Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మ‌ణిర‌త్నం సినిమా.. అందుకే ఆగిపోయింది - నాని

interview with nani

మ‌ణిర‌త్నం సినిమా.. అందుకే ఆగిపోయింది - నాని

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు..

స్టార్ ఇంటి నుంచి రాలేదు..

పొలిటీషియ‌న్ కొడుకు కాదు

బిజినెస్ మేన్ వార‌సుడు అస‌లే కాదు.

కేవ‌లం.. ప్ర‌తిభ‌ని న‌మ్ముకొన్నాడు. గాడ్ ఫాద‌ర్ అండ లేకున్నా.. ఇండ్ర‌స్ట్రీలో స్థానం సంపాదించుకోవ‌చ్చు అని నిరూపించుకొన్నాడు. నానికి న‌టుడిగా, హీరోగా వంద‌కి నూటొక్క మార్కులు వేయ‌డానికి ఇంత కంటే వేరే కార‌ణాలు కావాలా?  

అష్టాచ‌మ్మా నుంచి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ వ‌ర‌కూ సినిమా సినిమాకీ ఎదుగుతూనే ఉన్నాడు నాని. భ‌లే భ‌లే.. వ‌సూళ్లు నాని స్టామినాని స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేస్తూ... ప‌రిశ్ర‌మ‌ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాయి. ఇప్పుడు కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ అంటూ మ‌రోసారి వినోదాలు పంచ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా నానితో గో తెలుగు చేసిన‌ చిట్ చాట్ ఇది.
 

* కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌... టైటిల్ వెనుక క‌థేమైనా ఉందా?
- ఈ సినిమా క‌థ గురించీ, న‌టీన‌టుల గురించీ మేం  ఎంత ఆలోచించామో.. సినిమాకి ఎలాంటి పేరు పెట్టాల‌న్న‌దానికోసం అంత‌కంటే ఎక్కువ‌గా ఆలోచించాం. ర‌క‌ర‌కాల పేర్లు ప‌రిశీలించాం. ద‌ర్శ‌కుడు, నేనూ, నిర్మాత‌లూ క‌ల‌సి ఓ పెద్ద లిస్టు త‌యారు చేశాం. కానీ ఏదీ క‌నెక్ట్ అవ్వ‌డం లేదు. ఈలోగా.. సినిమా కూడా పూర్త‌యిపోయింది. ఇక ఇప్పుడైనా ఏదో ఓ పేరు పెట్ట‌క‌పోతే ఎలా??  అనిపించింది. మ‌ళ్లీ అంద‌రం కూర్చుని ప్ర‌శాంతంగా ఆలోచించాం. ఇది ఎవ‌రి క‌థ‌??  కృష్ణ‌గాడిది. కాబ‌ట్టి.. కృష్ణ‌గాడి ప్రేమ క‌థ అని పెడ‌దామ‌నుకొన్నాం. కానీ కిక్ లేదు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ అని ఫిక్స‌య్యాం. టైటిల్ ఫాంట్ కూడా చూస్తే.. జాన‌ప‌దం టచ్ ఉంటుంది. క‌థ‌లో అంత మేజిక్ ఉంది. అందుకే చివ‌రికి ఈ పేరు నిర్ణ‌యించాం.

* జై బాలయ్య అనే టైటిల్ పెడ‌దామ‌నుకొన్నార‌ట‌..?
- లేదు.. ఆ వార్త బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చిందో తెలీదు.

* ఈ క‌థ‌కీ బాల‌య్య‌కూ లింకేంటి?
- ఇందులో నేను బాల‌య్య అభిమానిని. అనంత‌పురం బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ ఇది. అక్క‌డ ప‌ది మందిని ప‌ల‌క‌రిస్తే.. తొమ్మిది మంది బాల‌య్య అభిమానులే. కాబ‌ట్టి... ఆయ‌న అభిమానిగానే నేనూ క‌నిపిస్తా. నేను క‌నిపించే తొలి స‌న్నివేశంలోనే బాల‌య్య పేరు వాడుకొని బ‌య‌ట‌ప‌డేలా ఓ త‌మాషా సీన్ ఉంది. అక్క‌డి నుంచి నాతోపాటు బాల‌య్య పేరు ట్రావెల్ అవుతుంది.

* మీ పాత్ర కోసం బాల‌య్య అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ ఏమైనా తీసుకొన్నారా?
- లేదండీ. నేను బాల‌య్య అభిమాని అయితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తానో.. అలానే న‌టించా.

* ఆయ‌న్ని ఏమైనా ఇమిటేట్ చేశారా..? అంటే తొడ‌గొట్ట‌డం వ‌గైరా....
- ఓ స‌న్నివేశంలో తొడ‌గొట్టా. కానీ అదేం సీరియ‌స్‌గా సాగే సీన్ కాదు. నేను తొడ‌గొట్టిన విధానం.. ఆ టైమింగ్ చూస్తే న‌వ్వొస్తుంది.

