Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

చెన్నై చేరెప్పటికి అర్ధరాత్రి దాటింది.  ఇల్లు చేరేప్పటికి తెల్లరుజామయింది.

నన్ను చూసి వినోద్, కోటమ్మత్త కూడా చాలా సంతోషించారు.

ఆశ్చర్యపోయేటంతగా  ఎదిగిపోయాడు, వినోద్..  అందమైన యువకుడిగా మారిపోయాడు నా తమ్ముడు.  

ఫ్రెష్ అయి బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా అంకుల్ పరిస్థితి వివరించారు  నాన్న.   ఈ సారి  హార్ట్-అటాక్ నుండి, ఆయన బయటపడ్డం కష్టమన్నారట, మొదట్లో డాక్టర్లు.  అందుకే, ఆయన మరీ మరీ అడగడంతో నన్ను అర్జంటుగా  పిలిపించామన్నారు.

ప్రస్తుతం, క్రిటికల్ నుండి,  ఆయన పరిస్థితి నిలకడగా ఉందట.  హృద్రోగం  వల్ల మాత్రం, మున్ముందు ఆయన ఆరోగ్య పరిస్థితి సున్నితంగానే

ఉండబోతుందని సూచించారట..   


రాణి గురించి అడిగాను..

రాణి ఇప్పుడు బయట వేరేగా నివశిస్తుందట.  తండ్రీ-తనయల నడుమ పరిస్థితి అదేవిధంగా పగ-పౌరుషాలతోనే కొనసాగుతుందట.   

విని చాలా బాధగా అనిపించింది.


ఇంతలో  హాల్లో నుండి వడిగా పడుతున్న అడుగుల చప్పుడుకి,  పక్కకి తిరిగి చూసాను. చిరునవ్వుతో డైనింగ్ ఎంట్రెన్స్ లో నిలబడున్నాడు జగదీష్..


ఆశ్చర్యంతో, సంతోషంతో నాకు నోట మాట రాలేదు... చూస్తుండిపోయాను...

నా గుండె చప్పుడు క్షణం సేపు ఆగినట్టు, తిరిగి అతి వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. ఇది అది అని చెప్పలేని భావన నన్ను అమాంతం చుట్టేసింది.


“హలో, మేడమ్ నన్ను గుర్తు పట్టారా?” అన్న మాటలకి ఉలిక్కిపడి చూస్తే,  వచ్చి నా ఎదురుగా కూర్చున్న జగదీష్.   


“నువ్వు ఇవాళ వస్తున్నావని, చంద్రకి చెప్పలేదు జగదీష్ బాబు. చంద్రని సప్రైజ్ చేద్దామన్నావుగా,” నవ్వుతూ అమ్మ.


“సంతోషకరమైన సప్రైజ్ ఇచ్చారు, కళకి,”  అమ్మ నుండి కాఫీ కప్పు అందుకుంటూ నాన్న.

“జగదీష్,  నీవు కూడా ఫ్రెష్ అయ్యి, బ్రేక్ ఫాస్ట్ కానివ్వు.  అంకుల్ ని విజిట్

చేయడానికి వెళదాము,” అన్న నాన్నతో........  

“నా  బ్రేక్ ఫాస్ట్  ఫ్లైట్ లోనే అయింది మామయ్య.  చంద్రకళ పనయితే, హాస్పిటల్ కి బయలుదేరడమే.  మీతో కలిసి వస్తున్నట్టు, నీరూ ఆంటీకి తెలియజేశాను,”

అన్నాడు జగదీష్.


“ఈ లోగా కాఫీ అయినా తాగు,” అంటూ జగదీష్ కి కప్పందించింది అమ్మ.

 

కాఫీ సిప్ చేస్తూ నావంక చూసాడు.

“నీవు ఇండియాకి తిరిగొచ్చేయాలని ఎంతగానో తపించింది కూడా, మీ నాన్నే అని తెలుసా నీకు?  అక్కడ  క్లాసికల్ ఆర్ట్స్ కి తగినంత ఆదరణ

లేదంట. ఆర్టిస్ట్ గా అక్కడ స్థిరపడాలనుకోడం  పొరపాటే అంటున్నారు మామయ్య,” ,”నిజమా?” నాతో జగదీష్...


నాన్న వంక చూసాను.

అయన సన్నగా నవ్వారు...


“అక్కడ కళారంగం పద్దతులే వేరని,  తెలుగు సభల్లో పాల్గొని మరీ, గ్రహించాను.  అక్కడ, ఆర్టిస్ట్ గా కొనసాగడానికి, టాలెంట్ కంటే ముందు, పలుకుబడి-పరపతి ఉండాలనిపించింది.  అమెరికాలో, స్థానికంగా ఉండడంతో,  ఓ విలువున్న ఆర్టిస్ట్ గా తన ఉనికిని కోల్పోయింది మన కళ.

సభల్లో పాల్గొనేందుకు, అందరిలా ‘ఆడిషన్స్’ చేసి, తన ఖర్చు కూడా

తానే  భరించింది.   

అందుకే, చంద్రకళ అలా అగచాట్లు పడే అవసరం లేదని,  త్వరగా తిరిగి ఇక్కడికి వచ్చేయాలని  ఆరాటపడ్డాను,”  అన్నారు నాన్న నిక్కచ్చిగా...


“పోనీలే సత్యం,  కష్టపడినా, ఆ దేశంలో కూడా పేరు ప్రతిష్ట దక్కాయిగా..  ఇక ఇప్పుడు తిరిగోచ్చేసింది.  సంతోషం.   ఇక చంద్రని చూస్తే మన భూషణ్ గారు కూడా కోలుకుంటారేమో!  వెంటనే, హాస్పిటల్ కి బయలుదేరండి,” అంది కోటమ్మత్త.

**

హాస్పిటల్  ఫోర్త్ ఫ్లోర్ లిఫ్ట్ నుండి బయటికి వచ్చి, అంకుల్  ఉన్న కేర్-యూనిట్ దిశగా నడిచాము...  


అంకుల్ రూములోకి వెళ్లబోతుంటే, గది నుండి మాకెదురుగా వచ్చిన

యువతిని చూసి, ఆగిపోయాము.   క్షణం తరువాత, ఆమె రాణియే నని

గుర్తుపట్టాను.ఇంత అధాట్టుగా ఆమె ఎదురుపడుతుందని ఊహించని నేను, నివ్వెరపోయాను.  మమ్మల్ని చూసిన రాణి కూడా అల్లాగే చేష్టలుడిగి

నిలబడిపోయింది.   


 ముందుగా తేరుకున్న జగదీష్, “హలో, రాణి, ఎలా ఉన్నావు?  ఫాదర్ ఎలా ఉన్నారు?  ఆయన ప్రస్తుత పరిస్థితి ఏమిటి?” రాణిని ప్రశ్నలతో ముంచెత్తాడు.  


రాణి కూడా తేరుకుని జగదీష్ ని నవ్వుతూ పలకరించింది.  “డాడీ పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు.  కొద్దిగా మాట్లాడుతున్నారు.  ఈ లీగల్ డాక్యుమెంట్స్  పై అయన సంతకాల కోసం, పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నాను,” గబగబా

చెప్పింది.


జగదీష్ మాట్లాడుతుండగా, నేను రాణి ని పరిశీలించాను.  ముందుకన్నా, బొద్దుగా అందంగా ఉంది.   చేతుల్లో ఫైల్స్ ఉన్నాయి...పొత్తి కడుపు ఎత్తుగా ఉంది.  తను ప్రెగ్నెంట్ అని స్పష్టంగా తెలుస్తుంది.  ఆమెతో వెనుకగా ఓ నడివయస్కుడు  కూడా ఉన్నాడు.  అతనికి ఓ చేతిలో బ్రీఫ్కేస్ - మరో చేతిపై లాయర్ కోటు ఉన్నాయి.  రాణి పర్సనల్ లాయర్

అయ్యుండవచ్చు.  


“ఇదో మనచంద్రకళ, ఇవాళే అమెరికా నుండి రిటర్న్ అయింది.  

