్మాయి వీసా, పాస్ పోర్ట్ మాయం చేసి, తల్లి తండ్రులతో కమ్యూనికేషన్స్ స్టాప్ చేసి టార్చర్ పెట్టాట్ట. తరువాతెవరో అతని స్నేహితుడే ఇంటికి వచ్చి ఈ అమ్మాయి పరిస్థితి గమనించి విషయయం అడగడం తో చెప్పింది. అతని సాయం తో పాస్ పోర్ట్ వెతికి తెచ్చుకుంది.

"నీ దగ్గరకు ఎలా వచ్చారు వీళ్ళు?"

నాకు తెలిసినావిడ ఆ అమ్మాయిని , ఆ తల్లి, తండ్రులని నా దగ్గరకు తీసుకొచ్చింది. పైగా వాళ్ళు వాళ్ళబ్బాయి తప్పేం లేదని ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాక పారిపోయి వచ్చిందని ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

చంద్ర మొహం ఆవేశం తో ఎర్రబడింది. ఎంత దారుణం! " వాళ్ళని కూడా అరెస్టు చేయాలిగా " అన్నాడు పళ్ళు బిగించి.

ఆ క్షణం లో చంద్ర మొహం లో కనిపిస్తున్న ఆవేశం , ఉద్రేకం చూస్తుంటే ఆ యువకుడు అక్కడ వుంటే షూట్ చేసి పారేస్తాడనిపించింది నాకు. 

" అయినా ఆ అమ్మాయి ప్రారంభంలోనే వాడిలో శాడిజం చూడగానే యాక్షన్ తీసుకోకుండా అసలు, సిసలు భరతీయ యువతిలా ఆ భరించడాలేంటి?"  విసుగ్గా అన్నాడు.

"మన ఇండియన్ గర్ల్స్ చేసే తప్పు అదే.. తనలా వచ్చేస్తే చెల్లి పెళ్ళి కాదనో , అమ్మ గుండె ఆగి పోతుందనో, నెమ్మదిగా భర్తని దారిలోకి తీసుకు రావడం భార్య ధర్మం అనో సహనంతో భరిస్తారు. ఆ సహనం వాళ్ళనే బలితీసుకునేదాకా చేసుకుంటారు. అందరూ అంతే.. ఏవిటో ఈ అర్ధం లేని సహనం. చిన్నప్పటీనుంచీ పెద్ద వాళ్ళు ఉగ్గు పాలతో నూరి పోస్తారు నీతులు. చదువుకున్న వాళ్ళు అదే భావ జాలంతో బతుకుతారు, చదువుకోని వాళ్ళు అదే భావ జాలం తో బతుకుతారు.

చంద్ర కూడా ఆలోచిస్తూ అన్నాడు " అసలు మన దేశం లో కూడా విదేశీ సంస్కృతి వస్తే బాగుండు."

"ఏది ? పదేళ్ళు కలిసి బతికాక పదకొండో ఏడు పెళ్ళి చేసుకుని , పన్నెండో ఏట విడాకులు తీసుకునే సంస్కృతా? నవ్వుతూ అన్నాను. చంద్ర చురుగ్గా చూసాడు. " పిచ్చి చంద్రా అలా అయితే మన దేశం లో కూడా అందరూ మెటీరియలిస్టుగానే బతికేవాళ్ళు. ఎందుకీ బంధాలు, అనుబంధాలు, బాధలు, కన్నీళ్ళు. మనది సెంటిమెంటల్ సంస్కృతి అందుకే ఇంకా అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు అనే బంధాలున్నాయి."

"నీకు బాగా విడాకులు కేసులు డీల్ చేసి, చేసి అలవాటైంది ఇలాంటి వార్తలు విని తట్టుకోడం. నా రక్తం ఉడుకుతోంది తెలుసా" ఆవేశం గా అన్నాడు.

అతని చేయి చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అన్నాను.