* ఈ సినిమా గురించి బాల‌య్య కూడా వాక‌బు చేశార‌ట‌..
- అవునండీ.. ఓసారి ''నానీ మా హిందూపురంలో సినిమా చేస్తున్నావ‌ట క‌దా.. నా ఫ్యాన్‌లా యాక్ట్ చేస్తున్నావ‌ట'' అని ఉత్సాహంగా అడిగారు.

* ఆయ‌న‌తో గెస్ట్ రోల్ చేయించాల‌ని అనిపించ‌లేదా?
- ఆ ఆలోచ‌న మాకూ వ‌చ్చింది. కానీ బాల‌య్య కోసం స‌న్నివేశాన్ని బ‌ల‌వంతంగా జొప్పించిన‌ట్టు అనిపిస్తుంద‌ని మానుకొన్నాం.

* భ‌లే భ‌లే మ‌గాడివోయ్ విజ‌యం ఎలాంటి బూస్ట‌ప్ ఇచ్చింది?
- చాలా షాకింగ్ రిజ‌ల్ట్ అది. క‌చ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంద‌ని తెలుసు. కానీ... ఆ స్థాయిలో వ‌సూళ్లు ద‌క్కించుకొంటుంద‌ని తెలీదు. ఓవ‌ర్సీస్‌లో టాప్ టెన్ చిత్రాల్లో అదొక‌టిగా నిలిచింది. కల‌ర్ ఫుల్ పోస్ట‌ర్లు ఉంటే స‌రిపోదు.. కంటెంట్ ఉండాలి. అలాంటి సినిమాలే ఆడ‌తాయ‌న్న నిజాన్ని ఈ సినిమా రుజువు చేసింది. ఒక విధంగా నా బాధ్య‌త‌ను పెంచిన సినిమా అది. నాని సినిమాకి ఓ న‌మ్మ‌కంతో జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు. ఆ అంచ‌నాల్ని అందుకోవాల్సిన బాధ్య‌త నాపై ఉంది.

* అంటే ఇక నుంచి వినోదాత్మక చిత్రాల‌కే ప‌రిమితం అవుతారా?
-  భ‌లే భ‌లేమ‌గాడివోయ్ లాంటి సినిమా ఎప్పుడోగానీ రాదు. అలాంటి క‌థ‌లే దొరుకుతాయ‌న్న గ్యారెంటీ లేదు. కానీ ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. నా నుంచి ఇక‌పై పైసా, సెగ‌ లాంటి సినిమాలు రావు. క‌థ‌లో హ్యూమ‌ర్ ఎక్కువ‌గా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాను.

* ఆహా క‌ల్యాణం కూడా బాగా దెబ్బ‌కొట్టింది క‌దా?
- అదో ర‌క‌మైన సినిమాలెండి. సినిమా బాగుంది, బాగాలేదు అన్న‌వారికంటే.. నాని ఓ తెలుగు హీరో అయ్యిండి, త‌మిళంలో సినిమా తీసి, తెలుగులో డ‌బ్ చేస్తాడా?  అంటూ తిట్టుకొన్న వాళ్లు ఎక్కువ‌మంది ఉన్నారు.. మ‌ళ్లీ అలాంటి త‌ప్పు చేయ‌ను.. (న‌వ్వుతూ)

* ఇక త‌మిళ  చిత్రాల‌కు దూర‌మా?
- ఒకేసారి రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం క‌ష్టం. ఒక ప‌డ‌వ తూర్పుకీ, ఇంకోటి ప‌శ్చిమానికీ వెళ్తే మ‌ధ్య‌లో మ‌నం మునిగిపోతాం.

* ఈమ‌ధ్య అగ్ర క‌థానాయ‌కులంతా మిమ్మ‌ల్ని తెగ పొగిడేస్తున్నారు..
- మ‌హేష్ బాబు, బ‌న్నీ, ఎన్టీఆర్‌.. వీళ్లంతా నా ఆడియో ఫంక్ష‌న్ల‌కు వ‌స్తున్నారు.. నిజాయ‌తీగా మాట్లాడుతున్నారు. అగ్ర క‌థానాయ‌కులు అయ్యిండి.. మ‌రో క‌థానాయ‌కుడ్ని పొగ‌డ్డం.. వాళ్ల పెద్ద మ‌న‌సుకు నిద‌ర్శ‌నం. న‌న్ను పొగిడార‌ని కాదుగానీ.. ఇలాంటి వాతావ‌ర‌ణం చాలా మంచిది.

*మ‌ణిర‌త్నం సినిమా ఎప్పుడు?
- ఇప్ప‌టికే చేయాల్సింది. ఈమ‌ధ్య ఓ క‌థ చెప్పారు. కానీ... ఇంచుమించు అలాంటి క‌థ‌తోనే హిందీలో ఓ సినిమా వ‌చ్చేసింది. అందుకే ఆ సినిమా ఆగిపోయింది. త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా.. మా కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంది.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ

-కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
movie review