Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

మకర సంక్రాంతి ప్రత్యేకం - సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

మకర సంక్రాంతి ఆచారాలు- పరమార్ధం


ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ప్రారంభం అవుతుంది. రవి మకర రాశి ప్రవేశం తో మకర సంక్రాంతి వస్తుంది. ఈ రోజుననే దేవ మార్గం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే వ్రతాలు అనేక శుభఫలాలను అందిస్తాయి. అదే విధంగా ఉత్తరాయణం లో మానవుడు చేసే శుభకార్యాలు ఎక్కువ ఫలాన్ని ప్రసాదిస్తాయి. సూర్యుడు మకరరాశి లో ప్రవేశించే ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నాన, జప, దాన, వ్రతాదులు  విశేషాఫలితాలను కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజున విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున చేసే పితృ తర్పణాలు, దానాలు మానవులను పితృ రుణం నుండి తప్పించగలవు.  ప్రజలు అమ్మవారిని పౌష్యలక్ష్మిగా పూజిస్తారు. సంక్రాంతి రోజు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేయకపోతే అనేక రోగాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.


రవి సంక్రమణేప్రాప్తే  నస్నాయా ద్యస్తు మానవ:
సప్త జన్మ సు రోగీస్యాత్ నిర్ధన చైవ జాయతే.

మానవులకు పంచవిధమైన రుణాలు ఉంటాయి. దేవరుణం, పితృ రుణం, భూత రుణం, మానవ రుణం మరియు ఋషి రుణం. భూమిపై జీవించే ప్రతి మానవునికి ఈ రుణాలు ఉంటాయి. ఈ రుణాల నుండి విముక్తిని ప్రతి మానవుడు పొందాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ తత్వం అవగతం ఆవుతుంది. ఈ రుణాల నుండి  మనుష్యలకు విముక్తి ని కలిగించడానికి పరిహారాలను ఆచారాల రూపంలో మన పెద్దలు తెలియచేసారు. పెద్దలు చెప్పిన ఈ ఆచారాలను పాటించినట్లైతే  ప్రతి మనిషి తన పంచ విధమైన రుణాలనుండి విముక్తిని పొంది పరమాత్మకు దగ్గర అవుతాడు. పంచ రుణాలనుండి గృహస్తు విముక్తి పొందే మార్గాలను మకర సంక్రాంతి ఆచారాల రూపంలో మన ఋషులు తెలియచేసారు. ఈ విముక్తి తరుణోపాయాలు సంక్రాంతి ఆచారాల రూపంలో నిర్దేశింపబడినవి. కనుక మకర సంక్రాంతి రోజున మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటిస్తే అన్నీ రుణాలనుండి విముక్తిని పొందవచ్చు.

మకర సంక్రాంతి రోజున కొత్తబియ్యం తో పాలు పొంగించి సూర్యాది దేవతలకు మనం నివేదిస్తాం. పులగం, పాయసం చేసి సూర్యాది దేవతలను మకర సంక్రాంతి రోజున పూజించడం చేత  ఈ దేవతల కృపవలన దేవ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందగలం. మకర సంక్రాంతికి పండిన పంట ఇంటికి వస్తుంది. పాడిపంటలకు, వ్యవసాయానికి ఆధారమైన సూర్యభగవానుని తప్పనిసరిగా ఆరాధించాలి. ఆయన ద్వారా వచ్చిన పంటను సూర్యునికే పాలు పొంగళ్ళ రూపంలో నివేదించుట వలన దేవరుణం కొంత మేరకు తొలుగుతుంది.

పితృ తర్పణాలు, పిండోదక దానాల వలన పితృ రుణం తీరుతుంది. మకర సంక్రాంతి రోజున పితృ తర్పణాలు,  దానాలు చేయాలని మన పెద్దలు తెలియజేశారు. ఈ రోజున పితృ పూజను చేసి తర్పణాలు వదలి దానాలు బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా పితృ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందవచ్చు.

 గాలి, నీరు, ఆకాశం ,భూమి మొ|లైన పంచభూతాల కృప వలన సమస్త జీవరాశికి వ్యవసాయం ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఈ పంచభూతాలు మానవులకు పూజనీయాలు. సంక్రాంతి రోజున పొలాలలో పొంగలి మెతుకులు చల్లడం, పసుపు కుంకాలు చల్లి గుమ్మడికాయ పగులగొట్టి దిష్టి తీయడం ఆచారంగా మారింది.  పశువులు మానవులకు చేసే మేలుకు గుర్తుగా కనుమ రోజున వీటిని పూజించి కొష్టాలను అలంకరిస్తాము. ఇంకా ముగ్గు లో బియ్యపు పిండిని కలిపి ముగ్గులు వేసి వీటి ద్వారా చీమలు వంటి అల్ప ప్రాణులకు ఆహారం అందిస్తాము. ఇటువంటి ఆచారం పాటిస్తే భూత రుణం నుండి మానవులు  కొంతమేరకు విముక్తిని పొందుతారు.