"రిలాక్స్ చంద్రా! డాక్టర్స్ కి మృత్యువు చూడడం వృత్తి రీత్యా సహజం అయినట్టు, మా లాయర్లకి ఇలాంటి దారుణాలు తెలుసుకోవడం కూడా అంతే సహజం. నీలాగే నాకూ ఆ క్షణం లో ఆ అమ్మాయి ఒక్కోటి చెబుతుంటే రక్తం ఉడికి పోయింది. వాడిని నాలుగు రోడ్ల కూడలిలో ఉరి తీయాలన్నంత కసితో రగిలి పోయాను. కానీ, కొన్ని కేసుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలని టార్చర్ పెట్టారు.. ఎంతో మంచి వాళ్ళైన అత్తా, మామల మీద ఆస్తి కోసం గృహ హింస చట్టం కింద నేరం మోపి కట కటాల పాలు చేసిన వాళ్ళున్నారు. గృహ హింస చట్టం వచ్చాక ఎంత మంది అమ్మాయిలు దాన్ని మిస్ యూజ్ చేసారో తెలుసా! అంతా కాల మహిమ."

"ఈ సమాజం లో నీతి, ధర్మం, నిజాయితీ అన్నీ పాతేసి వాటి పైన అపార్ట్ మెంట్స్ కట్టేస్తున్నారు. ఈ చదువులు, ఆధినికత అంతా వేలం వెర్రి అయిపోయి, యువతని బురద గుంటలోకి తోసేస్తోంది. అందుకే నీ స్నేహితుడి కొడుకని చెప్పగానే నాకు నిజంగా చాలా హ్యాపీగా వుంది. ముక్కూ, మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి చేసి వాడెలా చూసుకుంటున్నాడో మనమ్మాయిని అని బెంగ పెట్టుకుంటూ బతకలేం."

ఆ మాటతో చంద్ర మిహం లో ఉత్సాహం ఎగిరి వచ్చింది.

"నిజమే సమ్యూ! అశోక్ దంపతులు చాలా మంచివాళ్ళు, వాళ్ళ సంస్కారం పుణికి పుచ్చుకుని పుట్టిన వాడు ఆ అబ్బాయి కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం సహస్ర ఒప్పుకుంటే అది చాలా అదృష్టవంతురాలన్నామాటే."

నేను మౌనం గా వుండి పోయాను. నా మనసులో ఏదో మూల చిన్న సందేహం పొడ చూపింది. సహస్ర మేము చూసిన సంబంధం నిజంగా ఒప్పుకుంటుందా? ఒక వేళ ఒప్పుకోక పోతే చంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు!

నా దృష్టి పెద్ద గోళం లా మారి పడమట వైపు జారి పోతున్న సూరూ బింబం మీదకి పడింది. ఆ కిరణాల మేలి ముసుగు కప్పుకున్న మొక్కలన్నీ బంగారు రంగులో మెరిసిపోతున్నాయి.

అర విరిసిన మల్లె మొగ్గల మీంచి మధురమైన పరిమళం వీస్తోంది.

అప్పుడే శీను మొక్కలకి నీళ్ళు పెట్టాడేమో  అప్పటి వరకూ వేడిగా ఆవిర్లు కక్కుతున్న గాలి కొంచెం చల్లగా మారింది. పెరటి వైపు వున్న వంట  గది కిటికీలోంచి సత్యవతి చేస్తున్న చపాతీల వాసన మంద్రంగా వస్తోంది.

ఇంతలో శేషు దగ్గర్నుంచీ ఫోన్ రావడం తో ఇద్దరం పోటీల మీద వాడితో మాట్లాడి సహస్ర పెళ్ళి విషయం చెప్పాం..

" ఓ కంగ్రాట్స్.. ఆ కుర్రాడి నెంబర్ ఇవ్వండి బావగారూ! ఓసారి మాట్లాడుతాను " అన్నాడు శేషు ఉత్సాహంగా.

" మీ బావగారిలా నీకూ ఉబలాటం బాగా ఉందిరా.. ముందు సహస్రకి చెప్పాలి కదా " అన్నాను.

