Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naatukodi Pulusu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు - వాస్తవాలు - ​సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

 

తూర్పు ఉత్తర సింహద్వారం తో నిర్మించే గృహాలకు సింహద్వారం బయటకు కనిపించే విధంగా ప్రహరీ నిర్మించాలి. తూర్పు ఉత్తరాలలో బాగా ఎత్తులో ప్రహరి నిర్మించుట మంచిది కాదు. మగ సంతానానికి ఎదుగుదల లోపిస్తుంది. అయితే దక్షిణ పశ్చిమ దిశలలో ప్రహరీని  ఎత్తులో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరాలలో మరీ ఎత్తులో ప్రహరీ మంచిది కాదు. దక్షిణం, పడమరల వైపు కూడా గాలికి అవరోధం రానంత మేర ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. మన పూర్వ నిర్మాణాలలో దక్షిణం,పడమరల వైపు ఇంటిని ఖాయం చేసి ఉండటం మనం చూస్తూంటాము. ఇది చాలా తప్పు. ఇటువంటి గృహాలకు నైసర్గిక వాస్తు దోషాలు బాగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది నైరుతి మూసి నిర్మాణాలు చేయవచ్చునని సలహా ఇస్తున్నారు. ఇది కూడా తప్పు. నైరుతి మూసి నిర్మాణాలు చేస్తే ఇటువంటి నిర్మాణాలకు నైరుతి లో ఉండే నైసర్గిక వాస్తు దోషం తగిలి తీవ్ర నష్టాలు వస్తాయి. ఇంటికి దక్షిణం పడమర లో వేరే గృహం ఉంటే ఈ దిక్కులందు కాంపౌండ్ అవసరం లేదని భావిస్తారు.ఇది తప్పు. మన ప్రహరీ మనం కట్టుకోవలసిందే.

ప్రహరి ప్రధాన గృహం నుండి దక్షిణం ఆగ్నేయ, దక్షిణ నైరుతి దిక్కులు సమానమైన కొలతతో 90 డిగ్రీలు గా ఉండాలి. అదేవిధంగా పడమర వైపు పడమర, పడమర వాయవ్యం, పశ్చిమ నైరుతి ప్రధాన గృహం నుండి సమానమైన కొలతతో 90 డిగ్రీలు  గా ఉండాలి. ఏ దిశ పెరగరాదు.  అయితే తూర్పు ఉత్తరం వైపు తూర్పు ఆగ్నేయం కన్నా తూర్పు ఈశాన్యం అదే విధంగా ఉత్తర వాయవ్యం కన్నా ఉత్తర ఈశాన్యం ఎంతో కొంత పెరిగే విధంగా ప్రహరీ నిర్మించాలి. ఈశాన్యం పెరగకుండా ఉండరాదు. ఇంటి ప్రహరీ గోడ కు వీధి శూల తగిలే పక్షంలో నిర్లక్ష్యం చేయరాదు. ప్రహరీ కి ఎంతో కొంత ఖాళీ వదలి వేరే గోడను ప్రహరీ కి అడ్డం గా నిర్మించాలి. అప్పుడే ప్రహరీ కి వీధి శూల నుండి రక్షణ లభిస్తుంది.

ఈ రోజుల్లో చాలామంది ప్రహరిలను ఇంటి బీముల పై నిర్మిస్తున్నారు. ఇంటి బీమ్స్ ను ఇంటి నుండి బయటకు పెంచి వాటిపై ఇంటికి ఎడంగా ప్రహరిని కడుతున్నారు. భూమి పై మట్టం నుండి కాంపౌండ్, ఇంటి గోడలు ఎడంగా ఉన్నప్పటికి భూమి అడుగు భాగంలో ప్రధాన గృహం మరియు ప్రహరీలు బీమ్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇటువంటి నిర్మాణం వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ప్రహరీ ఇంటికి మద్య ఖచ్చితంగా కనెక్షన్ ఉండకూడదు. ఇంటికి ప్రహరీ మధ్య కనెక్షన్ ఉంటే ప్రహరీలకు తగిలే నైసర్గిక వాస్తు దోషాలు ఇంటికి కూడా తగిలి అనేక సమస్యలు వస్తాయి. కనుక ప్రహరీలకు వేరే పిల్లర్స్, బీమ్స్ వేసి ప్రహరిని నిర్మించాలి.

