Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: సోగ్గాడే చిన్ని నాయనా 
తారాగణం: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, నాగబాబు, బ్రహ్మానందం, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, అనసూయ, హంస నందిని, అనుష్క (స్పెషల్‌ అప్పీయరెన్స్‌) తదితరులు 
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌ 
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌, సిద్దార్ధ్‌.ఆర్‌ 
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్‌ 
దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల 
నిర్మాత: అక్కినేని నాగార్జున 
విడుదల తేదీ: 15 జనవరి 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
ఓ ప్రమాదంలో చనిపోతాడు జమీందారీ వంశానికి చెందిన బంగార్రాజు. చిలిపి బంగార్రాజు నరకంలో కూడా అమ్మాయిలతో సరసాలాడేస్తుంటాడు. ఇంకోవైపు బంగార్రాజు కొడుకు మాత్రం అమ్మాయిలంటేనే ఆమడ దూరం పారిపోతాడు. పనిలో పడి, పెళ్ళాన్ని కూడా పట్టించుకోడు బంగార్రాజు కొడుకు రాము. తనను పట్టించుకోని తన భర్త నుంచి విడిపోవాలనుకుంటుంది రాము భార్య సీత. కొడుకు, కోడల్ని అలా చూడలేక తల్లడిలిపోతుంది బంగార్రాజు భార్య. తన భర్తని తిడుతూ, భూలోకానికి రమ్మని వేడుకుంటుంది. ఇది ఈశ్వరేచ్ఛ అంటూ యముడు, బంగార్రాజుని భూమ్మీదకు పంపిస్తాడు. ఆ తర్వాత బంగార్రాజు ఏం చేశాడు? కొడుకుని ఎలా మార్చాడు? అన్నది తెరపై చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
అమాయకుడిగా బాగా చేసిన నాగార్జున, బంగార్రాజు పాత్రలో అయితే చెలరేగిపోయాడు. స్టైలిష్‌ నాగార్జున, అచ్చం పల్లెటూరి బంగార్రాజులా జీవించేయడం చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. చాలాకాలం క్రితం ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న అనేక సినిమాల్లో నాగార్జు నటించాడు. ఆనాటి ఎనర్జీ, దానికి తోడు మెచ్యూరిటీ అన్నీ కలగలిసి నాగార్జున సోగ్గాడి పాత్రలో అద్భుతంగా చేశాడు. నాగార్జున అదుర్స్‌ అనకుండా ఉండలేరు ఈ సినిమాలో అతన్ని చూశాక ఎవరైనా. 

రమ్యకృష్ణ 'బాహుబలి' తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఈ చిత్రంలో చేసింది. తన పాత్రకు ప్రాణం పోసింది. నాగ్‌ చిలిపి చేష్టలు, దానికి రమ్యకృష్ణ సిగ్గుపడే సన్నివేశాలు అద్భుతః అనాల్సిందే. లావణ్య త్రిపాఠి చాలా బాగా చేసింది. క్యూట్‌గా ఉంది. నాజర్‌, సంపత్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మీ కాస్త నవ్వించాడు. అనసూయ, హంసానందిని అలా అలా మెరిపించారు. అనుష్క, నాగార్జున కోసం కాస్సేపు కనిపించింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

కథ మరీ కొత్తదేమీ కాదుగానీ, కథనంతో మెప్పించాడు దర్శకుడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని కలుపుకుని, ఎంటర్‌టైనింగ్‌గా సినిమాని తీర్చిదిద్దాడు. డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ కూడా బావుంది. పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ ఓకే. ఇంకాస్త అవసరం అన్పిస్తుంది కొన్ని సన్నివేశాల్లో. సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌ అయ్యింది. కాస్ట్యూమ్స్‌ పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా ఉంటూనే, మోడ్రన్‌గా కూడా బాగా డిజైన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా హెల్పయ్యింది. 

కొత్త దర్శకుల్ని ఎంకరేజ్‌ చెయ్యడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. ఫెయిల్యూర్స్‌ వచ్చినా, నాగ్‌ కొత్త దర్శకుల్ని నమ్మడం మానలేదు. అదే అతనికి కొత్త దర్శకులపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. కొత్త దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ, స్టార్‌ హీరో నాగార్జునని డీల్‌ చేసే క్రమంలో తప్పటడుగు వేయలేదు, నాగ్‌ అతనిపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. సీన్‌ టు సీన్‌ చాలా జాగ్రత్తగా తీశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ కాకుండా, కథనం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా తీసుకున్నాడు. ఆకట్టుకునే అంశాలతో, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌, కొంచెం ఎమోషన్‌, అన్నిటికీ మించి మన్మధుడు నాగార్జునతో చిలిపి చేష్టలు చేయించడం అన్నీ బాగా సెట్‌ చేసుకున్నాడు దర్శకుడు. నాగ్‌, రమ్యకృష్ణ మధ్య చిలిపి రొమాంటిక్‌ సీన్స్‌ సింప్లీ సూపర్బ్‌. ఇక్కడే దర్శకుడు హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. 

ఫస్టాఫ్‌ హాయిగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనూ అంతే. ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఆడియన్స్‌ని కట్టి పడేశాయి. అక్కడక్కడా జర్క్‌లు మినహాయిస్తే ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
సక్సెస్‌ కొట్టేశాడే ఈ సోగ్గాడే.. 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5 

మరిన్ని సినిమా కబుర్లు
movie review