Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి కైలాశ దర్శనం ( ఆరు+ఒకటి భాగం ) - కర్రా నాగలక్ష్మి

' దర్చెన్ ' చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది . యెప్పటిలాగే అందరూ రూములు ఆక్రమించేయడంతో మాకు మిగిలిన రూములో వుండవలసి వచ్చింది . కొత్తగా కడుతున్న గదులు రూఫుని యింకా నీళ్లల్లోనే వుంచవలసినంత కొత్తగదులలో వుండవలసి వచ్చింది . అంటే చలి రెండింతలు వుంటుంది . మేము ఆ రూములో వుండేందుకు వొప్పుకున్నందుకు కృతజ్ఞతగా వంటలు పూర్తవగానే ముందుగా మాకు వడ్డించడం , టీలు టిఫినులు మాకు గదిలోకే అందించడం లాంటి అదనపు సౌకర్యాలు అందజేసేరు మా సహాయకులు .

 ' దర్చెన్ ' చైనా ఆక్రమిత టిబెట్టు లోని ' పురాంగ్ కౌంటీ ' లోని చిన్న గ్రామం . పూర్వం ఈ గ్రామాన్ని ' లారా ( LHARA ) ' అని పిలిచేవారు . పశువుల కాపర్లకు , సంచారజీవులకు ముఖ్య విశ్రాంతి స్థలంగా రెండే రెండు స్థిరనివాసాలతో వుండేది . కైలాశ యాత్రీకులకు , అష్టపాద యాత్ర చేసే జైనులకు , తంత్ర శక్తి పై విజయం సాధించిన ప్రదేశంగా భావించే ' బోన్ ' బౌద్దులకు యాత్ర యిక్కడనుంచే మొదలవుతుంది . సముద్ర మట్టానికి సుమారు 4575 మీటర్ల యెత్తులో వుంది . కాలక్రమాన జరిగిన సామాజిక , ఆచార వ్యవహారాలలో వచ్చిన మార్పులతో యిది యాత్రా నివాస స్థలంగా మారిపోయింది . యాత్రీకుల అవుసరాలకు కావలసిన అన్ని సదుపాయాలు అందజెస్తున్నారు . నివాసానికి గదులు , శాఖాహార భోజనశాలలు , వేడినీటి శ్నానశాలలు మొదలయినవి వున్నాయి . కాని మాకు కావలసిన మరుగు దొడ్లు యెక్కడా లేవు , అటాచ్డ్ బాత్రూములు వున్న గది సదుపాయాలూ లేవు . ఊరంతా కలిపి రెండు వీధులతో ముగిసి పోయింది . ఈ రెండు వీధులలోనే యాత్రీకులకు కావలసినవి అన్నీ అందుబాటులో వున్నాయి .

 కైలాస పరిక్రమ చేయదలుచుకున్న వారు యిక్కడ చైనా ప్రభుత్వం దగ్గరనుంచి టికెట్టు  కొనవలసివుంటుంది . మామూలుగా మనంచేసే పరిక్రమని  ' వెలుపలి ( outer )' పరిక్రమ అని అంటారు . ఇలాంటి వెలుపలి పరిక్రమలు పదకొండు చేసినవారికి లోపలి ( inner ) పరిక్రమ చెయ్యడానికి చైనా ప్రభుత్వం అనుమతిస్తుంది . Inner పరిక్రమ చాలా కష్టతరమైనదిగా చెప్తారు .

దర్చెన్ కి 330 కిలోమీటర్ల దూరంలో 2010 వ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చిన ' గుంసా ' విమానాశ్రయం వుంది . ఇక్కడ నుంచి వారానికి రెండుసార్లు ' లాసా ' కి , మరియు ' ఛెంగ్డు ' కి విమానాలు సౌకర్యాలు వున్నాయి .

దర్చెన్ లో స్విస్ ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న " టిబెటన్ మెడికల్ ఆష్ట్రో ఇనిస్టిట్యూట్ " లో టిబెట్ మెడిసిన్ లో శిక్షణ యిస్తారు , దీనికి అనుబంధంగా డిస్పెన్సరీ నడుపుతున్నారు .

మా గది కిటికీ అద్దాలలోంచి అద్భుతమైన కైలాశగిరి దర్శనం , ఆ శిఖరాన్ని అలా దర్శించుకొనే అదృష్టం యెందరికి కలుగుతుంది ?
భోజనాల సమయంలో మా గ్రూపు లోని ఔత్సాహికులు ఒక ప్రతిపాదన పెట్టేరు . అదేమిటంటే మా టూరు లో కైలాశమానససరోవర యాత్ర మాత్రమే వుంది . మిగతా చూడవలసిన స్థలాలు వాళ్లు చూపించరు . ఇష్టాం వున్న వాళ్లు షేరింగ్ బేసిస్ లో కార్లు మాట్లాడుకొని అవేళ చూసివస్తేనో అని . అంతవరకు ఆప్రదేశంలో యింకా చూడదగ్గ ప్రదేశాలు వున్నాయని తెలీనిమేము అవేంటో వాటి వివరాలు మా ' దోర్జీ 'ని అడిగి తెలుసుకున్నాం .

