Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి కైలాశ దర్శనం ( ఆరవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

మానససరోవరం లేక ఛియు - గొంఫ



రెండు గంటలకి భోజనాలు ముగించుకొని , ఆవ నూనె , పాత నైటీ ( స్నానం చేసిన తరువాత పారేసేటట్టుగా ) ఒళ్లు వత్తుకోడానికి పాత టవల్స , మార్చుకునే బట్టలు తీసుకొని వెళ్ళేం . దోర్జీ మూడింటికి హెల్పర్స వచ్చి బట్టలు మార్చుకోడానికి వీలుగా టెంటు వేస్తారని ఆ తరవాత మానస సరోవరం లో స్నానానికి వెళ్లమని చెప్పేడు . మేము సరేనని రెండు 5 లీటర్ల కేనులు తీసుకు బయలుదేరేము . మానస సరోవరంలోని నీరు హెల్పర్లు తెచ్చి ఖాట్మండు లో యాత్రీకులకు అందజేస్తారని దోర్జీ చెప్పేడు . అయినా మేము మాకేనులలో నీళ్ళు తెచ్చుకొనేందుకు నిశచయించు కొని బయలు దేరేం .

అరకిలోమీటరు ఆ చల్లని పడగొట్టేటంత పిచ్చి గాలిలో నడవడానికి మాకు అరగంట పట్టింది . ఇన్నర్స్ , రెండేసి స్వెట్టర్లు  కాక పైన ఖాట్మండు లో వాళ్లిచ్చిన జాకెట్టు వేసుకున్నా చలి కొరికేస్తోంది అలాంటిది ఈ బట్టలన్నీ విప్పి ఒక్క బట్టతో సరోవరం లో స్నానం చెయ్యగలమా అని భయపడ్డాం .

కాస్త నీళ్లు తలపై జల్లుకొని కేనులలో నీళ్లు పట్టుకొని వచ్చేద్దామని నిర్ణయించుకున్నాం .

ఇంత దూరం వచ్చి స్నానం చెయ్యలేక పోతున్నామే అనే దిగులు తినేస్తోంది . మా వారు చలికి బాగా తట్టుకోగలరు అతనే స్నానాలు లేవని హెచ్చరించడం , డాక్టరు మరిది కూడా వద్దనే అనేసరికి మనసు లో బాధగా వున్నా  , కైలాశపర్వత పరిక్రమ ముఖ్యం కాబట్టి మరి మాట్లాడలేదు .

మానస సరోవరం చేరుకున్నాం . నీళ్లు చాలా స్వచ్చంగా వున్నాయి . జోళ్లు విప్పుకొని కాళ్లు చేతులు కడుగుకొని నెత్తి మీద కాస్త నీళ్లు జల్లుకున్నాం .

ఇక్కడ మానససరోవరం గురించి నాకు తెలిసిన వివరాలు మీకు తెలియ జేస్తాను .

మానససరోవరాన్ని హిమనీనదము అని కూడా అంటారు . చుట్టుపక్కల వున్న మంచు కరిగి యేర్పడ్డ సరస్సు . మనదేశంలో ప్రవహిస్తున్న  ముఖ్యమైన నాలుగు పవిత్ర నదులైన బ్రహ్మపుత్ర , ఘఘారా , సింధు , సెట్లజ్ లు మానససరోవరం లోనే పుట్టినట్లు చెప్పబడ్డాయి . కొన్ని వేల సంవత్సరాలనుంచి హిందువులు యిక్కడ స్నానాలు , క్రతువులు ఆచరించినట్లు చారిత్రక ఆధారాలు వున్నాయి 

కాని " ఛామ్డో " యుధ్దానంతరము 1951 లో మానససరోవరం యాత్ర విదేశీయులకు ( టిబెట్టు , చైనీయులకు తప్ప మిగిలిన వారంతా విదేశీయులే ) ప్రవేశం రద్దు చేసేరు . ఇతరదేశాల రాజకీయ వత్తిడితో 1980 లో తిరిగి యాత్రకు అనుమతించేరు . టిబెట్ పీఠభూమి లో వున్న అతి యెక్కువ విస్తీర్ణం కలిగి వృత్తాకారంలో వుండే మంచినీటి సరస్సు యిది . ఉత్తరాన పరమపవిత్రమైన కైలాశపర్వతం , యెడమవైపున నల్లని నీటితో వుండే రాక్షస తాల్ వుంటాయి .

