Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: డిక్టేటర్‌ 
తారాగణం: బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహన్‌, రతి అగ్నిహోత్రి, సుమన్‌, పృధ్వీ, హేమ, షకలక శంకర్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, అజయ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు. 
చాయాగ్రహణం: శ్యామ్‌ కె నాయుడు 
సంగీతం: తమన్‌ 
నిర్మాణం: ఈరోజ్‌ ఇంటర్నేషనల్‌ 
దర్శకత్వం: శ్రీవాస్‌ 
విడుదల తేదీ: 14 జనవరి 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తుంటాడు ధర్మ (బాలకృష్ణ). తన పని తాను చేసుకుపోయే ధర్మ, ఎలాంటి గొడవల జోలికీ వెళ్ళడు. ధర్మ కాత్యాయని (అంజలి) వాళ్ళింట్లో ఉంటాడు. ధర్మ జీవితంలోకి ఇందు (సోనాల్‌ చౌహన్‌) వస్తుంది. ఇందు అన్నయ్య డ్రగ్‌ డీలర్‌ విక్కీ (విక్రమ్‌ జీత్‌). అతని గ్యాంగ్‌ నుంచి ధర్మకి ఓ సమస్య వస్తుంది. ఆ తర్వాత ధర్మ ఫ్లాష్‌ బ్యాక్‌ రివీల్‌ అవుతుంది. అసలు ధర్మ ఎవరు? ఇందు కారణంగా ధర్మ ఎదుర్కొన్న సమస్యలేంటి? అన్నవి తెరపై చూడాల్సిన అంశాలు. 

మొత్తంగా చెప్పాలంటే 
బాలకృష్ణ మరోమారు తెరపై చెలరేగిపోయారు. తన ట్రేడ్‌ మార్క్‌ డైలాగులతో, బాడీ లాంగ్వేజ్‌తో బాలకృష్ణ వన్‌ మ్యాన్‌ ఆర్మీ అనిపించారు. యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో అయితే ఆకాశమే హద్దు అన్నట్లు బాలయ్య కనిపించారు. డాన్సుల్లో కుర్ర హీరోలతో బాలకృష్ణ పోటీ పడేలా చేశారనడం అతిశయోక్తి కాదు. కూల్‌ పెర్ఫామెన్స్‌లోనూ, పవర్‌ఫుల్‌ పెర్ఫామెన్స్‌లోనూ వేరియేషన్స్‌ చూపించారు బాలకృష్ణ. 

అంజలికి పెద్దగా నటించేందుకు స్కోప్‌ దక్కలేదు. అయితే బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా బాగా సూటయ్యింది. తనకు దక్కిన పాత్ర వరకూ న్యాయం చేసింది. నట విషయంలో ఎలా ఉన్నా, సోనాల్‌ చౌహన్‌ గ్లామర్‌ బాగానే ప్రదర్శించింది. అలనాటి హీరోయిన్‌ రతి అగ్నిహోత్రి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సుమన్‌, నాజర్‌, పృధ్వీ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి తదితరులంతా ఓకే అనిపిస్తారు. 

బాలకృష్ణకు ఇలాంటి కథలు కొత్త కాదు. ఎన్నో సినిమాల్లో బాలయ్యను ఇదే తరహాలో చూసేశాం. కమర్షియల్‌ ఫార్మాట్‌ని ఎంచుకున్న దర్శకుడు బాలకృష్ణని ఇంకా బాగా వాడుకుని ఉంటే బాగుండేది. అలాగే, కథనంలో కొత్తదనం కోసం ప్రయత్నించి ఉంటే బాగుండుననిపిస్తుంది. అక్కడక్కడా డైలాగ్స్‌ బాగా పేలాయి. బాలయ్య అభిమానుల్ని అలరిస్తాయి. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే ఉంది. రెండు పాటలు చూడ్డానికీ, వినడానికీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌ పాయింట్‌. చాలా రిచ్‌గా సినిమాని తెరకెక్కించారు. ఎడిటింగ్‌ అక్కడక్కడా ఇంకొచెం అవసరం అనిపిస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. కాస్ట్యూమ్స్‌ బాగున్నాయి. 

కమర్షియల్‌ సినిమాల్ని తెరకెక్కించడంలో ఇప్పటికే శ్రీవాస్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే బాలయ్య లాంటి పవర్‌ఫుల్‌ మాస్‌ హీరోని పూర్తిగా వాడుకోలేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుంది. మాస్‌ కమర్షియల్‌ హంగులతో, అన్నీ సమపాళ్ళలో మిక్స్‌ చేసుకున్నాడుగానీ, కామెడీ అనుకున్నంతగా వర్కవుట్‌ కాలేదు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వరకూ బాగున్నాయి. కొన్ని సీన్స్‌లో శ్రీవాస్‌ ఛమక్కు కనిపించింది. ఓవరాల్‌గా బాలయ్య మార్క్‌ సినిమానైతే తీయగలిగాడుగానీ, బాలయ్య అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అవడంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు శ్రీవాస్‌. ఫస్టాఫ్‌ కాస్త యాక్షన్‌, కాస్త గ్లామర్‌ అన్నట్టుగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనూ అంతే. అక్కడక్కడా పవర్‌ఫుల్‌ సీన్స్‌తో ఓవరాల్‌గా బాగుందనిపిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
'డిక్టేటర్‌' జస్ట్‌ ఓకే 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
movie review