Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue147/415/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

లోన తాపసి ఒంటరిగా వుంటున్నాడో లేక ధర్మపత్నీ సమేతంగా కుటుంబంతో వుంటున్నాడో తెలీదు. పరిసరాల్లో ఎక్కడా మరో మనిషి జాడ లేదు. లోపలి నుంచి మాత్రం శివ పంచాక్షరి విన్పిస్తూనే వుంది. ఆ తపోధనుడి అనుమతి లేకుండా తను లోన ప్రవేశించ లేడు. ఆయన ఎవరో గాని తపస్సులో వున్నాడు. తన మూలంగా తపో భంగమైతే శాపానికి గురి కావలసి వస్తుంది. ఏం చేయాలో తోచక కాసేపు వాకిట్లోనే తట పటాయిస్తూ నిలుచున్నాడు ధనుంజయుడు.

ఇంతలో`

లోన పంచాక్షరి జప దీక్ష నిలిచి పోయింది. ‘‘ఎవరక్కడ? వాకిట నిలిచినది ఎవరు?’’ అంటూ అదే శాంత గంభీర స్వరం విన వచ్చింది.
‘‘స్వామీ. అడవిలో దారితప్పి వచ్చిన బాటసారిని. తమ దర్శనార్థం ఏతెంచిన అతిధిని.’’ వెంటనే బదులిచ్చాడు ధనుంజయుడు.
‘‘మంచిది నాయనా. అతిధి దేవోభవ అన్నారు. నీవు మా అతిధివి. పాద ప్రక్షాళన జేసుకుని లోనకు వచ్చి విశ్రాంతి గైకొనుము. ముందు గదిలో వలసిన కందమూలములు ఫలములు గంపలో వున్నవి. వలసినవి ఆరగించి క్షుద్భాధ తీర్చుకొని వెళ్ళ వచ్చును. రమ్ము’’ పిలిచాడు మహనీయుడు. దయార్థ హృదయుడగు ఆ తాపసి పిలుపుకు సంతసించాడు ధనుంజయుడు. చిన్నగా తలుపున నెట్టుకొని లోనకు అడుగు పెట్టాడు.

ముందు గది చాలా పెద్ద గది.

దానికి కుడి ఎడమలుగా రెండు తలుపుల్లేని కిటికీలున్నాయి. గాలి వెలుతురు ధారాళంగా లోనకు వస్తోంది. కుడి పక్క కిటికీ సమీపంలో నేలమీద దర్భ చాప పరిచి చక్కగా పక్క వేసి వుంది. తల దిండ్లు వున్నాయి. అది స్వామి వయనించే పాన్పుగా వూహించాడు. గది మధ్యలో పేము కర్రతో చేసిన నాలుగు కుర్చీల మధ్యన ఒక ఎత్తు బల్ల వున్నాయి. బల్ల మీద ఒక గంపలో చక్కగా కాల్చిన కంద మూలాలు అనేక పండ్లు కాయలు వున్నాయి. పక్కనే లోటాతో బాటు మంచి నీటి కుండ మూత పెట్టి వుంది. కాని ఆ గదిలో ఎవరూ లేరు. నిర్మానుష్యంగా వుంది. అవతల మరో గదిలోకి తలుపు లేని ద్వార బంధం కన్పిస్తోంది. బహుశ ఆ మహనీయుడు అవతలి గదిలో ఉండొచ్చనుకున్నాడు. ఆయన్ని దర్శించాలనే కుతూహలంతో అటు వెళ్ళి లోనకు తొంగి చూసాడు. అంతే`

తన కళ్ళను నమ్మ లేనట్టుగా`

చూస్తున్నది కలో నిజమో అర్థం గానట్టుగా`

అలా మ్రాన్పడి పోయాడు.

లోన వున్నది మనిషి కాదు.

పెను సర్పం.

దర్భాసనం మీద జింక చర్మం పరిచి దాని మీద చుట్ట చుట్టుకొని పడగ విప్పి కనులు మూసు కొని ధ్యానంలో వుంది. ఆ శ్వేత వర్ణం పాము శరీరం మీద అక్కడక్కడా కాలిన గాయాల్లా పుండ్లు కన్పిస్తున్నాయి. ధనుంజయుడు విభ్రాంతి చెంది చూస్తున్నాడు.
ఇతనెవరు?

నిజంగా సర్ప రూపుడైన ముని పుంగవుడా? లేక తనను అంతం చేయనెంచిన నాగ రాజు కుటిల పన్నాగమా? ఈ పన్నాగము నాగ రాజేనా! నాగ రాజుకి అయిదు శిరస్సులుంటాయంటారు. ఇతడు ఒకటే శిరస్సు కలిగి వున్నాడు. వంటి మీద ఆ పుండ్లు ఏమిటి? ఏమీ అర్థంగావటం లేదే. ఏమైనప్పటికీ తను అప్రమత్తంగా వుండుట మంచిది.

ఆలోచిస్తూ ఎలా వెళ్ళాడో అలాగే నిశ్శబ్ధంగా వచ్చి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఇంతలో లోపలి నుంచి తిరిగి మంద్ర స్వరంలో అదే గొంతు విన్పించింది. సర్పం మానవ భాషలో మాట్లాడుతోంది.

‘‘ఏమి నాయనా. లోనికి వచ్చినావా?’’ అనడిగింది.

‘‘వచ్చి, ఆసీనుడనైతి స్వామీ’’ వెంటనే బదులిచ్చాడు ధనుంజయుడు.

‘‘నీకు అతిధి మర్యాదలు చేయనశక్తుడను నాయనా. నీకిష్టమైన ఫలములో కందమూలములో కడుపార భుజింపుము.’’

‘‘క్షమించండి స్వామీ. ఎదురుగా గృహస్థు లేకుండా భుజించుట ధర్మ యుక్తము కాదు గదా. ఒక సారి తమ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించండి.’’

‘‘అలాగునే నాయనా. నేను వచ్చెదను. కాని నను గాంచి నీవు భయ పడ కూడదు సుమా. నీకే అపకారము ఒనర్చు వాడను కాను.’’
‘‘అలాగే స్వామీ.’’

కొన్ని లిప్తల తర్వాత`

నెమ్మదిగా పాకుతూ ముందు గది గుమ్మంలో కొచ్చిందా సర్పం.

ముందే ఆ సర్పాన్ని చూసాడు గాబట్టి ధనుంజయుడు భక్తి భావంతో లేచి నిలబడి నమస్కరించాడు. అయితే ధనుంజయుని చూడగానే స్థాణువై పోయిందా సర్పం. అక్కడ ఆగి పోయింది.

‘‘హే మహేశా... శంకరా.... నేను ఏమీ చూచుచున్నాను’’ అంటూ అప్రయత్నంగా మాటలు వెలువడ్డాయి.

మరొక్క మారు విస్మయానికి గురయ్యాడు ధనుంజయుడు. ఆ పెను సర్పం ఏమంటుందో అర్థం కాలేదు. అంతలో సర్పం ముందుకొస్తూ` ‘‘అర్జునా... విజయా... పార్థ.... కిరీటి... ఏమి నా భాగ్యము. నీవు నను జూడ వచ్చుటయా.... ఇది నిజమా...’’ అని అంటుంటే` ఆ పలుకులను ఎలా అర్థం చేసుకోవాలో ధనుంజయునికి తెలీలేదు.

‘‘స్వామీ. మీరు నను జూచి పాండవ మధ్యముడనని భ్రమ పడుతున్నట్టున్నారు. నేను పార్థుడను కాను స్వామీ’’ అన్నాడు
‘‘పార్థుడవు కావా....?’’

‘‘కాను స్వామీ. కాని ఆ వంశజుడనే.’’

ఆ మాటలు ఆలకించిన మరు క్షణమే`

కట్టెదుట వున్న సర్ప రూపం అదృశ్యమై`

ఆ స్థానంలో ఒక తాపసి ప్రత్యక్షమయ్యాడు.