ఘఘారా నది ' కర్ణాలి ' అనే పేరుతో నేపాల్ గుండా ప్రవహించి భారతదేశం లో బీహారు దగ్గర గంగానదిలో కలుస్తోంది . సింథు నది చైనా , భారతదేశంలో లదాక్ , జమ్ము కశ్మీరు లగుండా ప్రవహించి పాకిస్థాన్ లోకి ప్రవేశిస్తోంది . సెట్లజ్ నది చైనా , భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ , పంజాబు గుండా ప్రవహించి సంధునదిలో కలుస్తోంది .మానస సరోవరం సముద్రమట్టానికి 4556 మీటర్ల యెత్తులో వుంది . ఈ సరస్సు యొక్క మొత్తం విస్తీర్ణం 320 స్కేర్ కిలో మీటర్లు , తీరం పొడవు 25 కిలోమీటర్లు , చుట్టుకొలత సుమారు 88 కిలోమీటర్లు . స్థానికులు ఈ సరస్సుని ఛియు-గొంప అని పిలుస్తారు .  ' రోబర్ట్ థుర్మాన్ ' అనే విదేశీ పర్యాటకుడు ఈ సరస్సును టిబెట్ యొక్క మణిగా వర్ణించేడు .  మతపరమైన విశ్వాసాల గురించి చెప్పు కుందాం .

ముందుగా హిందూ మతం గురించి చెప్పుకుందాం .

బ్రహ్మ దేవుని యేడుగురు పుత్రులు శివుని స్వయంగా సేవించు కొనేందుకు యిక్కడకి రాగా వారికి శుచిర్భూతులు అయేందుకు నీటి సౌకర్యం కానరాక తండ్రి ని తలచుకొనగా బ్రహ్మ మనసునందే ఊహించి యీ సరస్సును సృష్టించెనట . అందుకని దీనికి మానససరోవరం అని పేరు వచ్చింది . బ్రహ్మపుత్రులు ఈ సరస్సు నందు స్నానాలు చేసి శివుని పూజించుకొని ఉత్తమ గతులను పొందేరు కాబట్టి కలియగంలోఈ సరస్సు నందు స్నానము చేసుకున్నా , కాళ్లు చేతులు కడుగుకొని , శిరస్సు పై నీళ్లు జల్లుకొని , తీర్థంగా పుచ్చుకొన్నా వారికి వంద జన్మల పాప ప్రక్షాళన జరిగి మరణానంతరము జీవుడు శివునిలో ఐఖ్యం అవుతుందని హిందువుల నమ్మకం .

మరో కధ ప్రకారం నాగరాజు మానససరోవరాన్ని నివాసంగా మార్చుకుని తన పరివారంతో నివసించే వాడట . సరోవరం మధ్యలో అద్భుతమైన జంబూ వృక్షం వుండేదట , ఆ చెట్టుకాయలు సోవరంలో పడేవట , నాగరాజు తనపరివారం తో ఆ అద్భుత ఫలాలను తినేవాడట . సరస్సులో మిగిలి పోయిన ఫలములు బంగారు ఫలములుగా మారిపోయేవిట . అయితే ఈ కధని నమ్మిన ఛియు -గొంప ప్రజలు బంగారం కొరకు తవ్వకాలు సాగించి బంగారం పొందసాగేరుట , ఆ సమయములో అక్కడ అమ్మవారు ( స్మాల్ పాక్స్ ) సోకి వూరంతా వల్లకాడు అయిందట , అప్పటి నుండి యిక్కడ బంగారంకొరకు తవ్వకాలు నిలిపి వేసేరు .

ప్రతీ రోజు అర్దరాత్రి దాటేక ముక్కోటి దేవతలు మానససరోవరంలో స్నానమాచరించడానికి వస్తారని , పౌర్ణమి రాత్రి జ్యోతి రూపంలో ఒడ్డున వున్న భక్తులకు దర్శనం యిస్తారని యిప్పటికీ హిందువులు నమ్ముతారు . ప్రపంచం మొత్తం మీద లుప్త మైనటువంటి రాజహంసలు మానస సరోవరంలో మాత్రమే వుంటాయని , పాలు నీటిని విడదియ్య గలిగే శక్తి వొక్క రాజహంసలకే వుంటుందనేది కూడా ఒక విశ్వాసం .
ఆ విశ్వాసాన్నే కైలాశమానససరోవర యాత్ర నిర్వాహకులు డబ్బు చేసుకుంటున్నారు . మేము కూడా అందుకే పౌర్ణమికి మానససరోవరం లో వుండే టట్టుగా బయలుదేరింది .

