Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యం.లక్ష్మి

మధుర ప్రపంచం – హెర్ష్సీ

అదొక మధుర ప్రపంచం.  అక్కడకెళ్ళినవాళ్ళందరికీ నోట్లో నీరూరుతాయి.  ఆ మధురాల రుచి చూసి మనసు సంతృప్తి చెందుతుంది.  మరి  మధురమైన చాకొలెట్స్ అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరుంటారండీ   పళ్ళు పాడవుతాయనే భయం వున్నా, టూత్ పేస్టుల ప్రచారాలు చూసి ధైర్యంగా తినేసేవాళ్ళు చాలామందే వున్నారు.  ముఖ్యంగా ఫారెన్ చాకొలెట్స్ అంటే మరీ క్రేజ్.  విదేశాలనుంచి ఎవరైనా వస్తుంటే చాకొలెట్స్ వస్తాయని ఎదురుచూడటం  అలవాటయిపోయింది.

మీకు చాకొలెట్స్ అంటే అంత ఇష్టమని తెలిసే, ఈ వారం మిమ్మల్ని చాకొలెట్ ఫేక్టరీకి తీసుకెళ్తున్నాను.  అందులోనూ హెర్షీస్ చాకొలెట్స్.  పద పద అంటారా  పదండి మరి ... మీదే ఆలస్యం.మనం ఇప్పుడు ఉత్తర అమెరికాలో, పెన్సిల్వేనియాలోని  హెర్షీస్ లో వున్నామండీ.  ఈ ఊరి అసలు పేరు  డెర్రీ చర్చ్.1903 లో మిల్టన్ యస్. హెర్షీ  ఇక్కడ హెర్షీస్  చాకొలెట్ కంపెనీ పెట్టారు.  ఆయన సొంత వూరు ఇది.  ఈ కంపెనీ తయారు చేసిన మిల్క్ చాకొలెట్ బార్స్ చాలా ప్రసిధ్ధి చెందాయి.  దానితో కంపెనీకూడా త్వరితిగతిన అభివృధ్ధి చెందసాగింది.  పైగా ఆ వూరులో జీవన వ్యయం తక్కువ.  హెర్షీ  తనదగ్గర పని చేసే వారందరికీ వారి సుఖ జీవనానికి కావలసిన హంగులన్నీ ఏర్పాటు చేయటం కూడా కంపెనీ అభివృధ్ధికి తోడ్పడింది.  కంపెనీ బాగా అభివృధ్ధి చెందటంతో ఈ ప్రాంతం పేరుకూడా హెర్షీ అయిపోయింది.  ఇక్కడ వున్న హెర్షీస్ చాకొలెట్ ఫేక్టరీ చాకొలెట్స్ తయారు చేసే కంపేనీలలో అతి పెద్దది.  ఇది అమెరికాలోనేకాక, ఇతర దేశాలలో కూడా ప్రసిధ్ధి చెందింది.    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలలోకన్నా ఎక్కువగా ఈ చాకొలెట్స్ అమ్ముడుపోతున్నాయి.

హెర్షీ చాలా రకాల చాకొలెట్స్ తయారు చేస్తున్నా, వీరు తయారు చేసే కిసెస్ అంచే చాలామందికి ఇష్టం.  ఇవి చిన్నగా కోన్ షేప్ లో వుంటాయి.  1907 లో వీటి ఉత్పత్తి మొదలు పెట్టినప్పటినుంచీ 1921దాకా వీటిమీద రేపర్స్ చేత్తోనే చుట్టేవారు.  1921లో దానికోసం మిషన్లు ఏర్పాటు చేసిన తర్వాత రేపర్ చుట్టేటప్పుడు సన్నటి పేపర్ రిబ్బన్ బయటకి వుండేటట్లు చెయ్యంటం మొదలు పెట్టారు.  ఆ రిబ్బన్ అసలైన హెర్షీస్ కిసెస్ కి గుర్తు.  ప్రస్తుతం ఈ కిసెస్ మాత్రమే రోజుకి 80 మిలియన్లకన్నా ఎక్కువ తయారవుతున్నాయంటే వీటిని ఇష్టపడేవాళ్ళు ఎంతమంది వున్నారో చూడండి మరి.