ఇంటి శ్లాబ్స్ ప్రహరీ గోడలపై వచ్చే విధంగా నిర్మించరాదు. ఇంటి శ్లాబ్ ఇంటి ప్రహరి కన్నా 2 లేక 3 అంగుళాలు లోపలికి ఉండే విధం గా వేయాలి. సెప్టిక్ టాంకులు,బోర్లు మొ|నవి ప్రహరికి టచ్ కాకుండా ఉండాలి.ప్రహరీ పై ఇంటికన్నా ఎత్తులో ఆర్చీలు డిజైన్లు కట్టరాదు. క్రూర మృగాల బొమ్మలు, భయం గొలిపే బొమ్మలు ప్రహరీపై ఉంచరాదు. ఇంకా ప్రహరీ పై గాజు పెంకు లను అమర్చకూడదు. ఇంటిని నిర్మించిన తదుపరి ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటిని ప్రాతిపదికగా తీసుకొని ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటికన్నా ప్రహరీ ముందుగా నిర్మిస్తే ఇంటిని ప్రహరికి అనుగుణంగా సవరించాలి. ఇది మంచి పద్దతి కాదు. అయితే ఖాళీ స్థలానికి నైరుతి ఆగ్నేయ దిక్కుల విపరీతంగా పెరిగిఉంటే ముందుగా పెరిగి ఉన్న దిక్కులను సవరించి ప్రహరీ నిర్మించాలి. అప్పుడు ఇల్లు సకాలంలో పూర్తి అవుతుంది.

ప్రహరికు ఉచ్చ స్థానంలో గేట్లు అమర్చాలి. ప్రహరికి కాలువలకు మధ్య ఎంతోకొంత ఖాళీ ఉండాలి. ప్రహరికి ఆనుకొని కాలువలు ఏ దిశలోనూ ఉండరాదు. పాత గృహానికి కాంపౌండ్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన గృహానికి పారు చెడకుండా ప్రహరీ కట్టాలి. అదే విధంగా ప్రధాన గృహం ను ప్రాతిపదిక గా తీసుకొనే ప్రహరీ కట్టాలి. ప్రధాన గృహం నుండి కొలత తీసుకొని ప్రహరీ కట్టాలి. అంతేకాని ప్రహరికి నూతనంగా మూలమట్టం వేసి కట్టకూడదు. ఇంటిపారు లోనే ప్రహరీ ఉండాలి. ప్రహరీ గోడలు అన్నీ సమానమైన మందం తో నిర్మించాలి. దక్షిణ పడమరల వైపు ఎక్కువ మందం తో నిర్మించి తూర్పు ఉత్తరాలలో తక్కువ మందంతో ప్రహరీ నిర్మించవచ్చు. ఇలా కాకుండా తక్కువ మందంతో ప్రహరీ ని దక్షిణ పడమరలలో నిర్మించి ఎక్కువ మందంతో తూర్పు ఉత్తరాలలో ప్రహరి కట్టరాదు. 4 వైపులా సమానమైన మందంతో ప్రహరీ కట్టవచ్చును. ఇంటి సింహద్వారంలో గాని ఇతర దర్వాజలో కాని ప్రహరీ గోడ పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బోర్లు టాంకులు మరియు బావులందు ప్రహరీ పిల్లర్లు రాకూడదు.

ప్రహరికి అమర్చే గేట్లు తూర్పు ఉత్తరాలలో ఇంటికన్నా తక్కువ ఎత్తులో ఉంచితే మంచిది. దక్షిణ పడమరల వైపు ఎత్తులో వుంచవచ్చు. అయితే ప్రహరీ గోడ నైరుతి లో ఉన్న ఎత్తుకంటే ఈ గేట్లు ఎత్తులో ఉండరాదు. ప్రహరీ గోడ మధ్య చెట్లు ఉండకూడదు. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రహరీ నిర్మిస్తే  నైసర్గిక వాస్తు దోషాలు తొలగి సుఖ సౌఖ్యాలు పొందవచ్చు.

మరిన్ని శీర్షికలు
weekly horoscope 15th january to 21st january