Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అడిగిన జీతం బియ్యని.

adigina jeetambiyyani

ఆఫీసులో చేరిన రోజే ఇంకా పూర్తిగా చార్జ్ తీసుకోనే లేదు, ఆఫీస్ ఇన్స్ పెక్షన్! పాత ఆఫీసరే అన్నీ చూప సాగాడు." దీనంత దురదృష్టపు ఆఫీస్ మరి లేదు సార్! ఒక్కరూ పని చేయరు. రాత్రి పది వరకూ సీట్లలో కూర్చునే ఉంటారు. ఒక్క ఫైలూ కదలదు. ఆఫీస్ స్టాఫ్ తో తల వాచి పోయి డిప్రెమోషన్ మీద ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్తున్నను. ఇలాంటి ఆఫీసుకు మీరు రావడం నిజంగా దురదృష్టం సుమండీ!" అన్నాడు పాత ఆఫీసరు ఆనంద రావ్.. ఇన్స్ పెక్షన్ చేసిన వారు అడ్డంగా ఏదేదో వ్రాసేసి పోయారు. “ఐదేళ్ల బట్టీ కాయితం ముందుకు కదల్లేదు. అందుకే మీకీ డిప్రెమోషన్, మీరు ఈ రోజే చేరుతున్నారు కదా! పది రోజుల్లో కొంతైనా పని పూర్తి చేసి హెడ్డాఫీసుకు తెండి "అని ఆఙ్ఞ జారీ చేసి వెళ్ళారు. దిగాలు ముఖమేసుకుని నాకు చార్జి అప్పగించాడాయన." మీరు ఒక్క సం. కంటే ఇక్కడ ఉండ లేరు మాస్టారూ! మీకు ఈ ఆఫీస్ పరిస్థితి తెలీక వచ్చినట్లున్నారు." అని కూడా అన్నాడు. ఆ రోజు మంచి రోజని ఆఫీసులో జాయినయ్యాను.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రెమోషన్! రాజకీయ శక్తులు మాయాజాలం చేసి నా ప్రెమోషన్ కు ఇనుప కంచె వేశారు. దాన్ని ఛేధించను నేను భగవంతుని మాత్రమే ఆశ్రయించాను. ఎందుకంటే ఆ దుష్టశక్తులను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలూ, పలుకుబడీ నాకు లేవు. నాకు చేతనైనది నా పని ధర్మ బధ్ధంగా, ఖచ్చితంగా చేయడం. అవి పడని దుష్టులు నాకు చేయ గలిగింది అదొక్కటే. నా కంటే జూనియర్లూ, అనర్హులూ నిచ్చెన మెట్లెక్కి పోతుంటే నిస్సహాయంగా చూస్తూ, భరిస్తూ, ఎన్నోరాత్రులు, అశాంతిగా, నిద్ర లేకుండా గడిపాను. చివరకు ఏ దేవుడు కరుణించాడో లేక ఆ శక్తులు నిర్వీర్యమయ్యాయో నేను ఊహించని సమయంలో పదోన్నతి సమచారం అందింది. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బయల్దేరి వచ్చి కార్యాలయంలో చేరాను. ఎందుకిలా ప్రెమోషన్ ఇచ్చారో కాస్తంత అర్ధం కాసాగింది. నాకు ఇది పనిషెంట్ అనుకుని ఇచ్చినట్లున్నారు. నాకు ముందున్న ఆఫీసర్ ఆనంద రావ్.

నాకు చార్జి అప్పగిస్తూ,"ంర్.. మదూ! మీకు ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది. ఇది సామాన్యమైన ఆఫీస్ కాదు. ఒక్కరూ బాధ్యతగా పని చేయరు. చేసినట్లే ఉంటారు కానీ పని పూర్తి కాదు, పై అధికారుల నుంచీ చివాట్లన్నీ మనకే! చూశారుగా ఈ ఇన్ స్పెక్షన్ పెర్సన్స్ ఏం వ్రాసి పోయారో! జీతాలు స్టాఫ్ కూ, చీవాట్లూ, మెమోలూ మనకూనూ. అందుకే వీళ్ళకు ప్రెమోషన్స్ నా బూటు కాళ్ళ క్రింద అణచి పెట్టి ఉంచాను ఐదేళ్ళుగా. మీరూ అలాగే చేయండి. ప్రెమోషన్ వస్తే ఇహ మాట వినరు. ముఖ్యంగా డ్రైవర్ ‘డాబూ రావ్’కు, అది నేను వాడికి పెట్టుకున్న‘నిక్ నేం ‘లేండి. వాడి అసలు పేరు రామా రావ్, వాడికి ప్రెమోషన్ వస్తే , వాడు ఆఫీస్ స్టేషనరీ ఇంచార్చి అవుతాడు. నిన్నూ నీ ఆఫీసునూ కూడా తినేస్తాడు. జాగ్రత్త, ఈ ఫైలంతా ప్రెమోషన్స్ కు సంబంధించినది. దీన్ని నీ స్వంత కస్టడీలోనే ఉంచుకో." అంటూ ఇంకా ఏవేవో జాగ్రత్తలు చెప్పాడు. అన్నిటికీ తల ఊచి చార్జి తీసుకుని, ఫేర్ వెల్ చేసి వచ్చాను. ఆయనకు ఎవ్వరూ ఓ కప్పు కాఫీ కూడా ఇవ్వనందుకు ఆశ్చర్య మేసింది. ముందుగా ఆయన అణచి పెట్టమని చెప్పిన ప్రెమోషన్ ఫైల్ ఓపెన్ చేశాను. క్లర్కులకు సీనియర్ క్లర్కులుగా , సీనియర్సుకు అకౌండెంట్స్ గా , అకౌండెంట్స్ కు మేనేజర్సుగా , జవాన్లకు అటెండెర్స్ గా , అటెండర్స్ కు అర్హత మేరకు చాలా ప్రెమోషన్స్ కు అవకాశాలున్నాయి. పోస్టులూ ఖాళీగా ఉన్నట్లు ఫైల్లో చూపించి ఉంది. ఒక్కోరూ వారికి ఉన్న అర్హతలనూ, తమకు రావాల్సిన ప్రెమోషన్లనూ ఇరవై , ముప్పై సార్ల వరకూ అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నారు.

అదంతా పేరు పేరునా ట్యాగ్స్ తో సపరేట్ చేసి, పెద్ద ఫైల్ గా ఉంది. ముఖ్యంగా రామారావ్ కు పదోన్నతి ఆపడం ఘోరం అనిపించింది. అతడికి కావల్సిన అర్హతలన్నీ ఉండటమే కాక , అతడితో కంపీట్ చేయను మరెవ్వరూ లేరు ఆ పోస్ట్ కు. ఫైల్ బాగా ఒకటికి , నాల్గు మార్లు స్టడీ చేశాను. వెంటనే నా టేబుల్ మీద ఉన్న నా ఆఫీస్ కంప్యూటర్ లో టైప్ చేయ సాగాను.  ఇంతలో ఇంటర్ కాం మ్రోగింది." సర్ ! స్టాఫంతా మిమ్మల్ని మీటై తమ అవసరాలు చెప్పుకోను వస్తారుట! సార్! పంపమన్నారా?" అంటూ నా సెక్రెటరీ అడిగాడు."అర్ధ గంట అయ్యాక రమ్మనండి." అని చెప్పి చక చకా టైప్ చేయసాగాను. పూర్తయ్యాక నా సెక్రెటరీకి ఫైల్ మైల్ చేసి, ' పర్సనల్ గా, సీక్రెట్ గా, కాపీస్ తీసి నా సంతకాల కోసం తెమ్మన్నాను. అతడు ఫైల్ తేగానే , సంతకాలు చేసేసి నా రూం లోనే అందరికీ విడి విడి గా కవర్లలో పెట్టి పేర్లు వ్రాసి ఉంచమన్నాను. సెక్రెటరీ పని పూర్తి చేస్తుండగా స్టాఫంతా వచ్చారు. అందరి చేతుల్లో అర్జీలు!  " ఏమిటవి? " అని అడిగాను ఏమీ తెలీనట్లు." సార్ ! మాకు పదోన్నతి ఐదేళ్ళూగా ఆగి పోయి ఉంది. మాకు ఉన్న అర్హతల మేరకు మాకు మీరు పదోన్నతులు కల్పిస్తారేమోని ..." అంటూ సీనియర్ మేనేజర్ మాట్లాడారు అందరి తరఫునా."ముందుగా ఈ కవర్ లు తీసుకుని తర్వాత ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే చెప్పండి " చాలా సీరియస్ గా చెప్పాను. అంతా భయ భయంగా సెక్రెటరీ అందించిన కవర్లు పేరు పేరునా తీసుకుని విప్పి చదివి ఆనంద భరితులై , దాన్ని ఆపుకోలేక అంతా ఒకే మారు నన్ను చుట్టు ముట్టి కృతఙ్ఞతా పూర్వకంగా షేక హ్యాండ్స్ ఇవ్వ సాగారు." సార్ ! మీరెంత మంచి వారండీ!“ - “ అడక్కండానే మీలా మాకెవ్వరూ పదోన్నతులు కల్పించ లేదండీ!-““కృతఙ్ఞతలు సార్!”  - “ నమస్కారాలు సార్!" అంటూ ఎవరికి తోచిన విధంగా వారు చెప్ప సాగారు.  రామారావ్ ముందుకొచ్చి రెండు చేతులూ జోడించి "ఆ శ్రీరామ చంద్ర ప్రభువు మీకు అంతా మంచే చేయాలని ప్రార్ధిస్తున్నాను సార్! నాకు పదోన్నతి ఇచ్చినా మీరున్నంత వరకూ మీ కారునేనే డ్రైవ్ చెస్తాను సార్! ప్లీజ్ అంగీకరించండి" అన్నాడు పట్ట లేని ఆనందంతో. ఎందుకో వారినంతా చూసి చాలా నాకు ఉద్వేగం కలిగింది.

నేనూ ప్రెమోషం కోసం చకోరం లా కాచుక్కూర్చున్న సంఘటనలు గుర్తొచ్చాయి.“ మీరు నన్నింతగా పొగడాల్సిన పని లేదు. మీకు న్యాయంగా రావాల్సిన పదోన్నతులు ఏదో కారణంగా ఆగి పోయాయి. ఇప్పుడు గత ఐదేళ్ళ నుంచే మీ స్కేల్స్ మారేలాగా మీకంతా అప్పటి నుంచే జీతాలు పెరిగే లాగా , అరియర్స్ అంతా కూడా ఇస్తున్నాను. ఐతే ఆగిపోయిన పనులన్నీ ఒక్క పది రోజుల్లో చక్క బెట్టండి. అదే మీరు నాకు చేసే ప్రత్యుపకారం." అన్నాను. అంతా తలలూచి " తప్పక చేస్తాం సార్!" అంటూ వెళ్ళి పోయారు. వెంటనే ఆఫీస్ లో కలకలం , పాత ఫైల్స్ అన్నీ బీరువాల్లోంచీ టేబుల్స్ మీదికి దూకాయి. అంతా ఎవరి బీరువాలు, టేబుల్స్ వారు దుమ్ము దులుపుకున్నారు , పరస్పరం సంప్రదించుకుని అతి వేగంగా డ్రాఫ్ట్సు టేబుల్స్ మీంచీ కదిల సాగాయి.

రాత్రి పదైనా మహిళలతో సహా కూర్చుండి పోయారు అలాగే. నేను నా ఛాంబర్ లోంచీ బయటికి వచ్చి "వాట్! మీరింకా ఉన్నారా! పదైంది. ఇళ్ళకెళ్ళండి, ఇంట్లో వారు కంగారు పడతారు. రేపు చేసుకో వచ్చును." అన్నాను. "సార్ ! మీరొక్కరే ఇలా మా ఈ ఆఫీసు జీవితంలో ఇళ్ళకెళ్ళమన్న వారు, రాత్రి పదైనా మమ్మల్ని ఇళ్ళకు పోనిచ్చిన వారు లేరు సార్! " అంటూ అంతా ముక్త కంఠంతో అన్నారు." గతం గతః. అంతా వెళ్ళి రేపు పని ప్రారంభించండి పది రోజుల్లో కనీసం సగం పూర్తి చేస్తే చాలు."  అని చెప్పాను. సంవత్సరాల నుంచీ ఆగి పోయిన పనులు ఒక్కోటీ తెమల సాగాయి. పది రోజుల్లో అప్ టు డేట్ గా అన్ని శాఖల పనులూ పూర్తై హెడ్డాఫీసుకు ఫైల్స్ తీసుకుని వెళ్తుండగా, రామా రావ్ హుషారుగా కారు నడప సాగాడు."రామా రావ్ ! నీకు ప్రెమోషన్ వచ్చినా ఇలా ఇంకా నా కారు డ్రైవ్ చేయడమేం బావో లేదోయ్!" అన్నాను."సార్ ! మీరు నా జన్మ నిలిపిన దేవుడు సార్! మీరిచ్చిన పదోన్నతితో, వచ్చిన అరియర్సుతో నా అప్పులన్నీ తీర్చుకుని, నా చెల్లెలు పెళ్ళి చేయబోతున్నను సార్! మా అమ్మకు కంటి ఆపరేషన్ మూడేళ్ళుగా పోస్ట్ పోన్ చేస్తున్నాను సార్! మా నాన్నకు పైల్స్ సార్! ఆయన బాధ చూడ లేము సార్, ఆపరేషన్ కు డబ్బు లేక జరుపు కొస్తున్నానుసార్! జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు వైద్యం చేయించే స్తోమత లేక వ్యర్ధ జీవిగా ఉండి పోయాను సార్! మీరు మా పాలిట అపర శ్రీరామ చంద్ర ప్రభువే సార్! మీరీ ఆఫీసులో ఉన్నంత కాలం నేనే మీ కారు తోలుతూ , నా స్టేషనరీ ఇంచార్చి పని కూడా చేసుకుంటాను సార్!" అన్నాడు కృతఙ్ఞత నిండిన నిశ్చల కంఠంతో. ఆఫీస్ స్టాఫ్ ఉత్సాహం, ఆనందం చూసి నాకు చాలా తృప్తి కలిగింది. ఐదేళ్ళ నుంచీ ఉన్న పెండింగ్ వర్క్ పదే పది రోజుల్లో పూర్తి చేసినా పరువు కాపాడారు. నాకు సుమతీ శతక పద్యం గుర్తొచ్చింది. ‘అడిగిన జీతం బియ్యని మిడి మేలపు దొరను కొల్చి.

మరిన్ని కథలు
maamma