చాకొలెట్స్ గురించి కొంత తెలుసుకున్నాంకదా.  మరి చాకొలెట్ల తయారీ చూడాలికదా.  దాని కోసం కంపెనీ వారు ఏర్పాటు చేసిన కండెక్టడ్ ట్రిప్స్ వున్నాయి.  ఇవి ఉచితం.  ఇక్కడ చాకొలెట్స్ తయారీ అంతా మిషన్ల ద్వారానే.  ఒక చోట చాకొలెట్స్ తయారీ మొదటి అంశంనుంచీ పేకింగ్ దాకా తయారీ విధానమంతా వున్నది.  దాని చుట్టూ ఒక వుడెన్ ప్లేంక్.  దానిమీద చిన్న చిన్న జీప్స్ లాంటివి .. ఒక్కొక్కదానిలో నలుగురు కూర్చునే వీలున్నవి వున్నాయి.  మనం అవి ఎక్కి కూర్చుంటే ఆ వుడెన్ ప్లాంక్ నెమ్మదిగా ఆ చాకొలెట్స్ తయారు చేసే ప్రాంతం చుట్టూ తిరగటం మొదలు పెడుతుంది.  అక్కడ తయారీ ఏ విధంగా జరుగుతుందో ముందుగా రికార్డు చేసిన కామెంటరీ వినపడుతూ వుంటుంది.  ఈ టూర్ 10 ని. వుంటుంది.  అదయిపోగానే బయటకొస్తే ఫుడ్ కోర్టులు, రకరకాల చాకొలెట్స్ కొనుక్కోవటానికి వీలుగా బోలెడు షాప్స్. ...  మీక్కావాల్సిన చాకొలెట్స్ కొనుక్కోండి. ..  షాపింగ్ అయిపోయిందికదా.  ఇంక బయటకి వెళ్దాం.

బయట హర్షీస్ పార్కు వున్నది.  పార్కు లోపల అన్నీ రైడ్స్ వున్నట్లు కనబడుతున్నాయి.  టికెట్ మనిషికి 20 $. . మనకి అంత టైము లేదు.  అందుకని బయల్దేరుదాము.అదేమిటక్కడ  రైళ్ళో, ట్రాలీలో తెలియకుండా వున్నాయి..  ఒక్కోదానికీ 4 కంపార్టుమెంట్లున్నాయి.  ఆ ఆవరణ చాలా పెద్దదికదా.  సందర్శకులు అనేక వైపుల నుంచి వస్తారు.  కార్ల పార్కింగు ప్రదేశాలనుంచి   చూడవలసిన ప్రదేశాలు చాలా దూరంగా వుంటాయి.  అందుకే సందర్శకుల సౌకర్యార్ధం ఆ ట్రాలీలు.  ఇవీ ఉచితమే.  వీటిలో ఎక్కి వారు ఆ ప్రదేశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, రావచ్చు.  ఈ ఏర్పాటు చాలా బాగుంది కదా

ఇన్ని విశేషాలు చెప్పానుకదా  ఇంకొక విశేషం కూడా చెప్పి ముగిస్తాను.  హెర్షీ దంపతులకి పిల్లలు లేరు.  అందుకనే వారు 1918లో అనాధ బాలలని చదివించటానికి ఒక బోర్డింగ్ స్కూల్ పెట్టి, దానికోసం వాళ్ళ సంపదలో చాలా భాగం, సుమారు 60 మిలియన్ డాలర్లపైనట  విరాళమిచ్చారు.  అప్పుడేకాదు, ఇప్పటికీ హెర్షీ కంపెనీ లాభాలనుంచి 30 శాతం ఆ స్కూల్ కి వెళ్తుంది.  ప్రస్తుతం 2000 మంది అనాధల చదువేకాక, వారి ఆరోగ్యం వగైరాల గురించి కూడా శ్రధ్ధ తీసుకుంటున్నారు.  అంతేకాదు, ఆ పిల్లల బాగోగులు చూడటానికి హౌస్ పేరెంట్స్ అని కొంతమందిని అపాయింట్ చేస్తారు.  వారు ఆ పిల్లలకి అన్ని విషయాలలో తోడుగా వుంటారు.

చూశారా ఈ మధుర ప్రపంచం తినటానికి  తియ్యని చాకొలెట్స్ ఇస్తోంది, తమ ఉద్యోగస్తుల అన్ని అవసరాలూ తీర్చి చాలా బాగా చూసుకుంటోంది, ఇంకా అవసరమైన వారిని ఆదుకోవటానికి కూడా ఎంత ముందంజ వేస్తోందో!!.

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu