Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

atulita bandham

   గతసంచికలో ఏం జరిగిందంటే. http://www.gotelugu.com/issue149/423/telugu-serials/atulitabandham/atulita-bandham/

“అమ్మా, బాబును చూసావా, ఎంత ముద్దుగా ఉన్నాడో...” ఊయలలో పడుకుని నిద్రిస్తున్న, ఆరు నెలల వయసున్న బాబు ముఖంలోకి మురిపెంగా చూస్తూ అన్నాడు, వేణు.

“అవునురా... వాడివన్నీ మీ నాన్నగారి పోలికలే... నవ్వినప్పుడు ఆ బుగ్గల మీద సొట్టలు చూడు!” తానూ మురిసిపోయింది సుగుణమ్మ.

 “ఇవిగోమ్మా, నేపీలు పట్టుకు వచ్చాను. ఇది బేబీ సోప్, ఆయిల్... ఇది పౌడరు. ఇదిగో బేబీ టవల్... ఈ పాకెట్ లో కాటన్ జుబ్బాలూ, డ్రాయర్లూ ఉన్నాయి. ఇంకేమైనా కావాలా?” తన చేతిలోని సంచీలోంచి వస్తువులన్నీ బల్లమీద పేర్చుతూ అన్నాడు, వేణు.

“ఇంకేం అక్కర్లేదురా... దిష్టి తగలకుండా పెట్టటానికి నల్ల తిలకం కావాలి. ఆ చిలాయ్  నేను బియ్యం వేయించి తయారు చేస్తానులే...” 

“రేపు అక్కయ్యా, వినతా వస్తానని అన్నారమ్మా వీడిని చూడటానికి...”

“ఊ... పుట్టిన తర్వాత ఇదే కదా చూడటం... రానీ... మేనల్లుడిని కళ్ళారా చూసుకుంటారు...”

“ఇక ఫర్వాలేదమ్మా... వీడిని తీసుకు వచ్చేసాను కదా... దూడ వెనుక ఆవూ దిగుతుంది చూడు...” కసిగా అన్నాడు, వేణు.
కాసేపు మౌనంగా ఉండిపోయింది సుగుణమ్మ.

రెండు నిమిషాల తర్వాత, మెల్లగా అంది,      “ఏమోరా బాబూ, నువ్వు తప్పు చేసావని అనిపిస్తోంది నాకు... తల్లినీ బిడ్డనూ విడదీయటం పాపం...”

“ఆవిడకి అలాగే బుద్ధి చెప్పాల్లేమ్మా నీకు తెలియదు... బయట నా పరువు తీసింది. అయినా నా కొడుకు నా దగ్గర ఉండక ఇంకెక్కడ ఉంటాడు?” గర్వంగా అన్నాడు.        “తనకీ కొడుకే కదరా... ఇప్పటికీ నువ్వు ఇంటికి రావటం లేటైతే నాకు కంగారుగా ఉంటుంది. అలాంటిది పసిగుడ్డును వదిలి తల్లి ఉండగలదా? తల్లడిల్లి పోదూ?”

 తల్లి వైపు అదోలా చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు, వేణూ.‘నేనే తప్పు చేసేనేమో...’ దీర్ఘంగా నిట్టూర్చి, పిల్లాడికి పాలు కలిపి, పాలసీసాలో పోయసాగింది, సుగుణమ్మ.

**

మర్నాడు సాయంత్రం -

“ఎందుకే అంతలా కుమిలిపోతావు? ఊరుకో...” దిండులో ముఖం దూర్చి విలపిస్తున్న మధుబాల భుజం తడుతూ అన్నది ఐశ్వర్య.     ఆమె దగ్గరనుంచి స్వల్పంగా వస్తున్న వాసనకు ముఖం చిట్లించి, “ఏంటి ఐశూ ఇది?” అంది బాధగా మధుబాల.

 “యా... అయామ్  సారీ... చాలా బాధ కలిగింది,  అందుకే కొద్దిగా తాగాను... ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మీ...” దూరంగా వెళ్లి బెడ్ మీద పడుకుంది,  ఐశ్వర్య.

 తానే లేచి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి, ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది, మధుబాల.

“ఏమైంది?” అంది అనునయంగా...