" దాని మొహం దానికేం తెలుసే చిన్న పిల్ల " అన్నాడు శేషు.

" నేనూ అదే అంటున్నా శేషూ! " అన్నాడు చంద్ర.

" మీ బావగారి కూతురు విషయానికి వచ్చేసరికి నిర్ణయాలు మారుతున్నాయి. నువ్వు ఇలాగే మాట్లాడితే ఎలారా?"

"అంతేనే బాబూ.. ఆదర్శాలు చెప్పడానికే ఆచరించడానికి కాదు. "

" చాల్లే ఊరుకోండి ఇద్దరూ పాతికేళ్ళు వస్తున్నాయి దానికి. ఈ మాట అది విందంటే తాట తీస్తుంది? అది మోడరన్ గర్ల్ రా బాబూ! దాని అభిప్రాయం తెలుసుకోకుండా తల వంచుకుని తాళి కట్టించుకో అంటే ఊరుకోడానికి రాధ కాదు అది సహస్ర నవతరానికి ప్రతినిధి " అన్నాను.

" రాధా!.. నువ్వింకా దాన్ని మర్చిపోలేదా " అనుకోకుండా రాధ ప్రస్తావన రావడం తో వింతగా అడిగాడు శేషు.

అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాలేవన్నా ప్రస్తావనకి వస్తే రాధే గుర్తొస్తుంది అన్నాను.

ఇట్స్ ఓకే మళ్ళీ రేపో, ఎల్లుండో కాల్ చేస్తాను ఆలియా లేదు బైటకి వెళ్ళింది తను వచ్చాక మాట్లాడిస్తాలే అన్నాడు.

శేషు అమెరికన్ గర్ల్ ని పెళ్ళిచేసుకున్నాడు ఆమె పేరు ఆలియా. ఎంతో స్నేహం గా వుంటుంది. వ్భారతీయ సంప్రదాయం అంటే ఎంతో గౌరవం. శేషు కన్సర్వేటివ్ అమ్మా, నాన్న వున్నప్పుడే నాలుగేళ్ళకోసారి ఇండియాకి వచ్చేవాడు. అమ్మా, నాన్న పోయాక ఒక్కసారి వచ్చినట్టున్నాడు. ఎందుకే టికెట్స్ కి  బోలెడవుతుంది  అంటాడు రావచ్చు కదరా అంటే. వాడికిద్దరు పిల్లలు.. ఇద్దరూ ఆడపిల్లలే.. పూర్తిగా అమెరికన్ లైఫ్ స్టైల్.

శేషు తో మాట్లాడడం అయాక ఇద్దరం లోపలికెళ్ళిపోయాం. చంద్ర టీవి ఆన్ చేసుకుని సోఫాలో సేటిల్ అయాడు. నేను సత్యవతి గారు ఏం చేస్తుందో చూడడానికి కిచెన్ లోకి వెళ్ళాను.

మర్నాడు శనివారం.. సహస్ర షూటింగ్ నుంచి రాత్రి బాగా పొద్దుపోయి వచ్చిందేమో ఇంకా నిద్ర లేవ లేదు.

చంద్ర ఆఫీసు లేదు నాకూ కోర్టుకి వెళ్ళే పని లేదు. కానీ, వేరే పని మీద బైటకి వెళ్ళాలి.. బ్రేక్ ఫాస్ట్ తినేసి చంద్రకి గంటలో వస్తానని చెప్పి కారు తీసుకుని వెళ్ళి పోయాను.

మధ్యాహ్నం లంచ్ టైం కి నేను తిరిగి వచ్చేసరికి ఒంటి గంటన్నర దాటింది. . నా కోసం సహస్రా, చంద్రా ఎదురుచూస్తున్నారు.  