ఆయన ముఖ మండం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. నిడు పాటి జుత్తును వెనక్కు లాగి కొప్పున ముడి వేసుకున్నాడు. నార బట్టను దట్టీగా బిగించి కట్టాడు. ఒంటి మీద వేరే ఏ ఆచ్ఛాదనా లేదు. శ్యామ వర్ణ మేని ఛాయ. నుదుట విభూది రేఖలు, ఛాతీకి అడ్డంగా జంధ్యం పోగును బట్టి ఆయన బ్రహ్మణోత్తముడని తోచింది. మెడలో రుద్రాక్షమాల చేతిలో జపమాల వున్నాయి. మంచు కన్నా చల్లని ప్రశాంతమైన చూపులతో చూడగానే నమస్కరించాలనిపించే దివ్య రూపం. కాని చంద్రుడిలో మచ్చల్లా ఆ మహనీయుని వంటి మీద పుండ్లు కన్పిస్తున్నాయి. ఆయన ఒక మహా వ్యాధి గ్రస్తుడు. కుష్టు రోగ పీడితుడు. అంతటి తపఃశ్శాలికి ఈ వ్యాధి ఏమిటో అర్థం కాలేదు. అయినప్పటికీ`

చెంత కెళ్ళి  వినమ్రుడై`

పాదాభివందనం చేసాడు ధనుంజయుడు.

అతడి వినయానికి ముగ్ధుడవుతూ` ‘‘ఆయుష్మాన్‌ భవ... అభీష్ట సిద్ధిరస్తు... ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. లే నాయనా’’  అంటూ అశీర్వదించి భుజాలు పట్టి లేపాడా ముని పుంగవుడు.

అప్పుడు కూడ ఆశ్చర్య సంభ్రమాలనుండి బయట పడ లేకున్నట్టుగా ధనుంజయుని ముఖారవిందాన్నే విస్మయంగా వీక్షిస్తున్నాడు.
‘‘ఆశ్చర్యము. మహదాశ్చర్యము. చరిత్ర పునరావృతమవునంటే ఇదియేనేమో. అన్ని విధాలా శుభ క్షణాలతో అచ్చు గుద్దినటుల ఆ మహా వీరుడు పార్థుని లాగే వున్నావు నాయనా. నమ్మ లేకున్నాను. నీవు విజయుడవేననుకొని భ్రమించి పోతిని’’ అన్నాడు.

ఈసారి మరింత విస్మయానికి గురయ్యాడు ధనుంజయుడు. చూస్తుంటే తన కన్నా పొడగరిలా సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు వున్నాడీయన. ఆపైన తనకు అర్జునుడు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఈయన వయసు ఎంతయి వుంటుంది? ఏ కాలం వాడు? ఎవరీ తాపసోత్తముడు? వూహకు అందటం లేదు.

‘‘స్వామీ. తమకు పాండవ మధ్యముడు తెలుసునా?’’ సందేహ నివృత్తి కోసం అడిగాడు. కాని ఆ ప్రశ్నకు బదులు చెప్పకుండా`

‘‘నీ నామ ధేయం ఏమిటి? ఎచటి వాడవు నాయనా?’’ అనడిగాడు.

‘‘స్వామీ. నన్ను ధనుంజయుడంటారు. ఈ రత్న గిరి ధరా చక్రము నేలు ధర్మతేజ ప్రభువుల వారి కుమారుడను. రాకుమారుడను. చంద్ర వంశ సుక్షత్రియుడను.’’

‘‘అర్థమైనది నాయనా. నీవు పార్థుని వంశజుడవే. రమ్ము ఆసీనుడవు కమ్ము’’ అంటూ తానొక ఆసనం మీద కూచున్నాడు. ఎదురుగా మరో ఆసనాన్ని అలంకరించాడు ధనుంజయుడు. ఇక ఉండ బట్ట లేక మరో సారి తన ప్రశ్నను వినిపించాడు.

‘‘సామీ. తమకు అర్జునుల వారు తెలుసా?’’

‘‘తెలుసు నాయనా.’’ అన్నాడు చిత్తంతో.

