Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

అభిమాల‌నుల కోసం ఏం చేసినా త‌క్కువే - ఎన్టీఆర్‌ !

 

 

ఎన్ టీ ఆర్‌... ఈ మూడ‌క్ష‌రాలు చాలు - అభిమానుల‌కు పూన‌కం వ‌చ్చేయ‌డానికి...!

ఎన్ టీ ఆర్ అంటే.. న్యూ టాలీవుడ్ రికార్డ్స్ అంటూ... అభిమానులు కొత్త అర్థం ఇచ్చేస్తుంటారు..!

వాళ్ల న‌మ్మ‌కాన్ని నూటికి నూటొక్క‌శాతం నిల‌బెట్టుకోవ‌డానికి అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తుంటాడు ఎన్టీఆర్‌..! 

 

అందుకే.. సింహాద్రి, ఆది, య‌మ‌దొంగ‌, అదుర్స్‌, బృందావ‌నం లాంటి భారీ విజ‌యాలు అత‌ని ఖాతాలో ప‌డ్డాయి. ఆది, సింహాద్రి.. త‌ర‌వాత నెంబ‌ర్ వ‌న్ త‌నే అన్నారంతా. కానీ.. వ‌రుస ప‌రాజయాల‌తో ఆ స్థానం తృటిలో త‌ప్పింది. అదుర్స్ త‌ర‌వాత ఆ స్థాయి విజ‌యం కోసం చాలా కాలం ఎదురుచూశాడు తార‌క్‌. ఆ నిరీక్ష‌ణ‌కు టెంప‌ర్ తెర దించింది. ఇప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో తో.. మునిప‌టి జోరు అందుకోవాల‌ని చూస్తున్నాడు. 

ఈ సంక్రాంతి బ‌రిలో నాన్న‌కు ప్రేమ‌తో కూడా నిలిచింది. పండ‌క్కి ప‌ల‌క‌రించే తొలి సినిమా ఇదే. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ తో గో తెలుగు జ‌రిపిన స్పెష‌ల్ ముచ్చ‌ట్లు...

 

* సంక్రాంతి శుభాకాంక్ష‌లు...

- థ్యాంక్సండీ.. మీక్కూడా... హ్యాపీ సంక్రాంతి...

 

* చిన్న‌ప్పుడు సంక్రాంతి సంబ‌రాలు ఎలా చేసుకొనేవారు?

- గాలి ప‌టాలు బాగా ఎగ‌రేసేవాడ్ని. అమ్మ, పిన్ని, చెల్లాయిల‌తో బాగా సంద‌డిగా జ‌రిగేది. సినిమాల్లోకి వ‌చ్చాక‌... హంగామా బాగా త‌గ్గింది. బ‌య‌ట‌కు వెళ్లి గాలిప‌టాలు ఎగ‌రేయాల‌న్నా.. ఆస్వేచ్ఛ ఎక్క‌డిది?

 

 

* పండ‌క్కి సినిమాలు బాగా చూసేవారా?

- ఓ.. సినిమాలు లేక‌పోతే సంక్రాంతి పండ‌గ పూర్త‌వ‌దుగా.. పండ‌క్కి ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే.. అన్నీ చూడాల్సిందే.

 

* ఈ సంక్రాంతి పండ‌క్కి నాలుగు సినిమాలొస్తున్నాయ్‌.. ప్రేక్ష‌కుల్ని ఏ సినిమా చూడ‌మంటారు?

- మా సినిమాతో పాటు... మిగిలిన మూడు సినిమాలూచూడండి.. ఎందుకంటే.. అన్ని సినిమాలూ బాగా ఆడాలి. అప్పుడు పరిశ్ర‌మ ప‌చ్చ‌గా ఉంటుంది.

 

* సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు వ‌చ్చేస్తున్నాయి.. ప‌రిశ్ర‌మ‌కు ఇది మంచిదే అంటారా?

- చాలా చాలా మంచిది. ఎందుకంటే తెలుగు సినిమాకు సంబంధించినంత వ‌ర‌కూ సంక్రాంతి ది బెస్ట్ సీజ‌న్‌. నాలుగు కాదు, ఇంకో నాలుగు సినిమాలొచ్చినా ఆడ‌తాయి. ఓసారి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, నాయ‌క్ సినిమ‌లొచ్చాయి.. రెండూ బాగా ఆడాయి.

 

* పెద్ద సినిమాలకు పండ‌గ రిలీజ్‌లు అక్కర్లెద్దు... పెద్ద సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండ‌గ అని దాస‌రి చెబుతున్నారు..

- ఆయ‌న ఏ కాన్సెప్ట్‌లో చెబుతున్నారో?  పెద్దదో, చిన్న‌దో.. సంక్రాంతి సీజ‌న్‌ని మిస్ చేసుకోవాల‌ని ఏ నిర్మాతా అనుకోరు...

 

* మ‌రి థియేట‌ర్లు దొరుకుతాయా?

- ముందస్తుగానే ప్రీపేర్ అయ్యాం క‌దా..?  అనుకొన్న‌న్ని థియేట‌ర్లు దొరక్క‌పోవొచ్చు.. కానీ స‌ర్దుకుపోవాలి..

 

* తొలి రోజు వ‌సూళ్ల రికార్డులకు దెబ్బ ప‌డుతుందేమో?

- నేను రికార్డుల గురించి ఆలోచించిచే మ‌నిషిని కాదండీ. ఇది వ‌ర‌కు ఒక్కొ సినిమా యేడాది ఆడేది. ఆ త‌ర‌వాత సంవ‌త్స‌రం.. ఆ త‌ర‌వాత సిల్వ‌ర్ జూబ్లీ... వంద‌రోజులు... ఇప్పుడంతా ప‌ద్నాలుగు రోజుల సినిమాలే క‌దా.

 

* ఇంత‌కీ నాన్న‌కు ప్రేమ‌తో .... ఎలాంటి సినిమా?

- టైటిల్‌కి త‌గ్గ‌ట్టే.... ఫాద‌ర్ సెంటిమెంట్‌తో సాగే క‌థ‌. ఓ తండ్రి కోసం కొడుకు ఏం చేశాడ‌న్న‌దే.. ఈ సినిమా.

 

* ఇలాంటి లైన్స్‌తో ఇది వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి..

- వ‌చ్చుండొచ్చు. కానీ.. తండ్రి కోసం కొడుకు ఎలా చేశాడు.. అన్న‌ది సుకుమార్ చాలా ఆస‌క్తిగా చూపించారు..

 

* 1 డిజాస్ట‌ర్ త‌ర‌వాత సుక్కుతో సినిమా చేయాలా, వ‌ద్దా అనే మీమాంశలో ప‌డ్డార‌ట‌..

- ఏంటోనండీ.. ఇలాంటి వార్త‌లు నాపైనే ఎందుకు ఎక్కువ‌గా పుడ‌తాయో అర్థం కాదు. ఎన్టీఆర్ హిట్టున్న ద‌ర్శ‌కుడితోనే ప‌నిచేస్తాడ‌ట‌... అంటుంటారు. నేనెప్పుడూ అలాంటి లెక్క‌ల్నిచూసుకొని ఎరుగ‌ను. కానీ.. జ‌నం మాత్రం అలా మాట్లాడుకొంటుంటారు.. సుకుమార్ విష‌యానికొస్తే... అత‌ను తీసిన సినిమాలన్నీచూశా. జ‌గ‌డం ఫ్లాప్ క‌దా, కానీ ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. 1 కూడా న‌చ్చింది.

 

* సుకుమార్ చాలా లేట్ అని.. చాద‌స్తం అదీ ఇదీ అనీ అంటుంటారు..

- కాదండీ.. తాను చాలా క్లారిటీఉన్న ద‌ర్శ‌కుడు. సినిమానికూడా చాలా త‌క్కువ రోజుల్లో పూర్తి చేశాడు..

 

* సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న ఉద్దేశంతో జ్వ‌రంలో ఉండికూడా డాన్సులు చేశార‌ట‌.

- త‌ప్ప‌దండి.. కొన్ని సంద‌ర్భాల్లో జ్వ‌రం.. అదీ ఇదీ అని అనుకోకూడ‌దు.. అభిమానులు సంక్రాంతి సంబ‌రాల కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల‌కు సినిమా అందిస్తాన‌ని మాటిచ్చాను. నాకోసం. వాళ్లు ఎంతో చేశారు, చేస్తున్నారు.. నా వంతుగా నేను చెప్పిన స‌మ‌యానికి సినిమా రిలీజ్ చేయ‌లేనా?   వాళ్ల కోసం ఏం చేసినా త‌క్కువేనండీ..

 

* టెంప‌ర్ రిజ‌ల్ట్‌తో సంతృప్తిగానే ఉన్నారా?

- టెంప‌ర్ ఎంత వ‌సూలు చేసిందీ, ఏం సాదించిందీ అని ప‌క్క‌న పెడితే.. నాపై నాకు న‌మ్మ‌కం క‌లిగించిన సినిమా ఇది. ఓ హోప్ కోసం కొన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. అది నాకు టెంప‌ర్ ఇచ్చింది..

 

* రాజ‌మౌళితో సినిమా ఎప్పుడు... ఇద్ద‌రూక‌ల‌సి గ‌రుడ చేస్తార‌ట‌..

- ఇంకా ఏం అనుకోలేదండీ. రాజ‌మౌళితో సినిమా అన్న‌ది ఇప్పుడు నా చేతుల్లో లేదు.. త‌నే డిసైడ్ చేయాలి... ఇప్ప‌టికే నాతో మూడు సినిమాలు చేశాడు. త‌ను నాకే, తెలుగు చిత్ర సీమ‌కే ప‌రిమితం అవ్వ‌కూడ‌దు. బాలీవుడ్‌, హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేయాలి..

 

* జ‌న‌తా గ్యారేజీ టైటిల్ ఫిక్స్ అయిన‌ట్టేనా?

- వ‌ర్కింగ్ టైటిల్‌గా అనుకొన్నాం.. చివ‌రికి దాన్నే ఉంచేద్దామ‌నిపిస్తోంది..

 

* 25 సినిమాల ప్ర‌యాణం వెన‌క్కి తిరిగిచూసుకొంటే ఏమ‌నిపిస్తోంది?

- అప్పుడే ఇన్ని సినిమాలు అయిపోయాయా అనిపిస్తున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో నా 25వ సినిమా అని మొద‌లెట్ట‌లేదు. ఇన్ని సినిమాలు అయ్యాయ‌ని లెక్క వేసుకోలేదు. ఎవ‌రో ఇది నా 25వ సినిమా అని గుర్తు చేశారంతే. ఎన్ని సినిమాలు చేశాం అనేదానికంటే అభిమానుల్ని ఎంత సంతృప్తి ప‌రిచా అన్న‌దే నాకు కీల‌కం. అలాంటి సినిమాలే ఎంచుకొంటా. ప్ర‌తి సినిమా అభిమానుల‌కు ప్రేమ‌తోనే అందిస్తా..

 

* ఈ సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల అవుతున్న నాన్న‌కు ప్రేమ‌తో కొత్త రికార్డులు సృష్టించాల‌ని కోరుకొంటున్నాం.

- థ్యాంక్సండీ...

-కాత్యాయని

 

మరిన్ని సినిమా కబుర్లు
saptagiri new look