Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

 గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue145/410/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

మడుగు లోని నీటి మీద రెక్కలల్లార్చుతూ అందమైన హంసలు విహరిస్తుంటాయి. తామర తూండ్లను తిని కొన్ని హంసలు తలను రెక్కల మధ్య దాచుకుని మత్తుగా నీటి మీద తేలుతూ నిద్ర పోతూంటాయి. అలాంటప్పుడు అవి ఎవరో ఉతికి గుట్టలుగా నీటి మీద వుంచిన తెల్లటి వస్త్రంలా శోభిస్తూంటాయి.

ఇక కొన్ని కొంగలు తామరాకు మీద పరుగిడుతూ కొన్ని ఒంటి కాలి మీద జపం చేస్తూ నీటి పైకి వచ్చిన చేపల్ని గుటుక్కున మ్రింగేస్తుంటాయి. పూల మకరందం గ్రోలిన తుమ్మెదలు అనేకం తామర పూల రేకుల మీద మత్తుగా సోలి పోతూంటాయి.

వృక్షశాఖల వెంట శుక పిక శారికాది వివిధ పక్షి జాతులు తిరుగుతూ కలకలం రేపుతూంటాయి. లేళ్ళు, కుందేళ్ళు వంటి వన్య ప్రాణులు సంపంగి వనంలో స్వేచ్ఛగా తిరుగాడుతూంటాయి. కౠరమృగాలు ఏవీ సంపంగి వనం దరిదాపులకు రావు. పాముల సంచారం అధికంగా వుండటమే అందుక్కారణం. ఫలవృక్షాలకు తీగలు, లతల వెంట పూచే అరుదైన పుష్ప జాతులకు అచట కొదువ లేదు.

నయన మనోహరమగు ఆ సంపంగి వనానికి నాగ సుందరి శంఖు పుత్రి చేరుకునే సరికి సంధ్యా సమయం దగ్గర పడింది. ఆకాశం నిర్మలంగా వుంది. పశ్చిమాన కొన్ని మబ్బులు కన్పిస్తున్నాయి. నాగకుమారి యువరాణి ఉలూచీశ్వరీ దేవిని కలవాలని సంపంగి వన ప్రాంతంలోనే సంచరిస్తోంది శంఖుపుత్రి.

ఎలాగయినా యువరాణిని కలిసి రత్నగిరి యువరాజు ధనుంజయుని గురించి చెప్పి ఆ యిద్దర్నీ కలపటం ద్వారా నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది శంఖు పుత్రి. తను నాగ లోకంలో ప్రవేశించ లేదు. నాగ రాజు నిషేధం ఉంది. ప్రవేశించి మరో సారి తను దండనకు గురి కావటం ఇష్టం లేదు. కాబట్టి బయటే యువ రాణిని కలవాలి. అందుకు అనువైన చోటు సంపంగి వనం. కాబట్టి`

వెలుగు దూరాన వున్న నాగుల దిబ్బ ప్రాంతం నుండి మూడు దినముల క్రితమే శంఖు పుత్రి సంపంగి వనానికి చేరుకుంది. కాని ఇంత వరకు యువరాణి దర్శనం లభించ లేదు. ఉలూచీశ్వరికి చాలా ప్రియమైన వనమిది. తరచూ చెలికత్తెతో వన విహారానికి వస్తూంటుంది. ఇవాళ గాకున్న రేపు తప్పక వచ్చునని నమ్మికతో ఆ ప్రాంతాల్లోనే సంచరిస్తోంది.

సాయంకాలపు శీతలగాలులకు తోడు సంపెంగపూల మధుర సువాసనలు మనసును పులకింప జేస్తున్నాయి. తన సర్పశరీరాన్ని అల్లన కదిలిస్తూ మడుగు వైపు కదిలింది శంఖుపుత్రి. ఇంతలో మడుగు నుండి నీళ్ళ చప్పుడు. కొందరు వనితల కిలకిలా నవ్వులు విన వచ్చాయి. యువ రాణి విచ్చేసి వుంటుందన్న వూహ తో చర చరా ముందుకెళ్ళింది.

శంఖు పుత్రి వెళ్ళే సరికి నలుగురు నాగకన్యలు మడుగు నీటిలో తామరపూల మధ్య జలక్రీడా నిమగ్నులయి వినోదిస్తున్నారు. పరిహాసోక్తులతో ఒకరిపై ఒకరు నీరు చల్లుకొంటూ కిలకిలా నవ్వుకొంటున్నారు. వారి అల్లరికి బెదిరి హంసలు, కొంగలు దూరంగా వెళ్ళి పోతున్నాయి. వారంతా ఎప్పుడూ యువరాణిని వెన్నంటి వుండే చెలికత్తెలు. అయితే యువరాణి ఉలూచీశ్వరి అక్కడ కన్పించ లేదు.

అర్ధ నగ్నంగా వున్న నాగకన్యలు మడుగు వద్ద కొస్తున్న శంఖు పుత్రిని గమనించి జల క్రీడలాపి, సగౌరవంగా నమస్కరించారు.

‘‘ఏమిటే? మీరు మాత్రమే వుంటిరి. యువరాణీ వారెచట?’’ అనడిగింది శంఖుపుత్రి. ఆ మాటకు`

‘‘ఏమి చెబుదుమమ్మా’’ అంటూ నాగకన్యలంతా ముఖ ముఖాలు చూసుకుని ముసి ముసిగా నవ్వుకోసాగారు.

శంఖు పుత్రికి ఏమీ అర్థం గాలేదు.

‘‘ఏయ్‌... ఏమియా పరాచికము? యువ రాణి వారు క్షేమములే గదా?’’ కించిత్తు కోపంగా అడిగింది.

‘‘అయ్యో! ఆమె క్షేమము కేమి కొదువ. కాదంటే ఒకింత జ్వరమున బాధ పడుచున్నారు’’ అని బదులిచ్చిందొక యువతి.

‘‘ఏయ్‌! పరిహాసము లాపి సత్యము పలుకుడు. జ్వరము ఏమి?’’

‘‘ఏమి చెప్పుదునమ్మా. సత్యమే పలుకుచున్నాము. అది జ్వరమే సుమా. మామూలు జ్వరము కాదు, మదన జ్వరము’’ అంది మరో వనిత.

శంఖు పుత్రి వ్యాకుల పడింది. ఆందోళన నిండిన స్వరంతో` ‘‘మదన జ్వరమా... అంటే...?’’ అంది.

‘‘అంటే ఏముంది? అది ఖచ్చితముగా కామ జ్వరమే. అ లక్షణము స్పష్టముగా పొడ చూపినవి. వారిప్పుడు మన లోకములో లేరు.’’ అంటూ బదులిచ్చింది మూడో నాగకన్య.

‘‘ఏమైనదే మీకు! ఇటు వదరుచున్నారు? ఏమి జరిగినది? ఇన్ని రోజులూ మీరంతా ఎచట వున్నారు?’’ విస్మయంతో నిలదీసింది శంఖు పుత్రి.

‘‘అదేమడుగుతావు లేమ్మా’’ అంటూ పెద్దగా నిట్టూర్చిందొక యువతి.

‘‘అవును. పెను ప్రమాదము నుండి బయట పడినాము. వారము దినముల క్రిందట మేమంతా ఢాకినీ వన ప్రాంతమున విహారమునకు పోతిమి’’ అంది మరో యువతి.

శంఖు పుత్రి మరింతగా విభ్రాంతురాలయింది.

‘‘ఢాకినీ వనమా... వింధ్య పర్వతముకు ఆవల గదా వున్నది. బహు దూరము. అంత శ్రమ పడి పోవుటకు ఏమున్నది యచట?’’ అంది.

‘‘ఢాకీని వన ప్రకృతి అందము ఈ కాల మున బహు రమ్యము. అది చూడ వసినదే గాని చెప్పనవి గాదు. అచట మైదానము పూచు గడ్డిపూలు కూడా అనేక రంగులలో ఆకర్షిస్తుంటాయి. యువరాణీ వారి కోరిక మేరకే మేమంతా వెడలినారము’’ అంది నాలుగో నాగ కన్య.

‘‘బాగున్నది. మరి పెను ప్రమాదమంటిరి అదేమిటి?’’ కుతూహలంగా ప్రశ్నించింది శంఖు పుత్రి.

‘‘అదియే చెబుతున్నాను. మేము నిన్న పగటి వేళ పచ్చిక బయలు నందు విహరిస్తూ ఒక పెద్ద గరుడ పక్షి కంట పడినాము. మేము మానవ కాంతలు కాదు నాగకన్యలమని గ్రహించి మమ్మల్ని పట్టి చంపి భక్షింపనెంచి వెంట బడి తరిమినది...’’

‘‘అయ్యో! ఎంత పని జరిగినది. పిమ్మట ఏమైనది?’’

‘‘మేము నలుగురమూ ఎలాగో తప్పించుకొని పొదలో దూరినాము. గరుడ పక్షి యువరాణీ వారి వెంట పడినది. తను కూడ తప్పించు కొని వుంటుందనుకున్నాము. చాలా సేపటి తర్వాత బయట కొచ్చి చూస్తే ఎవరును లేరు. భయాందోళన చెంది మేము వెతుకులాడగా ఒక చోట పచ్చికలో చచ్చి పడున్న గరుడ పక్షి కనిపించినది. కొంత దూరమున పొదల వెనక యువ రాణీ వారు కన్పించారు. వారు క్షేమంగా ఉన్నందున తేలిగ్గా వూపిరి తీసుకున్నాము. ఎవరో బాణమేసి గరుడ పక్షని చంపి కాపాడినారు. కాని ఎవరో ఏమిటో తెలీదాయె. యువ రాణీ వారు ఏమి జరిగినదీ చెప్పరాయె. అప్పటి నుండి ఆమె ధోరణి మారి పోయింది. ఎవరి తోనూ మాటలాడరు. పర ధ్యానము. మోమున ఆనందము, పెదవు చిరునవ్వు. తిండి మీద ధ్యాస లేదు. వెంటనే బయలు దేరి వచ్చేసినాము. మన నాగ లోకము రాకుండా ఇచటనే ఆగి పోయినారు. శరీరము వేడెక్కి ఉశ్చ్వాస నిశ్వాసలు బరువై ఎవరినో పదే పదే తలపోయుచున్నది. ఆమెకు సపర్యలు చేసి చేసి ఆ జ్వరము మాకు సోకి ఇదో ఉష్ట తాపము తీర జల క్రీడలాడు చుంటిమి’’ అంటూ వివరించిందో నాగకన్య. వెంటనే ఫక్కున నవ్వారు మిగిలిన యువతులు.

శంఖు పుత్రి ఆ మాటలు శ్రద్ధగా ఆలకించింది.

ఇదే నిజమైతే ఉలూచీశ్వరి ఎవరో సుందరాకారుడ్ని చూసి మనసు పారేసుకొని వుండాలి. వయసు కొచ్చిన అతివలు సుందరాకారుడైన పురుషుడ్ని గాంచి చలించుట సహజం. అతను ఎవరై వుంటాడు? అతను మానవ వీరుడా లేక యక్ష, గంధర్వ, కిన్నెర, విద్యాధరాది దేవ జాతులకు చెందిన వాడా! తన ప్రయత్నము విఫలము కాదు గదా. అసలచట ఏమి జరిగినదో ముందు తెలుసుకోవాలి.

‘‘యువరాణీ వారెక్కడ?’’ వెంటనే అడిగింది.

‘‘అదో... ఆ పొదల వెనక మండపమునందున్నారు’’ నలుగురూ ముక్త కంఠంతో పలికారు.

ఇక ఆలస్యం చేయకుండా వెను తిరిగింది శంఖు పుత్రి. నడుం దిగువ సర్ప శరీరము నుండి పూర్తిగా నాగ స్త్రీగా మారి నడుచుకొంటూ మండపం వైపు వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే తిరిగి జల క్రీడల్లో నిమగ్నులయ్యారు నాగకన్యలంతా.

పూల పొద వెనక వుంది ఏనాటిదో ఒక చలువ రాతి మండపం. దాని మధ్యలో ఒత్తుగా తామరాకు పరిచి వాటి మీద ఎత్తుగా తామర పూలు పరిచి శయ్యగా చేసారు. దాని మీద వెల్లికిలా శయనించి వుంది నాగలోక యువ రాణి ఉలూచీశ్వరి. అప్పటి కింకా సూర్యుడస్తమించ లేదు. సంపంగి పూల సౌరభాలతో కూడిన చల్లటి గాలులు పరవశింప చేస్తున్నాయి.

అతి లోక సౌందర్య వతి యగు నాగ రాజ తనయ యువ రాణి ఉలూచీశ్వరిని చూడగానే ఆమె మన్మథావస్థలో వుందని నాగ కన్యలు చెప్పింది అక్షర సత్యమని గ్రహించింది శంఖు పుత్రి.

