Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం



 గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue148/418/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

‘‘ఫలించదా స్వామీ?’’

‘‘అవును. ఫలించదు. అస్త్ర విద్య తెలిసిన వారంతా ద్వాపర యుగాంతానికి ఎవరూ మిగిలి లేరు. సప్త ఋషులతో బాటు పరశురాముల వారు మార్కండేయుల వారు మరి కొద్ది మంది వున్నారు. అంతా దివ్య పురుషులు మహా తపస్సంపన్నులు. నా జనకుడు ద్రోణాచార్యుల నుండి అస్త్ర శస్త్రాది సమస్త విద్యలు నేర్చిన వాడ్ని. అయినప్పటికీ బోధింప జాలను. కలి యుగంలో ప్రయోగ ఉప సంహరణాది అస్త్రవిద్యలేవీ బోధింప రాదన్న నియమమున్నది. మహనీయులు విధించిన నియమాలను ఉల్లంఘించి నీకు అస్త్ర విద్యలు బోధింప లేను. ఆపైన మారణాయుధములైన అస్త్రములను ప్రయోగించుటకు ఆ వ్యిద తెలిసిన ప్రత్యర్థి శత్రువుండాలి గాదా...,, లేరు. కావున విలయం సృష్టించే అస్త్ర విద్యల కోసం ఆశ పడకు నాయనా. వాటితో నీకు పని లేదు.’’

అశ్వత్థామ హితో పదేశం సమంజసం గానే తోచింది ధనుంజయునకు.

‘‘చిత్తము స్వామీ. తమ అజ్ఞానువర్తిని. ఇక ముఖ్యముగా రెండు సంశయములు నాలో మిగిలి వున్నవి. మీరు సర్వజ్ఞులు. నా సంశయ నివృత్తి జేసిన ఇక మీ ఏకాంతమునకు భంగము కలిగించక నా మార్గమున బయలుదేరగలను’’ అన్నాడు.

అశ్వత్థామ ప్రసన్నంగా చూసాడు.

కొద్ది క్షణాలు కను మూసుకొని`

జ్ఞాన దృష్టిలో అవలోకించాడు.

‘‘నీ సంశయము ఏమిటో గ్రహించితిని నాయనా’’ అన్నాడు.

‘‘నిన్నటి సంధ్యా సమయమున ఒక అద్భుత సౌందర్య రాశిని గరుడ పక్షి నుండి కాపాడినావు. ఆమె అంతలోనే కనుమరుగైనది. ఆమె ఎవరన్నది నీ మొదటి సంశయము. అవునా?’’ కనులు తెరిచి చూస్తూ అడిగాడు.

‘‘అవును స్వామీ.’’ అన్నాడు విభ్రాంతుడై చూస్తూ ధనుంజయుడు.

‘‘ఆమెను రెండో సారి కూడ జూచినావు గదా.’’

‘‘లేదు స్వామీ.’’

‘‘బాగుగా జ్ఞప్తికి తెచ్చు కొనుము. సంపంగి సువాసనలు, పడగ విప్పి అడుతూ నిన్నే వీక్షించిన శ్వేత నాగు...’’

‘‘ఆ మాట నిజము స్వామీ. శ్వేత నాగును జూచితిని. కాని....’’

‘‘కాని గుర్తించ నైతివి. నీవు గాంచిన ఆ సుందరియే శ్వేత నాగు. ఆమె నాగ కన్య.’’

‘‘నాగ కన్యా....’’

‘‘అవును. అందుకే గరుడ పక్షి ఆమెను, ఆమె చెలికత్తెలను పట్టి భక్షింపనెంచి తరిమినది. ఆమె సాధారణ నాగ కన్య కాదు. ఆమె నామ ధేయము ఉలూచీశ్వరి. నాగ లోకమునకు నీవు ప్రవేశింపకుండా నిన్ను ఇక్కట్లపాలు చేస్తున్న నాగరాజు మహా పద్ముడి కుమార్తె ఈ ఉలూచీశ్వరి. నిను తనివి తీరా వీక్షింప నెంచి శ్వేత నాగుగా మారినది.’’

అశ్వత్థామ చెప్పింది విని`

విస్మయం చెందాడు ధనుంజయుడు.

ఉలూచీశ్వరి ముగ్ధ మనోహర దివ్య రూపం మనసులో మెదులుతోంది. ఎంత పొరబాటు జరిగినది. అప్పుడే ఆమెను గుర్తించి పరిచయం చేసుకుంటే ఎంత బాగుండును. పాములతో మరో సమస్య ఎందుకని అప్పుడు తన దారిన వచ్చేసాడు. ఇప్పుడు కదా అసలు విషయం విశదమైనది. ఆమె దర్శన భాగ్యం తిరిగి లభిస్తుందో లేదో...

‘‘చింతించకు నాయనా. ఆమె పరిచయం నీకు లభిస్తుందిలే.’’ మనసులో మాట గ్రహించినట్టు దరహాసంతో చెప్పాడు అశ్వత్థామ. తిరిగి తనే వివరించాడు.

‘‘నీ రెండో సంశయము దివ్య నాగమణి గురించి. శ్రమ దమాదులకోర్చి నాగ లోకమును వెదుకుచూ బయలు దేరిన శ్రమ ఫలిస్తుందా! దివ్య నాగ మణిని తెచ్చి తండ్రిని కాపాడుకోగలవా లేదాని చింతింప పని లేదు నాయనా. కష్టే ఫలి అన్నారు. నీ శ్రమ వృధా పోదు. ఇంతకు మించి చెప్పవలసిన పని లేదు.’’

 

‘‘కృతజ్ఞుడను స్వామీ. చివరిగా నేను సహ్యాద్రికి చేరు మార్గమును సూచించండి చాలును. నేను బయలుదేరు చున్నాను’’ అంటూ లేచాడు ధనుంజయుడు.

అశ్వత్థామ కూడ లేచి దగ్గర కొచ్చాడు.

ధనుంజయుని ముదమారజూస్తూ`

భుజాలమీద చేతులేసాడు.

‘‘నిను జూడ నాటి అర్జునుడే కనుల ముందు సాక్షాత్కరించినట్టున్నది. గతము గురుతు చేస్తుంటివి నాయనా. రణ రంగమున శత్రువు గుండెలు అదిరేలా శంఖమును పూరించి గాండీవమును ఎక్కు పెట్టి ఇరు చేతులా శరము సంధించు గాండీవి ఆ వక్ర పరాక్రమం జ్ఞప్తి కొస్తున్నది నాయనా. యోగ కారకుడవు. చరిత్రను సృస్టిస్తావు. వెళ్ళి రమ్ము నాయనా.

ఇక్కడ నుండి ఉత్తర దిక్కుగా అయిదు యోజనాల దూరం వెళితే ఒక మహా పధాన్ని చేరుకుంటావు. నువ్వు రాజ మార్గన అటు ప్రయాణించి వుండవు. మీ రాజధాని రత్న గిరి నుండి బయలు దేరిన ఈ మహ పధం తీరం వెంట      ఉత్తరంగా సాగి తర్వాత గతి మార్చుకొని చంపా పురం మీదుగా ఈశాన్యంగా వెళ్ళి సహాద్రి పర్వత శ్రేణిని చేరుకుంటుంది. అటనుండి సహ్యాద్రి నానుకొనే తూర్పుగా మాళవ రాజ్యం చేరి అక్కడి నుండి వింధ్యాటవి మీదుగా వింధ్య పర్వతాలను దాటి ఉత్తరంగా సాగుతుంది.

సహాద్రి శ్రేణిలో భీమ శంకరుడు వెసిన సహాద్రి శిఖరానికి భీమశంఖర శిఖరమని పేరు. రథచక్రాలను పోలి కొండలు వున్నందున రథా చలే అనీ అంటారు. అక్కడికి చేరుకోడానికి అటు చంపాపురం నుండి వస్తే ఒక మార్గం చీలి సహ్యాద్రి పర్వత శ్రేణి మీదుగా భీమ శంకర శిఖరానికి చేరుస్తుంది. మీ తండ్రి గారి వెంట సపరివారంగా నీవా మార్గాన గతంలో స్వామిని దర్శించి వుంటావు.

ఇప్పుడు నీవు చేరుకునే రాజ మార్గాన పశ్చిమంగా వెళ్ళితే రేపు సాయం కాలమునకు సహ్యాద్రి పర్వత శ్రేణిని చేరుకుంటావు. అక్కడ అంబాపురమని చిన్న గ్రామం వుంటుంది. రాత్రికి అక్కడ మజిలీ చేయుట మంచిది. అక్కడి నుండి భీమ శంకర శిఖరానికి మరోమార్గం వుంది. రెండు దినములు పర్వత శ్రేణి మీది మార్గంలో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరుకోగలవు’’ అంటూ వివరించాడు.

ఆ మాటలు శ్రద్ధగా విని గుర్తు పెట్టుకున్నాడు ధనుంజయుడు. అశ్వత్థామ చరణాలకు మరోసారి ప్రణమిల్లి అశీర్వచనం తీసుకుని బయలుదేరాడు. అతడ్ని సాగనంపుటకు మెట్ల మార్గం వరకు వచ్చాడు అశ్వత్థామ. చివరగా`

‘‘నాయనా ధనుంజయా. నీవు అడగకున్ననూ నీకు రెండు ముఖ్య విషయము తెలుపుచున్నాను. ప్రయాణమందు తారసిల్లిన నీ మిత్రుడు తిరిగి నిను చేరుకుంటాడు. జీవి తకాలం నీకు తోడుగా వుంటాడు. ఇక రెండవ విషయం ముఖ్యమైనది.

ఇది కలికాలం. స్వార్థపరులైన మానవులు కొందరు కుట్రలు కుతంత్రాలు సాగిస్తుంటారు. న్యాయ ధర్మాలు నీతి నియమాలకు తావుండదు. త్వరలోనే మీ రత్నగిరి ఒక మహా యుద్ధాన్ని చూడ బోతోంది. అప్రమత్తుడవై చరింపుము. విజయోస్తూ. పోయి రమ్ము నాయనా.’’ అంటూ దీవించాడు.

మరో సారి ప్రణమిల్లి`

చరచరా మెట్లు దిగి వచ్చేసాడు ధనుంజయుడు.

తన అశ్వాన్ని అధిరోహించాడు.

ఉత్తర దిక్కుగా పోనిస్తూ మెట్ల వైపు చూసాడు.

అప్పటికే సర్ప రూపంగా మారిన అశ్శత్థామ, తన అశ్రమంలోకి నిష్క్రమిస్తూ కన్పించాడు.

పొద్దు పడమట వాలుతోంది.

కళ్ళాలు బిగించి అశ్వాన్ని శరవేగంతో పరుగెత్తించాడు. అయితే చివరిగా అశ్శత్థామ చెప్పిన రెండు విషయాు పదే పదే గుర్తుకొస్తూనే వున్నాయి. ఒకటి సంతోషం కలిగించేదే. ప్రయాణంలో పరిచయమైన వాడంటే మిత్రుడు అపర్ణుడే. ఒక పూట పరిచయంలోనే మిత్రుడిగా తనకెంతో దగ్గరయ్యాడు. అతడు తిరిగి వస్తాడని జీవితకాలం తనతో వుంటాడంటే అంత కన్నా ఆనందం ఏముంటుంది? కాని... రత్నగిరి ఒక మహా యుద్ధాన్ని చూడబోతోందంటేనే ఆశ్చర్యంగాను మనసుకు వేదన గాను వుంది.

తన జనకుని పాలనలో రత్నగిరి ప్రజలు శాంతి సుభిక్షాలతో సుఖంగా వున్నారు. సైనిక పరంగా చాలా శక్తి వంతమైన రాజ్యం తమది. అలాంటి రత్నగిరి పై ముట్టడి జరిపేంత తెగువ, ధైర్యం గలిగిన శత్రురాజులు ఎవరున్నారు? అయితే`

ఒక్కటి మాత్రం నిజం. పరిస్థితులు శత్రువులకు అనుకూలంగా వున్నాయి. ప్రభువు పుట్ట వ్రణంతో శక్తి హీనుడై రాజ మందిరాన పాన్పుకు పరిమితమయ్యాడు. యువ రాజు రాజధానిలో లేడు. శత్రువులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేక పోలేదు. ఆ శత్రువులు బయట వారా, అంతర్గతంగా వుంటూ వెన్ను పోటు పొడిచే వారాని తెలియాలి. ఏది ఏమైనప్పటికీ తను దివ్య నాగమణితో త్వరిత గతిని రాజధానికి చేరుకోవటం మంచిది. పరిస్థితులు విషమించ కూడదు.

