Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Love at 2nd Sight - Telugu Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

దేశానికి స్వాతంత్రం వచ్చి వచ్చే ఏటికి  70 ఏళ్ళవుతుంది.  ఇదివరకటి రోజుల్లో అంతగా తెలిసేది కాదు కానీ, గత కొన్ని సంవత్సరాలుగా తెలుస్తోంది, మన ఆర్ధికవ్యవస్థ, నల్ల ధనం మూలంగా  ఎంతగా ప్రభావితమయిందో. సమాచార వ్యవస్థ ధర్మమా అని, అసలు నల్ల ధనం అంటే తెలిసింది. కనీసం అందుకైనా నోచుకున్నాము.

ఇదివరకటి రోజుల్లో ఇంటి పెద్దాయన ఏదో ఉద్యోగం చేసి, సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. తన సంపాదనకి అనుగుణంగా, పిల్లల చదువూ సంధ్యా, పెళ్ళిళ్ళు పూర్తిచేసి తన బాధ్యతలు నెరవేర్చేవాడు. రిటైరయ్యేనాటికి , ఏ తెలిసినవారిదగ్గరో నోటు వ్రాసో, పరపతినిబట్టి నోటిమాట ద్వారానో, అప్పో సొప్పో చేసి, ఏ కట్నంలోనో స్త్రీధనం ద్వారా వచ్చిన స్థలంలో ఓ ఇల్లు , సాధారణంగా ఓ పెంకుటిల్లు ఏర్పాటుచేసికునేవాడు. ఏదో తను పోయినప్పుడు, తన పార్ధీవదేహాన్ని, మరీ బయట పెట్టాల్సిన అవసరం లేకుండా, స్వంత ఇంటినుండే సాగనంపించుకోడానికి. ఏ పూజచేసేటప్పుడో, సంకల్పం చెప్పుకునేటప్పుడు, మరీ “ వసతి గృహే” అనక్కర్లేకుండా “ స్వగృహే “ అనుకోవచ్చని.  ఆరోజుల్లో  అసలు బ్యాంకులే తక్కువ. చాలామట్టుకు సహకార బ్యాంకులే ఉండేవి. భూతనఖా బ్యాంకులుకూడా ఉండేవి. ఉన్న భూమేదో తాకట్టుపెట్టి, అప్పుతీసికోడానికి. అయినా ఆరోజుల్లో బ్యాంకులు కూడా  నిజాయితీగా ఉండేవి. మరీ ఈరోజుల్లోలాగ, రాత్రికిరాత్రే దివాళా తీసే రకం కాదు. అవడం ప్రెవేటు బ్యాంకులైనా ఓ బాధ్యతతో పనిచేసేవారు. కాలక్రమేణా ఇందిరాగాంధీ గారి ధర్మమా అని చాలా బ్యాంకులని జాతీయం చేసేశారు. పూర్వకాలం వారు, ఇప్పటికీ, ఆ జాతీయ బ్యాంకుల్నీ, పోస్టాఫీసులనీ మాత్రమే నమ్ముతారు.  చాలా మట్టుకు సహకార బ్యాంకులు మూతపడ్డట్టే.  ఒకానొకప్పుడు సహకార బ్యాంకులు తెరవడానికి పెద్దగా రూల్సూ, రెగ్యులేషన్లూ ఉండేవి కావు. ఓ నలుగురైదుగురు డబ్బున్న ఆసామీలు, కొంత మూలధనం పెట్టుకుని ఓ సహకార బ్యాంకు తెరిచేసేవారు.  ఊళ్ళో తెలిసినవారందరిచేతా ఓ ఎకౌంటు తెరిపించడం. అలా పోగుబడ్డ డబ్బుని, ఆ బ్యాంకు వ్యవస్థాపక మండలిలోవారే అప్పుగా తీసికోడం. వాళ్ళు ఉన్న డబ్బంతా అప్పుగా తీసేసికున్నారని మిగిలిన జనాలకి తెలిసే అవకాశాలు కూడా తక్కువే. అకస్మాత్తుగా ఓరోజు, తెల్లారేసరికి బ్యాంకులకి తాళాలు కనిపించేవి. డబ్బులు దాచుకున్నవాళ్ళు కుయ్యో మొర్రో అని గుండెలు బాదుకునేవారు.