 అష్టపాద , యమద్వారం , సప్త ఋషుల గుహలు , నంది కొండ చూడవలసినవని చెప్పేడు .

 మేము అయిదుగురుం వాళ్లతో వెళ్లడానికి మా సమ్మతి తెలియ జేసేం .యమద్వారం యమధర్మరాజు యొక్క నగరానికి యిది ద్వారమని మరణానంతరం జీవి పాప పుణ్యాలను బట్టి గాని లేక వారి పుత్రులు చేసే కర్మ ( మరణానంతరము చేసే కర్మకాండలు ) విధులను బట్టి యీ ద్వారం దాటే అర్హత పొందుతుందట . యీ ద్వారం దర్శించుకున్న వారికి యమబాధలు వుండవట . యమద్వారానికి కాస్త యెడమవైపుగా వెడితే అష్టపాద వుంది . ఇది జైనులకు పుణ్యస్థలం . జైనుల మొదటి తీర్థంకరుడు పార్శ్వ నాధుడు ( వృషభ దేవుడు ) పరమాత్మలో అయిక్యం అయిన ప్రదేశం . సప్తర్షులు తపస్సు చేసుకున్నట్లు చెప్పబడే గుహలు వున్నాయి .

కైలాసపర్వతానికి యెదురుగా కాస్త చిన్నదిగా వున్న పర్వతాన్ని నందికొండ అని అంటారు . కైలాసపర్వతానికి ఒక పరిక్రమ చేస్తే వచ్చేపుణ్యానికి పదమూడు రెట్ల పుణ్యం నందికొండకు ఒక ప్రదక్షిణ చేస్తే వస్తుందట . ఈ పర్వత శ్రేణులలో పార్వతి శిఖరం , గణేశపర్వతం కూడా వున్నాయని చెప్పేరు .

భోజనాలు చేసుకొని ఓ పదిహేను మందిమి యివన్నీ చూసుకొనేందుకు బయలుదేరేం . దర్చెన్ వూరికి మొదలులో వుంది మా బస . వూరు లోకి వచ్చేసరికి తుప్పరగా మొదలయిన వాన వూరుదాటేసరికి కుండపోతగా మారింది . మాకార్లు కొండల దగ్గరకి వచ్చేసరికి నాలుగడుగుల హిమపాతం జరిగి కార్లు ముందుకు పోలేని పరిస్థితి . కాస్సేపు ఆగి హిమపాతం తగ్గగానే ముందుకి వెడదామనుకొన్న మా ఆలోచన కి మా వెనుక దారి మూసుకు పోయే ప్రమాదం వుందనే హెచ్చరికతో వెనుకకి మరలి పోయేం .

వాన యెడతెరిపి లేకుండా కురుస్తూనే వుంది రాత్రి భోజనసమయంలో తెలుగు మాటలు వినిపించడంతో గుర్తొచ్చింది , తెలుగువాళ్ల హెలీకాఫ్టర్ గ్రూపు ని తీసుకొని హైదరాబాదు యేజంటు వస్తానని చెప్పడం . వాళ్లకి అదే కాంపౌండు లో ఓ ఫర్లాంగు దూరంలో వున్న రూములు యివ్వబడ్డాయి . ఆ గదులు అద్దాలతలుపులతో ఆకర్షణీయంగా వున్నాయి .  నాకు సహజంగా కాస్త యీర్ష కలిగింది . భోజనం అయిన తరువాత వారిని పలకరించే నెపంతో వెళ్లి వారి రూములు చూసేం రూములు చాలా బావున్నాయి కాని బాత్రూములు లేవు . నిత్యకృత్యాలకి ఫర్లాంగు దూరం నడిచి మేమున్న చోటికే రావాలి .

