Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
ఆముక్తమాల్యద
ఆముక్తమాల్యద ఆరవ ఆశ్వాసములో అమూల్యమైన 
సందేశా త్మకమైన  మాలదాసరి కథను చెప్తున్నాడు శ్రీకృష్ణదేవరాయ కవిచక్రవర్తి. మాలదాసరి కథకే మరొక పేరు కూడా ఉన్నది. 'కైశికీ ద్వాదశి'కథ అని ఆ పేరు. మాలదాసరి-బ్రహ్మరాక్షసుల సంవాదము అనే కథను శ్రీకృష్ణదేవరాయలు వేదవ్యాసముని ప్రోక్తమైన 'వరాహ పురాణం'నుండి తీసుకున్నాడు.

వరాహ పురాణంలో నలభై నాలుగవ సర్గలో వరాహస్వామి భూదేవితో తన భక్తుల ప్రభావాన్ని, తన ఉపాసనా ప్రభావాన్ని చెప్తూ ఈ కథను చెబుతాడు. ఒక కార్తీక శుక్ల ద్వాదశి రాత్రి మహాభక్తుడైన మాలదాసరి, ఎప్పటిలాగే స్వామిని సేవించడానికి వెళ్తూ బ్రహ్మరాక్షసునికి చిక్కి, వాడిని నానా విధాలుగా బ్రతిమిలాడుకుని, చివరికి, 'నేను మరలా తిరి రాకుంటే శ్రీహరితో సమానుడైన దైవము కలదు అని పలికిన 
మహా పాపిని అవుతాను' అని ఒట్టు వేసి, బంధ విముక్తుడై వెళ్లి, ఆ ద్వాదశి రాత్రి అంతా జాగారం చేసి, స్వామిని కీర్తించి సేవజేసి, తిరిగి బ్రహ్మరాక్షసుడి వద్దకు వస్తాడు. అతడి సత్య నిష్ఠకు ఆశ్చర్యపోయిన బ్రహ్మరాక్షసుడు ఆతని పాదాలమీద పడి, ఆనాటి కీర్తనా ఫలితాన్ని పొంది, ఆ బ్రహ్మరాక్షస రూపం నుండి విముక్తుడు అవుతాడు. కైశికీ రాగంలో స్వామిని కీర్తించిన ఆ ద్వాదశి నాటి పుణ్య సేవాఫలంగా 
బ్రహ్మరాక్షసుడు విముక్తుడైన ద్వాదశి కనుక అది కైశికీ ద్వాదశి. ఆముక్తమాల్యద ప్రధాన కథతో ఈ కథకు ఎక్కడా సంబంధం లేదు. కానీ శ్రీకృష్ణదేవరాయలు 'కులం కన్నా గుణం మిన్న' అని చెప్పడం కోసం, పరమాత్ముని దృష్టిలో ఉత్తమ శీలం కలవాడే ఉత్తమ కులానికి చెందినవాడు అని చెప్పడం కోసం ఈ కథను జొప్పించాడు. వరాహపురాణంలో ఈ కథను శ్రీహరి భూదేవితో చెప్పాడు. ఇక్కడ, ఆముక్తమాల్యదలో ఈ కథను శ్రీహరి 'భూదేవి తండ్రికి' చెప్పాడు, అది ఒక చమత్కారం అయితే, ఈ కథను విశిష్టాద్వైత సంప్రదాయంతో ముడిపెట్టి, కొన్ని కల్పనలు, కొంత స్వతంత్రత జోడించి 'సత్యపాలన'ను మించిన సఛ్చీలము లేదు అని సందేశాన్ని యిచ్చాడు. ప్రతీకాత్మకంగా చూస్తే 'గజేంద్ర మోక్షం'కథ ఒకటి మాత్రమే ఈ కథతో సరితూగ గలిగిన కథ, భారతీయ ఆధ్యాత్మిక సారస్వతంలో, అల్పమాత్ర ప్రజ్ఞుడైన ఈ వ్యాసకర్త ఉద్దేశంలో.

