Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sankranti wishes

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిన్నితెర చిద్విలాసం - పి.వి.డి.ఎస్.ప్రకాష్

all about small screen

రిమోట్ బటన్ నొక్కితే చాలు.....చిన్ని తెరపై నవ్వుల్లో కనిపించి, " హాయ్ వ్యూవర్స్," అంటూ ఆత్మీయంగా పలకరించి కార్యక్రమం లోకి సాదరంగా స్వాగతించే వ్యక్తి ఎవరో తెలుసా? యాంకర్...తనకిచ్చిన కార్యక్రమాన్ని జన సామాన్యం లోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలిగే వారథి, సారథి ఆ యాంకర్. కాన్సెప్ట్ ని చక్కగా ఆకళింపు చేసుకోవడం, జనామోదంగా తీర్చిదిద్దడం, యాంకర్ బృహత్తర బాధ్యత. ఆ కార్యక్రమమెలా ఉన్నా సూపర్ డూపర్ హిట్ చేయడం, టీ ఆర్ పీ రేటింగ్ లో ఆ కార్యక్రమాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడంలో యాంకర్ పాత్ర ప్రశంసా పాత్రమనే చెప్పాలి. 'బుల్లితెర ఇంటింటి నేస్తమైన తర్వాత యాంకర్లంతా ప్రతి కుటుంబానికీ ఆత్మీయ బంధువులే అవుతున్నారు. ' స్మాల్ స్క్రీన్ స్టార్ డం ' సొంతం చేసుకుంటున్నారు. అంతే కాదు, సినీ గ్లామర్ ను వెంట తెచ్చుకుని మరీ వీక్షకులను కొంత మంది యాంకర్లు అలరిస్తున్నారు. ఆడిస్తున్నారు. పాడిస్తున్నారు. తమ కనికట్టు మాయాజాలంతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు.

వెండి తెర మెరుపులు
తొలి నాళ్ళలో ప్రభుత్వ కోయిల లాంటి ఒకే ఒక చానెల్ ఉండేది. ' తడి గోడలపై పిడకల తయారీ ' సీమ పందుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు-తెలుసుకోవాల్సిన విషయాలూ అంటూ ఓ తరహా కార్యక్రమాలకే ఆ చానెల్ పరిమితమయ్యేది. ఎపుడో ఓ శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర వేళకు సినీ పాటలను ప్రసారం చేస్తే ప్రేక్షకులకు పండుగే. కొన్ని పరిధులు పరిమితులకు లోబడి రూపొందే ఆ తరహా కార్యక్రమాల నుంచి బుల్లితెర నెమ్మదిగా కళ్ళు విప్పి స్వేచ్చాయుత ప్రపంచాన్నే వీక్షించింది. కట్టూ-బొట్టూ మార్చుకుని కనికట్టు చేయడంలో ఆరిందా తనాన్ని అలవర్చుకుంది. అందమైన యాంకర్లను పరిచితం చేసి ఆహ్లాద కరమైన కార్యక్రమాలతో ఇంటింటా సందడి చేయడం మొదలు పెట్టింది. వీలైనంతమేర పట్ట పగ్గాలు లేని ప్రోగ్రాంస్ ని అందించే ప్రయత్నంలో పడింది. ఇదంతా ప్రైవేట్ చానెల్స్ రంగ ప్రవేశం చేయడంతోనే సాధ్యమైంది. ఆ వరవడిలోనే గ్లామర్ కి గ్రామర్ తెలిసిన  సిల్వర్ స్క్రీన్ సింగారాన్ని అవధుల్లేకుండా వినియోగించుకోవడంలోనూ బుల్లితెర ఆరితేరింది.
' ట్వటీ ఫోర్ ఇంటూ సెవెన్ ' కాన్వాస్ నిండా ఎడ తెరిపి లేని వినోదాన్ని పంచే అవకాశం లభించడంతో స్మాల్ స్క్రీన్ రెడీమేడ్ ఫుడ్ కోసం వెండి తెరపై ఆధార పడింది. పాత, కొత్త సినిమాల్ని అర గంట కాలం చొప్పున ఖండ ఖండాలుగా కత్తిరించేసి మరీ సినీ వినోదాన్ని ఇళ్ళ ముంగిళ్ళ లోకి తీసుకు రావడంతో బాటు ప్రత్యేకించి సినిమా చానెల్స్ పుట్టుకొచ్చి సినిమాల్ని కూడా ప్రసారం చేయడాన్ని ఆనవాయితీగా చేసుకుంది. బుల్లి తెర వామనుడిగా అంత కంతకూ ఎదిగేసరికి వెండి తెర కూడా విస్మయ నేత్రాలతో చూడడం కాకుండా, కొత్త చిత్రాలకు ప్రసార మాధ్యమంగా కూడా మలచుకొంది. ఆ మలచు కోవడం ఏ తారా స్థాయికి చేరిందంటే ముహూర్తం షాట్లు మొదలుకొని ఆడియో వేడుకల నుంచి, రిలీజ్ ఫంక్షన్లు దాటుకుని హీరో హీరోయిన్లు, దర్శక, నిర్మాతల ప్రత్యేక ఇంటర్వ్యూలతో బాటు విజయ యాత్రల విశేషాలకు కూడా అత్యంత శక్తివంతమైన సాధనంగా బుల్లితెర మారిపోవడం ఓ రకంగా   వెండితెరను కూడా శాసించే స్థాయికి చేరుకుందనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే వివిధ కార్యక్రమాల ప్రయోక్తలుగా సినీ కళాకారులకు కొత్త భూమిక దొరికినట్లయింది. కొన్నాళ్ళపాటు బిజీ బిజీగా నటించేసి పెళ్ళయ్యో, మరే ఇతర కారణాల వల్లో, సినిమాలకి దూరంగా ఉండి పోయిన మాజీలు, వారితో బాటు సినీ ప్రభ తగ్గుతుందేమోననే అంచనాలకు కొంతమంది కళాకారులు కూడా బుల్లితెర కార్యక్రమాల్లో బిజీగా మారి పోతుండడం వర్తమాన దృశ్యం.