సొగకనులు అర మూతలు పడ్డాయి, కపోలాలు ఎర్ర బారాయి, కంచుకం బిగుతైనది. శ్వాసలు బరువుగా వున్నాయి. కుదురు లేక అటు యిటు దొర్లుతోంది. బాహ్య స్పృహ కోల్పోయి పర ధ్యానంలో వుందామె. శంఖు పుత్రి ఆమెను అబ్బురంగా వీక్షిస్తూ చిన్నగా వెళ్ళి పక్కన కూచుంది.

‘‘ఏవమ్మా అత గాడిని మరువ లేకున్నావా?’’ మృదువుగా అడిగింది.

‘‘ఊఁ...’’ అంది ఏవో కలలలోకంలో విహరిస్తున్నట్టు.

‘‘అంత సొగసుకాడా?’’

‘‘బహు సుందరాకారుడు. మానినీ చిత్త చోరుడు’’

‘‘మమా వీరుడా?’’

‘‘ఒకే బాణమున గరుడ పక్షిని జంపి నను కాపాడినాడు.’’

‘‘ఎవడు వాడు? నరుడా... మరుడా... గంధర్వుడా...’’

‘‘తెలీదు.’’

‘‘ఎచటివాడు?’’

‘‘తెలీదు’’

‘‘తెలీకుండానే ప్రేమించినావా?’’

‘‘ప్రేమా...!’’

ఉలికి పడి కళ్ళు తెరిచింది ఉలూచీశ్వరి.

ఎదురుగా శంఖు పుత్రిని చూసి. చివ్వున లేచి కూచుంది. ‘‘నువ్వా అత్తా! ఎంత తడవైనది వచ్చి?’’ అంది సిగ్గు పడుతూ.

‘‘ఈ సిగ్గు నా ముందు ఎందుకులేమ్మా. ఢాకినీ వనమందు ఏమి అద్భుతము జరిగినది? సవిరముగా తొపుము. నీ సఖియలు చెప్పలేకున్నారు’’ అనడిగింది.

‘‘చెప్పెదను గాని అత్తా. నీ రాక అనూహ్యము. అనుకోకుండా ఏతెంచి నావు. ఏమి విశేషము?’’ మోకాలి మీద చుబుకము ఆన్చి ఓర కంట చూస్తూ అడిగింది ఉలూచీశ్వరి.

‘‘అవును. విశేషమే మరి. కంతుడా జయంతుడా యన దగ్గ ఒక వీర కుమారుని గాంచి నీకు తగిన జోడియని యెంచి నీకు తెలుప నెంచి వచ్చినాను. లాభమేమి? నా శ్రమ వృధా పోయినది. తగిన వాడిని నీవే ఎంచుకొటివాయె. సరి సరి. నీవింతగా మోహ పరవశ వైతి వంటే ఖచ్చితంగా గొప్ప వాడయి వుంటాడు. ఎవరా అదృష్టవంతుడు, ఏమా కథ?’’ అనడిగింది శంఖు పుత్రి.

ఉలూచీశ్వరి ఆలోచను గతానికి మళ్ళాయి. ఆమె కనుల ముందు ఢాకినీ వనం కన్పిస్తోంది. చిన్నగా చెప్పడం ఆరంభించింది.

*****************************************

ఆ రోజు ఎగిరే పాము, అగ్నిసర్పం నుండి వీరోచితంగా పోరాడి బయట పడిన యువరాజు ధనుంజయుడు రెండు దినాలు ఘోరాటవిలో దారి తెన్ను లేకుండా తిరిగాడు. రెండో రోజు ఉదయానికే మబ్బులు పూర్తిగా చెదిరి పోయాయి. ఆకాశం నిర్మలమైంది. సూర్యుడు తొంగి చూసాడు. దిశయితే తెలిసినాయి గాని తను దారి తప్పి ఎంత దూరం వచ్చేసాడో తెలీకుండా పోయింది.

‘‘హే ప్రభో భీమ శంకరా. ఏమిటయ్యా నీ లీల. నీ దర్శనానికి రాలేదని నా దారి మరల్చి కీకారణ్యమున నన్నింతగా శ్రమ పుచ్చుట న్యాయమా? ఇలా గయితే సహ్యాద్రికి ఎప్పటికి చేరగలను, నాగలోకం ఎప్పుడు వెళ్ళగలను? నీ చేష్టలకు అర్థమేమో నీకే తెలియాలి’’ అనుకున్నాడు మనసులో.