ధనుంజయుని ఆలోచనలతో సంబంధం లేనట్టు అశ్వం గరుడ శర వేగంతో అడవిలో ఉత్తర దిక్కుగా దూసుకు పోతూనే వుంది.

***************************

భీమ శంకర క్షేత్రం.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటగు ఈ క్షేత్రం గురించి శివ పురాణంలో వుంది. స్థల పురాణం కూడ అదే చెప్తుంది. భీమాసురుడనే రాక్షసుని సంహరించేందుకు శంకరుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు.

రావణ బ్రహ్మ సోదరుడైన కుంభ కర్ణునికి కర్కటి అనే రక్షసికి జన్మించిన వాడు భీమాసురుడు. అతడికి ఢాకిని, శాకిని అని ఇరువురు భార్యలు.

తన తండ్రి, పెదతండ్రులు, తాతలు, బంధు వర్గం అంతా రామరావణ యుద్ధంలో మరణించారని, శ్రీహరి అవతారమే శ్రీరామచంద్రుడనీ తెలుసుకున్నాడు. శ్రీహరి మీద దేవతల మీద ప్రతీకారేచ్చతో అనేక సంవత్సరాలు బ్రహ్మను గూర్చి ఘోర తప్పసు చేసి అన్ని లోకాల్లోను తన కన్నా బలవంతుడు వుండ కూడదని వరం పొందుతాడు. ఆ వీర గర్వంతో దేవతలపైకి దండెత్తాడు. ముని వాటికను ధ్వంసం చేసాడు. పాతాళ రాజ దంపతుల్ని బంధించి చెరలో వుంచాడు. లోకాలను అల్లకల్లోలం చేసాడు.

అటు వంటి భీమాసురుని సంహరించేందుకు శంకరుడు సహ్యాద్రిపై జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. శివుని క్రోధానం భీమాసురుని భస్మం చేసింది. అంతే కాదు, అతడి అనుచర గణాల్ని కూడ దగ్ధం చేసి భస్మరాసులుగా చేసింది.

అప్పుడు భీమా సురుడి భార్యలయిన ఢాకినీ, శాకినీలు సదాశివుని శరణు వేడుకుని ఆయన కృపా కటాక్షంతో శేష జీవితాన్ని స్వామి సేవలో గడిపారు. ఆ విధంగా ఆ ప్రాంతం ఢాకినీ, శాకినీ వనంగా ప్రసిద్ధమై కాలక్రమంలో ఢాకినీ వనంగా స్థిర పడింది. ఇక బూదిద కుప్పలుగా మారిన రాక్షసుల దేహాల నుంచి ఎన్నో అరుదైన వనమూలికల నిచ్చే మొక్కలు, వృక్షాలు, తీగలు ఆవిర్భవించాయి. ఇది భీమ శంకరం జ్యోతిర్లింగమునకు సంబంధించిన పురాణ గాధ. దీనికి నిదర్శనంగా తర తరాలుగా ఆలయ ప్రాంతంలో అడవి నుండి అరుదైన వన మూలికల్ని తెచ్చి అమ్ముకునే ఆటవికులు ఆ ప్రాంతంలో కన్పిస్తారు. అయితే`

సహాద్రి పర్వత శ్రేణిని అనుకొని నాలుగు దిక్కులా వున్న అటవీ ప్రాంతాల్లో సింహ శార్థులాది కౄర మృగాల సంచారం అధికంగా వుండేది. స్వామి దర్శనార్థం వెళ్ళే భక్తుల మీద, రాజ మార్గన వెళ్ళే వాహనాల మీద అవి తరచూ దాడి చేసి ప్రాణ నష్టం కలిగించేవి.