తెర తారలే యాంకర్లయితే....?
ప్రత్యేక పరిచయం అవసరం లేని జగమెరిగిన సినీ సెలబ్రిటీల ద్వారా ఏ నినాదం బయట కొచ్చినా క్షణాల్లో ప్రపంచానికి చేరి పోతుంది. వరుస ప్రోమోల ఆర్భాటాలు, అలెర్ట్ ల హంగామాలు చేయనవసరం లేకుండా ఓ సెలెబ్రిటీతో ఓ కార్యక్రమం రూపొందుతోందన్న ఓ వార్త చాలు, సదరు ప్రోగ్రాం పై అంచనాలు పెరగడానికి. దాంతో చాలామంది సినీ కళాకారులు స్మాల్ స్క్రీన్ పై బిగ్ ఎంట్ అర్ టైన్ మెంట్ ఇచ్చే ప్రయోక్తలుగా, ప్రజెంటర్ లుగా ముందుకు వస్తున్నారు. కొత్తగా పురుడు పోసుకుంటున్న ఓ కార్యక్రమాన్ని జన హృదయాలు చూరగొనేలా చేయడం అంటే మాటలు కాదు. శతాధిక చానెల్స్ అవిశ్రాంతంగా అహర్నిశలూ ప్రోగ్రాంస్ ని టెలెకాస్ట్ చేస్తూనే ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో చేతిలో రిమోట్ ఉన్న ఏ ప్రేక్షకుడూ ఏ ఒక్క కార్యక్రమం పై దృష్టి నిలప లేని పరిస్థితి దాపురించింది. ఫలానా కార్యక్రమాన్ని ఎందుకు చూడాలి? అని వీక్షకుడు ప్రశ్నిస్తే, కార్యక్రమ రూపకర్తలు ఈ ఆకర్షణ, ఈ వినోదం కోసం చూడాల్సిందే, అంటూ సవాళ్ళను తీసుకుని అతి జాగ్రత్తగా రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఓ మాట, ఓ ఆట, జన సామాన్యంపై త్వరిత గతిన విశేష ప్రభావాన్ని చూపించాలంటే, సెలెబ్రిటీ అవసరం ఎంతైనా ఉంది. అది గమనించిన బుల్లితెర నేడు ఆత్మీయాంకర్లుగా సినీ సెలెబ్రిటీలనే ఎంచుకునేందుకు మొగ్గు చూపిస్తోందంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నాగ్....సామాన్యుడి సిమ్హాసనం
టాలీవుడ్ మన్మధుడిగా రొమాంటిక్ సిన్మాల్తో మెస్మరైజ్ చేస్తున్న అక్కినేని నాగార్జున మాటీవీలో నిర్వహిస్తోన్న మీలో ఎవరు కోటీశ్వరుడు తాజా సీజన్ సంథింగ్ స్పెషల్ గా ముందుకు దూసుకు పోతోంది. గతంలో బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ఓ ప్రముఖ జాతీయ చానెల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయ వంతంగా నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి కి అసలు సిసలైన అనుకరణగా తెలుగులో నాగార్జున ప్రయోక్తగా ప్రసారం అవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా సూపర్ సక్సెస్ బాటలోనే పయనిస్తోందని టీ ఆర్ పీ రేటింగ్స్ చెప్తున్నాయి. అనేకానేక కష్టాలు, కడగండ్లతో వేగిపోతున్న జన సామాన్యంలోని మేధో పరిణితికి పట్టం కట్టే కార్యక్రమంగా ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పాలి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వెండి తెరని ఏలుతున్న ప్రముఖుల్ని ఆహ్వానించి మరీ కార్యక్రమానికి కొత్త శోభని తీసుకొస్తున్న నాగార్జున ప్రజెంటేష విలక్షణంగా ఉందనే ప్రశంసలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. ప్రశ్నలు అడగడంలో హాట్ సీట్ లో పార్టిసిపేట్ చేస్తున్న సామాన్యులు స్ట్రెస్ కి గురి కాకుండా వారిని కూల్ కూల్ గా ఉంచడంలోనూ నాగార్జున అనుసరిస్తున్న పంథాని వేనోళ్ళ కొనియాడుతున్నారు. తానో సినీ సెలెబ్రిటీననే భేషజాన్ని ఇసుమంతైనా కనిపించనీయకుండా పార్టిసిపెంట్స్ కి అత్యంత ఆత్మీయుడైన వ్యక్తిగా తనని తాను ఆవిష్కరించుకోవడంలో నాగార్జున సఫలీకృతుడయ్యాడు.
నాగార్జున తాజా సినిమా సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతి బరిలోకి దిగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సరసన ఆ చిత్రంలో ఓ కథానాయికగా నటించిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ని హాట్ సీట్ లో కూచోబెట్టి తనదైన శైలిలో ప్రశ్నలు కురిపించడం ఆ కార్యక్రమానికి సంబంధించి తాజా సంచలనం. ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచి విచ్చేసి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు పోతున్న ఈ యంగ్ హీరోయిన్ కూడా తన అందంతో కార్యక్రమానికి సరి కొత్త అందం తీసుకొచ్చింది. అంతే కాదు, కార్యక్రమం ప్రారంభానికి ముందు లావణ్య త్రిపాఠి ఓ పాటకు నర్తన చేసి స్టూడియోలో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులను, ఇళ్ళల్లో టీవీ సెట్స్ ఎదురుగా కూచుని తిలకిస్తున్న వీక్షకులను ఎంతగానో అలరించింది.
నాగ్ తో జూ ఎన్.టీ.ఆర్.
సంక్రాంతి సినిమాల్లో సోగ్గాడే చిన్ని నాయన తో పోటీ పడుతూనే నాగ్ గేం షో మీలో ఎవరు కోటీశ్వరుడు లో పార్టిసిపేట్ చేసేందుకు రావడం విశేషం. ఆ సందర్భంగా ఆయన నాన్నకు ప్రేమతో సినిమా విశేషాలు అందులోని తన పాత్రకు సంబంధించి గెడ్డం, హెయిర్ స్టయిల్ కి సంబంధించిన కబుర్లు చెప్పి వీక్షకుల్ని అలరించారు. అంతేకాదు, తన జూనియర్ తో తనకున్న ఆప్యాయతను కూడా కార్యక్రమంలో వ్యక్తీకరించారు.
ప్రతిభ చూపించిన ఇద్దరు సామాన్యులు.
మీలో ఎవరు కోటీశ్వరుల్డు ఇన్ని సీజన్లలోనూ ఇంతవరకు పార్టిసిపేట్ చేసిన ఏ ఒక్క వ్యక్తీ దాటని పాతికవేల్, యాభై వేల ప్రశనల్లో విజేతలైన ఇద్దరు సామాన్యుల్ని కళ్ళ చూసిన ఘనత తాజా సీజన్ లో సంభవించడం విశేషం. ముందు రావణశర్మ పాతిక లక్షల రూపాయల్ని గెలుచుకుని చరిత్ర సృష్టిస్తే..ఆ తర్వాతి ఎపిసోడ్లలో విశాఖనుంచి వచ్చిన అమర్ నాథ్, రోహిత యువ దంపతులు 50 లక్షల రూపాయల్ని గెలుచుకుని రావణశర్మ సృష్టించిన రికార్డుల్ని బద్దలు కొట్టారు. అంతే కాదు, కోటిరూపాయల ప్రశ్నను కళ్ళజూస్తామనే ప్రతినతో కార్యక్రమంలోకి పాల్గొనేందుకు విచ్చేసిన అమర్ నాథ్ తన ప్రతినను నిలబెట్టుకోవడం కార్యక్రమానికి పరాకాష్ట. ఒక్కో ప్రశ్నకు సరైన సమాధానం చెప్తూ, యాభై వేల రూపాయల విజేతగా నిలిచిన అమర్ నాథ్ ప్రతిభకు నాగార్జున కూడా ఎగ్జయిట్ అయ్యి అభినందనలు కురిపించారు. ఇలా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున టీవీ షోలో కూడా తనదైన ముద్రతో దూసుకుపోతుంటే అచ్చం ఆయనలాగే మరికొందరు సినీకళాకారులు కూడా బుల్లితెరపై తమ గ్లామర్  ను పంచుతూ ముందుకు వెళుతున్నారు........   

మరిన్ని శీర్షికలు
save temples documentary movie