మూడో రోజు మధ్యాహ్నం అడవికి వేటకొచ్చిన కొందరు ఆటవికులు కన్పించారు. వారి ద్వారా తను వెళ్ళాల్సిన దిశ తెలుసుకొని ముందుకు సాగాడు. ఆ విధంగా సంధ్యా సమయానికి కాస్త ముందు గానే అశ్వం గరుడ ఢాకినీ వనాటవిలో ప్రవేశించింది.

ఒకప్పుడు ఢాకినీ అనే రాక్షసి ఆధీనంలో ఈ అటవీ ప్రాంతం వున్నందున దీనికి ఢాకినీ వన మను పేరు సార్థకమైంది. అందుకే ఢాకిన్యాం భీమ శంకరం అన్నారు. ఎందుకంటే, జ్యోతిర్లింగాలో ఒకటయిన భీమ శంకరుని ఆలయం ఈ ఢాకినీ వనం లోని భీమా నది తీరాన సహ్యాద్రి పర్వతం మీద వుంది. చాలా పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం.

ఢాకినీ వనము కూడ కీకారణ్యాలకు ప్రసిద్ధి అయినప్పటికీ చాలా ప్రాంతం రాతినేల గాబట్టి పచ్చిక బయళ్ళు అధికం. వాటి అందం చూడ తరమే గాని చెప్పనలవి గాదు. కొండ దిబ్బలు మైదానాల వెంట ఎటు చూసినా పచ్చని పచ్చిక ఒత్తుగా ఏపుగా పెరిగి కన్పిస్తుంది.

చిత్ర విచిత్రములైన గడ్డిపూలు అనేక రంగులలో విర బూసి ఆకర్షిస్తుంటాయి. మకరందం కోసం ఆ పూల వెంట తుమ్మెదతో బాటు అర చేయంత వుండే రంగు రంగుల సింగారాల సీతాకోక చిలుకలు రెక్కలల్లార్చుతూ మందలు మందలుగా సంచరిస్తూంటాయి. మరో పక్క పచ్చికలో తిరుగాడే కృష్ణజింకలు, లేళ్ళ అందాలు చెప్పనలవి కాదు.

తనివి తీరా ఆ అందాలను ఆస్వాదిస్తూ తరుత వెనగ్గా ముందుకు సాగుతున్నాడు రాకుమారుడు ధనుంజయుడు. ఇదే సమయంలో ఎగువన మైదానంలో విహరిస్తున్నారు నాగరాజ తనయ యువరాణి ఉలూచీశ్వరి, ఆమె చెలికత్తెలయిన నాగకన్యలు నలుగురూ.

అందమైన కృష్ణ జింకలను తరుముతూ అవి మూకుమ్మడిగా చెంగు చెంగున దూకి పరుగులిడుతుంటే వినోదిస్తున్నారు. ఉలూచీశ్వరి సీతా కోక చిలుకల వెంట పరుగులు తీస్తూ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నవ్వులు, కేరింతలతో నాగకన్యలంతా ఉత్సాహంగా పచ్చికలో గంతులు వేస్తుండగా తొలి సారిగా విన వచ్చింది కృష్ణ పక్షి అరుపు. అదిరి పడి ఆకాశం వైపు చూసారంతా.

పోతరించిన గరుడ పక్షి ఒకటి రెక్కు చాపి రివ్వున తమ వైపు వస్తూ కన్పించింది. అది తమ కోసమే వస్తోందని అర్థం కాగానే అంత వరకు వున్న ఉత్సాహమంతా మటు మాయమై పోయి ఆ స్థానంలో అంతు లేని భయం చోటు చేసుకుంది. అప్పటికే అది సమీపంలో వుండటంతో ఏమీ చేయటానికి పాలు పోక ప్రాణ భయంతో తలో పక్కకు పరుగు తీసారు. చెలికత్తెలు ఎలాగో ఎవరికి వారు పూల పొదల్లో దూరి ప్రాణాలు దక్కించుకున్నారు. కాని యువ రాణి ఉలూచీశ్వరికి ఆ అవకాశం దొరక లేదు. తన్నుకు పోడానికి రెట్టించిన ఉత్సాహంతో కృష్ణ పక్షి ఉలూచీశ్వరి వెంట పడింది.