వారిలో యెవరూ పరిక్రమ చేసే వారు లేరు . వారి కార్యక్రమం ప్రకారం ఆరోజు యమద్వారం వరకు వెళ్లి కైలాశగిరి దర్శించుకొని దర్చెన్ లో రాత్రి గడిపి పొద్దున్నే మానససరోవరం పరిక్రమ చేసుకొని మధ్యాహ్నానికి తిరిగి వెనుకకి మరలడం . అదీ వారి ప్రోగ్రాం . మంచు బాగా కురవడంతో యమద్వారం వరకు వెళ్లడం కుదరలేదు . మంచు పడడంతో కైలాశగిరి దర్శనం కాలేదు యీ విషయాలు చెప్తూ ఒక సందేహ ప్రాణి ' అక్కడనుంచి కనిపిస్తుంది , అలా వుంటుంది , యిలా వుంటుంది అని చెప్పేడండి , యేదీ కైలాశం . అరచేతిలో వైకుంఠం అంటారుగాని యీయన అరచేతిలో కైలాశం చూపించి లక్షన్నర లాగేడండి , యేదీ కైలాశం అంటే మంచు అంటాడండి  , రేపు మానససరోవరం అన్నాడండి , అదేనా చూపిస్తాడో లేకపోతే మంచు పడిపోయింది అంటాడో ? అని చిందులు తొక్కుతున్నాడు . మిగితావారు అతనికి వత్తాసుగా నిలుచున్నారు .

ఆ సమయంలో మేము అక్కడికి వెళ్లి మా మానససరోవరయాత్ర బాగా జరిగిందని , స్నానం చేసేమని పరిక్రమ మాత్రం మంచుకురవడంతో జరగలేదని , మా రూము కిటికీ లోంచి కైలాశ గిరి బ్రహ్మాండంగా కనిపించిందని యిప్పుడు మంచుకురవడంతో కనిపించడం లేదని , యమద్వారం వరకు వెళ్లడానికి మేము చేసిన ప్రయత్నం చెప్పేం .మంచుకురవడం నిజమేనని తెలుసుకున్న వాళ్లు కాస్త శాంతించేరు .
    రేపు కూడా మంచు యిలాగే కురుస్తే మాసంగతేమిటి ? అనే బెంగ మాకు కలుగలేదు . అంతవరకు సునాయాసంగా జరిగే మానససరోవర పరిక్రమ మేము చెయ్యలేక పోయేం . మంచు కురవడంతో మా తరవాత అక్కడికి చేరుకున్న వారు స్నానం కాదు దర్శనం కూడా చేసుకోలేక పోయేరు . దాంతో మాకు మనచేతులలో యేమీ లేదని , పై వాడికి యిష్టమైతే యాత్ర సవ్యంగా పూర్తి చేయిస్తాడనే విషయం బోధపడింది .

అందుకే యేమీ టెన్షన్ పడకుండా హాయిగా నిద్రపోయేం . మరునాడు పొద్దున్నే టీ తెచ్చిన రామ్ బహద్దూర్ ని యాత్ర వుందా అని అడిగితే మీ యాత్ర యెటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది టీ తాగి బేగులు రెడీ చేసుకోండి , మళ్లా పరిక్రమ పూర్తిచేసుకొని వచ్చేక మీ పెద్దబేగు మీకు యివ్వ బడుతుంది కాబట్టి అవుసరమైనవి సర్దుకోండి అని చెప్పి వెళ్ళిపోయేడు . ముఖ్యమైనవి సర్దుకొని బేగులు రెడీ చేసుకున్నాం .

ఫలహారాలు చేసుకున్న తరువాత మా ప్రయాణం యమద్వారం వైపుగా సాగింది . యమద్వారం దగ్గర బౌద్దుల సంబరం జరుగుతూ వుండడం తో మాకు అక్కడకు ప్రవేశం లేక తిన్నగా ' షెర్పాంగో ' కి వెళ్లిపోయేం . అక్కడ గుర్రాలు ( కఛ్చర్ ) , సామానులు మోసేందుకు యాక్ లు , కూలీలు వరసగా కూర్చొని వున్నారు . గుర్రాలను లాటరీ పద్దతిలో మాకు అలాట్ చేసేరు .

ఇవాళ మేము యెనిమిది కిలోమీటర్లు నడిచి సముద్రమట్టానికి సుమారు 4909 మీటర్ల యెత్తున వున్న ' దిరాపుక్ ' చేరుకోవాలి .
మంచుతో కప్పబడ్డ పర్వతాలు తప్ప గడ్డికూడా మొలవని యెడారిలో పిచ్చిగాలి , యెముకలు కొరికే చలి లో అడుగు తీసి అడుగు వెయ్యడం చాలా కష్టంగా వుంది . గుర్రాల నడకతో మెత్తని మన్ను వూపిరితీసుకుంటూ వుంటే ముక్కులోకి దూరి యిబ్బందిపెట్ట సాగింది .మెడలో పలుచని బట్టలో కట్టిన కర్పూరం వేలాడదీసుకొని ముక్కులకు మాస్కులు కట్టుకొని గుర్రాలని యెక్కేం . ఉత్తర భారతయాత్రలు చేసేం కాబట్టి గుర్రాలు మాకు కొత్త కాదు . మొదటి రోజు మేము సుమారు యెనిమిది కిలోమీటర్లు ప్రయాణించి మా బస చేరుకోవాలి . కైలాశ గిరి పరిక్రమలో ఈ యెనిమిది కిలోమీటర్ల దారి అంతా చదునుగా వుండి ప్రయాణం సులువుగా వుంటుందనే భ్రమ కలిగిస్తుంది . ఊపిరి తీసుకోవటం చాలా కష్టం అవుతూ వుంటుంది . విపరీతంగా ఆయాసం మొదలవుతుంది . గాలిలో ఆక్సిజన్ తక్కువ అవడంతో ఊపిరితిత్తుల గాలి యెక్కువగా పీల్చుకొనే ప్రయత్నం లో ఆయాసం వస్తుంది .