బౌద్దుల గురించి చెప్పుకుందాం .

బౌద్దులు అవనతప్త అని పాళీ భాషలో అనోతత్త అని మానససరోవాన్ని పిలుస్తారు .బుద్దుని తల్లి మాయాదేవి స్వప్నంలో తెల్లని యేనుగు పెద్ద మంచు పర్వతం నుండి బయలు దేరి స్వఛ్చమైన నీటితో వున్న సరోవరం మీదుగా వచ్చి తన గర్భం లో ప్రవేశంచి నట్లు కనిపిస్తుంది . ఆమె వర్ణంచిన పర్వతం కైలాశపర్వతమేనని , ఆ సరోవరం మనస సరోవరమేనని పోల్చుకున్నారు . బుద్దుడు తన జీవిత కాలంలో చాలా సార్లు ఈ సరోవరం వొడ్డున తపస్సు చేసుకున్నాడని బౌద్ద గ్రంధాలలోనూ బౌద్ద కధలలోనూ వ్రాయబడి వుంది . ఈ సరోవరం వొడ్డున యెనిమిది బౌద్ద ఆరామాలు వున్నాయి . బౌద్దులు ఈ ఆరామాలను దర్శంచుకొంటూ మానససరోవరానికి ప్రదక్షిణ చేసుకుంటారు . ఈ ఆరామాలలో ' ఛియా ' ఆరామం ఒక కొండ పైన వుంది దీనిని చూస్తే కొండను తొలిచి నిర్మించినట్లు అనిపిస్తుంది . తరవాతి కాలంలో బోధిసత్వులు యిక్కడ తపస్సు చేసుకొని జ్ఞానోదయం పొందేరుట . బౌద్దులు ఈ సరస్సుని జీవితకాలంతో పోల్చుతారు , ఈ యెనిమిది ఆరామాలను మనిషి జీవితం లో జరిగే యెనిమిది ముఖ్య ఘట్టాలతో పోల్చి యెవరైతే ఈ యెనిమిది ఆరామాలను దర్శించుకొని మానససరోవరానికి ప్రదక్షిణ చేసుకుంటారో వారు ఒక జీవిత కాలాన్ని జీవించినట్లు గా లెక్కిస్తారు . ఇప్పటికీ యిక్కడ ప్రశాంతంగా వుంటుందని తపస్సు చేసుకోడానికి బౌద్దులు వస్తూవుంటారని మా దోర్జీ చెప్పేడు .

జైన గురువులలో మొదటి వాడైన వృషభ తీర్ధంకరుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకున్నాడని జైన గ్రంధాలలో వుండటం చేత ఈ ప్రదేశం జైనులకు కూడా పవత్రమైనదే .

సిక్కుల పవిత్రగ్రంధం గురుగ్రంధసాహెబ్ లో గురు నానక్ ఈ ప్రదేశాన్ని సందర్శించి నట్లుగా వుంది . అందుకు సిక్కులకు కూడా ఈ ప్రదేశం పవిత్ర స్థలమే .

ఇవి వివిధ మతస్థుల నమ్మకాలు .

ఇక మాయాత్రలోకి వస్తే మాకన్నా ముందు మానససరోవరం చేరుకున్న మా తోటి యాత్రీకులు స్నానాలు చేసి తడి బట్టలతో కొందరు , పొడి బట్టలతో కొందరు హోమం చేస్తున్నారు .

వాళ్ళకి లేని చలి మనకేనా అని ఒక నిముషం అనిపించింది . వీళ్లల్లో సగం మంది యివాళ రాత్రికే వెనుకకి పంప బడతారు , మరికొందరు ' దర్చెన్ ' వరకే వస్తారు మిగతా మొండి ఘటాలు యింటికెళ్లేక ఆరునెలలు న్యుమోనియాకి మందులు వాడుతారు అని మామరిది భవిష్య వాణి చెప్పడం తో మరింకేమీ అలోచించక మానససరోవరం ఒడ్డున కైలాశ గిరికి అభిముఖంగా కూర్చొని శివ స్తోత్రాలు, సహస్ర నామావళి చదువు కో సాగేం .

కైలాశగిరి ని దర్శంచు కున్నపుడు కలిగిన పారవశ్యం వర్ణించడానికి నా పదకోశం చాలదు . యెంత సేపుచూసినా తనివితీరదే . అలా కొంతసేపు వున్నాక మా హెల్పర్లు టెంటు సామగ్రి తీసుకొని వచ్చేరు . మేము టెంటు లేదని స్నానం చెయ్యలేదనుకొని గబగబా టెంటు వేసి బట్టలు మార్చుకుని స్నానానికి వెళ్లమన్నారు . నీళ్లు చల్లగా వున్నాయి అన్న మామాటలకి యిప్పుడు వేడిగా వుంటాయి స్నానానికి వెళ్లండి అని , ఒళ్ళంతా ఆవనూనె పట్టించి వెళ్లమని చెప్పేరు . మేము మా సందేహాలని బేగులలో దాచేసి గబగబా బట్టలు మార్చుకొని సరస్సులో దిగేం ఆశ్చర్యం నీళ్లు గోరు వెచ్చగా వున్నాయి . అక్షరాలా ఓ పది నిముషాలు  సరోవరంలో మునిగి స్నానాలు చేసేం . ఒక ఫర్లాంగు లోపలకి వెళితే ముణుకులు మునిగేయి . అక్కడ స్నానం చేసుకున్నాం . ఈశ్వరుని కృప మామీద పుష్కలంగా వుందని సంతోషించి , ఈ కృపని యిలాగే కొనసాగించి మాయాత్ర జయప్రదంగా జరిగేట్లు చూడమని వేడుకొని టెంటులో బట్టలు మార్చుకున్నాం.

మాతో పాటు వచ్చిన భారతి ఆమె భర్త చలిలో స్నానం వద్దు అనుకొని టవల్స , పొడి బట్టలు తెచ్చుకోలేదు . మీరు స్నానం చేసి రావడం చూస్తే మాకూ స్నానం చెయ్యాలని వుంది యెలా ? మారు బట్టలు కూడా తెచ్చుకోలేదు , నూనె కూడా లేదు అని బాధపడసాగింది . మా నూనె మిగిలింది చాలా వుంది మీరు వాడుకోండి , మా తడి బట్టలు కట్టుకొని స్నానం చేసిరండి , మీరు స్నానం చేసేంత వరకు మీ పొడి బట్టలు మేము పట్టుకుంటాం అని నాకు తోచిన సలహా యిచ్చేను . వాళ్లిద్దరూ కూడా స్నానాలు చేసుకున్నారు .

మేం సూర్యాస్తమయం వరకు అంటే సుమారు యేడుగంటలవరకు సరోవరం ఒడ్డున కూర్చొని సరోవరంలోని మట్టితో లింగాకారం చేసి సరోవరం నీటితో అభిషేకించి మాకు తోచిన విధంగా పూజలు చేసి మాతో కూడా తెచ్చుకున్న డ్రైఫ్రూట్స్ నైవేద్యం చేసి అరగంట అరగంటకి మారుతున్న కైలాశగిరి అందాలు చూస్తూ గడిపి తిరిగి మా బస చేరుకున్నాం .

అప్పటికే మా దోర్జీ మాకోసం అంటే మాకోసం కాదు డాక్టరు గారికోసం యెదురు చూస్తున్నాడు విషయం యేమిటీ అంటే మా గ్రూపులో అతి చిన్నవయసున్న 22 యేళ్ల అమ్మాయుకి , హరియాణా నుంచి వచ్చిన సుమారు నలభై యేళ్ల ఆవిడకి మరికొందరికి ఆరోగ్యం దెబ్బ తింది . మామరిది వాళ్లిద్దరిని చూసి యేదో మందులు యిచ్చి వెనుకకి పంపెస్తే మంచిదని చెప్పేరు . ఈ లోపు ఇండోరు గ్రూపు నుంచి పిలుపొస్తే అక్కడికి వెళ్ళేం . అందులో ఆరుగురికి బాగులేదు . చలి పట్టిపోయేరు వీళ్లకి శుభ్రంగా బట్టలతో కవరు చేసి వేడివేడిగా టీ అదీ యివ్వమని చెప్పేరు . అదేం రోగమో కాని ఖాట్మండు లో మాకిచ్చిన కోట్లు యేం చేసేరో గాని పలుచని మామూలు బట్టలు కట్టుకొని వున్నారు . యెంతో నచ్చచెప్పి వూలు కోట్లు ధరించమని చెప్పి వచ్చేసేం . పదినిముషాలకి మళ్లీ పిలుపు , మాయరోగం చలిపట్టిపోయేరు శుభ్రంగా బట్టలు కట్టుకొని రజ్జాయిలో పడుకుంటే తగ్గుతుంది , మనమాట వినటంలే , మొండిఘటాలు నేనేంరాను అని మామరిది రాలే . నేనే వెళ్లి కర్పూరం వెలిగించి ఆ వేడితో ఒళ్ళంతా కాచి వూలు బట్టలు కట్టుకోవమ్మా శరీరం వెచ్చ పడుతుంది అని చెప్పేను . కాపడం తరవాత ఆమెలో చాలా మార్పు గమనించేము . మనిషి లో వణుకు పూర్తిగా తగ్గింది . ఇక్కడ మరో విషయం మీకు చెప్పాలి ఈ వణకుతున్న వాళ్లల్లో యిద్దరు చైనా బోర్డరు దగ్గర పసిపిల్లల చేత సామాను మోయించుకొని డబ్బులు యెగవేసేరే వాళ్లే .