అంకుల్ ని చూద్దామనే మేమంతా ఇలా,”... క్షణమాగాడు జగదీష్..

“ఇంతకీ నీరూ ఆంటీ లోపలున్నారా,”  ఏమనాలో ఇబ్బంది పడుతూ, మళ్ళీ అతను..


“అవును, నిన్ను చెన్నైకి రమ్మని పిలిచానని చెప్పారు డాడీ. ఇవాళ, ఇక్కడికి  వస్తున్నావని  మమ్మీ అన్నది.  ఇప్పుడే,  తను ఇంటికి వెళ్ళింది.   ఫ్రెష్ అయి త్వరగానే వచ్చేస్తుంది... ,” అంటూ మావైపు

చూసింది రాణి...

“ఎలా ఉన్నారు మీరంతా?” అడిగింది.   


“బాగున్నాము రాణి.  మీ ఫాదర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటాము,” అంది అమ్మ.  


చిరునవ్వు తో “థ్యాంక్యూ,” అనేసి, జగదీష్ వైపు చూసింది రాణి..


”జగదీష్, నీకిక్కడ పనయ్యాక, ఓసారి నన్ను కలుస్తావని ఆశిస్తాను.  నీతో మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి.  ప్లీజ్, కాల్ చేసి తప్పకుండా రా,” అనేసి

అందరి వద్ద  సెలవు తీసుకొని వడివడిగా తన లాయర్ తో వెళ్ళిపోయింది.

**

అంకుల్ ఉన్న రూమ్ లోకి వెళ్ళాము... వాకిట్లోనే అంబుజ కనబడింది...నన్ను చూడగానే, నీళ్ళు నిండిన కళ్ళతో, రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టింది.

దగ్గరగా వెళ్లి, ఆమె భుజం మీద తట్టి, లోనికి నడిచాను.   


లోపల, అంకుల్ బెడ్ వద్ద  వైటల్స్ చెక్  చేస్తున్న నర్స్ కనబడింది.

వెళ్లి, కాస్తదూరంలో అంకుల్ కాళ్ళ వైపు నిలబడ్డాము.


పని ముగించి వెళుతూ, క్షణం సేపు మా వద్ద ఆగింది, నర్స్.

“పొద్దుటినుండి ఆయన తన డాటర్ తో మాట్లాడుతూ గడిపారు.  ఆవిడ ఉండగానే, కళ్ళు మూసుకుని పడుకున్నారు, సార్,” ఆయనకి  కాస్త  విశ్రాంతి

అవసరమన్నట్టు మాకు సూచించి, అక్కడినుండి కదిలింది...

**

బెడ్డుకి  దగ్గరగా వెళ్లి,  అంకుల్ వంక చూసాను.  మూసుకుని ఉన్న ఆయన కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి.  వెలుగు తగ్గిన ఛాయ, సన్నబడి చిక్కిపోయిన శరీరాకృతి చూసి, దిగులుగా అనిపించింది.   అయన రూపు పూర్తిగా మారిపోయింది.   


వణుకుతున్న చేతులతో ఆయన పాదాలపై చేతులుంచాను.   

తమాయించుకోమనట్టు, పక్కనే ఉన్న జగదీష్ నా భుజంపై చేయి వేశాడు.


పాదాలపై స్పర్శకి, మెల్లగా కళ్ళు తెరిచారాయన.  “ఎవరూ?” అంటూ మా దిశగా చూసారు.


నా వెనుకగా ఉన్న నాన్న, అంకుల్ కి దగ్గరగా వెళ్లి, బెడ్ పక్కనున్న స్టూల్ మీద కూర్చున్నారు.   

“ఇవాళ నిన్ను చూడ్డానికి మాతో పాటు చంద్రకళ కూడా వచ్చింది, భూషణ్.  

అంతేకాదోయ్, మాతో పాటే జగదీష్ కూడా ఉన్నాడు,” మృదువుగా ఆయన చేతులపై తడుతూ నాన్న.


కళ్ళెత్తి చూసిన ఆయన ముఖంలో మెల్లగా ఆనందం, ఆశ్చర్యం చోటుచేసుకున్నాయి.   

“కళా, నువ్వా? ఇలా రా, వచ్చి నా దగ్గరగా కూర్చో,” అన్నారు...


“నమస్తే, అంకుల్,” అంటూ నాకూడా దగ్గరగా వచ్చిన జగదీష్

చేయందుకున్నారాయన..


“బాబూ జగదీష్,  నామాట మన్నించి చెన్నై వచ్చినందుకు,  ఆనందంగా ఉంది.  మీ ఇద్దరితోనుకాసేపు మాట్లాడాలి,” మా వంక చూస్తూ, అంకుల్....  


“హైరానా పడకుండా, తీరిగ్గా మాట్లాడు భూషణ్.  నీకు కావలసినంత సేపు ఇక్కడే ఉంటారు వీళ్ళు,”  నాన్న కలగజేసుకున్నారు..  


“బాబూ  జగదీష్, నీవు చైర్ దగ్గరగా వేసుకొని కూర్చో.  ఈ లోగా మేము వెళ్లి క్యాంటీన్ లో కాఫీ తాగి వస్తాము,” అంటూ నన్ను స్టూల్  మీద కూర్చోమని, అమ్మతో సహా రూము నుండి వెళ్ళారు.   

**

మమ్మల్ని  తన బెడ్డుకి ఇరువైపులా కూర్చోమని సైగ చేసారు అంకుల్.   

ఉద్వేగాన్ని  ఆపుకోలేకపోతున్న  నా వంక చూసి, వద్దని సైగ చేసాడు

జగదీష్.  వెళ్ళి బెడ్ దగ్గరగా స్టూల్ మీద కూర్చున్నాను..


ఇరువైపులా కూర్చున్న మా ఇద్దరి చేతులూ గుప్పిళ్ళలోకి తీసుకుని దగ్గరగా పట్టుకున్నారు అంకుల్.  

“అత్యంత ఆప్తుల్ని దగ్గరికి తీసుకున్నట్టుగా ఉందమ్మా,” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.   నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను..   


“మీరీ స్థితిలో అప్సెట్ అవ్వడం మంచిది కాదు అంకుల్,” అంటూ అటు ఆయన్ని,“ఎందుకు ఏడుస్తావు?...నువ్విలా బాధపడి ఆయన్ని మరింత

బాధపెట్టకు చంద్రా,” అని ఇటు నన్ను ఓదార్చాలని ప్రయత్నిస్తున్నాడు జగదీష్.


పెల్లుబుకుతున్న దుఃఖంతో, అంకుల్ చేతి పై తల ఆనించాను.


“చంద్రా,  చెబితే వినాలి... కంట్రోల్ యువర్సెల్ఫ్ ప్లీజ్. కన్నీళ్ళు తుడుచుకో,”

టిష్యూ అందించాడు జగదీష్...


కాసేపటికి, నాకంటే ముందుగా అంకుల్ తేరుకున్నారు...

“బాధపడకు, కళా.  కళ్ళు తుడుచుకో,” సుతిమెత్తగా అంకుల్ గొంతుతో పాటు,...

“అవును చంద్రా, బాధపడకమ్మా,” అన్న నీరూ ఆంటీ మాటలకు తలెత్తాను.   


ఆవిడ ఎప్పుడు గదిలోకి వచ్చారో కూడా తెలియలేదు.  నా దగ్గరగా నిలబడి, నా తలపై చేయి వేసింది ఆంటీ.   

పైకి లేవబోయిన నన్ను, “పర్వాలేదు కూర్చోమ్మా, మీఇద్దరిని చూడాలని ఎంతగానో తపిస్తున్నారు మీ అంకుల్.  మేము జగదీష్ ని చూసి కూడా చాలా కాలమయింది,” అంటూ మరో కుర్చీ లాక్కుని నాపక్కనే

కూర్చున్నారావిడ.  


జగదీష్ తో పలకరింపులు ముగిసాక, “నిన్ను తలవని రోజు లేదంటే నమ్ము,”  నాతో ఆంటీ.  

**

“కరెక్ట్ టైంకే వచ్చావు నీరూ.  ఇప్పుడే నీ గురించి అనుకున్నాను.  డాక్టర్ గారిని

కలిసొస్తాన్నావుగా!  ఏమన్నాడాయన?” అంకుల్.

ఆంటీ లేచి అంకుల్ కి దగ్గరగా వెళ్లి,  పైకి జరిగి కూర్చోడానికి ఆయనకి సాయం చేసింది.  


“వారం క్రితం కంటే బెటర్ అన్నారు.  ఇలాగే నిలకడగా ఉంటే, నాలుగు రోజుల్లో,  ఇంటికి వెళ్ళవచ్చన్నారు.   కోలుకునేంత వరకు, ఫుల్-టైం నర్స్ అజమాయిషీలో ఉండాలన్నారు.  పోతే, నడవడానికి  ఓపిక వచ్చేంతవరకు

వీల్-చెయిర్ తో మానేజ్ చేయాలన్నారు.  చెయిర్ కూడా సెలెక్ట్ చేసే వస్తున్నా.  పోతే,  ఓ గంటలో మళ్ళీ వచ్చి మిమ్మల్ని చూస్తాన్నారు,” వివరించింది ఆంటీ.   


తిరిగొచ్చి, నా పక్కనే కూర్చుంటూ,  “ఏమ్మా, మీరు రాణి ఉండగానే వచ్చారా? దాన్ని కలిసారా చంద్రా?” ఆడగిందామె.

చూసామన్నట్టు తలాడించాను...


“కలిసాము ఆంటీ... బ్రీఫ్ గా మాట్లాడాము కూడా,” జవాబిచ్చాడు జగదీష్....


కొద్దిపాటి మౌనం...తరువాత...జగదీష్ చేతిపై తట్టి, ముందుగా అంకుల్

మాట్లాడారు.

“జగదీష్ బాబు, నీకు తెలియని కొన్ని విషయాలు, ఈ రోజు నీ

ముందుంచుతాను..,” అన్నారు.


విశ్రాంతిగా ఉండమని జగదీష్ వారించినా ఊరుకోలేదాయన.  

చేసేది లేక, ఇద్దరం మౌనంగా ఉండిపోయాము.


”మన చంద్రకళని స్వయంగా నేనే, ఓ క్లిష్టమైన పరిస్థితిలోబంధించేసానని తెలుసా నీకు?...నా అంచనా ప్రకారం కళ నీకు ఈ విషయాలేవీ చెప్పుండదు,” అంటూ, వారి ఇరవైఐదవ పెళ్లిరోజున జరిగిన సంగతులతో పాటు, ఆలయంలో మా మధ్య జరిగిన సంభాషణని పూస గుచ్చినట్టు ఏకరవు పెట్టారు... అంకుల్.


అవాక్కయిపోయాను.  జగదీష్ వంక చూసే ధైర్యం లేకపోయింది.  


“ఈ రోజున మాత్రం, ఆనాటి నా తప్పిదాన్ని సరిదిద్దుకోదలిచాను.  అయితే, అందుకు ముందుగా చంద్రకళని క్షమార్పణ అడుగుతున్నాను,”  నా చేతిని

పదిలంగా జగదీష్ చేత్తో కలిపి పట్టుకున్నారు అంకుల్..


తల పైకెత్తి అయన వంక చూసాను.


“స్వార్ధపూరితంగా ఆలోచించి, నిన్ను అసాధ్యమైన త్యాగాలు చేయమని అడిగాను తల్లీ. నన్ను క్షమించు కళా.. నేను ఆశించిన దానికన్నా నీవు ఎక్కువే చేసావు.   రెండేళ్ళగా  ఇండియాకి తిరిగొచ్చేయమని, మీ నాన్న చెప్పినా,

నీవు రాలేదంటే, నాకర్ధమయిందమ్మా కళా.

మా ఇంటి పరిస్థితులు మెరుగవుతాయని ఆశించే,  జగదీష్ కి దూరంగా గడపుతున్నావని గ్రహించగలిగాను....  మాతో ఉన్న అనుబంధాలకి కట్టుబడి,

పెద్ద మనసుతో వ్యవహరించావని తెలుసునమ్మా, కళా,”  అంకుల్

కళ్ళనిండా నీళ్ళు....


నా కళ్ళ నుండీ ఆగని కన్నీరు.


“అందుకే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మీఇద్దరి వివాహం నా చేతుల మీదగా జరిపించడమే నాకున్న కోరిక,” కలిపున్న మా చేతులని గుండెలకి హత్తుకున్నారు.....

**

నేను తలెత్తి, జగదీష్ వంక చూసాను.. మునుపెన్నడూ చూడని భావాలు కనబడ్డాయి నాకు.

‘ఇందుకేనా  మాట్లాడినప్పుడల్లా నా మనస్సుని రాణి వైపు మళ్ళించాలని, వాళ్ళ కుటుంబానికి నా అవసరం  ఎంతైనా ఉందని చెప్పడానికి ప్రయత్నించావు?’ అని గుచ్చి గుచ్చి అడిగినట్టుగా ఉన్నాయి అతని చూపులు...


ఆ ప్రశ్నకి నా వద్ద జవాబు లేదే మరి! ఛటక్కున కళ్ళు దించుకున్నాను.


“నేను ఈ సారి హార్ట్ అటాక్ తో ఆసుపత్రిలో జేరడమే నిన్ను తిరిగి చెన్నై తీసుకురాగలిగింది కదూ! అందుకే, ఇది, మన సమస్యకి ఆ దేవుడు చూపిన పరిష్కార మార్గం అనుకుంటాను...,” అన్న అంకుల్ వైపు చూసాను.   


ఇంతలో ఆంటీ కలగజేసుకుంది...

“మేము నీ భవిష్యత్తుకి అడ్డుగోడయ్యామని నిత్యం కుమిలిపోతున్నాం చంద్రా..  ఇక మన జగదీష్ అంటావా?  తరుచుగా మా యోగక్షేమాలు కనుక్కుంటూ, రాణి విషయంలో కొంత కనువిప్పు కలిగించాడు.  అందుకే ద్వేషించే బదులు, దాని ఆలోచన, ప్రవర్తన అర్ధం చేసుకునే ప్రయత్నంలో పడ్డాము.  చెన్నై  వచ్చిన ఒకటి రెండు సార్లు,  మమ్మల్ని స్వయంగావచ్చిపలకరించాడు కూడా,” క్షణమాగింది ఆంటీ.


“ఇప్పుడవన్నీ ఎందుకు ఆంటీ,” అన్నాడు జగదీష్.  


“చెప్పనీ బాబూ, నిన్ను చూసి కూడా ఆరు నెలలు దాటింది కదా,” అంది ఆంటీ.... జగదీష్ కి వినడం మినహా వేరే ఆప్షన్  లేకుండా పోయింది.  


“ఇకపోతే,  రాణి  కొన్నాళ్ళ  క్రితం వరకు తరచుగా, ఆశగా ఢిల్లీ వెళ్ళడం, వాళ్ళ  సొంత మనిషిలా వ్యవహరించడం చేసేది.  తిరిగి వచ్చి నిరుత్సాహంగా గడిపేది.  చేసేదిలేక, మేము మౌనంగా ఉండిపోయాము.

ఆరునెల్ల క్రితం మాత్రం ఇంటినుండి తన సొంత ఫ్లాట్ లోకి వెళ్ళిపోతానంది.   

జగదీష్ పై, తానిక ఆశలు వదులుకున్నట్టేనని మాకర్ధమైంది....  

తనకి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చాము.  కాకపోతే, అక్కడ, ఆ రంజిత్ సూరితో సహజీవనం చేస్తుందని అశాంతిగా ఉంది,” చెప్పడం ఆపి గట్టిగా ఊపిరి తీసుకుంది ఆంటీ....  


అంకుల్ వైపు ఒకసారి చూసి, మళ్ళీ చెప్పసాగింది...”రాణిని మీరూ చూసే ఉంటారుగా..తనిప్పుడు ప్రెగ్నెంట్ కూడా.... నెలరోజుల క్రితం,

ఆస్థులపై తన హక్కులివ్వమని తన లాయర్ ద్వారా అడిగింది,”

అంటూ ముగించిందామె.

**

మంచినీళ్ళు అడిగి తీసుకొని తాగారు అంకుల్.  మా వంక నిశితంగా చూసారు..


“మేము చెప్పిందంతా విన్నారుగా...  ఎంతో హాయిగా ఉంది.  భారమంతా

దిగిపోయినట్టుగా!  ఇప్పుడు మీరిద్దరూ మమ్మల్ని  క్షమిస్తారు కదూ,” అంటూ

చేతులు  జోడించారాయన.


ఆయన్ని వారించబోయాము..


“అదేమిటోయ్, భూషణ్, వాళ్ళని ఆదేశించు...బతిమాలి బామాడుతావేమిటి... ఈ కూతురు వద్ద నీకు ఎంతైనా స్వేచ్చాస్వాతంత్రాలున్నాయిగా,” అన్న నాన్న మాటలకి కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి చూసాను.  ఎప్పటి నుండి అక్కడ ఉన్నారో గమనించనే లేదు...


అది గ్రహించిన జగదీష్, “మామయ్యావాళ్ళు వచ్చి కూడా కాసేపయింది.  

వినవలసిందంతా విన్నారు,” అన్నాడు నవ్వుతూ.


“ఇకపోతే, భూషణ్ అంకుల్,  ఇప్పుడు నేను చెప్పేది కూడా వినాలి మీరు,”

అంకుల్ వైపు చూస్తూ మళ్ళీజగదీష్.

“చంద్రకళకి మీ పట్ల అంతులేని  ప్రేమాభిమానాలున్నాయి.  ఎంతంటే, నన్ను కూడా దూరం చేసుకోడానికి వెనుకాడలేదు,” ఆగి, ఒక్క క్షణం నా వంక సూటిగా చూసాడు.   

“కాబట్టి, క్షమించడాలు ఏమీ అక్కరలేదు... మా మామయ్య అన్నట్టు, మీరు ఎలా కావాలంటే అలా చేద్దాము,” అన్నాడు.......


అమ్మ కల్పించుకుంది.. “ఇదే సరయిన సమయం.. చంద్రని తిరిగి చెన్నైకి రప్పించాలని, మీరిద్దరూ  ఎన్నాళ్ళగా  ప్లాన్ చేస్తున్నారో కూడా చెప్పండి,” అంది నాన్నతో......


“భలేదానివే శారదా...ఇప్పుడా? మొదటి సారి అమెరికా వెళ్లి ఆరునెలలు

చంద్రకళ వద్ద ఉన్నప్పుడే  చెప్పానుగా.  అమెరికా జీవనం చాలించి, ఇక ఇండియాకి వచ్చేయమని.  ఆ సంగతి భూషణ్ కి తెలుసును.  

అందుకేగా ‘నర్తకి’ అనే టెలి-సీరియల్   ప్రాజెక్ట్ మొదలుపెట్టి, దాన్ని ఇక్కడికి రప్పించాలని ప్లాన్ చేసాము, ఆ ప్రాజెక్ట్ సిద్దమైంది కూడా,” అన్నారు నాన్న.....


వెంటనే, అంకుల్ కల్పించుకున్నారు.

“జగదీష్ కి అమెరికా వెళ్ళే ఆలోచన లేకపోవడం కూడా కొంత కారణం లేవోయ్

సత్యం,” నవ్వుతూ ఆయన..


ఆయన ముఖాన చిరునవ్వు అందరికీ అపురూపమైన దృశ్యమే అయింది..   


“ఏమైనా, అందరం మాట్లాడాము... అసలు చంద్రకళ మాత్రం నోరు విప్పలేదు,” నా వంక సంశాయంగా చూసారు అంకుల్.


క్షణం సేపు తడబడ్డాను.

“ఏం లేదు అంకుల్.  నన్ను ఇండియాకి రప్పించాలని, కొద్దికాలంగా మీరు, నాన్న ఎంతగా తపించారో,  మీ ఆరోగ్యం చక్కబడాలని నేనూ అంతగానే ఆశిస్తున్నాను.  మూడేళ్లక్రితం కంటే కూడా మీరింకా కృంగిపోయారు.... ఇంత అలజడిగా ఉన్నప్పుడు నన్నేమనమంటారు?  చెప్పండి...,” ఆయన వంక చూసాను.


ఆయన పెదవులపై కదిలిన చిరునవ్వు  నాకెంతో ధైర్యాన్నిచ్చింది...


“వీల్-చెయిర్ అవసరం లేనంతగా మీరు ముందు కోలుకున్నాకే, అంకుల్,

మిగతా విషయాలు.  అందుకు మీరు పూర్తి ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చెయ్యాలి,” చేయి చాచాను.  


“అలాగే, నీకు నా ప్రామిస్ తల్లీ,” చాచి ఉన్న నా చేతిలో చేయి వేసారాయన....


డోర్ మీద నాక్ చేసిన అలికిడికి అందరం అటుగా చూసాము.

“హలో, ఇక భూషణ్ సార్ కి విశ్రాంతి అవసరం,.. “అంటూ డాక్టర్ గారు  లోనికి  రావడంతో, అంకుల్ వద్ద శలవు తీసుకొని, అక్కడినుండి

కదిలాము.  

**

అమెరికా నుండి, చెన్నై తిరిగి వచ్చిన ఆరు నెలలకే, నాట్య ప్రదర్శనలతో,

టి.వి షోలతో బిజీ అయిపోయాను.   అంకుల్ ద్వారా, “నారాయణీ నమోస్తుతే” అన్న ఓ ‘భక్తి’  సినిమా సైన్ చేసాను... ఆ సినిమాలో నాది అమ్మవారి పాత్ర.... జగదీష్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంగా ప్రోత్సహించాడు...    


ఈ ఆరు నెల్లల్లో, అంకుల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.  కోలుకున్నారు.

వీల్-చైర్ అవసరం లేకుండా నడుస్తూ,  స్టూడియో వ్యవహారాలని కూడా సంతోషంగా చూసుకోవడం మొదలుపెట్టారు..   


తమ్ముడు  వినోద్, మెడికల్ స్కూల్లో చేరడానికి ప్రిపేర్ అవుతున్నాడు...  

**

సిటీలోని ఓసెంటర్ ప్లేస్ లో, డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి, నాన్న సన్నాహాలు మొదలుపెడితే,  ముహూర్తం నిర్ధారించి, రెండు నెల్లల్లో, మా పెళ్ళి జరిపించే  సన్నాహాలు అంకుల్ మొదలుపెట్టారు...

అమ్మమ్మ, మామయ్యా వాళ్లు, కోటమ్మత్త సహా ఆయనకి

సలహాదారులయ్యారు.   


ఇక, రాణికి పాప పుట్టిందని తెలిసింది.  తన రీతిలో తను బాగానే ఉందని

వింటుంటాను.   


“ఏమి జరిగుంటే, జగదీష్ పై, రాణి ఆశలు వదులుకుందో తెలియలేదు,” అని

అమ్మతో అన్నప్పుడు,

“ఎంత వెంటపడినా, లాభం లేదని, ఇంక సమయం వృధా చేయడం వ్యర్ధం అని అనుకునుంటుంది,” అందామె..


కాలిఫోర్నియాలో తన మెడికల్ ప్రాక్టీస్ మొదలుపెట్టినవిక్రమ్ తో ఎప్పటిలామాట్లాడుతూనే ఉన్నాను.  నా లాంటి మరో అమ్మాయిని తనకి భార్యగా తెచ్చే బాధ్యత నాదేనంటూ, ఆట పట్టిస్తుంటాడు...


అమెరికా నుండి మా పెళ్ళికి వస్తామని తెలియజేసారు తేజశ్విని గారు...

**          
.

..                                                                                

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్