Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 సాధారణంగా  చాలా మందికి, కొన్నిటిమీద ఇష్టాలు ఉండవు. ఎన్ని అవకాశాలు వచ్చినా సరే, వాటివైపు మొగ్గరు. అలాగని ఇష్టం ఒకటే కాదు, ఒక్కోప్పుడు, భయంకూడా ఉంటుంది. వాటిని  mind block  అంటారనుకుంటా. అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే, ఛస్తే వీళ్ళు మాత్రం తమ అభిప్రాయాలని మార్చుకోరు. మరీ అడిగితే.. “ నా ఇష్టం…” అని  ఓ మొండి సమాధానం చెప్తారు. ఎన్ని ప్రయత్నాలు చేయండి, వాళ్ళు మాత్రం మారరంటే మారరు. వాళ్ళ కర్మ అని ఊరుకోవాలే తప్ప చేసేదేమీ ఉండదు.

ఇలాటివి ప్రత్యేకంగా ఓ విషయం అని చెప్పలేము, ఏదైనా  తాము తినే తిండి పదార్ధం కావొచ్చు, ఓ పండు కావొచ్చు, ఓ కూర కావొచ్చు.. ఫలానాది ఇష్టం లేదూ అంటే లేదన్నట్టే. కొంతమందికి  కాకరకాయ నచ్చకపోవచ్చు, ఇంకొంతమందికి  వంకాయ పడకపోవచ్చు.. అలాగే కొంతమందికి అరటికాయ నచ్చకపోవచ్చు. దానికి పెద్ద కారణాలే ఉండక్కరలేదు, చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణం కూడా ఓ కారణం అయుండొచ్చు. ఉదాహరణకి, తను పెరిగిన ఇంట్లో, పెరట్లో పై చెప్పిన కూరగాయలే దొరకడంతో, వాళ్ళింట్లో రోజు విడిచి రోజు ఆ కూరలే తినాల్సొచ్చి ఉండొచ్చు. చదువుకునే రోజుల్లో, అమ్మ పెట్టిందే నోరు మూసుకు తినాలి తప్ప, మనకి ఇంకో దారుండేదికాదు. తాను డొమీనియన్ ప్రతిపత్తి నుండి, పూర్ణ స్వాతంత్రం వచ్చి, తన కాళ్ళమీద నిలబడ్డ తరువాత, చేసే మొదటి పనేమిటంటే, ఆ పైన చెప్పిన కూరగాయలు అస్సలు ఇంట్లోకే తేవక పోవడం. ఎప్పుడో, శలవలకి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ వెర్రి తల్లి, తన కొడుకు, చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే, వంకాయ కూర కారం పెట్టి ఓ పూటా, అరటికాయ ఆవ పెట్టి ఇంకో పూటా శ్రమ పడిచేస్తుంది. ఎంతో ప్రేమగా వడ్డించిన ఆ కూరలన్నీ, సుతారంగా పక్కన పెట్టేస్తాడు. “ అదేమిటిరా కన్నా…  చిన్నప్పుడు శుభ్రంగా తినేవాడివి, ఇప్పుడేం వచ్చిందీ..”.. ఆ కొడుకు..”  ఆ మధ్యన ఒంట్లో బాగోక డాక్టరు దగ్గరకి వెళ్తే ఆయన ఇలాటి కూరలు మానేయమన్నారూ..” అని ఓ కుంటి సాకు చెప్తాడు, పాపం ఆ వెర్రి తల్లి నమ్మేస్తుంది. పాపం ఆవిడకేం తెలుసూ, ఆవిడ చిన్నప్పుడు వీడికి పెట్టిన కూరల మీద కసి తీర్చుకుంటున్నాడనీ?

ఇంకొంతమందుంటారు, ఫలానా పండు “ కాశీలో వదిలిపెట్టేశానండీ..” అంటారు. అది కూడా మహ అయితే ఏ అరటిపండో అవొచ్చు. దీనితో ఏమౌతుందీ, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, మరీ అరటిపండు కాకుండా, ఏ యాపిల్ పండో తాంబూలంతో ఇవ్వాల్సొస్తుంటుంది. మరీ చీప్ గా అరటి పళ్ళెవరిక్కావాలీ, ఏ ఇంపోర్టెడ్  పళ్ళో అయితే బావుంటుంది కానీ..

ఏదైనా  వద్దనుకుని, చెప్పుకోడానికి మొహమ్మాటమైతే, హాయిగా ఏ కాశీ గంగమ్మ తల్లిమీదో, కాదూ కూడదంటే ఏ డాక్టరుమీదో పెట్టేయొచ్చు. హాయి కదూ.. ఈ పధ్ధతి, వీటిని వెరిఫైకూడా చేయడం కష్టం. తినడానికి తిండిలేనివాడు, ఏం పెట్టినా కళ్ళకద్దుకుని మరీ తింటాడు. ఇటువంటి, అంటే  selective  గా కొన్నిటిమీద తెచ్చిపెట్టుకున్న అయిష్టాలు ఏర్పరుచుకోడం ఉత్తి జరుగుబాటు రోగం. అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే కొన్నిటిమీద  భయం ఉండొచ్చు. ఉదాహరణకి కుక్కలు. కొంతమంది స్టైలిష్ గా అసలు నాకు కుక్కలంటే ఎలర్జీ అండీ అంటాడు. అలెర్జీయా పాడా.. భయం. చెప్పుకోడానికి నామోషీ. . పైగా ఈ కుక్కల యజమాన్లు.. “ అబ్బే అదేమీ చేయదండీ.. ఉత్తి సాధువు..”  అనడం ఆనవాయితీ. ఆ కుక్కకి యజమానిమీద విశ్వాసం కానీ, మనమీదెందుకుంటుందీ? పోనీ ఏ గొలుసైనా వేసి కట్టేయొచ్చుగా అంటే, “ దానికిష్టం ఉండదండీ.. “ అని ఆ కుక్కమీద పెట్టేస్తూంటారు. అదో పధ్ధతీ.. మరీ దాన్ని అడగలేముగా “ ఏమ్మా గొలుసేసి కట్టేయడం నీకిష్టం లేదా…” అని?  ఆ ఇంటికి వెళ్ళి , ఆ కుక్క ఎప్పుడు మనమీద పడుతుందో అని భయపడుతూ కూర్చోడం తప్ప చేసేదేమీ ఉండదు.

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా  online shopping  లే కదా.. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనుతో టకటకా  ఆర్డర్లు చేసేయడం. ఒకలా ఈ పధ్ధతి బాగానే ఉంది. కానీ అందరికీ  నచ్చదాయె.  ఈ నచ్చనివాళ్ళు చెప్పే  కారణం ఏమిటంటే… నాకు సరుకు నాణ్యత చూసికొనుక్కోడమే నచ్చుతుందండీ.. వాడు పంపే కూరల్లో చచ్చులూ, పుచ్చులూ ఉంటాయేమో. హాయిగా మార్కెట్ కి వెళ్ళి, బెండకాయ చివరన తెంపి లేతదా. ముదురుదా అని తెలిసికోడంలోనే మాస్టారికి హాయేమో. అలాగే, బ్యాంకింగనండి, టిక్కెట్ల బుకింగనండి, ప్రతీదానికీ  వెళ్ళి ఆ క్యూలో నుంచోడమే కొందరికి సుఖం. “పోనీ మీరుకూడా నేర్చుకోరాదా , పక్కింటి అన్నయ్య గారిలా,” అని ఇంటి ఇల్లాలు కానీ , ఎరక్కపోయి అందా, ఆవిడ పని అయిపోయిందే. నీకేం తెలుసనీ వీటిల్లో జరిగే మోసాలు అని తను విన్నవీ, చదివినవీ, ఊహించినవీ  చెప్పి ఊదరగొట్టేస్తాడు. జీవితం ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సాగిపోతూనే ఉంటుంది….

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pounch patas