ఇంట్లో మేము ముగ్గురం ఎవరి పనుల్లో వాళ్ళుంటాం. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాకునేది చాలా తక్కువ. సహస్రకున్న ఆసక్తి మేరా దాన్ని మాస్ కమ్యూనికేషన్స్ చదివించడంతో అది పూర్తిగా ఎలక్ట్రానిక్ మీడియానే తన కెరియర్ గా భావించి అందులోనే ఎదగడానికి కృషి చేస్తోంది. సహస్ర చామన చాయగా వున్నా కను ముక్కు తీరు బాగుంటుంది. నది మీద అలల్లా శ్రావ్యమైన స్వరం, మాట్లాడుతుంటేనే సంగీతం పాడుతున్నట్టు వుంటుంది. అంచేతనేమో మీడియాలో అడుగు పెట్టిన అతి కొద్ది కాలం లోనే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది.

చంద్ర హైటెక్ సిటీలో ఉద్యోగం .. అక్కడి నుంచి తను చిక్కడ పల్లి వచ్చేసరికి బాగా అలసి పోతాడు. రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ అంచేత టీవి లో వచ్చే అన్ని భాషల న్యూస్ చానల్స్ చూస్తుంటాడు. అలాగని తండ్రీ, కూతుళ్ళు మాట్లాడుకోరని కాదు. మీడియా గురించి ఏవో ప్రశ్నలేస్తుంటాదు అది సమాధానాలు చెబుతూ ఉంటుంటుంది.  ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ అయినా అభిప్రాయాలు కలవక అస్తమానం వాదులాడుకుంటూ వుంటారు.. ఒక్కోసారి ఆ వాదులాట కీచులాట అయే ప్రమాదం కూడా వుంది. అలాంటప్పుడు నేను రంగంలోకి దిగి శాంతి రాయబారాలు జరుపుతూ వుంటాను. 

ఏ మాత్రం వీలున్నా అందరం కలిసే బోజనాలు చేస్తాం.

నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి సహస్ర ల్యాప్ ట్యాప్ పెట్టుకుని ఏదో చేస్తోంది. చంద్ర న్యూస్ చూస్తున్నాడు.

నన్ను చూడగానే " వచ్చావా? ఆకలేస్తోంది " అన్నాడు.

" సత్యవతిగారూ వడ్డించండి ఇప్పుడే వస్తాను " అంటూ లోపలికి వెళ్ళి బ్యాగ్ పడేసి , చేతులు కడుక్కుని వచ్చాను. ముగ్గురం డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళాం.

సత్యవతి మా ముగ్గురికీ వడ్డించింది.

ఏదన్నా కావాలంటే నేను చూసుకుంటాను మీరు కూడా తినేయండి అన్నాను.

తరువాత తింటానమ్మా అంటూ ఆవిడ కొంచెం ఎడం గా వెళ్ళి నిలబడింది. 

సహస్ర స్టఫ్డ్ క్యాప్సికప్  కలుపుకుని నోట్లో పెట్టుకుని అంది మామ్మగారూ క్యాప్సికం చాలా బాగుంది. సత్యవతి చిన్నగా నవ్వింది.

నీకు క్యాప్సికం ఇష్టమా? అడిగాడు చంద్ర.

నీ కూతురికి ఎప్పుడు ఏదిష్టమో దానికే తెలియదు బాబూ.. ఒక రోజు పొటాటో, ఒకరోజు క్యాప్సికం, మరో రోజు..

నా మాట పూర్తి కాకుండానే " స్టాప్ ప్లీజ్ " అంది గట్టిగా.

" ఎందుకే రాక్షసీ అరుస్తావు? " అన్నాను కోపంగా.

" ఇలా అరవక పోతే నువ్వు ఆపుతావా? ఎప్పుడూ నన్ను విమర్శించడానికి మౌకా కోసం చూస్తుంటావు " అంది.

" ఎవరు చేసుకుంటారోగానీ దీని అరుపులకి భయపడి పారిపోతాడు " అన్నాను.

" అంత పిరికివాడిని నేను చేసుకోనులే " అంది సహస్ర.

చంద్ర నా వైపు చూసి సైగ చేసాడు. నేను నువ్వే చెప్పు అన్నట్టు తిరిగి సైగ చేసాను.