ఆ రోజు పున్నమి కావడంతో రాత్రి మానససరోవరంలో ముక్కోటి దేవతలు వచ్చి స్నానం చెయ్యడము కాక మనుషులకు దర్శనం యిచ్చి కోరిన వరాలు మన వొళ్లో పోసేరోజు . భోజనాల సమయంలో ఓ ముప్పై మందిమి వెళదాం అని నిర్ణయించుకున్నాం . అంతా ట్రాష్ నేను పడుకుంటా అన్నారు మావారు . ఈ విషయం దోర్జీని అడిగితే మతపరమైన నమ్మకానికి సంబంధించిన విషయంకాబట్టి తానేమీ చెప్పనని అన్నాడు మరీమరీ అడిగితే అదే నిజమైతే సీజనుకి కనీసం 4 లేక5 మార్లు వచ్చే తనుగాని హెల్పర్లు గాని ఈ చలిలో తిరుగుతూ యెందుకుంటాము , సార్ మాటవిని రెస్ట్ తీసుకోండి అని అన్నాడు .

అయినా మేము మానససరోవరానికి వెళ్ళేం . రాత్రి పన్నెండు నుంచి రెండు వరకు ఆ చలిలో కూచున్నాం . రాజహంసలూ లేవు ముక్కోటి దేవతలూ రాలేదు . మాలో కొందరు మనం మాట్టాడుకోడం విని వచ్చి వుండవు అని , కాదు కాదు రేపు రాత్రి కి కూడా పున్నమి వుంది కాబట్టి రేపు రాత్రికి వస్తారని వివిధ రకాలయిన అభిప్రాయాలతో వెనుతిరిగేం . మాకన్నా రెండు రోజులు ముందుగా వచ్చిన గ్రూపు లో వాళ్లు నిన్న మేం చూసేం , రెండేసి జంటగా వచ్చి అలా సరోవరంలోకి వెళ్లి మళ్లా అలా చూస్తూవుండగా మీదకు వెళ్లి మాయమయిపోయేయి . అలా రోజూ వస్తాయట , ఇవాళ యెందుకు రాలేదో తెలీదుగాని రేపు రావొచ్చు అన్నారు .

ఆ రేపుకూడా అక్కడే వుంటున్నాం కాబట్టి రాత్రివచ్చి దేవతలని చూసెయ్యాలని నిర్ణయించుకున్నాం .

మరునాడు పొద్దున్న బ్రేక్ ఫాష్టు టేబుల్ దగ్గర తెలిసిన విషయం యేంటంటే ముందురోజు అనారోగ్యం పాలైనవాళ్లని పొద్దున్నే ఒక హెల్పర్ ని సహాయంగా యిచ్చి ఖాట్మండు పంపించేరని , అందులో ఆ తెలివైన అక్కచెల్లెళ్లు కూడా వున్నారని .

ఆ రోజు బుద్ద పౌర్ణమి కాబట్టి బౌద్దులు కైలాశపర్వతం దగ్గర వేల సంఖ్య లో చేరి పెద్ద యెత్తున పూజాది కార్యక్రమాలు జరుపుకుంటారు కాబట్టి మాకు ఆ రోజు మానససోవరం లోనే వుండవలసి వచ్చింది . ఆ రోజుకూడా వాతావరణం బాగుండడంతో మధ్యాహ్నం మానససరోవరం దగ్గరకి వెళ్లి పూజలు గట్రా నర్వర్తించుకొని ( స్నానం చెయ్యలేదండోయ్ )  కైలాశగిరి అందాలు కనులార తిలకించి మా నివాసానికి వెళ్ళిపోయేం .