 “నీకూ తెలుసుగా, సరిగ్గా ఎనిమిది నెలలు అయింది కార్తీక్ నన్ను విడిచి వెళ్లి... మళ్ళీ,  ఈరోజు కనిపించాడు నాకు... అమీర్ పేట చౌరస్తా దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసాను. అతని కారు, నా స్కూటరూ  పక్క పక్కనే ఆగాయి. నన్ను చూడలేదు. పక్కనే ఎవరో అమ్మాయి ఉంది. ఆమెతోనే ఉంటున్నాడనుకుంటాను... ఎవరో చెప్పారు ఆ మధ్య... చాలా బాధగా ఉంది మధూ...బాబీని ఆడిస్తూ...కాస్తో కూస్తో నా మనసును మరల్చుకునే దాన్ని. వాణ్ణి నీ మొగుడు ఎత్తుకుపోయాడు... నీకూ హింసే... నాకూ హింసే... ఈ ఆడజాతికి టోటల్ గా జన్మంతా శిక్షేనా?” రెండు చేతుల్లో ముఖం కప్పుకుని నిశ్సబ్దంగా కన్నీరు కార్చింది ఐశ్వర్య...

 “ఛీ... ఇదేమిటే... నా ఐశూ కంట తడి పెట్టటమా? నో.. నెవర్! రాత్రే కదా మన బాబీ గాడిని ఎలా అయినా తెచ్చేసుకుందామని నాకు ధైర్యం చెప్పావు? ప్లీజ్... ఊరుకో...”

“ఏవి నేస్తం, ఆనాటి మధురమైన రోజులు? ఏవి నేస్తం, ఆనాటి దూసుకుపోయే రెక్కలు? ఏది నేస్తం, చుక్కల లోకంలోకి ఎగిరిపోయే ఆ ఉత్సాహం, ఉల్లాసం?”

“అవును...అయిపోయిన  గతమెప్పుడూ మంచిదే... గడుస్తున్న వర్తమానమే... వట్టి వ్యర్థకాలం అనిపిస్తూ ఉంటుంది...” మధూ కనుల ముందు ఏవేవో దృశ్యాలు...

***

“ఏయ్ మధూ...ఇవ్వాళ  ఆదివారమే కదే, కాసేపయినా నన్ను  పడుకోనీకుండా ఆ స్తోత్రాలు పెట్టి నా నిద్ర చెడగొట్టకపోతే, నువ్వూ పడుకోకూడదూ కాసేపు?” నిద్ర లేచి కూర్చుని, చిరాకు పడింది ఐశ్వర్య.

“ష్!” మందలింపుగా చూసి, టేప్ లో వస్తున్న విష్ణు సహస్రనామం పుస్తకంలో చూసి  చదువుతూ వినసాగింది, మధుబాల.

భుజాలు ఎగురవేసి, టవల్ తీసుకొని బాత్ రూమ్ వైపు నడిచింది ఐశ్వర్య  ఫ్రెష్ అవటానికి. పది నిముషాల్లో స్నానం కూడా ముగించి వచ్చి, మధూ ఎదురుగా మంచం మీద మఠం వేసుకుని కూర్చుంది. అప్పటికి స్తోత్రం మొత్తం పూర్తి అయింది.

“ఊ, ఇంతకూ ఈరోజు మన మెస్ లో ఏం టిఫినో... ఆకలేస్తోంది బాగా...” పొట్ట తడుముకుంది ఐశ్వర్య...

“రా మరి, కిందికి వెళ్లి తిని వద్దాం... ఆదివారం కదా, ఏ పూరీకూరనో, ఏ పెసరట్ ఉప్మానో చేసి ఉంటాడు భీముడు...” నవ్వింది మధుబాల.

“ఊ, వెళదాం కానీ, నీ ప్రోగ్రాం ఏమిటో చెప్పు ఈ రోజు!” ఆరాటంగా అడిగింది, ఐశ్వర్య...

“ఏముంది? టిఫిన్ తినేసి, బట్టలు ఉతుక్కోవాలి... ఆ పని అయ్యాక లంచ్... తర్వాత కాసేపు రిలాక్సింగ్ గా పాటలు విని, కింద టీవీలో ఏదైనా మంచి మూవీ వస్తే చూసి, ఆ తర్వాత చదువుకోవాలి. రేపు పరీక్ష ఉంది కదా మనకి!”

 “అబ్బా, ఆదివారం కూడా ఇంత  సుత్తి ప్రోగ్రామా? అలంకార్ లో మంచి ఇంగ్లీష్ మూవీ వచ్చింది, ఫస్ట్ షో కి పోదామే...”

“నిన్న వెళ్లావు కదే ఆ మూడో నంబర్ రూమ్ మాగీ తో... చాలలేదా?” చిన్నగా కసిరింది మధు.