అక్కడ ఏనుగు మొసలికి చిక్కింది. ఇక్కడ మాలదాసరి బ్రహ్మరాక్షసుడికి చిక్కాడు.ఏనుగు, మాలదాసరి యిద్దరూ మహా భక్తులే. మొదలు యిద్దరూ స్వప్రయత్నం చేసి,ఓడిపోయారు. చివరికిద్దరూ శ్రీహరినే నమ్ముకున్నారు. ఐశ్వర్యము, మదము, కామము,భవబంధాలు అన్నిటికీ ప్రతీక ఐన మొసలిని జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక ఐన 'శ్రీహరి చక్రం' ఖండించింది, 'జీవుడు' అనే ఏనుగు చివరికి విముక్తిని పొందింది. నా ధైర్యము, నా శౌర్యము,నా లౌక్యము, నా ప్రయత్నము అనే అజ్ఞానపు బంధంలో యిరుక్కున్న మాలదాసరికి  'ప్రపత్తి' మార్గము అనే జ్ఞాన సుదర్శన ప్రభలు బంధవిముక్తిని కలిగించి, తాను విముక్తుడు కావడం మాత్రమే కాక, మరొక జీవిని, బ్రహ్మరాక్షసుడిని ముక్తుడిని 
చేసే శక్తిని ప్రసాదించాయి.ఒకసారి నువ్వున్నావని నమ్ముకున్న తర్వాత, నీకు సమర్పించుకున్న తర్వాత, యిక నేను-నా ప్రయత్నము-నా ఆరాటము-నా పోరాటము ఏదీ లేదు, పాల ముంచినా నీట ముంచినా భారము నీదే, ఫలితమూ నీదే, కర్తవు, కర్మవు, క్రియవు, భోక్తవు అన్నీ నువ్వే, అని నిశ్చింతగా నమ్ముకుని పడి ఉండడమే ఉత్తమమైన మార్గం, ప్రపత్తి మార్గం. అది 'తెలిసిన' ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. దాన్ని 'తెలుసుకున్న తర్వాత' విభీషణుడు, ఏనుగు, పాంచాలి, అహల్య, ధ్రువుడు రక్షింపబడ్డారు. మాలదాసరి కూడా అది తెలుసుకున్న తర్వాత, నిశ్చింతగా బ్రహ్మరాక్షసుడి వద్దకు తిరిగి వెళ్లి వాడికి ఆహారంగా మారడానికి సంసిధ్దుడైనాడు. తాను రక్షింపబడడమే కాకుండా, తనను చంపి తినేయాలనుకున్న బ్రహ్మరాక్షసుడినీ భయంకరమైన ఆ జన్మనుండి రక్షించాడు!

ఆ రకంగా చూస్తే మాలదాసరి ఒక పిసరు ఎక్కువే, ఏనుగుకన్నా! విశిష్టాద్వైత మార్గంలో, వైష్ణవమార్గంలో భక్తుడు, భాగవతుడు భగవంతుడితో సమానుడు. భాగవత సేవ భగవత్సేవకన్నా మరీ పుణ్యప్రదం అని చెబుతుంది సంప్రదాయం. భాగవతోత్తముడైన మాలదాసరి బ్రహ్మరాక్షసుడిని రక్షించగలిగాడు.కండబలం, మందబలం తప్ప బుద్ధిబలం లేని జంతువైన ఏనుగు, సామాజికంగా నిమ్నకులానికి చెందిన సామాన్యుడు మాలదాసరి, ఇద్దరూ ఏ ప్రత్యేకతలూ లేనివారే, శ్రీహరి భక్తి, ప్రపత్తి అనే ప్రత్యేక పెన్నిధి తప్ప. చివరికి ఆ పెన్నిధియే వారికి అక్కరకొచ్చింది. కేవలం భక్తి మాత్రమే కాదు, సత్యవ్రత నిష్ఠ కలిగిన మహానుభావుడు మాలదాసరి. తన బంధాలను తెంచుకోవాలని అనుకున్నది పరమాత్ముడి సేవకోసమే, అది నెరవేర్చుకుని వెనక్కు వెళ్లి తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిధ్ధపడ్డ అపర దధీచి, ఆదర్శ మానవుడు మాలదాసరి. అటువంటి వారికి కుల, మత, వర్గ, ప్రాంత, లింగములనే తుచ్ఛపరిమితులు ఉండవు, వారు భూమి మీద సంచరించే దేవుళ్ళు అని భారతీయుల విశ్వాసం. ఉపనిషత్తులతో మొదలుకొని, భారతీయ ఇతిహాసాలు, పురాణాలు అన్నీ యిదే చెప్పాయి. 'చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ..' అని, అన్నిటిలోనో, అందరిలోనూ, అంతటా భగవంతుడినే చూసే సమదర్శనుడు చండాలుడైనా మరెవడైనా, ఆతడే నా గురుదేవుడు అని ఆదిశంకరులు చెప్పినది ఆ సత్యాన్నే!

యిదివరకే ఎక్కడో ఉన్న కథను తీసుకొచ్చి వాడుకోవడం యేమి గొప్ప అనేవారు ఉండవచ్చు, అసలా కథను ప్రపంచానికి చెప్పాలి అనుకోవడమే మహా ఉపకారం, భారతీయ ఆలోచనా విధానాన్ని మరొకసారి చెప్పడానికి. కథ మాత్రమే కాక, కథనము, పాత్రల పోషణ, వర్ణన, చమత్కారం, లక్ష్యము యివి మాలదాసరి కథకు సాటి రాగలిగిన కథ ఎక్కడా, ఏ భాషలోనూ లేదు అని 'విశ్వనాథ' వారితో పలికించాయి.బ్రహ్మరాక్షసుడు కట్లు విప్పదీయగానే పరుగు పరుగునా వెళ్లిపోయాడు

మాలదాసరి.అతఁడు తదల్పపాపఫల మందుట సుంకము దీఱి పోయి తచ్ఛత
దళపత్త్ర నేత్రునకు జాఁగిలి మ్రొక్కి రణద్విపంచియై 
స్తుతికలితప్రబంధములఁ జొక్కఁగఁ బాడి యసత్యభీభర 
ద్రుతగతి వచ్చి రాత్రిచరుతో వ్రతపూర్తి గతార్తి నిట్లనున్

ఆ మాలదాసరి యెప్పుడు, యే పాపము చేయడం వల్లనో ఫలితంగా కాబోలు, వచ్చిన ఆ బంధాలు తొలిగిపోయాయి. దాంతో ఎప్పటి పాపపు బాకీయో తీరిపోయింది బహుశా.వెళ్లి వేయిరేకుల పద్మములవంటి కన్నులున్న ఆ తిరు కురుంగుడి శ్రీహరికి సాగిలి నమస్కరించి, తన చిట్టి వీణను మీటుతూ, ఆనందంగా తాండవం చేస్తూ, స్తుతులతో కల్పించిన ప్రబంధములవంటి తన కీర్తనలతో స్వామిని కీర్తించి, సేవించి, ఆలస్యము అయితే, అసత్యము పలికాడీ దాసరి అని ఎక్కడ ఆ బ్రహ్మరాక్షసుడు అనుకుంటాడో అనే భయంతో, వేగంగా వెనక్కు తిరిగి వచ్చాడు, బ్రహ్మరాక్షసుని వద్దకు. వ్రతం పూర్తి చేసుకోవడం వలన దిగులు తొలిగిపోయి, ఆ బ్రహ్మరాక్షసుడితో యిలా అంటున్నాడు. బ్రతికి ఉండగా స్వామికి మేలుకొలుపులు పాడకుండా తెల్లవారకూడదు అనే వ్రతం నెరవేరింది, కనుక దిగులు తొలిగిపోయింది. అన్నమాట ప్రకారం ప్రాణాలను అర్పించడానికి, అది కూడా ఆలస్యము చేయకుండా వెనక్కు రావడం వలన, ఆడినమాట తప్పని వ్రతం కూడా పూర్తి అయింది, కనుక దిగులు తొలిగిపోయింది మాలదాసరికి, అని చమత్కరిస్తున్నాడు రాయలవారు.

నీచెఱఁ బాసి పోయి రజనీచర చక్రిఁ భజింప ముక్తిపొం 
దేచెర యే చెఱం దవుల నే నిఁక నుండగ జూడు పంచుచో 
నే చరణం లేయుదర మేయుర మేశిర మేకరంబు లీ 
వాచరణంబు లాయుదర మాయుర మాశిర మాకరంబులున్

ఓ (రజనీచరా, నిశాచరా) రాక్షసేశ్వరా! నీ చెఱ నుండి తప్పించుకునిపోయి, ఆ చక్రధారి ఐన శ్రీహరిని కీర్తించడంవలన నాకు ముక్తిపొందు దగ్గరైంది. ఆయన సేవతోటీ, సత్యవ్రత నిష్ఠా పాలనంతోటీ, ఆకలిగొన్న వానికి భోజనపాత్రుడిని కావడంతోటీ నాకు ముక్తి పొందు హెచ్చు ఐంది. ఇక యే చెరలో, ఏ బంధాలలో నేను చిక్కను. యిదిగో, చూడు, నన్ను నువ్వు పంపేప్పుడు ఎలా వెళ్ళానో అలానే వచ్చాను. 'నీ'శరీరాన్ని 'నీ'కోసం భద్రంగా తెచ్చాను. నువ్వు పంపేప్పుడు ఏ కాళ్ళు, ఏ ఉదరము, ఏ రొమ్ము, ఏ తల, ఏ చేతులు, ఎలా ఉన్నాయో, ఆ కాళ్ళు, ఆ ఉదరము, ఆ రొమ్ము, ఆ తల, ఆ చేతులు అలాగే నిక్షేపంగా ఉన్నాయి,ఏమీ దాచుకోకుండా వచ్చాను, యిక ఈ శరీరం నీది, నీ యిష్టం, ఎలా తింటావో ఏమంటావో .. అన్నాడు మాలదాసరి. ఏ మాత్రమూ బాధ, భయము లేకుండా,అన్ని బాధలు, బరువులు, బాకీలు తీరినవాడిలాగా .. సంతోషంగా, ఉత్సాహంగా,సరదాగా సల్లాపాలాడుతున్నట్లు ' యిక నన్ను తినేసి నీ ఆకలి తీర్చుకో' అన్నాడు మాలదాసరి!

(కొనసాగింపు వచ్చేవారం)

**వనం వేంకట వరప్రసాదరావు. 
మరిన్ని శీర్షికలు
weekly horoscope29th january to 4th february