Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 

నిస్త్రాణగా మెట్లమీద కూలబడిపోయింది మధుబాల. ఆమె నుదుటినుంచి చెమటలు ధారాపాతంగా కారిపోవటం మొదలయ్యింది. షాక్ వలన కొంచెం తలతిరుగుతున్నట్టు అనిపిస్తుండగా, అదిరే పెదవులతో  “ప్లీజ్, కొంచెం మంచినీళ్ళు...” అంది నూతిలోంచి వచ్చినట్టున్న గొంతుతో ఎంతో నీరసంగా...

“అయ్యో...ఒక్క క్షణం మేడమ్...” ఆమె వంక జాలిగా చూస్తూ రామలక్ష్మి గ్లాసుతో  అందించిన మంచినీళ్ళు గటగటా తాగేసింది, మధు.

“ఏ టైమ్  లో జరిగిందిది?”

“మూడు గంటలప్పుడు...నందిని మేడమ్ గారు ఆ లెటర్ చూడగానే...”

“కానీ నాకు తెలియకుండా ఎలా పంపించారు?  కనీసం ఫోన్  అయినా చేసి చెప్పాలి కదా?”

“అయ్యో, మీకు ఫోన్ చేసారమ్మా... ఒక సారి కాదు, రెండు మూడు సార్లు చేసారు. చేసినంత సేపూ ఆయన ఇక్కడే వెయిట్ చేసారు. సరే, ఉత్తరంలో మీ సంతకమే ఉంది కదాని...”

“ప్చ్... నా ఫోన్ పాడయింది... ఆఫీసు నుంచి వస్తూ ఉంటే బైక్ కూడా బ్రేక్ డౌన్ అయింది... వేరే ఆటో పట్టుకుని వచ్చేసరికి ఈ టైమ్  అయింది... ఇప్పుడు నేనేం చేయాలి?’ కొంత పైకీ, కొంత స్వగతంగా అనుకుంటూ మాట్లాడుతున్న మధుబాల ఉన్నట్టుండి  పానిక్ అయిపొయింది.

“మీ ‘ఊయల’ చాలా ప్రిస్టీజియస్ కేర్ సెంటర్ అని నాకు కొంచెం దూరమే అయినా  ఇక్కడ చేర్చాను, నా బాబుని.  మీరేమో అర్థం లేకుండా, ఎవడికో ఇచ్చేసారు... మీ మీద కేస్ పెడతాను...” గట్టిగా అరిచింది. అంతలోనే ఆమె గొంతు రుద్ధమైంది.

“మేడమ్... ఏదైనా ఉంటే మీరు నందిని గారితో మాట్లాడాలి. నా మీద అరిస్తే ఎలాగా?” కొంచెం సీరియస్ గా మొహం గంటు పెట్టుకుంటూ అన్నది  రామలక్ష్మి.

“ఆ,  నందిని గారినే అడుగుతాను...ఏదీ,  మీ ల్యాండ్ ఫోన్ ఉపయోగించుకోవచ్చా?”

“నందిని గారు బాంబే వెళ్ళారు... ఇప్పుడు ఫ్లైట్ లో ఉంటారు...”

“ఓ మైగాడ్... ఎప్పుడు వస్తుంది తను?”

“ఎల్లుండి వచ్చేస్తారమ్మా...”

“నాకు... నాకు... ఒక హెల్ప్ చేయగలవా రామలక్ష్మీ? ఒక ఆటో పిలవగలవా?”

“మీ బాబును  గురించి బెంగ పడకండమ్మా...మీ బాధ అర్థమౌతోంది... అలాగే, తప్పకుండా పిలుస్తాను...”

రామలక్ష్మి పిలుచుకు వచ్చిన ఆటోలో కూలబడి, తనుండే ఇంటి అడ్రెస్ చెప్పింది, మధుబాల.

***

“ఏమిటోయ్, అనుకోని ఈ అదృష్టం?” పార్టీ ఇస్తానంటూ వెంటబడిన కన్నన్ ని నవ్వుతూ అడిగాడు, స్వరూప్.

“చెప్తాగా... రా మరీ...” బైక్ ‘అప్సరా’ బార్  ముందు పార్క్ చేసి, ముందుకు నడిచాడు కన్నన్.

“చాలా రోజులైంది నేను డ్రింక్స్ తీసుకుని...ఇంతకీ విషయం ఏమిటి?” మళ్ళీ కుతూహలంగా అడిగాడు, స్వరూప్.

“చెప్తాగా... వెయిట్...” టేబుల్ మీద ఉన్న వాజ్ లోంచి తాజా రోజాను చేతిలోకి తీసుకుని రేకులు లాగుతూ అన్నాడు కన్నన్. అతని కన్నులలో ఒక వింత కాంతి...

వెయిటర్ ని పిలిచి కావలసినవి అన్నీ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ వచ్చేవరకూ ఇద్దరూ మాట్లాడుకోలేదు. స్వరూప్ కి ఏదో ఫోన్ కాల్ రావటంతో అక్కడ  సిగ్నల్ లేక బయటకు వెళ్ళాల్సి వచ్చింది.

తిరిగి వచ్చేసరికి రెండు మూడు సిగరెట్స్ కాల్చేసాడు, కన్నన్... అతని ముఖం కాస్త నెర్వస్ గా ఉన్నట్టు అనిపించింది, స్వరూప్ కి. ఈలోగా ఆర్డర్ వచ్చింది.

అన్నీ కలిపి, ఐస్ క్యూబ్ వేసి గ్లాసును స్వరూప్ ముందుకు తోసాడు, కన్నన్.

ఐదు నిమిషాలు గడిచాయి... “చెప్పు...” అన్నాడు స్వరూప్ కన్నన్ వంక ప్రశ్నార్థకంగా చూస్తూ...

“చెబుతాను కాని, స్వరూప్... నువ్వు  నాకు తప్పకుండా సహాయం చేయాలిరా...”

“ఏ విషయంలోనో చెబితే కదా తెలిసేది?” కొంచెం అసహనం ధ్వనించింది స్వరూప్ స్వరంలో.

“నాకు... మధుబాలంటే చాలా ఇష్టం...అరే  వాహ్! ఏం స్ట్రక్చర్ రా ఆమెది?”

“కన్నన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?  రేపో ఎల్లుండో పెళ్లి చేసుకోబోతూ, పరాయి ఆడదాని గురించి అలా  ఎలా మాట్లాడ గలుగుతున్నావు? నీకు మేరేజ్ ఫిక్స్ అయింది, అది గుర్తు పెట్టుకో...” వారిస్తున్నట్టుగా అన్నాడు స్వరూప్.

“అయితే ఏమిటి? దానికీ దీనికీ ఏం సంబంధం ఉంది? ఇంకా ఆర్నెల్ల వరకూ పెళ్ళికి ముహూర్తాలు లేవంట... ఈలోగా ఏదో కాలక్షేపం అయిపోతుంది... మరీ, మధుబాలతో నీకు మంచి స్నేహం ఉంది కదా... కాస్త నన్ను రికమెండ్ చేయాలి గురూ...” బ్రతిమాలుతున్నట్టు అన్నాడు కన్నన్.

అప్పటివరకూ తాగినదంతా దిగిపోయినట్టయింది స్వరూప్ కి...

“సారీ బాస్. మధుబాల అలాంటిది కాదు... ప్లీజ్... నీకు సరదాలుంటే తీర్చుకోవటానికి వేరే మార్గాలు వెదుక్కో... ఆ అమ్మాయిని మాత్రం అల్లరి పెట్టకు...ఇది కరెక్ట్ కాదు...” కోపంగా అన్నాడు.

“ఏం, నువ్వైతే ఫర్వాలేదా?” వెకిలిగా నవ్వాడు, కన్నన్.

“ఛీ! ఏం మాట్లాడుతున్నావు? మధు నాకు సిస్టర్ లాంటిది...”

“లాంటిది - కాని కాదు కదా?”

“కన్నన్... మనిషికి ఏది ఉన్నా లేకపోయినా కేరెక్టర్ చాలా ఇంపార్టెంట్. నీ దృక్పథం మార్చుకో... చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. వస్తాను బై...” అసహనంగా లేచాడు స్వరూప్.

“హు... నీ ఋణం ఉంచుకోను లేవోయ్... ఏదో సెట్ చేసి పెడతావని అనుకుంటే ఏంటి తెగ బెట్టు చేస్తున్నావు?”

“జస్ట్ షటప్ మై డియర్ కన్నన్... ఏదో మంచివాడివని పొరపాటు పడి నీతో  స్నేహం చేసాను. గుడ్ బై...” చరచరా నడుచుకుంటూ బయటికి  వెళ్ళిపోయాడు, స్వరూప్.

అతను వెళ్ళిన వైపే చూస్తూ కసిగా పళ్ళు కొరికాడు కన్నన్. ఈ సారి అతని ముఖంలో క్రౌర్యం స్పష్టంగా ప్రతిఫలిస్తోంది.

***

“డార్లింగ్... ఆకలి వేస్తోంది...” బయటి నుంచి వస్తూనే బాగ్ సోఫాలో విసిరేసి, కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసుకుంటున్న కార్తీక్ భుజాలమీద వయ్యారంగా వాలిపోయింది డాలీ, తన బరువంతా అతని వీపు మీద వేస్తూ...

“హేయ్, ఆగు ఓ నిమిషం... కొద్దిగా బిజీగా ఉన్నాను...” దృష్టి మరల్చకుండా చెప్పాడు, కార్తీక్.

“వ్హాట్ యార్, నీ పని నాకన్నా ముఖ్యమైనదా?” వంగి అతని చెంపను గట్టిగా ముద్దాడింది డాలీ... అంతే, ఆమె పెదవుల స్పర్శతో వివశుడైన కార్తీక్ ఆ పని వదిలేసి ఇటు తిరిగి డాలీని మీదకు లాక్కున్నాడు.

కొద్ది నిమిషాల తరువాత అతన్ని విడిపించుకుంటూ, “కార్తీ... అయాం ఫీలింగ్ హంగ్రీ !” అంది గోముగా...

“హంగ్రీ అంటే జాంగ్రీలు ప్లేట్ లోకి రావు బేబీ, వండుకుంటే వస్తాయి... పద కిచెన్ లోకి... ఇద్దరం కలిసి చేసుకుందాం...” అన్నాడు సీట్ లోంచి లేస్తూ.

“అబ్బా బోర్ బాబూ వంటంటే...” గునిసింది, డాలీ.

“తినటం బోర్ కాదేం? పద... నువ్వు కబుర్లు చెబుతూ కూర్చో,  నేనే చేస్తాలే...” ఆమె బుగ్గ మీద చిటికె వేసాడు.

ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళారు. ఆమె మాటలు వింటూ తాను పనిలో పడ్డాడు కార్తీక్.

“కార్తీ, నాకు ఈరోజు అరియర్స్ వచ్చాయి... రేపు నీకు మంఛి గిఫ్ట్ కొనిస్తాను...”

“ఓ, కంగ్రాట్స్ డాళింగ్... నువ్వు నాకు ఏం కొన్నా సరే, నా అరియర్స్ డబ్బు రాగానే నీకు మాత్రం డైమండ్ నెక్లెస్ కొనిస్తా... ప్రామిస్”
“ఐ నో యువర్ లవ్ డియర్... ఆ అన్నట్టూ, సండే నాకు బెంగుళూరులో కాన్ఫరెన్స్ ఉంది... శనివారమే బయలుదేరాలి నేను.”
“అయితే నేనూ వస్తాను...”

“ఉహు, వద్దు... వచ్చి ఏం చేస్తావు? అయినా నేను మా ఆఫీస్ వాళ్ళతో ఫ్లైట్ లో వెళతాను. నువ్వు వద్దులే...”

“నేనిక్కడ ఒక్కడినీ ఉండలేను,  నాకు బోరు కొడుతుంది డాలీ...”

“ఫర్వాలేదు కార్తీ... కలయిక తరువాత విరహం, విరహం తరువాత కలయిక బాగుంటాయి... అయినా మనం ఎప్పుడూ కలిసి ఉండటం కుదరదు... ఒకరిని ఒకరు శాసించుకోవటానికి వీలు లేదు... మరచిపోయావా, మనం మొగుడూ పెళ్లాలం కాదు కదా?” నవ్వింది డాలీ.
ఆమెతో మాట్లాడుతూనే  రైస్ కుకర్ పెట్టేసి, గబగబా పప్పు, కూర చేసాడు.

“థాంక్ యు డాళింగ్, యు డిడ్ ఇట్...” మళ్ళీ మరో చుంబనం  ప్రసాదించి, “నేను స్నానం చేసి వస్తాను, పళ్ళాలు పెట్టు, ఇద్దరం తినేద్దాం...” చెప్పేసి,  వాష్ రూమ్ లోకి వెళ్ళింది డాలీ.

‘ఒకప్పుడు వంటింట్లోకి రావాలంటేనే ఏడ్చే తనేనా ఈవేళ ఈమెకు వంట చేసి పెడుతున్నాడు? డాలీ అంటే నాకెందుకు ఇంత పిచ్చి?’ తనను తానే ప్రశ్నించుకున్నాడు కార్తీక్. అతనికి జవాబు దొరకలేదు కాని కనురెప్పల్లో అరక్షణం పాటు ఐశ్వర్య ముఖం కదిలింది. దాన్ని బలవంతంగా పక్కకి తోసేస్తూ, ఆ రాత్రి డాలీ అందించబోయే అపురూప స్వర్గ సుఖాలను ఊహించుకుంటూ, మధురోహలతో మరో వాష్ రూమ్ లోకి దారి తీసాడు, కార్తీక్.

***

పదహారో సారి మధుబాలకు చేస్తున్న ఫోన్ కాల్ ను కట్ చేసింది ఐశ్వర్య.  దాదాపు గంట నుంచీ ప్రతీ ఐదు నిమిషాలకూ ప్రయత్నిస్తోంది. కాల్ కలవటం లేదు. ‘స్విచ్డ్ ఆఫ్’ అనే వస్తోంది.

‘మధూకి ఏమైంది? చాలా సమయం దాటింది, అయినా ఇంకా ఇంటికీ రాలేదు... ఫోన్ పోయిందా? లేక పాడైందా? లేదా మధూకి ఏదైనా యాక్సిడెంట్... ఉహు, అలా జరగదు... ఐదు నిమిషాల్లో మధూ ఇంటికి వచ్చేస్తుంది...’ అల్లకల్లోలమైపోతున్న తన మనసుకు సర్ది చెప్పుకుంటూ,  ఆదుర్దాని అణచుకుంటూ ఒక గ్లాసు చల్లని నీటిని తాగింది ఐశ్వర్య. ఆ తర్వాత హాల్లోనే అటూ ఇటూ పచార్లు చేయసాగింది. అలా అటూ ఇటూ ఒక యాభై సార్లు తిరిగాక డోర్ బెల్ మ్రోగింది.

“ఏమిటింత ఆలస్యం? ఏమై పోయావ్?” తలుపు తెరిచీ తెరవగానే కోపంగా అరిచింది ఐశ్వర్య, మధుబాలను చూడగానే...
ఆమె జవాబు చెప్పే లోగానే, “ఆ డొక్కు ఫోన్ మార్చెయ్. అసలు పని  చేయటం లేదు. నాకిక్కడ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు... విన్నావా? అవునూ...” చిన్నగా కేకపెట్టి, “వాడేడే?” అంది.

“ఐశూ... ఐశూ... బాబు... బాబు...మన బాబి...” ఐశ్వర్యను కౌగిలించుకొని ఆమె భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవసాగింది, మధుబాల.

“ఆ? చెప్పు.... బాబు? బాబుకు ఏమైంది చెప్పు మధూ... టెన్షన్ గా ఉంది...”

“బాబును తీసుకు వెళ్ళిపోయారు...” మధుకు దుఃఖం వరదలు కట్టలుగా తెంచుకుంది. నేలమీద కూలబడి  వెక్కి వెక్కి ఏడుస్తున్న మధూని చూస్తూంటే అంతా అయోమయంగా తోచింది ఐశ్వర్యకు. తానూ  పక్కనే కూర్చుని ఆమెను ఒడిలోకి తీసుకుంది, ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ...

“మధూ... ప్లీజ్ కూల్ డౌన్ ...” ఆమె జుత్తులోని వేళ్ళు పోనిచ్చి రాయసాగింది ఐశ్వర్య. రెండు నిమిషాల తర్వాత దుఃఖం లోంచి తేరుకుంది మధు.

“చూసావా ఐశూ... వేణు ఎంత పని చేసాడో?”

“వేణూనా? వేణు అని  నీకెలా తెలుసు?”

“లేకపోతే ఇంకెవరు? అతనికే ఆ అవకాశం ఉంది బాబును తనతో తీసుకు వెళ్ళటానికి...” నిర్వేదంగా అంది మధుబాల.

“నీ యాబ్సెన్స్ లో బాబునలా ఎలా ఇచ్చేస్తారు మధూ? వాళ్లకి... ఆ నందినికి మాత్రం బుద్ధి ఉండక్కరలేదా?”

“అదంతా నా  దురదృష్టం ఐశూ... నా సంతకాన్ని ఫోర్జ్ చేసి నేను అతనితో బాబును పంపమన్నట్టు లెటర్ రాసిచ్చి తీసుకుపోయాడు. పాపం వాళ్ళు నాకు చెప్పటానికి ప్రయత్నించారు. కాని నా ఫోన్ పాడై... భగవంతుడా, నామీద కోపంతో వేణూ వాణ్ని ఏం చేస్తాడో?”
“ఏదీ, వేణూ ఫోన్ నెంబర్ ఇవ్వు... నా సెల్ లో లేదు... ఓ సారి మాట్లాడతాను...”

“ఉహు వద్దు ఐశూ...” విముఖంగా ముఖం తిప్పుకుంది మధుబాల.

“కాదులే, ఓ సారి మాట్లాడితే ఏమౌతుంది? ప్లీజ్... ఏదీ ఒక్క సారి... చెప్పు...”

బలవంతంగా నంబర్ చెప్పింది మధుబాల.

***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్