గత కాలపు జ్ఞాపకాల పొరలేవో కదులాడి చిత్తమును వ్యాకుల పరిచినట్టు ఆయన ముఖమండం తెలియజేస్తోంది. భారంగా నిట్టూర్చి చెప్పాడు.
‘‘ఒక్క అర్జును డేమిలే నాయనా. ఆయన ఏకైక కుమారుడు సుభద్రా దేవి తనయుడైన మహా వీరుడు అభిమన్యుడును తెలుసు. ధర్మ మూర్తి ధర్మజుడు మహా బలశాలియగు భీమ సేనుడును వారి సోదయి నకులసహదేవులును తెలియు. పాండవులే కాదు, కురు సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాదిపత్యంగా పరిపాలించిన సుయోధన చక్రవర్తి ఆయన సోదయి అందరూ తెలియును. బలరామకృష్ణుల వారి బంధు వర్గమును తెలియు. కురు వృద్ధుడగు భీష్మా చార్యుల వారు నీతి కోవిదుడగు విదురుడు, మహా దాత కర్ణుడు, వికర్ణుడు శకుని శల్యాది విశిష్ట ప్రముఖులందరూ నాకు తెలిసిన వారే.

బాల్యము నుండి కౌరవులు, పాండవులతోడ కలిసి ఒకే గురువు చెంత విద్యాభ్యాస మొనర్చి అస్త్ర శస్త్రాది సమస్త విద్యలు అభ్యసించిన వాడను గాన నాకు అందరునూ తెలిసిన వారే. అంతియే కాదు సుమా, నభూతో న భవిష్యతి అన్నట్టుగా పదునెనిమిది దినములు సాగిన మహా సంగ్రామము కురు క్షేత్ర రణ రంగమున పాల్గొన్న వాడిని. నాకు తెలియని వారెవరు నాయనా. కాదంటే`

కాల ప్రవాహము ఎవరినీ దేనికీ శాశ్వతముగా వుంచదు. అందరూ పోయినారు. నేను మాత్రం మిగిలే వుంటి. కలియుగాంతం వరకు ఉండ వలసిన వాడినే. చిరంజీవినను నాకు యిది వరమో శాపమో నాకే తెలీదు. కర్మఫలం అనుభవింపక తప్పదు.’’ అంటూ అప్రయత్నంగా కళ్ళలో నిలిచిన నీటిని తుడుచుకున్నాడు. చివరి మాటల్లో గొంతు తడుమారింది. తెలియని వేదన యేదో ఆ తాపసి గుండెల్ని తాకి చింతా క్రాంతుడ్ని చేసింది.

ఆ తాపసి మాటలు ధనుంజయునికి అర్థమై కూడ అర్థం గానట్టే వుంది. నాటి కురుక్షేత్ర సంగ్రామమున పాల్గొన్న హేమా హేమీలందరూ తనకు తెలుసునంటున్నాడు. సుమారు అయిదు వందల సంవత్సరాల క్రితం మాట. ఒక మనిషి ఇంత కాలం జీవించుట సాధ్యమేనా? పైగా కలి యుగాంతం వరకు ఉండ వలసిన వాడినే అంటున్నాడు. అంటే యుగంతం వరకు జీవించే వుంటాడా? ఆంజనేయ, పరుశు రామ, మార్కండేయాది చిరంజీవుల్లో ఈయన కూడ ఒకడా. అయితే ఎవరీయన?

అనేక ప్రశ్నలు ఒకే సారి ఉదయించి ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా అమాయకంగా చూసాడు ధనుంజయుడు.

‘‘స్వామీ. తమరు ఇంత చెప్పినా మీ నామ ధేయం ఏమిటో, మీరెవరో గుర్తించ లేకున్న స్వామీ. ఆ వివరాలు కూడ చెప్తే సంతసించెదను’’ అన్నాడు.

‘‘ఏమి నాయనా? చంద్ర వంశ క్షత్రియుడవు, పార్థుని సంతతికి చెందిన వాడవు. మీ పూర్వీకుల గాధలు వినలేదా?’’ మనసు కలత బారకుండా దృఢ పర్చు కొంటూ శాంత చిత్తంతో అడిగాడా తాపసి.

‘‘ఏదో ఆనోట ఈనోట వినటమే గాని పూర్తిగా తెలియదు స్వామీ. వ్యాస మహర్షు వారు భారత భాగవత కావ్యమును రచించిరని వింటిని గాని చదువుటకు వాటి వ్రాత పత్రులేవీ లభించ లేదు మాకు.’’

‘‘ఏమంటివి నాయనా. వ్యాసుల వారు నాటి చరిత్రను భారత, భాగవతమును పేర ఆ గాథను గ్రంథస్థము చేసినారా?’’

‘‘అవును స్వామీ.’’

‘‘ఆహాఁ... వ్యాస మహర్షుల కృషి కడు శ్లాఘనీయము గదా. భవిష్య తరాలకు తన రచన మూలంగా మహోపకార మొనర్చినారు. అయితే విను నాయనా. నాది ఏమంత గొప్ప చరిత్ర కాదు. సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి ఉన్నత చరిత్రుడనై వుండి కూడ ఘోర తప్పిదము చేసి హీన చరిత్రుడనయినాను. నన్ను అశ్వత్థామ అంటారు. కురు పాండవులకు అస్త్ర శస్త్రాది సమస్య విద్యలు నేర్పిన గురు దేవుడు ద్రోణా చారుల వారి కుమారుడను’’ అన్నాడు.

‘‘అశ్వత్థామ?’’ అప్రయత్నంగా పలికాడు ధనుంజయుడు.

‘‘అవున్నాయనా. అశ్వత్థామనే. ద్రోణ సంభవుడైన మదీయ జనకుడు ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి చిరంజీవి యగు కొడుకు కావలెనని వరం పొందినాడు. ఆ వరమున జన్మించిన వాడే ఈ అశ్వత్థామ’’

‘‘మరి ఈ కుష్ణువ్యాధి ఎలా సంక్రమించినది స్వామీ?’’

‘‘సంక్రమించినది కాదు నాయనా. నా ఘోర తప్పిదాలకు ఫలితంగా శ్రీకృష్ణ వారి నుండి నాకు లభించిన శాపం. కలి యుగాంతం వరకు ఈ వ్యాధిని అనుభవింపక తప్పదు. మా వంశ గౌరవాన్ని కుల పత్రిష్టను ఇనుమడింప జేయు చిరంజీవి యగు తనయుని బడసినందుకు మదీలో జనకుడు ఆనందించినాడు. కాని ఆ ఆచార్యుని ఆశలు అడియాశలు జేసి మదీయ చిరంజీవత్వమును వ్యర్థ పరుచు కొని ఘోర పాతకము గావించి పాపి నైతిని. కావున నగు బాటు నుండి తప్పించు కొనుటకు ముఖము చాటు చేసు కొని ఆ నాటి నుండి సర్ప రూపమున అజ్ఞాతముగా గడుపు చున్నాను. ఇప్పుడు కూడ నిను పార్థునిగ నెంచి నిజ రూపు ధరించినాడను.’’

‘‘నమ్మ శక్యము గాకున్నది. తపో ధనులైన మీరు తెలిసి కూడ అంతటి పాప కార్యము ఏమీ జేసినారు. శ్రీకృష్ణుని శాపానికి ఎలా గురయ్యారు?’’‘‘చెబుతాను నాయనా. కాని అతిధిగా వచ్చిన నిన్ను కూర్చుండ బెట్టి మాటలాడుచున్నాను. ఆకలితో వచ్చి వుందువు. ముందు ఫలములారగించిన పిమ్మట తెలిపెదను.’’

అశ్వత్థామ అభ్యర్థన మేరకు రెండు ఫలములు తిని, నీరు తాగాడు ధనుంజయుడు. గతాన్ని వివరించాడు అశ్వత్థామ.

‘‘ఆ నాడు కురుక్షేత్ర సంగ్రామ మందు ఏమి జరిగినది? ధర్మం ఎవరి పక్షాన వున్నది? అందరికీ తెలుసు. అయినప్పటికీ కౌరవుల పక్షాన నిలిచి యుద్ధమున పోరాడుతున్నారంటే కారణము కేవలము భృత్యు ధర్మం. అతిరథ మహారథులు కురువృద్ధులు అంతా దుర్యోధన సార్వభౌముని విజయం కోసం శత విధాలా పోరాడిన ఫలితం దక్క లేదు. లక్షలాది సైన్యం నశిస్తోంది. కురు వృద్ధులు అతిరథ మహా రథులు ఎందరో నేలకొరిగిపోయారు. యుద్ధం ముగింపు కొస్తోంది. కౌరవులు ఓటమి పాలవుతున్నారు. ఆ సమయాన రాజ భక్తి భృత్యు ధర్మాలు నాలో అత్సుత్సాహం చూపించాయి. పాండవులు కురు క్షేత్రంలో విజయులైనప్పటికీ వారికి వారసులుండ కూడదు. పాండు వంశం నిర్వీర్యం కావాలన్న కసితో తల వంపు తెచ్చే ఘాతుకమునకు ఒడి కట్టినాను. న్యాయ ధర్మమును విడిచితి, దయా దాక్షిణ్యాదులు మరిచితి. బ్రహ్మణుడై వుండి కూడ యుద్ధనీతికి విరుద్ధముగా కౄర కార్యము జేసితి. గాఢ నిద్ర యందున్న ఉప పాండవుల కుత్తుకలు కోసి వధించితి. పాండవుల ద్వారా ద్రౌపతీ దేవికి కలిగిన సంతానమే ఉప పాండవులు.

అంతటితో ఆగలేదు నేను.

ఉత్తర గర్భస్థ శిశువును జంపుటకు, భ్రుణ హత్యకు తెగ బడి హీన చరిత్రుడనైతి. ఆ శిశువు పైకి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించితి. సమయానికి కృష్ణ పరమాత్మ అడ్డు పడి ఆమె గర్భస్థ శిశువును కాపాడినాడు. లేకున్న పాండు వంశం ఆనాడే నిర్వీర్యమయ్యేది. ఆ శిశువే పార్థుని మనుమడు అభిమన్యుని కొడుకు పరీక్షిత్తూ. ఆ పరీక్షిత్తూ నుంచే మీ వంశ  వృద్ధి జరిగినది.

నేను గావించిన కౄర కార్యముకు ప్రతిగా కలి యుగాంతం వరకు మహా వ్యాధితో బాధ పడమని కృష్ణ భగవానుడు నాకు శాపమిచ్చినాడు. ఆ శాపఫలమే నాకీ కుష్టు వ్యాధి.’’ అంటూ వివరించాడు బాధా తప్త హృదయంతో.

అశ్శత్థామ చెప్పిన శాప వృత్తాంతం విని విస్తు పోయాడు రాజ కుమారుడు ధనుంజయుడు. ప్రభు భక్తి పెచ్చరిల్లి తమ వంశానికే హాని చేసిన దోషి ఇప్పుడు తన ఎదురుగా వున్నాడు. కాని ఆ నాడు ఘోర పాపం చేసిన తర్వాత పశ్చాత్తప్తుడయ్యాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. ఆ పైన అపారమైన శివ భక్తితో ముని వృత్తిలో వున్నాడు. నాటి తన పాపాలు పరిహారమైనట్టే. ఇప్పుడు విచారింప పని లేదు. తమ వంశ మూల పురుషులను చూసిన మహానీయుడీయన.

‘‘స్వామీ. గతమును తలచి చింతింప పని లేదు. మీరిపుడు పరమ పవిత్రమగు ముని వృత్తిలో వుంటిరి. మీ వంటి మహనీయుడు మా రత్నగిరి రాజ్యమున వశించుట మాకు సంతోష కరము. నేను సకల విద్యలు అభ్యసించితి కాని అస్త్ర విద్య బోధించు గురువు లభించలేదు...’’ అంటూ ధనుంజయుడు ఏదో చెప్పబోతూండగా, చేయి ఎత్తి వారించాడు అశ్వత్థామ.

‘‘నాయనా నాకు నీ ఉద్దేశము అవగతమైనది. అస్త్ర విద్య నేర్చుకోవాలని ఆశ పడుతున్నావు. అవునా?’’ అనడిగాడు.
అవునన్నట్టు తల పంకించాడు ధనుంజయుడు.

‘‘నీ కోరిక ఫలించదు నాయనా.’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali