Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue149/421/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

ఓసారి చుట్టూ అవలోకించాడు.

ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. వారిలో కొందరు యధాలాపంగా తనను చూస్తున్నారు, వాళ్ళుకాదు. ఇంకెవరో... ఎవరది? తలతిప్పి కోనేటి వంక చూసాడు. అంతే`

కొద్దిక్షణాలు గుండె కొట్టుకోవటం ఆగి పోయిందనిపించింది. ఊపిరి తీసుకోవటం మర్చిపోయాడు. దిగువన`

నీటి వంచ నుండి పైకి మూడో మెట్టు మీద నిలబడుందామె. నిండా రెండు పదుల వయసు కూడ వుండని లేబ్రాయపు ముగ్ధ. అసాధారణ రూప లావణ్యవతి. విప్పారిన సోగ కళ్ళతో తన వంకే నిశితంగా చూస్తోంది. ఆమె ముఖారవిందంలో ఇదీ అని తెలియని ఆశ్చర్యం తొంగి చూస్తోంది. అప్పటికే ఆమె స్నానం ముగించి దుస్తులు మార్చుకున్నట్టుంది. రంగు రంగుల హరివిల్లు లాంటి దుస్తుల్లో చంద్ర వంకలా మెరిసి పోతుంది. ఆమెకు రెండు మెట్లు దిగువన ఒక బామ్మ వుంది. ఆమె తడి దుస్తుల్ని నీటిలో పిండుతోంది. వాళ్ళిద్దరే వచ్చినట్టున్నారు. ఇంకెవరూ లేరు పక్కన. అది కూడ కాదు`

తను ఆమెను చూసాడు. ఇంతకు ముందు ఎక్కడో చూసాడు. కాని ఎక్కడో ఎప్పుడో గుర్తు రావటం లేదు. కాని ఆ ముఖం... అవును. ఆ ముఖ వర్ఛస్సు చూస్తుంటే మిత్రుడు అపర్ణుడు గుర్తుకొస్తున్నాడు. ఈమె అపర్ణుడి సోదరి కాదు గదా!

ధనుంజయుడు ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే ఆమె ముఖం తిప్పుకుని తన బామ్మతో ఏదో చెప్పి బయుదేరింది. చక చకా మెట్లెక్కి పైకి వస్తూ ఓర కంట ధనుంజయుని గమనిస్తూనే వుంది. పెదవుల మీద చిరు నవ్వు, బుగ్గల్లో సిగ్గు దాచుకొంటూ అతడి సమీపం నుంచే పైకి వచ్చి బిరబిరా ఆలయం వైపు వెళ్ళి పోసాగింది. అంత వరకూ ధనుంజయునే గమనిస్తున్న సేవకుడు ఉండ బట్టలేక`

‘‘వాళ్ళనంతగా చూస్తున్నారు. ఏమైనది ప్రభూ?’’ అనడిగాడు.

‘‘ఏమిరా. వాళ్ళు నీకు తెలుసునా?’’ వెళ్తున్న ఆ అందాల రాశినే చూస్తూ అడిగాడు ధనుంజయుడు.

‘‘తెలుసు ప్రభు. ఆ బామ్మ పేరు నీలవేణి. ఇక్కడే నివశిస్తున్నది. చాలాకాలంగా ఉంటున్నది. వన మూలికలు కొనటం విక్రయించటం ద్వారా బాగానే సంపాదిస్తున్నది. ఆ వెళ్తున్న అమ్మాయి పేరు భద్రాదేవి.’’

‘‘భద్రాదేవి?’’

‘‘అవును ప్రభూ. భద్రాదేవి ఇక్కడివారందరికీ తెలుసును.’’

‘‘ఆ యువతికి అన్నదమ్ములు ఎవరన్నా వుంటిరా?’’

‘‘నాకు తెలిసి ఎవరూ లేరు ప్రభు. ఈ అమ్మాయి కూడ ఇక్కడ వుండదు. చంపాపురం దగ్గరలో ఏదో వూరట. అక్కడ తన పిన్నమ్మ వద్ద వుంటుందని వింటిని. అప్పుడప్పుడూ యిలా బామ్మ నీలవేణిని చూచుటకు వచ్చి పోతూ వుంటుంది.’’

