Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview with sunil

త్రివిక్ర‌మ్ చాలా ఇచ్చాడు... ఇంకేం అడ‌గ‌ను?! - సునీల్‌

చాలామంది క‌మెడియ‌న్లు హీరోల‌య్యారు.  కానీ.. వాళ్లంద‌రిలో సునీల్ స్పెష‌ల్‌. హీరో క్వాలిటీస్ పుణికి పుచ్చుకోవ‌డానికి... ఎన్నికష్టాలు ప‌డ్డాడో, ఇంకా ప‌డుతూనే ఉన్నాడు. ఆ క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ఎప్ప‌టి క‌ప్పుడు ద‌క్కుతూనే ఉంది. ఇప్పుడు సునీల్ కోస‌మే టికెట్లు తెగుతున్నాయి... క‌థ‌లు పుడుతున్నాయ్‌. మినిమం గ్యారెంటీ ఉన్న హీరోల్లో సునీల్ ఒక‌డు!  ఇంత క్రేజ్ క‌మెడియ‌న్ గా ఉన్న‌ప్పుడూ ఉంది. ఇన్ని డ‌బ్బులు అప్పుడూ సంపాదించాడు. కానీ... అంత‌కు మించిన కిక్‌.. ఇప్పుడు అనుభ‌విస్తున్నాడు. తాజాగా కృష్ణాష్ట‌మితో ప్రేక్ష‌కుల‌కు వినోదాలు పంచ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా సునీల్‌తో పిచ్చాపాటి. 

* మ‌రీ 'న‌ల్ల‌' పూసైపోయారు...
- మేక‌ప్‌కి దూరంగా ఉన్నా క‌దా.. (న‌వ్వుతూ) నిజం క‌ల‌ర్ బ‌య‌ట‌ప‌డిపోయిందేమో..?

* ఈ గ్యాప్ ఎందుకు?  ఫ్లాపులొచ్చాయ‌నా?  హిట్ కొడ‌దామ‌నా?
- భీమ‌వ‌రం బుల్లోడు బాగానే ఆడిందండీ. `యావ‌రేజ్ సినిమాకే ఇన్ని వ‌సూళ్లు వ‌చ్చాయంటే.. నీతో హిట్ సినిమా తీస్తే ఎంతొస్తాయ్‌?  సూప‌ర్ హిట్ సినిమా తీస్తే ఎంతొస్తాయ్‌?  బ్లాక్ బ్ల‌స్ట‌ర్ తీస్తే ఎంతొస్తాయ్‌` అని దిల్‌రాజు గారు న‌న్ను అడిగారు. మంచి క‌థ‌తో సినిమా తీసి, నీ రేంజ్ ఏంటో చూపిస్తా` అన్నారు. అలా.. కృష్ణాష్ట‌మి మొద‌లైంది. నిజానికి మ‌ధ్య‌లో కొన్ని క‌థ‌లు విన్నా. కొన్ని ప్రాజెక్టులు సెట్ అయ్యి, ఆగిపోయాయి. ఎప్పుడేం జ‌రుగుతుందో మ‌నం చెప్ప‌లేం క‌దా??   గ్యాప్ గ్యాపే... కానీ... ఈసారి ఇలా ఆలస్యం అవ్వ‌దు. ఈ యేడాది కృష్ణాష్ట‌మితో స‌హా మూడు సినిమాలు విడుద‌ల చేస్తా. దాంతో 2015లో నా నుంచి సినిమాలేద‌న్న బెంగ తీర్చుకొంటా.

* క‌థానాయ‌కుల‌కు గ్యాప్ వ‌స్తే.. క‌ష్టం క‌దా?
- నిజమే.. అలా అంటుంటారు. కానీ నా విష‌యంలో అదృష్ట‌మో ఏమో.. ఇప్ప‌టికీ జ‌నం గుర్తుంచుకొన్నారు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే క‌థ‌లే అందుకు సాక్ష్యం. అందులో చాలా రిజ‌క్ట్ చేశా. వీడికు క‌థ‌లు న‌చ్చ‌వురా బాబూ... అంటూ నిర్మాత‌లు తిట్టుకొంటూ వెళ్లిపోయేవారు.  అందాల రాముడు త‌ర‌వాత కూడా ఐదేళ్ల పాటు... హీరోగా యాక్ట్ చేయ‌లేదండీ. క‌మెడియ‌న్‌గానే న‌టించా. మర్యాద రామ‌న్న వ‌చ్చింది కాబ‌ట్టి చేశా. వ‌ర్మ‌గారితో సినిమా చేయాల‌న్న‌ది నా క‌ల‌. అందుకే... అప్ర‌ల్రాజులో న‌టించాను. అది ఫ్లాప్‌. ఓ ఫ్లాప్‌తో నా ప్ర‌యాణం ఆడ‌కూడ‌ద‌న్న క‌సితో..  పూల‌రంగ‌డు చేశా. ఆ త‌ర‌వాత క‌థ‌ మీకు తెలిసిందే.

