Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nani

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - కృష్ణగాడి వీర ప్రేమ గాధ

movie review

చిత్రం: కృష్ణగాడి వీర ప్రేమ గాధ 
తారాగణం: నాని, మెహ్రీన్‌, సంపత్‌ రాజ్‌, శతృ, బ్రహ్మాజీ, మురళీశర్మ, పృధ్వీ, సత్యం రాజేష్‌, హరీష్‌ ఉత్తమన్‌, తదితరులు. 
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌ 
ఛాయాగ్రహణం: యువరాజ్‌ 
నిర్మాణం: 14 రీల్స్‌ 
దర్శకత్వం: హను రాఘవపూడి 
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర 
విడుదల తేదీ: 12 ఫిబ్రవరి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
కృష్ణ (నాని) పరమ పరికివాడైన కుర్రాడు. అతనికో లవ్‌ స్టోరీ ఉంటుంది. కృష్ణకి మహాలక్ష్మి అంటే ప్రేమ. కానీ, ఆ ప్రేమని వ్యక్తపరచలేడు. కారణం అతని పిరికితనం. అయితే, ఆ ప్రేమను వ్యక్తపరచాల్సిన సమయమొస్తుంది. అదే సమయంలో కృష్ణ అనుకోని ఇబ్బందుల్లో పడతాడు. పిరికివాడైన కృష్ణకి నరరూప రాక్షసులైన ఫ్యాక్షనిస్టులతో తలపడాల్సి వస్తుంది. మరి, కృష్ణ పిరికితనాన్ని పక్కన పెట్టాడా? ఎందుకు ఆ కష్టం కృష్ణకి వచ్చింది? ఈ కష్టాల్ని జయించి కృష్ణ తన ప్రేమను గెలుచుకున్నాడా? అనేవి తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
నటనలో నాని గురించి కొత్తగా చెప్పుకోడానికేముంది? నాని నటించడు, జీవించేస్తాడు. ఏ సినిమాలో ఏ పాత్ర దక్కినా దానికి ప్రాణం పోసేయడం నాని ప్రత్యేకత. ఈ సినిమాలోనూ నాని చేసింది అదే. పిరికివాడిగా నాని పెర్ఫామెన్స్‌ సినిమాకే హైలైట్‌. హీరోయిన్‌తో లవ్‌ పండించే సీన్లలో నాని చెలరేగిపోయాడు. అలాగే, ఏమోషనల్‌ సీన్స్‌లోనూ నాని సత్తా చాటాడు.

హీరోయిన్‌ మెహ్రీన్‌ తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. హావభావాల పరంగా మంచి మార్కులేయించుకుంది. క్యూట్‌గానూ ఉంది. పసిపిల్లలైనా చిచ్చరపిడుగులనిపించుకున్నారు బాల నటులు. బేబి నయన, మాస్టర్‌ ప్రదమ్‌, బేబి మోక్ష తమ నటనతో ఆకట్టుకున్నారు. సంపత్‌ రాజ్‌ మరోసారి మంచి పాత్రలో కనిపించాడు. బ్రహ్మాజీ, పృధ్వీ తదితరులు బాగా నవ్వించారు. మురళి శర్మ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

కథ, కథనం విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సన్నివేశాల్ని చిత్రీకరించిన తీరు బాగుంది. టెక్నీషియన్స్‌ నుంచి మంచి ఔట్‌పుట్‌ రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. మాటలు బాగున్నాయి. సహజంగా ఉండి, ఆకట్టుకుంటాయి. సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ బాగుంది, అక్కడక్కడా ఇంకాస్త బెటర్‌గా వుంటే బాగుండేదనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఓ డిఫరెంట్‌ లుక్‌ సినిమాకి వచ్చిందంటే అది సినిమాటోగ్రాఫర్‌ పనితనమే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా రిచ్‌గా తెరకెక్కిందంటే నిర్మాణపు విలువలు బాగున్నట్టే కదా.

సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, మాటలు అన్నీ సినిమాకి కలిసొచ్చాయి. కొత్తదనంతో కూడిన ఆలోచనలతో దర్శకుడు సినిమాని బాగా డీల్‌ చేశాడు. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. సెకెండాఫ్‌ కూడా అదే పేస్‌లో కొనసాగుతుంది. పిరికివాడి లవ్‌ స్టోరీ, దాంట్లో చిన్న పిల్లలకి లింకప్‌, దానికి మళ్ళీ ఫ్యాక్షనిజం టచ్‌. ఇన్ని ప్రత్యేకతలతో సినిమా చేయడమంటే కత్తిమీద సాహసమే. దర్శకుడిగా ఆ సాహసం చేసి, మెప్పించగలిగాడు హను. స్క్రీన్‌ప్లే విషయంలో కష్టపడ్డ తీరు అభినందనీయం. ఓవరాల్‌గా డిఫరెంట్‌ సినిమా చూశామన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్లాస్‌ ఆడియన్స్‌నీ అలాగే మాస్‌నీ మెప్పించే అంశాలు సినిమాలో మెండుగా ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే 
భలే భలే కృష్ణగాడి వీర ప్రేమగాధ

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
rashi khanna  was beauty...