రాత్రి యెనిమిదింటికి భోజనం ముగించి అలారం పెట్టుకొని పన్నెండిటికి మా వారి లాంటి వారు తప్ప ఓ యిరవై మందిమి మానససరోవరం చేరుకున్నాం . సుమారు ఒక గంట వేచి వున్నాక రెండు దీపాలు కిందకి దిగుతూ కనిపించేయి . మాకు ఆశ్చర్యం తో మాటరాలేదు . కొన్ని సెకండ్ల తరువాత కనిపించలేదు , కొన్ని సెకండ్ల తర్వాత మళ్లీ కనిపించేయి . అవి యేవైనా మోటారు వాహనం హెడ్ లైట్స కావొచ్చు అని వివేకం చెప్పింది .అదే విషయం అక్కడ వున్న వాళ్ళకి చెప్తే కొందరికి కోపాలు వచ్చేయి . నేను శాంతంగా ఆ దీపాలను అవి వస్తున్న దిశగా జాగ్రత్తగా చూడమన్నాను . అందరం ఆ దీపాలను జాగ్రత్తగా చూడగానే అవి ట్రక్కులని మా బసల వెనుక వైపున వున్న రోడ్డుమీదకివచ్చేక తెలిశాయి . అలా ఓ నాలుగు వాహనాలను చూసిన తరువాత అందరికీ దీపాల రహస్యం తెలిసింది . నిజం జర్ణించుకోలేని మహిళ క్రితం సారి మేము దీపాలు యిటు వైపునుంచి రావడం చూసేం యిటు వైపు ోడ్డు లేదుగా అంది పగలు చూస్తే రోడ్డు వున్నదీ లేనిదీ తెలుస్తుంది . ఆ కొండల వెనుక యేమూలో గ్రామం వుంటే వారు వెలుగుకు వుపయోగించుకొనే టార్చ కాంతి కూడా మనకి యెక్కడనుంచి వచ్చిందో తెలీదుకదా ? అని అనుకుంటూ కొన్ని గంటల నిద్రకు దూరమైనా ఒక మూఢనమ్మకాన్ని ఛేదించేమనే ఆనందం తో నిద్ర పోయేం .

మరునాడు దంతధావనం చేసుకోడానికి బయటకు అడుగువేసి ఆశ్చర్య పోయేం . పక్క టెంటు కనిపించనంత మంచు పడుతోంది . టీ లు టిఫినులు టెంటులోకే పంపబడ్డాయి . చూస్తూ వుండగానే ెండడుగుల యెత్తుకి చేరుకుంది తెల్లని మెత్తని  మంచు. అంతలా మంచు పడడం అప్పటివరకు చూడలేదేమో నాకు చాలా సంతోషం అనిపించింది . వెంటనే చేతులతో ( గ్లౌసు వేసుకున్నా లెండి ) మంచు తీసుకొని కాసేపు ఆడుకున్నా మా వాళ్లు వద్దన్నా . అందరం మానస సరోవరం పరిక్రమ కి బయలుదేరేం . 88 కిలోమీటర్ల ప్రయాణం కారులలో పూర్తి చేసుకొని ' దర్చెన్ ' చేరుకోవాలి . కాని ఒ యిరవై కిలోమీటర్లు వెళ్ళేక కారులు ముందుకు వెళ్ల లేని పరిస్థితి . అందరం వెనుకకి మానససరోవరం చేరుకున్నాం .

అప్పుడే అక్కడికి చేరిన మూడు కొత్త గ్రూపులు షెడ్డులలోకి చేరుకుంటున్నారు . వారికి మానస సరోవర స్నానం , దర్శనం ప్రాప్తి లేదు . మంచు క్లియర్ చేసే సాధనాలు లేకపోవడంతో మంచు కరగడానికి నాలుగయిదు రోజులు పడుతుంది . సరోవరం లో పడ్డ మంచు నీటిని బాగా చల్లగా మార్చేస్తుంది .

మా యాత్ర మానససరోవర పరిక్రమ లేకుండా వేరే దారిలో సాగి  ' దర్చెన్ ' చేరుకుంది .

మిగిలిన వివరాలు వచ్చేసంచికలో చదువుదాం

అంత వరకు శలవు

మరిన్ని శీర్షికలు
Fits | Epilepsy | Ayurvedic Treatment | మూర్ఛలు, ఫిట్స్ | Dr Murali