* క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్పుడే హాయి క‌దా?  యేడాదికి 30 సినిమాల‌తో హ్య‌పీగా ఉండేవారేమో?
- అమ్మో.. అప్పుడుండే బాధ‌లు అప్ప‌డివండీ. పొద్దున్న ఏడింటికే సెట్‌కి వెళ్లిపోయేవాడ్ని. రాత్రెప్పుడో ఇంటికొచ్చేవాడ్ని. ఒకే రోజు రెండు షూటింగులంటే ఇంకా క‌ష్టం.  ఒక సినిమాలో నా సీన్ అయిపోయినా... ద‌ర్శ‌కుడు వ‌దిలేవాడు కాదు. అవ‌త‌ల నా గురించి ఇంకో పార్టీ వెయిటింగు. వ‌దిలి వెళ్లలేను.. అలాగ‌ని ఉండ‌లేను. చాలా టెన్ష‌న్ ప‌డేవాడ్ని. కుటుంబానికీ దూరంగా గ‌డిపా. ఇప్పుడు... ఆ బాధ లేదు. హాయిగా ఇల్లూ, కుటుంబం.. సినిమాలూ అంటూ కావ‌ల్సినంత టైమ్ ఉంది.

* క‌మెడియ‌న్ గానే ఎక్కువ సంపాదించారు క‌దా?
- అప్పుడు రిలైట్ వ్యాపారమండీ.. కొంచెం కొంచెం అంద‌రికీ అమ్ముకోవొచ్చు.. ఇప్పుడు హోల్ సేల్ గా ఒక‌రికే అమ్ముకోవాలి.. (న‌వ్వుతూ). అయినా డ‌బ్బుల గురించి ఎప్పుడూ ఆలోచించ‌లేదండీ. నాకు సినిమా ముఖ్యం.

* హీరో అయ్యాక మీ నుంచి కామెడీ త‌గ్గిపోయింద‌ని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు?
- క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్పుడు ఎన్ని వెకిలి వేషాలేసినా న‌డిచిపోయేదండీ. ఇప్పుడు హీరో కదా..?  అన్ని ఎగ‌స్ట్రాలు చేయ‌కూడ‌దు. అందుకే కామెడీ డోసు త‌గ్గిందేమో..

* మీరు హీరో అయిపోయాక సునీల్ స్థానం ఇంకా అలానే ఖాళీగా ఉంది అంటుంటారంతా..
- అదంతా నామీద అభిమానం కొద్దీ చెప్తున్న మాట‌లు. క‌మెడియ‌న్‌గానే కొన‌సాగితే రొటీన్ పాత్ర‌లు చూళ్లేక‌.. వీడు ఆపేస్తే బాగుణ్ణు అనుకొందురేమో. ఇప్పుడొస్తున్న కొత్త వాళ్లంతా బాగా న‌టిస్తున్నారండీ. ఎవ్వ‌రికీ పేరు పెట్టాల్సిన ప‌నిలేదు.

* క‌మెడియ‌న్ గా గుర్తింపుని ఎంజాయ్ చేశారా?  లేదంటే హీరోగానా?
- న‌టుడిగా. 

* దిల్‌రాజు బ్యాన‌ర్‌లో క‌మెడియ‌న్ గా చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు అదే బ్యాన‌ర్‌లో హీరో. ట్రీట్‌మెంట్లో తేడా ఏమైనా వ‌చ్చిందా?
- ఇది వ‌ర‌కు కూడా న‌న్ను ఆయ‌న హీరోగానే చూసేవారండీ. అయినా దిల్‌రాజు ఆఫీసులో అడుగుపెడితే రెస్‌పెక్ట్ కోసం ఎదురుచూడ‌ను. నేనే ఈ ఆఫీసు వాళ్ల‌కిస్తా!  అది నా బాధ్య‌త‌. ఏ ఆఫీసుకెళ్లినా.. `టీ ప‌ట్రా..` అని ఆర్డ‌రేయొచ్చు. ఇక్క‌డ మాత్రం `ఒరేయ్‌.. ఆయ‌న‌కు టీ ఇవ్వండ్రా..` అని పుర‌మాయిస్తా. అంత చ‌నువుందిక్క‌డ‌.

* బ‌న్నీ చేయాల్సిన సినిమా ఇదంటున్నారు. మ‌రి మీ శైలికీ బ‌న్నీ స్టైల్‌కీ చాలా తేడా ఉంది క‌దా?
- నాకు త‌గిన మార్పులు చేశాకే.. క‌థ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌డీ. నా స్టైల్‌కి తగ్గ‌ట్టే ఉంటుంది. అయితే.. నా పాత్ర మాత్రం కూల్‌గా సాగుతుంది. ఎమోష‌న‌ల్ డ్రామా ఈ సినిమా. ఇంత భారీ సినిమా మ‌ళ్లీ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. అంత రిచ్ గా ఉంటుంది.

* ద‌ర్శ‌కుడి విష‌యంలో మీరు మితిమీరిన జోక్యం చేసుకొంటార‌ట‌.. నిజ‌మేనా?
-  నా సినిమా బాగా రావాల‌న్న క‌సితో ప‌నిచేస్తా. ఈరోజు ఓ సీన్ చేశాన‌నుకోండి.. నాకు తెలిసిన ద‌ర్శ‌కుల‌తో డిస్క‌ర్స్ చేస్తా. దాంతో... బెట‌ర్ అవుట్ పుట్స్ బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఏం చేయ‌కూడ‌దో, ఏం చేస్తే బాగుంటుందో తెలుస్తుంది. దాన్నే ద‌ర్శ‌కుడితో పంచుకొంటా. దాన్ని జోక్యం అనుకొంటే ఎలా?  సినిమా హిట్ట‌యితే అంద‌రికీ పేరొస్తుంది క‌దా?

*  మీ ఫ్రెండ్ త్రివిక్ర‌మ్‌తో సినిమా ఎప్పుడు?
- ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడుతున్నాడండీ. నేను.. లీగ్ ద‌శ‌లో ఉన్నా.. ఖాళీ దొరికితే త‌ప్ప‌కుండా చేస్తాం.

* మీరే అడిగేయొచ్చుగా?
- ఇప్ప‌టికే చాలా ఇచ్చాడండీ. నేనూ ఫుల్లుగా వాడేసుకొన్నా. నా కోసం ఎన్ని పాత్ర‌లు సృష్టించాడు?  అస‌లు ఈ బాడీ లాంగ్వేజీ ఇచ్చిందేవ ఆడు క‌దా?  మ‌రీ ఎక్కువ లాగేయ‌కూడ‌దు. నిజంగానే నాకు త‌న‌తో సినిమా చేయాల‌ని బ‌లంగా అనిపిస్తే.. వెంట‌నే అడిగేస్తా. త‌నూ కాద‌న‌డు. 

* త్రివిక్ర‌మ్ సృష్టించిన పాత్ర‌ల్లో మీకు బాగా న‌చ్చిందేది?
- మ‌న్మ‌థుడులో బంకు శీను క్యారెక్ట‌ర్ అంటే బాగా ఇష్టం. ఒకే మ‌నిషిలో రెండు కోణాలు.. ఒకేసారి చూపించే అవ‌కాశం చాలా అరుదుగా దొరుకుతుంది. అందులో నేనుండేది నాలుగు సీన్ల‌లోనే. కానీ.. భ‌లే పేలింది. అదేంట్రా... ఇంకొన్ని ఎక్కువ రాయొచ్చుగా...? అని అడిగా. `అరేయ్‌.. కూర బాగున్న‌ప్పుడే ఆపేయాలి.. న‌చ్చింది క‌దా? అని దాని మీద బోర్ కొట్టేంత వ‌ర‌కూ తిన‌కూడ‌దు` అన్నాడు. 

* కృష్ణాష్ట‌మి త‌ర‌వాత‌?
- వంశీకృష్ణ ఆకెళ్ల సినిమా స‌గం పూర్త‌య్యింది. ఈ యేడాదే విడుద‌ల చేస్తాం.

* ఓకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ..

మరిన్ని సినిమా కబుర్లు
krishnashtami movie review