అదేదో సహకార బ్యాంకులకే కాదు, ప్రభుయ్వ బ్యాంకులకి కూడా పాకుతోంది. తేడా ఏమిటంటే ప్రభుత్వ బ్యాంకులు మరీ దివాళా తీయవు,. ప్రభుత్వమే  ఏదో సహాయం చేసి గట్టెక్కిస్తూంటుంది.  అయినా ఏడాది తిరిగేసరికి అవేవో    N P A  ల పేరుతో  మొండి బకాయిలు మాత్రం పాపం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరగవూ, మనం వెళ్ళి  నిజాయితీగా అప్పడిగితే, ఎక్కడలేని అల్లరీ పెట్టి, నానాగొడవా చేసి ముప్పుతిప్పలు పెడతారు. అదే ఓ దౌర్భాగ్యపు రాజకీయనాయకుడు వెళ్ళి అప్పడగడం తరవాయి, వాడికి మంగళహారతులు పట్టి, వాడు అడిగినదానికంటే ఎక్కువిస్తారు. వాడు తీసికోడం వరకే,  అప్పు తీరుస్తాడో తీర్చడో ఆ భగవంతుడికే తెలియాలి. సమాజం లో  so called  పరపతి ఉన్న సినిమావాళ్ళూ, వ్యాపారస్థులదీ కూడా ఇదే రంధి. ఈమధ్యన చదివాము, అదేదో పెద్ద బట్టల దుకాణం వాళ్ళు రెండుమూడు బ్యాంకుల దగ్గర కోట్లకి కోట్లు అప్పుచేసి, చివరకి టోపీ పెట్టారుట.  వాళ్ళు ఈ మూడు బ్యాంకులకీ ఒకే  స్థిరాస్థి కాగితాలు పెట్టి అప్పు తీసికున్నారట. అవేం బ్యాంకులండి బాబూ.. మనం అప్పుకి వెళ్తే కోడిగుడ్డుకి వెంట్రుకలు లెక్కపెడతారే  మరి వీళ్ళకి అంతంత అప్పులెలాఇస్తారండి బాబూ? అలాగే సినిమావాళ్ళొస్తే ఈ బ్యాంకులవాళ్ళకి ఒళ్ళు తెలియదు. అడగడం పాపం, ఇవ్వడానికి రెడీ. వాడు తిరిగి ఇవ్వకపోతే కోర్టులున్నాయి. యుగాలు గడిచినా ఆ అప్పు మాత్రం తీరదు.

సాదా సీదా జనాలు అప్పు తీసికుంటే మాత్రం, ఆస్థులు వేలం వేసేస్తారు. ఇంకో వార్త --  నిన్న వాడెవడో దొంగబంగారం తాకట్టు పెట్టి 52 లక్షలు అప్పు తీసికున్నాడట. అదీ ఓ ప్రెవేటు బ్యాంకూ, ఇంకోటి ప్రభుత్వ బ్యాంకూ..  మనం బంగారం తీసికెళ్ళి అప్పడిగితే, మంచి బంగారమైనా నానా తిప్పలూ పెడతారే, అలాటిది రెండేసి బ్యాంకులని ఎలా మోసం చేశాడంటారు?  బ్యాంకువాళ్ళకి అలాటి మోసాలు తెలియదంటే నమ్మే విషయమేనా?

 ఇంక నల్లధనం తీయిస్తారని నెలకోసారి చెప్పి ఊరుకోబెడుతూంటారు..  తెచ్చేదీ లేదు పెట్టేదీ లేదు. పదేళ్ళనుండి వింటున్నాం.. అయినా అదో కాలక్షేపం…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
vastu vastavalu