సంక్రాంతి రోజున దానధర్మాలు చేయమమని మన ధర్మం చెపుతుంది. పండుగ రోజున తిలలు, వస్త్రాలు, ధాన్యం, చెరకు, గోవులు ఫలాలు మొ|లైనవి దానం చేస్తారు. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి ధాన్యం దానం చేస్తారు.  ఇటువంటి దానాల వలన మనుష్య రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. పురాణ పటనం, జపాతపాలు, బ్రాహ్మణులకు దానాలు వంటివి ఆచరించుట ద్వారా ఋషి రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మానవులకు ఏర్పడే పంచరుణాలను తొలగించడానికి మన పెద్దలు ఆచారాల రూపంలో తరుణోపాయాలను చూపించారు. వీటిని గురించి తెలిసినా తెలియకపోయినా పండగ ఆచారాలను పాటిస్తే మనుషులకు ఎంతో మేలు జరుగుతుంది.

మకర సంక్రాంతి తో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే ఎటు వంటి పుణ్యకార్యమైన, శుభకార్యమైన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాయణం  గృహారంభాలకు, గృహప్రవేశాలకు చాలమంచి కాలం.దేవతా ప్రతిష్టాలకు ఉత్తరాయణం మంచిది. సౌమ్య దేవత ప్రతిష్టలు తప్పనిసరిగా ఉత్తరాయణం లోనే చేయాలి. నూతన ఆలయాల ప్రారంభం ఉత్తరాయణం లోనే చేయాలి. వివాహాలకు అన్ని శుభకార్యాలకు ఉత్తరాయణం మంచిది.

మకర సంక్రాంతి రోజున ప్రతివారు తప్పనిసరిగా తెలకపిండి ఒంటికి రాసుకొని స్నానం ఆచరించాలి. తెలక పిండికి వాతాన్ని హరించే గుణం ఉంది. శని మకర రాశికి అధిపతి. శని గ్రహం వాతాన్ని పెంచుతుంది. కనుక వాతాన్ని హరించే తెలకపిండి స్నానం ఈ రోజు చాలా మంచిది. ఈ కాలం లో పెరిగే వాతాన్ని అరిసెలు కూడా బాగా తగ్గిస్తాయి. అందుకనే బెల్లం, నువ్వులు, బియ్యపు పిండి తో తప్పనిసరిగా అరిసెలు వండుకు తినాలని మన పెద్దలు చెపుతారు. మన ప్రాంతం లో అందుకనే ప్రతి గృహం లో అరిసలు వండుతారు. సంక్రాంతి రోజు నువ్వులు గుమ్మడికాయ, బెల్లం వంటి వస్తువులు మంచి ఆరోగ్యం కోసం దానం చేయాలి. మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా దానాలు ఇవ్వాలి.

మకర సంక్రమణ పుణ్యకాలేతదానం స్వశక్తి:
ఫలం కాంస్యాది దాన్యాని దీయతే దోషనాశనం
ఫలాని మూలన్యజీనం సువర్ణం గ్రామాంశు కాద్యమ్ సతిలేక్షు గావ:
ధాన్యం ఖరాంశో: మకర ప్రవేశ ఏతానిదానాని వివేషితాని

ఈ శ్లోకం ప్రకారం సంక్రాంతి రోజు ధాన్యం, ఫలాలు, బంగారం,కంచు వంటి లోహాలు దానం ఇవ్వడం మంచిది. ఘృత కంబళి దానం శ్రేష్టం. సంక్రాంతి రోజు ఏది దాన చేస్తామో అవి అధికంగా జన్మ జన్మలకు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజులో నువ్వులు, బియ్యం కలిపి శివ భగవానుని పూజించాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. ఆవు నేతితో శివునకి అభిషేకం చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి. సంక్రాంతి రోజు ఒక్కపూట భోజనం చేయాలి. రాత్రి కాలంలో భుజించరాదు.

యయా సన్నిహితా నాడ్యా: తాస్తా: పుణ్యతమా స్మృతా:

సంక్రాంతి సమీపిస్తున్న కొద్ది అధిక పుణ్య కాలం కాబట్టి  ఈ రోజులో చేసే మంత్ర ధ్యానాలు,జపాలు తపాలు. దానాలు తర్పణాలు శ్రేష్ట మైన ఫలితాలు ఇస్తాయి. చలికాలంలో రాత్రికాలం దీర్ఘంగా ఉంటుంది. పగటికాలం తక్కువుగా ఉంటుంది. కనుక నిద్ర లేచే సమయానికి బాగా ఆకలిగా ఉంటుంది. దీనికి విరుగుడుగా పులగం తినాలని వాగ్భటుడు మొ|లైన వైద్యులు చెప్పడం జరిగింది. రోజు పులగం తినడం ఖర్చుతో కూడిన పని. అందరికీ సాధ్యం కాదు. కనుక ఈ పండుగనాడు అందరికీ అందుబాటులో ఉండటానికి ఆలయ ప్రసాదంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. మకర సంక్రాంతి రోజున శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదవితే మంచి లాభం కలుగుతుంది.మకర సంక్రాంతి ఆచారాల వెనుక అనేక పారమార్ధిక విషయాలు దాగున్నాయి. వీటిని భక్తితో ఆచరిస్తే పరమాత్మ కృప లభించి జీవితం ధన్యం అవుతుంది.

మరిన్ని శీర్షికలు
pounch patas