Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vastu vastavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పిట్స్ బర్గ్ 


అమెరికాలో మన ఆలయం అనగానే చాలామందికి ముందు గుర్తొచ్చేది పిట్స్ బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.  దానికి కారణం అమెరికాలో హిందూ పధ్ధతిలో నిర్మింపబడిన మొదటి ఆలయాల్లో ఇదీ ఒకటి.

జూన్ 30, 1976లో శంఖు స్ధాపన జరిగిన ఈ ఆలయంలో నవంబర్ 17, 1976లో విగ్రహ ప్రతిష్ట జరిగింది.  ప్రతిష్ట జరిగిన రోజునుంచీ ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి.  ఇక్కడ పంచరాత్రాగమనాన్ని అనుసరిస్తారు.

ఈ ఆలయంలో అర్చనలు, అభిషేకాలేకాక భక్తుల కోరిక మీద సత్యన్నారాయణ వ్రతాలు, వివాహాలు ఇంకా ఇతర శుభ కార్యాలు కూడా జరుగుతూ వుంటాయి.  వీటికి రుసుములుంటాయి.  భక్తులు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వీలుగా ఆలయంలో వసతి సౌకర్యం కూడా వున్నది.  దీనికీ కొంత రుసుము చెల్లించాలి.

ఆలయ నిర్మాణానికి అయిన మిలియన్ల డాలర్ల ఖర్చు అమెరికాలోని, ఇంకా ఇతర దేశాలనుంచి కూడా భక్తులు సమర్పించారు.  తిరుమల తిరుపతి దేవస్ధానం కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహాయం చేసింది. 

ఆలయం ప్లాను అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ఎండౌమెంట్స్ డిపార్టుమెంట్లో ఇంజనీరింగ్ సెల్ ఉద్యోగి శ్రీ గణపతి స్ధపతిచే రూపొందించబడింది.

ఆధ్యాత్మికంగానేకాక సామాజికంగా కూడా ఈ ఆలయం ట్రస్టు వారు అనేక సేవలు చేస్తున్నారు.  ఆసక్తి వున్నవారికి శని, ఆదివారాలలో సంస్కృతం, తమిళం, కన్నడ, తెలుగు భాషలు, నాట్యం, సంగీతము, శ్లోకాలు నేర్పుతారు.

ఉపాలయాలలో గణేష్, శివుడు, పార్వతి కొలువు తీరి వున్నారు.

27-6-2008న పగలు 11గం.లకు లాన్సింగ్ లో బయల్దేరిన మేము, మధ్యలో లంచ్ చేసి, పిట్స్ బర్గ్ లోని వెంకటేశ్వర ఆలయం చేరుకునేసరికి రాత్రి 7 గం.లయింది.  అక్కడ 8-30 దాకా వున్నాము.  ఆ రోజు అక్కడ కొత్త వంటశాల ప్రారంభోత్సవం జరుగుతున్నదని, అప్పుడు అక్కడ వున్న వారందరిని రమ్మన్నారు.  పూజా సామానుతోపాటు మేళాలతో కిచన్ దాకా వెళ్ళాము.  వాళ్ళు పూజ మొదలు పెట్టాక అక్కడనుంచి బయల్దేరాము.

కేంటీన్

అమెరికాలో దాదాపు ప్రతి ఆలయంలో కేంటీన్ వుంటుంది.  అక్కడ మంచి ఆహారం కూడా దొరుకుతుంది.  సాధారణంగా అక్కడ ఆలయాలకి వెళ్ళినవాళ్ళు అక్కడ దొరికే ఆహారం తినకుండా రారు.  పాపం. మన దేశానికి దూరంగా వుంటారు.  అందరికీ అన్నీ చేసుకోవటం రాదు.  అవివాహితులు చాలామందే వుంటారు.  వారందరికీ ఒక రోజు దేశీయ భోజనం అంటే పండగే.

మౌంట్ వాషింగ్టన్

పిట్స్ బర్గ్ నుంచి పక్కనే వున్న మౌంట్ వాషింగ్టన్ కి వెళ్ళాము.  ఇది కొంచెం నిటారుగా వుండే కొండ.  ఈ కొండ, దీనిమీద బిల్డింగ్స్ అమెరికాలో అందమైన ప్రదేశాలలో ఒకటి అంటారు.  రాత్రిపూట ఆ కొండ మీదనుంచి కింద కనబడే అద్భుతమైన దృశ్యాలు – కింద ఎలిగెనీ రివర్, దానిమీద వంతెనలు, ఎత్తయిన బిల్డింగ్స్, లైట్స్ చాలా అందంగా వున్నాయి.  ఈ దృశ్యాలని చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తారు.

అక్కడనుంచి ఇంకో గంట ప్రయాణం చేసి రాత్రి బస వీలింగ్ లోని హేమ్టన్ ఇన్ లో.... 

మరిన్ని శీర్షికలు
pounch patas