 “అది నిన్న, ఇది ఈరోజు...పైగా అది హిందీ సినిమా... ఈ సినిమా నీతో చూడాలని అనుకున్నానే...”

 “అయితే వచ్చే వారం వెళదాం లే... మరి పద... బ్రేక్ ఫాస్ట్ చేసి వద్దాం!” ఇద్దరూ మెట్లు దిగి డైనింగ్ హాల్లోకి వచ్చారు.

అప్పటికే ఆ హాస్టల్లోని అమ్మాయిలంతా కుర్చీల్లో కూర్చుని టిఫిన్ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

“హాయ్ జంట కవులూ, గుడ్మార్నింగ్...” అంటూ పలకరించారు.వాళ్ళని నవ్వుతూ విష్ చేసి,  ఐశ్వర్య, మధూ కూర్చోగానే, భీముడి భార్య భాగ్యం ప్లేట్స్ పెట్టి, లోపలినుంచి వేడి వేడిగా పెసరట్, ఉప్మా పట్టుకు వచ్చి వడ్డించింది. చట్నీ చిన్న గిన్నెల్లో వేసి అందించింది.

“భాగ్యం, నాకింకో పెసరట్ కావాలి... ముందే చెబుతున్నా...” నవ్వుతూ చెప్పి ప్లేటు ముందుకు లాక్కుంది ఐశ్వర్య...

“మూడు ముక్కల పెసరట్... అదిరింది...” ఘుమఘుమలాడిపోతున్న పెసరట్ ను త్రుంచి, అల్లం చట్నీ తో తింటూ అన్నది మధుబాల.  “అవును, మూడు ముక్కల పెసరట్ అని ఎందుకంటారు మధూ?”

“ఉల్లి పాయ, పచ్చి మిర్చి, అల్లం- ఈ మూడు రకాల ముక్కల్నీ  సన్నగా తరిగి, ఇలా పెసరట్ మీద అద్ది, వేస్తారు కదా, అందుకని...”     “అవునా, పెసరట్టు  మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడూ చేయదు...” దిగులుగా అంది ఐశ్వర్య...

“ఏం? ఎందుకని?”

“మాది రైతు కుటుంబం కదా... ఇలాంటి టిఫిన్లు అలవాటులేదు. రాగి సంగటి, జొన్న రొట్టె, ఎప్పుడైనా గోధుమ చపాతీలు! ఇదే మాకు బ్రేక్ ఫాస్ట్... అందుకే నాకు ఇలాంటి టిఫిన్స్ అంటే చాలా ఇష్టం మధూ...” అమాయకంగా చెప్పింది ఐశ్వర్య.

“మరి నీకూ తెలుసుకదే, మీ ఇంటి పరిస్థితి, ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నారు మీ నాన్నగారు. నెలతిరిగే సరికి నీకు డబ్బు పంపటానికి ఎంత ఇబ్బంది పడతారో కూడా  నువ్వే చెప్పావు... మరి... నీ సరదాల కోసం నువ్విలా డబ్బు తగలేస్తే ఎలా చెప్పు?”

“నా సరదాల కోసం నేను నా అవసరాలు కొన్ని త్యాగం చేస్తాను తెలుసా? ఉదాహరణకు వీకెండ్ కి మూవీకి వెళ్ళాలి అంటే, మన మెస్ లో తప్ప మరెక్కడా ఎంత అవసరమైనా తినను.  గైడ్స్ కొనుక్కోకుండా నోట్స్ రాసుకుని చదువుతాను. మధ్య మధ్యలో పండక్కి బట్టలు కొనుక్కోమని నాన్న డబ్బులిచ్చినా వాటిని వాడకుండా జాగ్రత్త గా దాచుకుంటాను.  సాయంత్రాలు ఇంకేదైనా చేయాలని, పార్ట్ టైం జాబ్ లా అన్న మాట... డబ్బు సంపాదించాలని ఉంటుంది... కాని, ప్రస్తుతం డిగ్రీ మంచి మార్కులతో పాసవందే మనకి జాబ్ రాదు... అందుకని చదువే మన ప్రథమ కర్తవ్యం!”

 “అవును ఐశూ, మనం బాగా కష్టపడాలి... ఈ ఏడాది పూర్తి అయిపోతే, మనకి  కాంపస్ లోనే మంచి సెలెక్షన్ రావచ్చు... అరె... ఇదేమిటి?” కంగారు గా వెదుక్కోసాగింది, మధుబాల.

“ఏమైంది?”

“రూమ్ తాళం వేయటం మరచిపోయాను...”

“ఫర్లేదులే, ఇద్దరం ఇక్కడే ఉన్నాము కదా!” ఫక్కున నవ్వింది ఐశ్వర్య...

 మధుకి కూడా నవ్వొచ్చేసింది.  “యూ నాటీ!” అని భుజమ్మీద కొట్టింది నవ్వుతూ...

ఇంకో పెసరట్ వేడి వేడిగా తెచ్చింది భాగ్యం. దాన్ని సగానికి తుంచి వద్దంటున్నా మధూ పళ్ళెంలో పడేసింది ఐశ్వర్య.

 టిఫిను తిన్నాక,  రూమ్ కొచ్చి, కాసేపు పుస్తకాలు తెరిచారు స్నేహితురాళ్ళు ఇద్దరూ.

***

మధుబాల తల్లిదండ్రులు ఏలూరు వాస్తవ్యులు. మధు వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబమే అయినా ఇప్పుడు మాత్రం మామూలు మధ్యతరగతి కుటుంబం అనే చెప్పాలి. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి మామూలు గృహిణి. మధు పైన ఉన్న ఇద్దరాడపిల్లల పెళ్ళిళ్ళు చేసే సరికి ఆమె తండ్రి కుటుంబరావు గారికి సగం ఆస్తి హరించుకుపోయింది.  తర్వాత మగపిల్లాడు మధు అన్నయ్య గిరి కూడా స్కూలు టీచరే.  కొత్తగా ప్రక్కనున్న పెల్లెలోనే ఉద్యోగంలో చేరాడు. ఆస్త్మా తో బాధపడే తల్లి ఆయన దగ్గరే ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా ఇప్పటికీ ప్రతీ పండక్కీ ఏదో ఒకటి కావాలని అడుగుతూ భార్యల్ని పుట్టింటికి తరుముతారు అల్లుళ్ళు. వాటి కోసం డబ్బును సమకూర్చి మళ్ళీ కూతుళ్ళతో పంపేసరికి తలప్రాణం తోకకి వస్తుంది ఆయనకి.

ఈ చికాకుల మధ్య సెలవులకి ఇంటికి వెళ్ళటానికి కూడా మధుబాలకు ఇష్టంగా అనిపించదు. నాన్నని చూస్తే ఎంతో జాలి, ప్రేమ కలుగుతాయి. అందుకే తనకి మంచి ఉద్యోగం వస్తే ఆయన బాధ్యతలు పంచుకుంటూ, వాళ్ళను  చక్కగా చూసుకోవాలని కలలు కంటూ, తన  చదువు శ్రద్ధగా చదువుకుంటోంది మధుబాల.

ఐశ్వర్య ఇంటి పరిస్థితి మరో విధంగా ఉంది.  ఆమె తల్లిదండ్రులు అనంతపురంలో ఉంటారు.తండ్రి ఒక చిన్నకారు రైతు. ఆయనకి  ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి పెళ్లి చేసారు. కొడుకును కూడా పెద్ద చదువులే చదివించినా, అతడు చదువు పూర్తి  కాగానే కలకత్తాలో ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిపోయి అక్కడే తన సహోద్యోగి బెంగాలీ భామను పెళ్లి చేసుకున్నాడు. అతడినుంచి సహాయం అంతంత మాత్రమే. రాయల సీమంతా రాళ్ళ మయమే... వర్షాభావం వలన  పంటలు సరిగ్గా పండక అవస్థలు పడుతున్నా, చిన్న కూతురి మీదే ఆశలు పెట్టుకొని చదివిస్తున్నాడు ఆ తండ్రి.

***

ఆలస్యంగా హాస్టల్ కి వచ్చి రూమ్ తలుపు తట్టబోయి, అది తీసే ఉండటంతో లోపలి తోసింది, మధుబాల. గదంతా చీకటిగా ఉండి,  వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న శబ్దం వినిపించింది.

“ఐశూ...” అని పిలుస్తూ స్విచ్ వేయగానే లైట్ వెలిగింది. హృదయ విదారకంగా ఏడుస్తూ,  మంచం మీద ఒక మూటలా పడుంది  ఐశ్వర్య.మధు మనసు చెరువైపోయింది... “ఏమిటే ఐశూ... ఏమైందిరా?” త్వరత్వరగా వెళ్లి ఆమె పక్కనే కూర్చుని వీపు పై చేయి వేసింది. ‘మధూ,’ ఒక్క ఉదుటున లేచి ఆర్తితో, ఆమెను చుట్టేసింది ఐశ్వర్య.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్