Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక



 గతసంచికలో ఏం జరిగిందంటే.. http://www.gotelugu.com/issue144/407/telugu-serials/vedika/vedika/

మూడేళ్ళ తరువాత...... 

డాన్స్ క్లాస్ ముగిసే సమయానికి, నా అసిస్టెంట్ రాగిణి, మెసేజ్ నోట్ అందించి వెళ్ళింది....

స్టూడెంట్స్ చేత నమస్కారం చేయించి, మరునాటి డాన్స్ ప్రోగ్రాం విషయంగా  కొన్ని సూచనలిచ్చి పంపేసాను.

మెసేజ్ నోట్  పంపిన వారు, సుసర్ల శర్మ గారు... అమెరికాలోని, హ్యూస్టన్-గాల్వెస్టన్ ఇండియన్ కమ్యూనిటీలో మంచి పేరున్న వ్యక్తి. పెద్దాయన. 

ఆయన సహాయ సహకారాలతోనే,  గాల్వెస్టన్ లో,  డాన్స్ స్కూల్ బ్రాంచ్  స్థాపించగలిగారు, తేజశ్విని గారు.  నా అజమాయిషీలోనే, వందకి పైగా స్టూడెంట్స్ డాన్స్ నేర్చుకుంటున్నారు.. 

అలసటగా ఉన్నా, వారిని కలవడానికి, స్టూడియో వెయిటింగ్ రూమ్ లోకి వెళ్లాను.. 

నన్ను చూస్తూనే, లేచి గ్రీట్ చేసారాయన. వెంట ఆయన భార్య కుమారి కూడా ఉన్నారు..  ఇద్దరూ శివ పార్వతుల్లా  ఉంటారంటుంది అమ్మ. ఈ మధ్య హ్యూస్టన్ వచ్చినప్పుడు, అమ్మా వాళ్ళకి,  వీరితో మంచి స్నేహం కుదిరింది.

“నమస్తే,  ఎలా ఉన్నారు?” వెళ్లి ఎదురుగా కూర్చున్నాను.

“ఏం లేదమ్మా.  మా కిచెన్ గార్డెన్ నుండి ఈ  కూరగాయలు నీకిచ్చి వెళదామని ఇటుగా వచ్చాం.  దొండకాయ, కాకరగాయ నీకు ఇష్టమని చెప్పింది మీ మమ్మీ,” అంది ఆంటీ...

“థ్యాంక్స్ ఆంటీ, అమ్ముంటే వెంటనే వండేస్తుంది కూడా,” టేబిల్ మీద ఉంచిన ప్లాస్టిక్ బాగ్స్ ని చూస్తూ, నేను...

“ఔనూ, అమ్మా వాళ్ళు వెళ్లి కూడా వారం రోజులయిందిగా?  మేమంతా వాళ్ళని తలుచుకుంటున్నామని చెప్పు.  వాళ్ళున్నన్నాళ్ళు  సరదాగా ఉండేది. పిల్లల్ని, డాన్స్ క్లాసులో దింపి, అమ్మతో,  సి-వాల్ పొడుగునా వాకింగ్ చేసి, బీచ్ కి వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం.  మొత్తానికి మూడు నెలల పాటు,  శనాదివారాలు మంచి కాలక్షేపంగా  ఉండేది వాళ్ళతో,” మళ్ళీ కుమారి గారు...

“ఔనండి...వాళ్ళు కూడా మీ కంపెనీ ఎంజాయ్ చేసారు... ఇక్కడ పరిచయమైన వారందరి గురించి తలుస్తూ ఉంటారు,” అన్నాను...  

శర్మ గారు కల్పించుకున్నారు... “చూడమ్మా చంద్రకళ.........నిన్నో సంగతి అడగాలని కూడా ఇలా వచ్చాము,” అన్నారాయన...

’చెప్పండి’ అన్నట్టుగా ఆయన వంక చూసాను..

“మీ పేరెంట్స్ వెళ్ళే ముందు, మన  డాన్స్ స్కూల్ వార్షికోత్సవం అయింది కదా.   అక్కడ కలిసినప్పుడు, మాటల్లో మీ నాన్నగారు ఓ సంగతి చెప్పారు,” క్షణమాగి, ఓ సారి తదేకంగా నా వంక చూసారు....

“అదేనమ్మా, త్వరలో నీవు తిరిగి ఇండియాకి వెళ్ళిపోతావన్నట్టు సూచించారాయన.  అదే నిజమైతే, మరి మా పిల్లల క్లాస్ ఎలా జరుగుతుంది? 

నీ శిక్షణలో వారికి డాన్స్ తో పాటు, మన సాంప్రదాయం కూడా వంటబడుతుంది.  అలాంటిది, ఉన్నట్టుండి నీవు వెళ్ళిపోతావేమోనని మాకు కాస్త దిగులు గానే ఉంది,” ఆగారాయన....

నేను జవాబు చెప్పేలోగా, కుమారి గారు అందుకున్నారు... “చూడు తల్లీ, నీకు మంచి వరుణ్ణి చూసి, పెళ్లి చేసి, ఇక్కడే ఉంచేయాలని మా ఆలోచన.  

త్వరలోనే నీ వివాహం జరిపించాలని మీ అమ్మ కూడా చాలా సార్లు మాతో అన్నారు. వరాన్వేషణ మొదలు పెట్టడానికి మేము సిద్దం....మరి నువ్వేమంటావ్?” అడిగారామె...

వారిద్దరి మాటలు విని, నవ్వేసాను.

“చూడండి, శర్మ గారు.. వారి మొదటి విజిట్ నుండే,  నన్ను తిరిగి వచ్చేయమంటున్నారు, మా అమ్మావాళ్ళు.  మా నాన్న గారైతే, 
పట్టు బడుతున్నారు కూడా. 

మరి నేను వచ్చి అప్పుడే మూడున్నరేళ్ళు గడిచాయి కదా!” ....క్షణమాగాను...

“నిజానికి, నాకూ ఇండియాకి వెళ్ళాలనుంది...కాకపోతే, ఎప్పుడనేది, ప్లాన్ లేదు...  నేను వెళ్ళేదుంటే మాత్రం,  తేజశ్విని మేడమ్ తప్పకుండా ఆల్టర్ నేటివ్  ఆలోచిస్తారు... కాబట్టి, మీరు బెంగ పెట్టుకోకండి.. మీ అభిమానానికి కృతజ్ఞతలు,” అంటూ వారి నుండి సెలవు తీసుకున్నాను.

**

కార్ డ్రైవ్ చేస్తూ,  శర్మ గారితో నా సంభాషణ గుర్తు చేసుకున్నాను.  అమెరికాలో నేనడుగిడి అప్పుడే  మూడున్నరేళ్ళు అవుతుందని కూడా గుర్తు చేసుకున్నాను... 

తేజశ్విని గారి ఆధ్వర్యంలో మెలుగుతూ, కళా రంగంలో ఎంతో చూసాను, ఎంతో చేసాను. ఎన్నెనో అనుభవాలు... ఒక్కోప్పుడు ఉత్సాహంగా ఉంటుంది...

మరోప్పుడు దిగులుగా, అసహనంగా ఉంటుంది. 

తెజేశ్విని గారు మాత్రం, నా రాక తమ ఆర్ట్స్ ఇన్స్ టిట్యూట్ కి ఓ కొత్త వొరవడి తెచ్చిందంటారు.  ఆ ఉత్సాహంతో,  ఇతర ప్రాంతాల్లో తమ డాన్స్ స్కూలు బ్రాంచీలు స్థాపించారు కూడా.  

అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే పద్ధతి కొంచెం కొత్తగా అనిపిస్తుంది...... నాట్యాభ్యాసన ఇక్కడ వారికి  ఓ కాలక్షేపమే అనిపిస్తుంది.. 

ఏమైనా, ఇక్కడి కళారంగ వాతావరణం  నాకు  అంతగా రుచించలేదు...... 

అసంతృప్తిగా ఉంటుంది....

ఈ మూడున్నరేళ్ళల్లో, అమ్మ ఓ మారు, నాన్న ఓ మారు, ఇద్దరూ కలిసి మరోసారి నా వద్దకు వచ్చి వెళ్ళారు. 

నేను చేస్తున్న కృషి, నాకందుతున్న గుర్తింపు చూసారు... ఇక్కడి కళా రంగ వాతావరణం వారికి కూడా అంతగా రుచించలేదన్నారు.అదీ గాక, త్వరలోనే నా పెళ్లి జరిపించాలని, అమ్మ ఆరాట పడుతుంది.  

దాంతో, మొన్నటి సారి వచ్చినప్పుడు, నన్నిక తిరిగి చెన్నై వచ్చేయమని వొత్తిడి చేయసాగారు నాన్న.

ఆ విషయంగా,  ఆయనకి, ఇక్కడ నా పరిస్థితి వివరించాలని, ఓ మారు గట్టి ప్రయత్నమే చేసాను.

జీతం పెంచడమే కాక,  తేజశ్విని గారు, నా కోసం టౌన్–హోమ్  తీసుకుని, కారు కూడా కొన్నారని నాన్నకి గుర్తు చేసాను.  మరో ఏడాది వరకు ఏర్పాటయిన క్లాసులు, శిష్యుల ‘రంగ ప్రవేశ కార్యక్రమాలు అకస్మాత్తుగా మధ్యలో వదిలి రాలేనని నాన్నకి అర్ధమయ్యేలా చెప్పడం ఒక అవస్తే అయింది.  

అదంతా వింటున్న అమ్మ, కూడా కలగ జేసుకుంది....

“చూడమ్మా చంద్రా, మన జగదీష్ చదువయి, జాబులో చేరబోతున్నాడు. 

నీవిక్కడికి వచ్చి మూడేళ్ళయింది.  ఇంటికి తిరిగి రావాల్సిన సమయమే కదా, పెళ్లి చేసుకోడానికిక్కూడా సరయిన సమయం. 

కాబట్టి, మీరిద్దరూ కూడా,  భూషణ్ గారి విషయం అంటూ, ఇక సమయం వృధా చేయడం సరికాదు.  పెళ్లి జరిగిపోవాలి...తేజశ్విని గారితో మాట్లాడి ఇక్కడ ఈ పనులు కానిచ్చి వచ్చేయమ్మా చంద్రా,” అంటూ తన అభిప్రాయం తెలిపింది. ....

జగదీష్ తో ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉంటాను.  

హౌజ్-సర్జెన్సీ కూడా కంప్లీట్ అవబోతుందని,  నన్నిక ఇండియాకి తిరిగి వచ్చేయమని చెబుతున్నాడు.  రాణి అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చి మణత్తయ్య తో గడిపి వెళుతుందని  కూడా చెబుతుంటాడు. 

‘పోనీ రాణితోనే సెటిల్ అయిపోరాదా? నా జీవితాన్ని కళాసేవలో గడిపేస్తాను’

అని ఓసారి గమ్మతుగానే  జగదీష్ తో అన్నప్పుడు, నవ్వేసాడు. 

అలాగైతే, తను కూడా తన జీవితాన్ని, బీదవారికి వైద్య సేవలందిస్తూ, అందరికీ  దూరంగా అటవీ ప్రాంతాల్లోని మెడికల్ క్యాంప్స్ కి పని చేస్తానన్నాడు. 

ఆ సంభాషణ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది..

ఇదంతా పక్కన పెట్టినా, అంకుల్  కుటుంబ పరిస్థితిలో కాని, రాణి పద్ధతిలో కాని ఎటువంటి మార్పు లేకపోవడంతో, జగదీష్ తో నా  జీవితం మీమాంస గానే ఉండి పోతుందేమో  అని అశాంతిగా ఉంటుంది. 

**

గరాజీలో కారు పార్క్ చేసి, ఇంటి ఎంట్రెన్స్ వైపు నడిచాను...

ఫ్రంట్ డోర్ తాళం తీయబోయి, తలపు తెరిచే ఉందని గ్రహించాను.  

తేజశ్విని గారి వద్ద మాత్రమే డూప్లికేట్ ఉంది కదా, అనుకుంటూ మెల్లగా తలుపు పక్కకి తోశాను.   హాల్లో ఆవిడే కూర్చుని ఉన్నారు.  ముఖంలో అసహనం తాండవిస్తుంది.. అలికిడికి తలెత్తి చూసారావిడ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam