Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Corns and Ayurvedic Treatment in Telugu by Dr. Murali Manohar | ఆనెలు

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

                                                          పేలెస్ ఆఫ్ గోల్డ్  

అమెరికాలో చూడదగ్గ ఎనిమిది ఆధ్యాత్మిక కేంద్రాలలో పేలెస్ ఆఫ్ గోల్డ్ ఒకటి.  అనేక అవార్డులు పొందిన అందమైన గులాబీ తోటలతో, వందకు పైగా జల యంత్రాలతో, అత్యంత సుందరమైన అతి విశాలమైన ఆవరణలో నిర్మింపబడిన సుందర భవనమిది. 

స్వామి ప్రభుపాదగారి నివాసార్ధం ఆయన శిష్యులు స్వయంగా శ్రమించి నిర్మించిన భవనమిది.  ప్రభుపాదగారు 1896లో కలకత్తాలో జన్మించారు.  ఆయన గురువు శ్రీ భక్తి సిధ్ధాంత సరస్వతి ఠాకుర్ 20వ శతాబ్దం మొదట్లో భారత దేశంలో కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుండేవారు.  శ్రీ సరస్వతి ఠాకుర్ ప్రభుపాదని 1922లో కలకత్తాలో మొదటిసారి చూసినప్పుడు, ఆయనని చైతన్య మహాప్రభు ప్రబోధించిన కృష్ణభక్తిని ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళల్లో ప్రచారం చెయ్యమన్నారు. 

అయితే  సాంసారిక, వ్యాపార బాధ్యతలలో మునిగిపోయిన శ్రీ ప్రభుపాద తర్వాత 40 ఏళ్ళదాకా భారత దేశాన్ని వదల లేకపోయారు.  1965లో, తన 69వ సంవత్సరంలో కలకత్తానుంచి న్యూయార్క్ వెళ్ళే ఓడ ఎక్కారు.  ఆయన ముఖ్య వుద్దేశ్యం  పాశ్చాత్య దేశాలవారికి భారత దేశ శాంతి సౌహార్ద్రాల సందేశాన్ని అందించటం.  అప్పటికి  వేదాలలోని ముఖ్యాంశాలకు ఆయన చేసిన వ్యాఖ్యానాలు  80 సంపుటాలుగా వెలువడ్డాయి.  వాటిలో భగవద్గీత, భాగవతం కూడా వున్నాయి.

శ్రీ ప్రభుపాద అమెరికా చేరిన కొత్తల్లో వెస్ట్ వర్జీనియాలోని న్యూ వ్రిందావన్ కమ్యూనిటీలో వుండేవారు.  ఈయన 1966లో తన శిష్యుల సహకారంతో ISCON (International Society for Krishna Consciousness) ప్రారంభించారు.  అదే హరేకృష్ణ మూవ్ మెంట్.  ఈ మూవ్ మెంట్ ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా చాలా ప్రఖ్యాతిగాంచింది. 

తన జీవితంలో ఆఖరి 12 ఏళ్ళల్లో ప్రభుపాద వేల కొద్ది పాశ్చాత్యులను హరే కృష్ణ మూవ్ మెంట్ లో స్వఛ్ఛందంగా చేరేటట్లు చేశారు. శ్రీ ప్రభుపాదగారి శిష్యులు తమ గురువుగారి నివాసార్ధం ఒక గృహాన్ని నిర్మిద్దామనుకున్నారు.  తమ గురువుపట్ల వారికున్న భక్తితో ఆ ఇల్లు వారే స్వయంగా నిర్మించాలనుకుని 1972లో నిర్మాణం మొదలు పెట్టారు.  భక్తులు నిర్మాణపు పనులలో నిపుణులు కారు.  కానీ గురువుగారి మీద వున్న భక్తి శ్రధ్ధలతో వారు ఆ పనులు క్షుణ్ణంగా నేర్చుకుని, శ్రధ్దగా పని చేశారు.  ఒక సాధువు నివసించటానికి నిర్మింపబడే మామూలు గృహంలా మొదలు పెట్టబడిన ఆ భవనం శిష్యుల అత్యుత్సాహంతో భారత దేశంలోని ఒక రాజ భవనంలా తయారయింది.  నిర్మాణంలో పాల్గొన్న శిష్యులు కూడా ఆ భవనం తాము నిర్మించినదంటే వారే నమ్మలేకపోయారు. 

కానీ విచారకరమైన సంగతేమిటంటే ఆ భవనం పూర్తికాక మునుపే, 1977, నవంబర్ లో  శ్రీ ప్రభుపాదగారు పరమపదించారు.   1979లో నిర్మాణం పూర్తయింది.  ఆ భవంతిలో నిలిపిన శ్రీ ప్రభుపాద విగ్రహం సజీవ మూర్తిగా దర్శకులను చిరునవ్వుతో పలకరిస్తున్నట్లుంటుంది.

పేలెస్ ఆఫ్ గోల్డ్ విశేషాలు

అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో యాత్రీకులను అమితంగా ఆకర్షించే ఈ భవంతికి ఏటా 50,000 మంది పైగా సందర్శకులు వస్తారు.
అమెరికాలో అవార్డులు పొందిన వంద గులాబీ తోటలలో ఈ ఆవరణలోని తోటకూడా వున్నది.  ఇక్కడ 150 రకాల పైన గులాబీలున్నాయి.  అందమైన లోటస్ పాండ్ ప్రత్యేక ఆకర్షణ.  ఈ తోటలను, పాండ్ ని, భవంతిని చూస్తూ ఎంత సేపయినా గడపవచ్చు.

పేలెస్ లోకి నిర్ణీత సమయంలో గైడ్ తో సహా మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. గైడ్ చెప్పినదాని ప్రకారం ...... కిటికీలకున్న స్టైన్డ్ గ్లాసెస్ లోంచి సూర్య కిరణాలు  అద్దాలతో అలంకరింపబడిన సీలింగ్ మీద, షాండిలియర్స్ మీద పడి వింత కాంతులతో మెరుస్తాయి.  గోడలు, స్తంభాలు 22 కేరెట్ల బంగారంతో, సెమి ప్రెషస్ స్టోన్స్ తో అలంకరించారు.  పై కప్పుపై భారత దేశ పురాతన గాధలు చిత్రీకరించారు.  భవనం పై డోమ్ బరువు 30 టన్నులు.  దీనికింద వున్న క్రిస్టల్ సీలింగ్ లో 4200 క్రిస్టల్స్ అలంకరించబడ్డాయి.

ఈ భవంతిలో అత్యంత అందమైన నాలుగు రాయల్ పీకాక్ విండోస్ వున్నాయి.  ఒక్కొక్కదానిలో చేతితో తయారు చేయబడిన స్టైన్డ్ గ్లాసెస్ ముక్కలు 1500కన్నా ఎక్కువ వాడబడ్డాయి.  నెమలి ఈకలు రాజరికాన్నీ, కృష్ణుడితో నెమలికి వున్న సంబంధాన్నీ గుర్తు చేస్తాయికదా. 
రకరకాల చలువ రాళ్ళు యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలనుంచీ దిగుమతి చేసుకున్నారు.    పర్షియన్ క్రిస్టల్స్ ఇంకా అనేక దేశాలనుంచి అనేక రకాల గృహ నిర్మాణ వస్తువులను తెచ్చి వాడారు.  ఫ్రాన్స్ నుంచి తెచ్చిన షాండిలియర్స్ లో క్రిస్టల్స్, రంగు రాళ్ళు పక్కనే వున్న కిటికీలలో వున్న రాళ్ళ రంగులతో మేచ్ అవుతాయి.  శ్రీ ప్రభుపాద కూర్చున్న కుర్చీ, దేవుణ్ణి పెట్టిన పెద్ద చెక్క స్టాండ్, ఇండియానుంచి తెప్పించిన బెస్ట్ టేక్ తో చేసినవి.    

ఈ భవన నిర్మాణం జరుగుతూండగా ప్రభుపాద మధ్యలో వచ్చి నిర్మాణాన్ని పర్యవేక్షించేవారుట.  ఈ కారిడార్లు ఆయన నడిచినవి.  ఇక్కడ ప్రతి చోటా ఆయనతో అల్లుకున్న కధలెన్నో వున్నాయి అని మా వెంట వచ్చిన గైడ్ చెప్పారు. 

 గైడ్ కి మనం ఏమీ చెల్లించక్కరలేదు.  అడిగిన వివరాలన్నీ ఓపిగ్గా చెప్పారు. 

పేలెస్ లో శ్రీ ప్రభుపాద బెడ్ రూమ్ లో చిన్న కృష్ణుడు వెన్న తింటున్నట్లు 3 డి పైంటింగ్ వున్నది.  ఆ చిత్రాన్ని చిత్రీకరించింది, ఆ పేలెస్ కట్టింది, అందులో ప్రతి ఒక్క పని చేసింది ప్రభుపాద శిష్యులు .. అంతా 20 – 22 ఏళ్ళ వాళ్లేట. మొత్తానికి పేలెస్ పెద్దది కాకపోయినా, చాలా అందమైనది, అక్కడ వాడిన మెటీరియల్ వల్ల ఖరీదయినది. 

వ్రిందావన్

పేలెస్ నుంచి అర మైలు దూరంలో వున్న న్యూ వ్రిందావన్ (శ్రీ కృష్ణుని ఆలయం) కి వెళ్ళాము.  అక్కడ హారతి చూశాము.  భక్తులు తన్మయంతో పాటలు పాడుతూ డాన్స్ చేశారు.  ఆలయంలో దేవతా విగ్రహాలను వుంచిన బంగారు గద్దె ప్రపంచంలోనే చాలా అందమైనదని చెబుతారు. గద్దె మీద వున్న రాధా కృష్ణుల విగ్రహాలని, ఇంకా అక్కడే వున్న నరసింహస్వామి, ప్రహ్లాదుడు, ఇతర దేవతా విగ్రహాలను చాలా ఆకర్షణీయంగా అలంకరించారు.  ఆలయం గోడలమీద రాధా కృష్ణులవి, చైతన్యప్రభువువి చిత్రాలున్నవి.  ఒక గదిలో అందమైన బంగారు ఊయల వున్నది.  ఇంకొక చోట టేక్ వుడ్ తో చేసిన రధం.  వీటిని ఉత్సవాలలో ఉపయోగిస్తారు.

ఇక్కడ వున్న తోటలో రక రకాల కూరగాయలు పండిస్తారు.  వాటిని స్వామి నివేదనకి, అక్కడ కేంటీన్ లో చేసే వంటలకి వుపయోగిస్తారు.

ప్రతి హిందూ ఆలయంలో వున్నట్లే ఇక్కడా కేంటీన్ వున్నది.  పదార్ధాలు రుచిగా వున్నాయి. సమీపంలోనే వున్న పాండ్ కి కొంచెం దూరంలో కాటేజస్ వున్నాయి.  అక్కడ వుండాలనుకునేవారికి అద్దెకి ఇస్తారు.  హోటల్ కూడా వున్నది.    పాండ్ ఒడ్డున చైతన్య ప్రభు విగ్రహాలున్నాయి. మేము ఆ పాండ్ లో హంసలని చూశాము.  అవి మా దగ్గరగా వస్తే ఎంత సంతోషం వేసిందో.

దర్శన సమయాలు

ఉదయం 5 గం. లనుంచి పగలంతా ఆలయం తెరిచే వుంటుంది.  సందర్శకులు ఏ సమయంలోనైనా దైవ దర్శనం చేసుకోవచ్చు. 

మరిన్ని శీర్షికలు
Telangana Mutton Curry - తెలంగాణా మటన్ కర్రీ