సేవకుడి మాటలు ఒకింత ఆలోచనలో పడేసాయి యువరాజు ధనుంజయుడ్ని. కళ్ళ ముందు అపర్ణుడు మెదలుతున్నాడు. ఇప్పుడే గాంచిన భద్రాదేవి మెదలుతోంది. అపర్ణుడిలో బాలిక లక్షణాలు గమనించి తను పరిహసించినాడు కూడ. కాని పోలికల్లో సామ్యమున్న ఒకరే అనుకోడానికి పొంతన కుదరకున్నది. ఇరువురూ ఒకరేనా లేక వేరు వేరా... ఈ యువతి అపర్ణుడే అయితే తనను చూచి కూడ చూడనటు వెళ్ళగలడా? అయిననూ రక్త సంబంధం లేని ఇరువురు యువతీ యువకులందు ఒకే పోలికలుండుట సాధ్యమా... ఏమో... ధనుంజయుని మనసంతా గందరగోళమై పోయింది. చివరకు తన సందేహాలను బలవంతాన పక్కకు తోసి ఒక సారి స్వామి ఆలయ గోపురాన్ని వీక్షించాడు.
‘‘హే ప్రభూ భీమ శంకరా. ఏమిటి స్వామీ నాకీ పరీక్ష. నా చంచల చిత్తమున నా అధీన మందుంచుకొను శక్తిని ప్రసాదించు. దీక్షా బద్ధుడనై దివ్య నాగమణి కోసం నాగ లోకమునకు బయలు దేరిన నాకు మార్గము చూపి విజయాన్ని అనుగ్రహింపుము.’’ అంటూ మనసు లోనే వేడుకున్నాడు.

ఒక సారి వెళ్ళి బామ్మతో మాట్లాడమని మనసు ఒత్తిడి చేసింది. అయినా కూడ` అనవసరమగు వ్యవహారమని వెళ్ళలేదు. ఈలోపల చూస్తుండగానే బామ్మ గారు కూడ పిండిన తడి దుస్తుల్ని భుజాన వేసుకుని మెట్లెక్కి తన దారిన వెళ్ళి పోయింది.
ఇక ఆలస్యం చేయలేదు ధనుంజయుడు.

చక చకా మెట్లు దిగాడు.

కొనేటి లోకి దూకి మూడు మునకలు వేసి తలార స్నానమాచరించాడు. మెట్ల పైకి వచ్చి పొడి దుస్తులు ధరించి తడి దుస్తుల్ని పిండి సేవకుడి చేతికి అందించి, విడిది గృహానికి పంపించేసాడు. తను స్వామి దర్శనానికి బయలుదేరాడు.

సగం ముఖానికి అడ్డంగా తెల్లటి వస్త్ర భాగం చుట్టు కోవటం, వెంట పరివారం లేక పోవటంతో స్థానికులెవరూ అతన్ని యువరాజుగా గుర్తించ లేదు. ఒక అంగడిలో పూలు, పండ్లు, టెంకాయి, పూజ ద్రవ్యాలతో కూడిన చిన్న బుట్ట తీసుకుని ఆలయంలోకి బయలుదేరాడు. అతడు గోపురం వైపు నడిచి పోతూండగా ఆరుజతల కళ్ళు తననే నిశితంగా పరిశీలిస్తున్న సంగతి ధనుంజయునికి తెలీదు.

గోపుర ద్వారం దాట గానే ఏటవాలుగా దిగువకు రాతి మెట్ల వరుస వుంది. వంద మెట్లు దిగితే గాని గర్భాలయ ప్రాంగణం లోకి అడుగు పెట్ట లేరు. చెదురు మదురుగా భక్తు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు. నాలుగు మెట్లు దిగాడో లేదో` అంతే`
మరొక్క మారు విభ్రాంతికి గురయ్యాడు యువరాజు ధనుంజయుడు. అప్పటికే స్వామిని దర్శించి వెను తిరిగినట్టుంది అందాల భరిణి భద్రాదేవి. లేడిపిల్లలా చెంగు చెంగున మెట్ల మీద దూకుతూ ఎదురుగా వస్తూ కన్పించింది. కొద్ది సేపు మైమరచి పోయి అలా చూస్తుండి పోయాడు. పరిమళ భరితమగు వసంతపు సుడిగాలి ఒకటి తనను చుట్టేసి పోతున్నట్టనిపించింది. ఈసారి కూడ అతన్ని చూసీ చూడనట్టే చకచకా మెట్లెక్కి గోపుర ద్వారం దాటి క్షణంలో కనుమరుగైందామె.

ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కాసేపు అక్కడే ఆగి పోయాడు. భద్రా దేవి సౌందర్యం కన్నా ఆమెలో కన్పిస్తున్న అపర్ణుడి పోలికలే యువరాజుని చిత్త భ్రమకు గురి చేసి ఆశ్చర్య చకితుడ్ని చేస్తున్నాయి. అంత లోనే మనసును దృఢ పర్చుకుంటూ ఆ దివ్య సుందర రూపాన్ని మనసు నుంచి చెరిపేసాడు. తాత్కలికంగా ఆమెను మర్చిపోతూ, చిత్తమును భీమశంకరుని మీద లగ్నం చేసి తిరిగి మెట్లు దిగడం ఆరంభించాడు.
‘‘హర హర మహాదేవ ` శంభో శంకర’’ అంటూ భక్తు నినాదాలు ఆలయ గంటల జయఘోష తనువును మనసును పనుకింజేస్తున్నాయి. భక్తి భావాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఆలయ ప్రధాన అర్చక స్వామి పేరు శివ దాసు.

ఎందుకో ఆయన బయటకు వస్తూ మండపం వద్ద ఎదురయ్యాడు. వృద్ధుడైనప్పటికీ చూడగానే యువరాజు ధనుంజయుని గుర్తు పట్టేసాడు. వెంట రాచ పరివారం లేదు. ఆర్భాటం లేదు. ఒక సాధారణ భక్తుడిలా నడుచుకుంటూ వస్తున్న ధనుంజయుని గాంచి విస్తు పోయాడు. ధనుంజయుడు క్లుప్తంగా తను వచ్చిన పని చెప్పాడు. వెంటనే అతడి చేతిలోని పూలు, పండ్ల బుట్టను తను అందుకొని అతన్ని వెంట బెట్టుకొని గర్భ గుడి లోకి వెను తిరిగాడాయన.

పిమ్మట చకచకా ఆలయంలో పరిస్థితి మారి పోయింది. యువరాజు వేంచేసిన విషయం చెప్పకుండానే భక్తుల్ని గర్భ గుడి నుండి బయటికి పంపించేసారు ఆలయ సిబ్బంది. అర్ధ జాము వరకు దర్శనం నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. ధనుంజయుని భీమ శంకర స్వామి ఎదురుగా కూచుండ జేసి ప్రత్యేక పూజలు ఆరంభించారు పూజారులు. ప్రభువు ధర్మ తేజుని ఆరోగ్యం కొరకు, ధనుంజయుని విజయం కొరకు స్వామికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.

భీమ శంకరుని సన్నిధిలో జ్యోతిర్లింగాన్ని దర్శిస్తూ అలౌకికానందంలో అలాగే ఎదురుగా కూచున్నాడు ధనుంజయుడు. దరహాసంతో స్వామి తనను ఆశీర్వదిస్తున్నట్టుంది. భక్తితో స్వామికి ప్రణమిల్లాడు. ఆవిధంగా భీమ శంకరుని ఆశీస్సులు తీసుకుని ధనుంజయుడు బయటికి నడిచాకే తిరిగి భక్తుల్ని దైవ దర్శనానికి అనుమతించారు.

తనను తోసుకు వెళ్తున్న భక్తుల్ని కూడ పట్టించు కోకుండా మండపం దాటి మెట్ల మార్గంలో పైకి వచ్చేసాడు యువరాజు ధనుంజయుడు. గోపుర ద్వారం దాటాడు. ప్రభాకరుని మరి కొన్ని నల్ల మబ్బులు చేరి తమలో దాచేసు కోవటంతో ఆ రోజు ఎండ తెలీటం లేదు. కాని ఇప్పుడిప్పుడే గాలి వేడెక్కుతోంది.

గోపుర ద్వారం దాటి ఇలా బయటికి వచ్చాడో లేదో అలా మరో సంఘటన ధనుంజయుని ఉక్కిరి బిక్కిరి చేసి ఆశ్చర్య సంభ్రమాల్లో ముంచెత్తింది. ఎంత మాత్రం వూహించని సంఘటన. ఎదురుగా మిత్రుడు అపర్ణుడు వస్తూ కన్పించటమే అందుక్కారణం. కాళ్ళకు బంధం వేసినట్టు ఉన్న చోటే నిలబడిపోయాడు.

అంతలో సమీపం లోకి వచ్చిన అపర్ణుడు ధనుంజయుని చూసి గుర్తించి విస్మయం చెందుతూ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. వూహించని విధంగా అపర్ణుడి రాకతో ఇప్పుడు తను గాంచిన భద్రా దేవి పోలికల్ని అపర్ణుడిలో వెదు క్కోవలసి వచ్చింది. అందుకే చెంత కొచ్చిన అపర్ణుడిని పలకరించ లేదు. అచ్చు గుద్దినట్టున్న ఇరువురి పోలికలు. ఎంతగా ఆశ్చర్యమంటే తన సగం ముఖాన్ని కప్పి వుంచిన వస్త్ర భాగం జారి పోవటం కూడ ధనుంజయుడు గమనించ లేదు.

‘‘ప్రభూ! మీరేమిటి ఇచట నున్నారు? ఎప్పుడు వచ్చినారు? మీరు మాళవ రాజ్యం వైపు పోలేదా?’’ తనూ ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాడు అపర్ణుడు.

‘‘అదో పెద్ద గాథ. పిమ్మట తెలిపెదను గాని. నీవేమి యిక్కడ వుంటివి. ఎప్పుడు వచ్చినావు? చంపా పురం పోలేదా? ఎలా వున్నావు?’’ అంటూ ఆదరంగా చేయి అందుకున్నాడు. ఆ చేయి మృదువుగా కుసుమకోమల సదృశంగా వుంది. వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాడు అపర్ణుడు.

‘‘చూస్తున్నారుగా ప్రభూ! నేను కుశలము గానే వుంటిని. చంపాపురం నుండి ఇటకు మూడు దినముల క్రితమే వచ్చినాను. కాని మీరు భీమ శంకరము వచ్చుట కడు ఆశ్చర్య జనకము. నమ్మలేకున్నాను.’’

‘‘ఆ దినమే చెప్పినావుగా. మన స్నేహములో బలమున్నచో తిరిగి కలుసుకొనెదమని. బలమున్నది మిత్రమా. అందుకే కలిసితిమి. నిను జూడ చాలా ఆనందముగనున్నది. నిన్న రాత్రి ఇచటికి వచ్చి విడిది గృహమున బస చేసితి. అన్నిటికి మించి ఇచట గొప్ప విచిత్రమును జూచినాను.’’

‘‘విచిత్రమా...?’’

‘‘అవును విచిత్రమే! ఎవరో భద్రా దేవియట. అన్ని విధములా నీ పోలికన నీ సోదరి వలె యున్నది....’’

‘‘ఏదీ... ఆ నీలవేణి బామ్మ గారి మనుమరాలా... తెలుసులే’’ 

‘‘తెలుసునా?’’

‘‘అవును ప్రభూ! తరచు స్వామి దర్శనార్థం వచ్చిపోతూంటాను గదా. అందుకే ఇచట చాలా మంది మీ యిద్దరూ కవల పిల్లలాయని నను అడుగుతుంటారు. నిజమునకు ఆమెకు నాకు ఏ సంబంధమును లేదు...’’

‘‘నిజము గనే లేదా?’’

‘‘లేదంటిని గదా....’’

ఏదో చెప్పబోతూ మధ్యలోనే ఆగి పోయాడు అపర్ణుడు. కనుకొసల ఏదో కదలిక . అదిరి పడి` ‘‘ప్రభూ!’’ అంటూ చట్టున ధనుంజయుని కరము పట్టి పక్కకు లాగాడు. అలా లాగడమే ఆ క్షణమున యువరాజు ప్రాణముకు శ్రీరామ రక్ష అయింది. అతని గుండెల్లో నాటుకోవలసిన పిడి బాకు ఒకటి గాలిని చీల్చుకొంటూ తుమ్మెదలా ఝుంకారం చేస్తూ సూటిగా దూసుకెళ్ళి గోపురం చెక్క తలుపునకు నాటుకొంది.
ధనుంజయుని తృటిలో ప్రాణాపాయం నుండి రక్షించడంతో ఆగ లేదు అపర్ణుడు. మరు క్షణమే అతడి చేతి నుండి వెలువడిన పిడి బాకు రివ్వున దూసు కెళ్ళి హత్యా ప్రయత్నానికి కారకుడైన వాడి గుండెల్లో పిడి వరకు దిగబడింది.

తప్పించుకునే అవకాశం లేక పోయింది వాడికి. కెవ్వున అరిచాడు. అపర్ణుడినే ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నేలకు ఒరిగి పోయాడు. చూస్తుండగానే ఎగిరి పోయాయి వాడి ప్రాణాలు. వేడి రుధిరం వాడి ఛాతీ నుండి వరదలా పొంగింది. ధనుంజయుడికి ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. అతడి చేయి అప్రయత్నంగా తన ఖడ్గం పిడి మీద పడింది. కాని ఖడ్గం ఒర నుంచి తీయాల్సిన అవసరం లేక పోయింది. ఎందు కంటే పిడి బాకు విసిరి ఒకడ్ని నేల కూర్చిన క్షణం లోనే అపర్ణుడు తన ఖడ్గం దూసి చిరుత గండులా ప్రత్యర్థు పైకి దూసుకు పోయాడు.

గోపురం నుండి ఇరవై ధనువుల దూరంలో ఒక చెట్టు క్రింద నిలబడున్నారు వాళ్ళంతా. మొత్తం అయిదుగురు. చూడ్డానికి కాషాయ దుస్తుల్లో సాధు సన్యాసుల్లా వున్నారు. వాళ్ళలో ఒకడు నేలకూలగా ఇంకా నలుగురున్నారు.

వాళ్ళందరికీ వూహించని పరిస్థితి యిది. తప్పించుకోడానికో, పారి పోడానికో అవకాశం లేదు. యువ రాజు కత్తి దూసి కదన రంగంలోకి దూకితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ బాలకుడు ఎవడో సమయానికి పానకంలో పుడకలా అడ్డు పడకుంటే ఈపాటికి యువరాజు నేలకూలి వుండేవాడు. క్షణకాలం ఏం చేయాలో తోచ లేదు వాళ్ళకి. సుడి గాలిలా వచ్చి పడుతున్న అపర్ణుడిని చూస్తూ తమ కాషాయ దుస్తుల మాటు నుండి ఖడ్గాలను బయటకు తీసి పోరుకు సిద్ధమయ్యారు.

ఈలోపల గోపురం ఆవరణలో చావు కేక విని పరిసరాల్లోని భక్తులంతా ఒక్క సారిగా ఉలికిపడ్డారు. ‘‘యువరాజా వారు... యువరాజా వారు’’ అంటూ గుసగుసలు చెల రేగాయి. ముఖానికి ఆచ్ఛాదన తొలగటంతో అతడ్ని అక్కడ పౌరులు చాలా మంది గుర్తు పట్టేసారు. ఏం జరుగుతోందో తెలీక అయోమయంగా దూరంగా నిలబడి చూస్తున్నారు.

‘‘రేయ్‌ ద్రోహుల్లారా’’ అనరిచాడు సాధువుల్ని సమీపిస్తూనే అపర్ణుడు.

‘‘యువరాజా వారిని ఎదిరించు ధైర్యము లేక ఆదాటుగా దొంగ దెబ్బ తీయాలని చూస్తార్రా? లొంగి పొండు... వెంటనే లొంగి పోకున్న మీకు వీడి గతే పడుతుంది’’ అంటూ ఆవేశంగా హెచ్చరించాడు.

‘‘ఒరే కుర్ర కుంకా. మేం లొంగి పోయిననూ చచ్చెదము. లొంగ కున్నను చచ్చెదము. యువ రాజు ఎలాగూ మమ్మల్ని క్షమింపడు’’ కత్తి ఝుళిపిస్తూ అరిచాడొకడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bandham