కొన్ని సెకన్ల తరువాత చంద్ర నెమ్మదిగా మొదలు పెట్టాడు.

" సహస్రా నీకు మమ్మీ మంచి మ్యాచ్ చూసింది."

" నేనా ? " అనబోయి తలెత్తిన నేను చంద్ర సైగతో ఆగిపోయాను.

సహస్ర నా వైపు చూసింది "అవునా" అన్నట్టు

అవునన్నట్టు నవ్వి ముని వేళ్ళతో గోంగూర పచ్చడి తీసుకుని నోట్లో పెట్టుకున్నాను.

అబ్బాయి యు.ఎస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాడు ఎం ఎస్ అయిపోయింది అంటూ వివరాలు చెప్పసాగాడు చంద్ర.

సహస్ర మౌనంగా భోచేస్తూ వినసాగింది.

చంద్ర చెప్పడం ముగించి నా వైపు , సహస్ర వైపు మార్చి , మార్చి చూసి కొన్ని క్షణాలు ఆమె ఏదన్నా చెబుతుందేమో అని ఎదురుచూసి నా వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు. వెయిట్ అని కంచం లో వేలితో రాసాను.

ఎప్పట్నుంచీ నాకు మ్యాచెస్ చూస్తున్నారు డాడీ? హటాత్తుగా అడిగింది సహస్ర. ఎప్పట్నుంచి ఏముంది? నిన్నటి నుంచే అనుకో నవ్వాడు చంద్ర. సహస్ర మాట్లాడలేదు.

చంద్ర భుజాలెగరేసి పెరుగు వేసుకుని భోజనం ముగించి లేచాడు.

నేనూ  లేచాను.

మా వెనకాలే సహస్ర కూడా లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. సత్యవతిని బోంచెయ్యమని చెప్పి నేను చంద్ర దగ్గరకు వెళ్ళాను.

నాకోసమే ఎదురుచూస్తున్నవాడిలా గబాల్న అడిగాడు అదేంటి అట్లా రెస్పాండ్ అయింది. నేను నవ్వాను. అది రెస్పాండ్ అవలేదు నీకు రెస్పాండ్ అయినట్టు అనిపించిందా?

అదే నాకూ అర్ధం కాలేదు.. చిరాగ్గా అన్నాడు.

అతని ఆరాటం అర్ధం చేసుకున్నదానిలా నవ్వి చంద్ర చేయి నా చేతిలోకి తీసుకుని తొందరపడితే ఎలా? సహస్ర మన కూతురు. మన మాటకి గౌరవం ఇస్తుంది కాకపోతే ఆడపిల్ల కదా.. సహజం గా వుండే బిడియం వుంటుంది. మనం చెప్పాల్సింది చెప్పాం, మనం చెప్పిన విషయం దాని బుర్రలోకి వెళ్ళి ఆలోచించుకోవాలి కదా!

ఒప్పుకుంటుందంటావా? అనుమానంగా అడిగాడు.

ఎందుకొప్పుకోదు? తప్పకుండా ఒప్పుకుంటుంది. మనం దాని తల్లి, తండ్రులం ఏం చేసినా దాని సుఖం కోరే చేస్తాం అనే నమ్మకం దానికుంది అన్నాను ఎంతో నమ్మకంగా.

అనడమే కాదు ఖచ్చితంగా ఒప్పుకుంటుందని విశ్వాసం నాకుంది కారణం ఇంతవరకూ తను ఎవరినీ ప్రేమించినట్టు నా దృష్టికి రాలేదు, తన కెరియర్ మీద తప్ప ప్రేమా, పెళ్ళి విషయాల పట్ల సహస్ర దృష్టి లేదని డృడం గా అనిపించింది.

చంద్ర సంశయిస్తూనే నా మాటల మీద నమ్మకంతో , మౌనంగా వుండి పోయాడు.

నేను కూడా నిశ్చితంగా వుండి పోయాను. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్