 ఆయాసం మొదలయినప్పుడు ముందుగా చేయవలసిన పని యేవిటంటే కర్పూరాన్ని వాసన చూడాలి . నోటితో గాలి పీల్చుకోవడం ఆపి ముక్కుతో గాలి పీల్చుకోవాలి .

 సెలయేళ్ల వొడ్డునుంచి మా సహాయకులు వంటసామగ్రి యాక్ ( మంచు బర్రెలు అనొచ్చా ?) ల పై వేసుకొని చకచక నడుస్తూ కనిపించేరు . చాలా చోట్ల నేను కూర్చున్న గుర్రం అటూయిటూ పరుగులు తీసి నన్ను చాలా భయానికి గురి చేసింది . చాలా చోట్ల నడవవలసి వచ్చింది . నడవవలసి వచ్చిన చోట గుర్రం యజమాని చెయ్యందించి సహాయం చేసేడు . నేను తినలేకపోయిన ఆహారం అతనికి యిచ్చినందుకు అతను చూపించిన కృతజ్ఞత అది .

మొత్తానికి ' దిరాపుక్ ' లో మా బస చేరేసరికి కళ్ళు కనిపించటం లేదు . ఎలాగో మా ' ఛాంగ్మై ' సహాయంతో బస చేరేక నా శరీరం నా స్వాధీనం లోకి వచ్చేసరికి పదిహేను నిముషాలు పట్టింది . 'దోర్జీ ' వచ్చి మా కోసం యేర్పాటు చేసిన టెంటు చూపించేడు . ఆ టెంటు లో మరో గ్రూపు వాళ్ళ వంటలు జరుగుతున్నాయి . ముందుగా చేరుకున్న వాళ్లు వున్న ఒక్క మట్టి గది ఆక్రమించుకున్నారు . మిగతా వాళ్లు సర్దుకోవాలి . మగవాళ్లంతా టెంట్లు బాగులేవని గొడవ పెట్టుకున్నారు . మా వారు , మా మరిది కూడా గొడవపడి వేరే టెంటుకి మారుదాం అన్నారు . నేను వొప్పుకోలేదు . మావాళ్లు కొంతసేపు వేరే టెంటు లో గడిపి తిరిగి మా టెంటు కి వచ్చి యీ టెంటు వెచ్చగా వుందని , అక్కడ క్రింద పక్కలు వెయ్యడంతో చలికి తట్టుకోవడం కష్టమని మా టెంటుకి మారిపోయేరు . మా టెంటు కైలాశపర్వతానికి ఆనుకొని వుంది , నాకు నేను ఈశ్వరుని పాదాల దగ్గర వున్న ఫీలింగు కలిగింది . ఈశ్వరుని ఒళ్లో తల పెట్టుకున్న అనుభూతి కలగడంతో అక్కడనుంచి కదలదలుచుకోలేదు . ' దోర్జీ ' కొత్త టెంటు వేసేమని కావాలంటే అందులోకి మారవచ్చని పలిచేడు . కాని మేము మారలేదు .సహాయకులు వేడి వేడి టీ వేడి పకోడీలు అందంచేరు .

కాస్త కాళ్లు చేతులు సర్దుకున్నాక బయటకి వెళ్ళేం  . కాస్త దూరం కైలాశపర్వతానికి దగ్గరగా నడిచేం . తరువాత నేను మా చెల్లి నడవలేక ఆగి పోయేం . మావారు , మరిది , అమ్మాయి కాస్త ముందుకి వెళ్లేరు . మావారు అక్కడే ఆగి పోవడం తో మా మరిది , అమ్మాయి చాలా ముందుకి వెళ్లి దండం పెట్టుకొని కొన్ని ఫొటోలు తీసుకొని వచ్చేరు .మా గ్రూపు లో చాలా మంది యిక్కడ నుంచి వెనుకకి మరలి పోతున్నారు . మరునాడు మేము సుమారుగా 22 కిలోమీటర్లు నడవాలి . అందుకే మా సహాయకులు వేడి వేడిగా వడించిన భోజనం చేసి తొందరగా నిద్రపోయేం . మిగతా వివరాలు వచ్చేసంచికలో చదువుదాం .

అంతవరకు శలవు

మరిన్ని శీర్షికలు
sahiteevanam