Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్ M. A ( జ్యోతిష్యం)

ద్వారాల అమరిక –తీసుకోవలసిన జాగ్రత్తలు.

పూర్వకాలంలో నిర్మించే గృహాలకు గృహ మధ్యభాగంలో వచ్చే విధంగా దర్వాజాలను అమర్చేవారు. కానీ నేటి కాలంలో  యే నిర్మాణానికైనా మధ్యలో కాకుండా ఉచ్చ స్థానాలలో దర్వాజాలను అమర్చుతున్నారు. ఈ రెండు పద్దతులు సరైనవే. అయితే ఉచ్చ స్థానాలలో దర్వాజాలు ఉంటే మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం. ఏ నిర్మాణానికైనా దర్వాజాలు తప్పనిసరి. యే నిర్మాణానికైనా మంచి స్థానాలలో దర్వాజాలను అమర్చాలి. మంచి స్థానాలలో ఉండే దర్వాజాల వలన మంచి నడక వస్తుంది. మేరుగైన జీవితం ఉంటుంది. చెడు దిశలలో దర్వాజాలను ఉంచినట్లైతే చెడు దిశల గుండా నడక సాగి సమస్యలు వస్తాయి. కనుక దర్వాజాలు అమర్చే సందర్భంలో అనేక జాగ్రత్తలను మనం తీసుకోవాలి.

పాత గృహాలకు దర్వాజాలను ఇంటి మధ్యభాగంలో, గృహ కొలతను సగం చేసి కొంచెం ఉచ్చ స్థానానికి వచ్చే విధంగా దర్వాజాలను అమర్చేవారు. అంటే ప్రధాన దిక్కులందు దర్వాజాలను పెట్టేవారు. దిక్కును 9 భాగాలుగా చేసి, ఈ భాగాలను 9 గ్రహాలకు విభజించి మంచి గ్రహ ఆదిపత్యం లో ఉన్న స్థలంలో సుమారు సెంటర్ నందు దర్వాజ అమర్చే వారు.  పురాతన గృహాలు దాదాపుగా పూరిళ్ళు, నిట్టాడు గృహాలు. ఇటువంటి గృహాలకు గృహ మధ్య భాగంలో దర్వాజా ఉంచితే పై కప్పు బరువును దర్వాజా సమానంగా మోస్తుంది. పై కప్పును సమానంగా మోసే నిమిత్తమై దర్వాజాను మధ్యలో ఉంచేవారు. ఇప్పుడు నిర్మాణ రంగం బాగా వృద్ది చెందింది. అనేక మార్పులు వచ్చాయి. పై కప్పును మోయడానికి పిల్లర్లు,బీమ్ లు ఉన్నాయి. దర్వాజాలను మధ్యలో కాకుండా ఉచ్చ దిశలైన  ఈశాన్యం, పడమర వాయవ్యం, దక్షిణ ఆగ్నేయం లో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి అన్నది నేటి భావన. ఉచ్చ స్థానాలలో దర్వాజాలు ఉంచితే మంచి దిశలగుండా నడక సాగి మెరుగైన జీవితం ఖచ్చితంగా వస్తుంది. కనుక ఉచ్చ దిశలలో ద్వారాలు ఉంచుట మంచిది. ఈ దిశలగుండ నడక సాగినట్లైతే మంచి జీవితం ఉంటుంది అన్నది అనుభవం ద్వారా తెలుసుకొన్న అంశం.

తూర్పు ముఖంగా ఉండే గృహాలకు తూర్పు మరియు తూర్పు ఈశాన్యం నందు దర్వాజాలను ఉంచవచ్చు.  18, 12, లేదా 9 అంగుళాల కట్ట ను ఉంచి తూర్పు ఈశాన్యంలో దర్వాజను అమర్చితే చాలా మంచిది.  ఈ దర్వాజకు ఎదురుగా పశ్చిమ వాయవ్యంలో కూడా దర్వాజాను ఉంచితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక వేళ సెంటర్ దర్వాజాను ఉంచాలనుకొంటే గృహ కొలతను సగం చేసే కొంచెం ఉచ్చ దిశ అయిన ఈశాన్యం నకు జరిపి డోర్ ఉంచాలి. అయితే ఇటువంటి సందర్భం లో ద్వారానికి ఇరు వైపులా కిటికీలు తప్పని సరిగా ఉంచాలి. అదే విధంగా దక్షిణ ముఖంగా నిర్మించే గృహానికి తప్పనిసరిగా దక్షిణ ఆగ్నేయంనందు ద్వారం అమర్చాలి. దక్షిణం సెంటర్ లో దర్వాజను అమర్చడం అంతా మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయంలో దర్వాజాను ఉంచి దానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యం లో ద్వారం అమర్చాలి. ఉత్తరం లో ద్వారం లేకుండా దక్షిణం లో ద్వారం ఉంచకూడదు. పశ్చిమ ముఖ గృహానికి పడమర వాయవ్యం లో దర్వాజ ఉంచాలి. పడమర సెంటర్ లో డోర్ ఉంచకూడదు. పడమర వాయవ్యం లో డోర్ ఉంచి దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యం లో డోర్ ఉంచాలి. తూర్పున డోర్ లేకుండా పడమర వైపు డోర్ ఉంచరాదు. ఉత్తర ముఖంగా నిర్మించే గృహానికి ఉత్తర ఈశాన్యం లేదా ఉత్తరం సెంటర్ లో డోర్ ఉంచవచ్చు. ఈ డోర్ కు ఎదురుగా దక్షిణ ఆగ్నేయం లో డోర్ ఉంచుట మంచిది. ఈ డోర్ అమరిక వలన ఆడపిల్లల వివాహాలు త్వరగా తృప్తికరంగా జరుగుతాయి. ఉత్తరం సెంటర్ లో డోర్ ఉంచితే తప్పనిసరిగా డోర్ కు ఇరువైపుల కిటికీలను ఉంచాలి.

మరిన్ని శీర్షికలు
veekshanam