కాలి కొద్ది పరుగు తీస్తోంది ఉలూచీశ్వరి. మూడు సార్లు తన మీదికి ఎగురుతూ వచ్చిన పక్షి గోళ్ళకు చిక్కకుండా తప్పించుకుంది. దారిలో దొరికిన ఒక ఎండు కొమ్మను అందుకుని దానితో పక్షిని అదలించే ప్రయత్నం చేసింది. కాని వెళ్ళినట్టే వెళ్లి భీకరంగా అరుస్తూ తిరిగి తిరిగి వస్తూనే వుందా పక్షి. అది తమను నాగకన్యలుగా గుర్తించే దాడికి తెగ బడిందని అర్థమై పోయింది. చెలికత్తెలు ఎటు పోయారో కన్పించ లేదు. ఎంత దూరం పారి పోగలదు. తన సహజ రూపమైన సర్ప రూపం ధరించే సమయం కూడ లేదు. చివరి ప్రయత్నంగా` ‘‘రక్షించండి... కాపాడండి’’ అనరుస్తూ పరుగిడ సాగింది. ఆ అరుపు చెట్ల వెనకగా వస్తున్న ధనుంజయునికి విన్పించాయి. ఉలికి పడి అశ్వాన్ని నిలువరించాడు.

ఎవరో యువతి ప్రమాదంలో ఉన్నట్టుంది. ఎవరామె? ఈ నిర్జన అటవీ ప్రాంతానికి ఎవరు వస్తారు? ఒక వేళ యిది అడవుల సంచరించు భూత ప్రేత పిశాచ గణాలకు చెందిన ఎవరో మాయావి మాయాజాలం కాదు గదా! దీర్ఘంగా ఆలోచిస్తూ చెవులు రిక్కించాడు.

అంతలో మరో మారు విన వచ్చిందా ఆక్రందన.

తనకు కుడి వైపు నుండి విన వచ్చింది. ఆమె ఏమి ప్రమాదాన వుందో తెలీదు. క్షణం కూడ ఆస్యం చేయకుండా`

అశ్వాన్ని అటు మళ్ళించాడు.

తృటిలో చెట్ల పొదలను దాటి మైదానం లోని పచ్చిక మీదకు దూసుకొచ్చింది అశ్వం గరుడ. అప్పుడు కన్పించిందో వింత దృశ్యం. పెద్ద కృష్ణ పక్షి ఒకటి ఒక యువతిని తరుముకొస్తోంది. ఆమె చేతిలో ఒక ఎండు కట్టె వుంది. దాంతో పక్షిని అదలిస్తూ ప్రాణ భయంతో పరుగు తీస్తూ అరుస్తోందామె.

చూస్తుంటే ఆమె సాధారణ యువతిలా లేదు. దివ్య తేజస్సుతో సకలాభరణ భూషిత యగు అతి లోక సుందరిలా వుంది. గరుడ పక్షి ఒక యువతిని తరమటం వింత అయితే! అంతటి మోహనాంగి ఒంటరిగా మైదానమున సంచరించుట మరి యొక వింతగా తోచింది. అశ్వాన్ని ఆమె దిశగా పరుగు పెట్టిస్తూ విల్లంబులు అందుకున్నాడు ధనుంజయుడు.

గిట్టల శబ్ధం వింటూనే చివ్వున తల తిప్పి చూసింది ఉలూచీశ్వరి. శ్వేతాశ్వం నాలుగు కాళ్ళ మీద దూసుకొస్తోంది. దాని మీద విల్లంబులతో తనను కాపాడ వస్తున్న ధనుంజయుని గాంచి విభ్రాంతురాలయింది. రూపెత్తిన కల్కి అవతారంలా వున్న ధనుంజయుని రూపురేఖా విలాసాలకు ముగ్ధురాలవుతూ తన గతిని మార్చుకొని అశ్వానికి ఎదురు పరుగెత్తింది. అదే సమయంలో`

ఉలూచీశ్వరి సౌందర్యం ధనుంజయుని మనసులో ముద్ర పడి పోయింది. ఆమె మానవ కాంత కాక పోవచ్చని సందేహం కూడ ఏర్పడింది. అయితే నిజంగా ఆమె దేవ కన్య అయితే ఒక గరుడ పక్షికి భీతిల్ల వలసిన పని లేదు. అనేక ఆలోచనలు మనస్సున ముప్పిరి గొంటూండగా అశ్వాన్ని వేగంగా పోనిచ్చాడు.

ఆమెను సమీపిస్తున్నకొద్ది ఆమె దివ్య సౌందర్య ప్రభాలను వీక్షిస్తూ తన్మయుడయ్యాడు ధనుంజయుడు. అంతలో సుడి గాలిలా ఉలూచీశ్వరిని సమీపించింది అశ్వం.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali