Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
himagiri kailasa darshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

ఆముక్తమాల్యదా ప్రబంధంలోని చివరిది ఐన ఆరవ ఆశ్వాసములో మహాభాగవతుడైన మాలదాసరి కథను చెబుతున్నాడు రాయలవారు. భారతీయ ఆధ్యాత్మిక సారస్వతంలోని అత్యుత్తమ, ప్రతీకాత్మక గాథలు రెండు ఈ ఆశ్వాసములో, ఈ సన్నివేశములో మనకు భిస్తాయి. ఇవి ప్రపంచములోని ఏ సాహిత్యములోనూ కనిపించవు! చీకటిలో దారి తప్పి, బ్రహ్మరాక్షసుడికి చిక్కిన మాలదాసరి యిలా అంటున్నాడు.ఖ్యాతుండవు దైత్యులందు మును పాపైనొక్క నీకా యశో భిఖ్యన్నేనును జేర్తు మే యొసఁగుఁ దప్పింపన్వ్రతం బొక్కఁడేముఖ్యం బై యొనరింతు దాని సఫలంబున్జేయఁగా లేవుగా 'సఖ్యం సాప్తపదీన' మన్మన మిథ స్సాఙ్గత్య మూహించుచున్ యిదివరకే వ్వు రాక్షసులందు ప్రఖ్యాతి చెందినవాడవు. అటువంటి నీకు మరొక కీర్తిని కలిగిస్తాను నేను. నీకు నా శరీరాన్ని సమర్పణం చేయడం అనే విషయాన్ని భంగం చేయకుండా, నా వ్రతాన్ని పూర్తి చేసుకోడానికి అవకాశము కల్పించిన కీర్తిని నీకు కలిగిస్తాను. సఖ్యం సాప్త పదీనం, టే ఏడడుగులు కలిసి నడిస్తే చాలు సఖ్యత కలిగినట్లే అన్న మాట నీకు తెలిసినదేగా, మనము ఇద్దరమూ యిప్పుడు స్నేహితులము యినాము, ఏడు అడుగులు కలిసి వేసిన కారణంగా. ఆ స్నేహబంధాన్ని గుర్తించి, నా వ్రతము నొకదానిని పూర్తి చేసుకునే అవకాశాన్ని వ్వలేవా? ఏమిటా వ్రతము అంటే..

ఈ కుఱఁగటి యీ కురుఁగుడి
వైకుంఠునిఁ బాడి వత్తు వ్రతముగఁ దత్సే
వాకృతి కడపట నాశనము 
నీ కౌదు న్ముఖ్య మిదియ నేఁ డగుతుదకున్

ఈ సమీపములోనే ఉన్న కురుగుడి (తిరుక్కురుంగుడి) లో వెలిసియున్న విష్ణుని కీర్తనలు పాడి, ఆయన సేవజేసి వస్తాను ప్రతిరోజూ, అది నా వ్రతము. ఈ రోజు కూడా అలాగే నా వ్రతము పూర్తి చేసుకుని వచ్చి, నీకు ఆహారాన్ని అవుతాను.అలా అయితే వ్రత సమాప్తి చేసుకున్నతర్వాత మరింత శ్రేష్ఠమైన ఆహారాన్ని అవుతాను, అలా నీకు మరింత రుచికరమైన ఆహారంగా అవుతాను. నువ్వు దయజేసి, నన్ను వదిలిపెట్టావంటే, ఈ రోజున నా చివరిసారిగా స్వామికి నా సంకీర్తనతో సేవజేసుకుని మరలా వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను, నన్ను కనికరించి వదిలిపెట్టవయ్యా అని అడిగాడు మాలదాసరి.ఆ మాటలకు కిలకిల నవ్వి, దాసరి చెంపలమీద పరిహాసముగా చరిచి, 'లెస్స పండించితివిరా దాసరీ! నానా దారులూ కొట్టి, నిన్న, మొన్ననే మహా విరాగివి, భక్తుడివి అయి ఉంటావు. నీ లౌక్యముతో నన్ను బురిడీ కొట్టించి, ఉచ్చు కొరికి పారిపోయే జంతువులాగా, తప్పించుకునిపోదామని ఎత్తులు వేస్తున్నావా?అంత తెలివితక్కువ వాడిలా కనిపిస్తున్నానా నేను?    

ఏరాజ్యంబునరుండు నోరికడివో నీబోధ మాలించు? నిం 
కేరాజ్యంబు నరుండు బాసకయి మే నీఁ దాన యేతెంచుఁ దీ
పార న్నేఁ జననీమియు న్మగిడి నీ వారామియుం దెల్ల మే
లా రంతుల్పలు పల్కు లంత్యకుల యేలా చింత లేలా వగల్?

ఏ తిక్క దేశంలోని యే పిచ్చి మనిషి నోటిదగ్గరి కూడును వదిలిపెట్టుకోడానికి నీ బోధలు, నీ మాటలు వింటాడు? ఇంకే తిక్క రాజ్యంలోని పిచ్చి మనిషి మాటను నిలబెట్టుకోడానికని శరీరాన్ని యివ్వడానికి తనంత తానే వెనక్కు తిరిగివస్తాడు? తియ్యగా నేను వదిలిపెట్టడమూ జరిగేది కాదు, ఒక వేళనేను  వదిలిపెట్టినా మళ్ళీ నువ్వు రావడమూ జరిగేది కాదు, ఎందుకురా రచ్చ చేస్తావు? ఓరి చండాలుడా! ఎందుకీ ఆలోచనలు, ఎందుకీ మాటలు? అన్నాడు పరిహాసంగా, బ్రహ్మరాక్షసుడు.

అనినఁ జెవి మూసి నారాయణా యటంచు 
నతఁడు నను నమ్మవేఁ బిశితాశి యొక్క 
శపథమున నమ్ము మని వాఁడు సమ్మతింప 
వేనవే ల్సత్యములు వల్కి వినకయున్న    

బ్రహ్మరాక్షసుని మాటలకు రెండు చెవులూ మూసుకుని ' నారాయణ! నన్ను నమ్ముమయ్యా రాక్షస కులేశ్వరా! కావాలంటే శపథం చేస్తాను, ప్రమాణం చేస్తాను' అని వేలవేల సత్యములను ప్రమాణంగా పలికి, అప్పటికీ వాడు నమ్మకపోవడంతో 

ఎవ్వనిచూడ్కిఁ జేసి జనియించు జగంబు వసించు నిజ్జగం 
బెవ్వనియందు డిందు మఱి యెవ్వనియం దిది యట్టి విష్ణుతో 
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేఁడ నే 
నెవ్విధినైన ని న్గదియనేని యన న్విని బంధ మూడ్చినన్    

రాక్షసరాజా! రంగదాసులు అసత్యము లాడగలరా? నేను నీకు యిచ్చిన మాటను తప్పి, మరలా రాకపోతినా, ఎవరి చల్లని చూపులచేత ఈ సమస్త ప్రపంచమూ  పుడుతుందో, ఎవనియందు యిది స్థిరంగా నెలకొని యుంటుందో, చివరికి ఎవరిలో లీనమవుతుందో, ఆ మాహావిష్ణువుతో సమానుడైన వేరు దైవము ఉన్నాడు అని భావించిన, పలికిన మహా పాతకుడిని అవుతాను, నా పలుకులను విశ్వసించుమయ్యా! నన్ను విడిచి పెట్టుమయ్యా అని పలుకగానే, అప్పుడు ఆతని పలుకులను విశ్వసించి, ఆతని బంధనాలను విడిపించాడు బ్రహ్మరాక్షసుడు. వాడు మామూలు రాక్షసుడు కాడు, బ్రహ్మరాక్షసుడు, అంటే వాడికీ ఉపాసనలు,  విశ్వాసాలు మొదలైనవి ఉన్నాయి. ఆ మాలదాసరి మహాభాగవతుడు అని ఈ పాటికే గ్రహించాడు. మహా వైష్ణవుడు అనీ గ్రహించాడు. ఎన్ని ప్రమాణాలు చేసినా నమ్మనివాడు, 'నా దైవము ఐన శ్రీ మహావిష్ణువును యితరులతో పోల్చిన మహా పాపిని అవుతాను, తిరిగి రాకుంటే' అని పలుకగానే వదిలిపెట్టాడు, యిదొక విచిత్రము అయితే,ఈ పద్యము మొత్తమూ పోతన మహానుభావుని 'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యెవ్వని యందు డిందు' అన్న జగత్ప్రసిధ్ధమైన పద్యానికి అనుకరణగా చేశాడు రాయలవారు. అది ఆయనకు పోతనమీద ఉన్న భక్తికీ, తనకు పూర్వకవులు అందరినీ క్షుణ్ణంగా చదువుకున్నవాడు అన్న సత్యానికీ నిదర్శన! అంతకన్నా అద్భుతమైన ఒక విశేషము, ' గజేంద్ర మోక్షణ' సన్నివేశంలోని పద్యాన్నే తీసుకున్నాడు స్ఫూర్తిగా. దానికి కారణమైన రసరమ్యమైన రహస్యాన్ని వచ్చేవారం తెలుసుకుందాము.

కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని శీర్షికలు
weekly horoscope 22nd january to 28th january