రత్నగిరి తన ఏలుబడి లోకి రాగానే ప్రభువు ధర్మ తేజుడు ఈ క్షేత్రంపై దృష్టి పెట్టాడు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు, యాత్రికులకు గాని ఇటు రాజ మార్గాన సాగే ప్రయాణీకులకు గాని కౄర మృగాల బెడద లేకుండా సురక్షితంగా చేయటానికి ప్రతి ఆరు మాసములకు ఒకసారి సపరివారంగా ఈ ప్రాంతాలకు వేటకు వచ్చేవాడు. కౄరమృగాలను వేటాడి చంపే వారు. అంతే కాదు, ప్రతినెల డప్పు కొట్టి బాణా సంచా కాల్చి కౄరమృగాలను దూరంగా తరిమేందుకు ఢాకినీ అడవుల్లో నివశించే అట వికులకు బాధ్యత వప్పగించాడు. ఈ కారణాలచేత సహ్యాద్రి ప్రాంతాలు నిరపాయమయ్యాయి. కృారమృగాల సంచారం తగ్గి పోయింది. ధర్మ తేజుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసాడు. భక్తుల సౌకర్యార్థం ఎన్నో వసతి ఏర్పాట్లు చేసాడు.

అశ్శత్థామ వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరిన యువరాజు ధనుంజయుడు మరునాడు సాయం కాలానికి తూర్పున సహ్యాద్రి పర్వత శ్రేణి ఆరంభ ప్రాంతం లోని అంబా పురం గ్రామం చేరుకున్నాడు.

రాత్రికి అంబా పురంలో విడిది చేసి, ఉదయం బయలు దేరి లోయలు, పర్వత సానువుల వెంట ప్రయాణం సాగించి మూడో రోజు చీకటి పడుతూండగా సహ్యాద్రి మీది భీమ శంకరం పల్లెకు చేరుకున్నాడు.

ఇది స్వామి ఆలయానికి పక్కనే కాస్త దిగువున వుంది. అక్కడే యాత్రికుల సౌకర్యార్థం రాజ కుంటుంబం నిర్వహిస్తున్న అనేక గదులతో కూడిన పెద్ద విడిది గృహం వుంది. దాన్ని నిర్వహించు అధికారి అతడి మనుషులు ఎప్పుడూ అక్కడే వుంటారు. ఆ విడిది గృహం పక్కనే పల్లె వుంది. అక్కడ వేళ్ళ మీద లెక్కించగ గృహాలు మాత్రమే కన్పిస్తున్నాయి.

అక్కడ స్వామికి పూజు, అర్చనకు అవసరమైన పూలు పండ్లు సుగంధ ద్రవ్యాలు, పాలు వంటివి అర్చక స్వాములకు అందిస్తూ జీవిస్తున్నవారు కొందరు, అలాగే స్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఆలయ ఆవరణలో పూలు, పండ్ల దుకాణాలు నిర్వహిస్తూ జీవించే వారింకొందరు. మరి కొందరు ఆయ ప్రాంతాల్లో పారిశద్ధ్య పనులు నిర్వహిస్తుంటారు. ఇక మిగిలిన వారు ఆటవికులు సేకరించి తెచ్చే వనమూలికలను కొనుగోలు చేసి వాటి కోసం వచ్చే ఆయుర్వేద వైద్యులకు లాభానికి అమ్ముకొని జీవన యాత్ర సాగిస్తున్నారు. ఆ విధంగా భీమ శంకరం పల్లె వాసులు ఈ భీమశంకర క్షేత్రం మీద ఆధార పడి బ్రతుకుతున్నారు.

పోతే గతంలో`

రాజ పరివారంతో తన తండ్రి ధర్మతేజ మహారాజు, తల్లి మహారాణి కనకాంబిక వెంట ధనుంజయుడు చాలా సార్లు ఈ క్షేత్రానికి విచ్చేసి వున్నాడు. అలాగే తండ్రి వెంట ఢాకినీ అరణ్య ప్రాంతాల్లో వేటకూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ చాలా మంది తనను గుర్తు పట్టే అవకాశం వుంది. ఒంటరిగా వస్తున్న తనకిప్పుడు ఇక్కడ ఎలాంటి హడావుడి ఆర్భాటాలు ఇష్టంలేదు. అందుకే ఎవరూ తనను చప్పున గుర్తించకుండా వుండేందుకు సగం ముఖాన్ని కప్పుతూ తెల్లని వస్త్ర భాగాన్ని కట్టుకున్నాడు.

అయినప్పటికీ`

కను చీకటి పడుతుండగా వచ్చి సత్రం ముందు అశ్వం దిగిన ధనుంజయుని చూడగానే గుర్తించిన అక్కడి అధికారి భయ భక్తుతో సాష్టాంగ పడి పోయాడు.

‘‘చూడు! నేనిప్పుడు ఒంటిగానే వచ్చినాను. ఎలాంటి రాచ మర్యాదలు అక్కర లేదు. నా రాకను రహస్యము గనే వుంచుము. అర్చక స్వాములకును తెలియ పరుచ వలదు. ఉదయం నేను మాట్లాడెదను. స్వామిని దర్శించి ఎల్లుండి    ఉదయం వెళ్ళి పోయెదను గాక. నాకో ప్రత్యేక మగు గదిని ఏర్పాటు చేయించుము’’ అంటూ ఆజ్ఞాపించాడు ధనుంజయుడు.

క్షణాల్లో ఏర్పాట్లు జరిగి పోయాయి.

అశ్వ సంరక్షణకు దాన్ని అశ్వశాలకు తీసుకుపోయారు సేవకులు. అశ్వం మీది తోలు సంచులు, ఆయుధాలు అన్నీ గదిలోకి చేర్చబడ్డాయి. సుమారు పది దినముల పిమ్మట అలుపు తీరా వేడి నీట స్నానమాచరించి కడుపార మృష్టాన్నభోజనం ఆరగించాడు ధనుంజయుడు. అలసిపోయిన శరీరం గావటంతో పాన్పు మీద నడుం వాల్చగానే వెంటనే గాఢ నిద్రా వశుడయ్యాడు.

******************************

మరునాడు ఉదయం.

సూర్యోదయానికి ముందే లేవాలనుకున్నాడు గాని, సూర్యోదయమైన పిమ్మట గాని లేవ లేక పోయాడు యువరాజు ధనుంజయుడు.

కాలకృత్యాలు తీర్చుకుని భీమ శంకరుని దర్శనార్థం బయలు దేరాడు. ఎవరూ గుర్తించ కుండా సగం ముఖాన్ని కప్పుతూ తెల్లని వస్త్ర భాగాని చుట్టుకున్నాడు. సత్రం నుండి ఒక సేవకుని వెంట తీసుకెళ్ళాడు.

భీమ శంకర క్షేత్రం వెనక తట్టునే అర్చక స్వాము నివాస గృహాలున్నాయి. ఆలయం తూర్పు గోపురం ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో చెట్లక్రింద పూలు, పండ్లు ఇతర అంగడులు వున్నాయి. ఆలయం సమీపంలోనే భీమకుండ్‌ అనే కోనేరు వుంది. నాలుగు పక్కలా రాతి మెట్ల నిర్మాణం వుంది. పాతిక మెట్లు దిగి ఆ సహజ జలాశయంలో పుణ్య తీర్థ మాచరించి స్వామి దర్శనానికి వెళతారు.

ఆ రోజు సోమవారం గావటంతో స్వామికి విశేష పూజలు, అభిషేకాలు వుంటాయి. నిన్న రాత్రికే ఇక్కడికి చేరుకున్న భక్తులు ఉదయమే వచ్చి కొందరు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే, స్నానం చేసిన వారు దేవుని దర్శనానికి పోతున్నారు. అంగళ్ళ వద్దను, చెట్ల కిందను భక్తులు కన్పిస్తున్నారు.

ఏవీ పట్టించుకోకుండా సేవకునితో నేరుగా కోనేటి వద్దకు చేరుకున్నాడు యువరాజు ధనుంజయుడు. ఉదయపు చలి చలి గాలులతో ఆహ్లాద భరితంగా వుంది వాతావరణం. అక్కడి నుండి చూస్తుంటే తూర్పు పశ్చిమ దిక్కులకు వరుస తీరిన సహ్యాద్రి పర్వత శ్రేణులు, చుట్టూ ఢాకినీ అరణ్యాల సోయగం కనువిందు చేస్తోంది. అంత వరకూ తూర్పు ఆకాశంలో ప్రకాశిస్తున్న ప్రభాకరుని చిన్న మబ్బు తెర ఒకటి మూసి వేసింది.

రాతి మెట్లు రెండు దిగిన ధనుంజయుడు.

ఉన్నట్టుండి ఆగిపోయాడు.

తనను ఎవరో గమనిస్తున్నారన్న భావ వీచిక ఒకటి ఎందుకో గుండెల్ని తాకింది. చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఎవరై వుంటారు?

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali