Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఎర

era

ఉద్యమం  ఉదృతం అయింది. మెల్లగా సిటీ లను దాటి ప్రతి వూరి లోనూ వూపందుకుంది. నిరసనలు మొదలయ్యాయి.
గమనిస్తే ఉద్య మాల తీరు తెన్ను లు  ఇలా వుంటాయి రాస్తా రోకో’ లు మొదటిగా వచ్చే ప్రతి చర్య. ఉద్యమ కారులు రోడ్లమీద భైఠాయిస్తారు. బస్సులను ఆపుతారు, లారీలను నిలేస్తారు. ఎక్కడివక్కడ ఆగిపోతే తప్ప, ఉద్యమానికి గుర్తింపు రాదు.
ప్రతి పనికీ అడ్డం పడినప్పుడే అందరిలో చలనం కలుగుతుంది  “అసలు సమస్య ఏమిటీ? అని ప్రశ్నిస్తారు. ఆవిధంగా సమస్య పూర్వా పరాలు విస్తరిస్తాయి. ఇంకా బస్సులు, పోలీసు ఠాణా లు తగలపెట్టడం తోప్రభుత్వానికి నష్టం కలుగుతుంది కోట్లలో నష్టం వచ్చినప్పుడే కదా కదలిక కలుగుతుంది.ఉద్యమం వూపందుకుందీ అని అవగాహన కలగ గానే కొన్ని సంఘాలు సంఘీభావం తెలుపడం, కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో మీడియా లలో డిస్కషన్లు మొదలవుతాయి...

ఈ సమస్యకు మీరేమంటారు?  YES  or  NO  వెంటనే SMS చెయ్యండి అని ప్రకటన..దాని ఫలితాలను ప్రతిగంట కూ చూపుతూ ‘సమస్య’ ఎంత తీవ్రమైనదో ఎలుగెత్తి చాటుతారు.  అప్పుడు అధికారం లో వున్న పార్టీలో కదలిక మొదలై  అసలు కారణం ఎవరూ అని? అని ఎంక్వైరీ పెడతారు. కొంతమందిని సస్పెండ్ చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిని రాజీనామా చేయ్యమనో , సెలవులో పోవాలనో ఆదేశిస్తారు.
ఉద్యమకారులు వినరు.. సమస్యకు పరిష్కారం అదికాదు అని వాదిస్తారు. సమస్య ఎటూ తేలలేదని ‘నిరాహార దీక్షలు’ చేస్తారు.
మద్దతుగా రోజుకో వందమంది నిరాహార దీక్ష చేబడతారు. ఈ నేపధ్యం లో వస్తాడు రాజు. పేరే రాజు కాని నిరు పేద. రాయలసీమలో ఒక చిన్న కుగ్రామంలో పెరిగి, వానలు లేక, పంటలు పండక, తినడానికి తిండి కరువైపోతే కూలి వెతుకుతూ సిటీని చేరిన రాజు, అతనితో బాటు అతని కుటుంబం లో పెళ్ళాం రంగి, రెండేళ్ళ కొడుకు, మూడు నెలల పాప! కూలికి వేడితేనే ఆ పూట తిండి అన్న పరిస్థితి. కూలీగా చేరడానికి కూడా చాలా తతంగం వుంది. సప్లయరు పెద్దాయన కు  ఇంత వాటా అని ఇవ్వాలి. డబ్బులిచ్చే సమయానికి  హాజరు అయ్యే అతన్ని ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకుందామని కూడా అనుకోరు ఎందుకంటే ఆయన ద్వారానే ఎక్కడ కూలీ వున్నా పోయేది. సొంతంగా వెతుక్కోవడం సిటీలలో కాని పని...పట్నం వచ్చిన ఇరవై రోజులకే ఉద్యమం మొదలైంది.

రాస్తా రోకో’ లలో లారీలను ఆపి కూలీలను మధ్యలోనే దింపేశారు. సప్లయర్ కూడా ‘ఇంకేమీ చేయలేము వెళ్లి పొండి’ అన్నాడు. ఇంటికి పొతే ఆరోజు తిండి గడిచేదేట్ల? అని ఏడుపు వచ్చింది రాజుకు. రంగి దాచి వుంచిన యాభై రూపాయలతో బ్రెడ్డు కొనుక్కుని వస్తే తిన్నారు...ఉద్యమం కొనసాగే కొద్దీ కూలీ అయిన రాజుకు  కష్టమైపోసాగింది. చిన్న పాపకు పాలు రావాలంటే తల్లికి తిండి వుండాలి కదా. పిల్లను చంకలో వేసుకుని, కొడుకుని తీసుకుని అడుక్కోవడానికి వెళ్ళింది రంగి విధి లేక. “తిండికి లేక పోయినా బిడ్డలు కనడానికేమీ తక్కువ లేదు” అని ఈసడిస్తూ వుంటే తల తీసినట్టయింది. ఇంకా పోబుద్ది కాక నీళ్ళు తాగి పడుకుంది. తల్లి దగ్గర పాలు రాక పాప ఏడిస్తే నీళ్ళను తాపింది. ఇది చూసి ఏడుపు వచ్చింది రాజుకు. నెమ్మదిగా ఉద్యమకారుల దగ్గరికి పోయినాడు. చివరగా కూర్చున్న వారితో ‘తినడానికి తిండి లేక చచ్చి పోతున్నామయ్యా. పనులు ఆగి పోయినాయి. కూలీ దొరక లేదు. నా కూతురు మూడు నేలలది ఏడుస్తా వుంది” కళ్ళ నీళ్ళతో దీనంగా చెప్పినాడు. నలుగురు జేబుల్లో నుండీ చిల్లర నోట్లు ఇచ్చినారు. లెక్క  పెడితే తొంబై రూపాయలు వున్నాయి.
“నాలుగు రోడ్ల కూడలి దగ్గర మా నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. సాయంకాలం అక్కడికి ఇంకా జనం కావాలి. ఇంకా కొంత మంది ని తీసుకురా, డబ్బులు కూడా ఇస్తాము.” అని అన్నాడు ఒకాయన. కూలీ లేనప్పుడు ఇట్లా ఏదైనా చేస్తే కడుపైనా నిండుతుంది అనుకుంటూ పోయినాడు. సాయం కాలం ఇంకా ఇద్దరు కూలీలతో పోయి కూర్చున్నాడు. నూరు రూపాయలు ఇచ్చినారు. తరువాతి రోజు మళ్ళీ పోయినాడు.. అక్కడ ముగ్గురు మనుష్యులు రాజు ను పక్కకు పిలిచి కొంచం సేపు మాట్లాడి నారు. ఇంటికి వచ్చినాక రంగికి ఇదు నూర్లు ఇచ్చి “నిరాహార దీక్షలో రేపు కొంచం గలాటా చెయ్యాలంట..నలుగురు ఆత్మహత్య చేసుకుంటాం అని నెత్తిన కిరసనాయలు పోసుకోవాలంట...ఇంతలో పోలీసులు వస్తారు...వానులో కి ఎక్కించినా పోవాలంట...ఇది చేస్తే ఉద్యమ కారులు డబ్బులిస్తారు..ఒక వేళ అగ్గి పెట్టుకుంటే వెంటనే ఆస్పత్రికి చేరుస్తారంట...ఇది చేస్తే పదివేలు ఇస్తామన్నారు..”

“ఏమైనా అయితే ఎట్లా?” భయంగా అంది రంగి.

“ఏమీ కాదు. ఉద్యమాలలో ఇవి మామూలంట. పదివేలు తీసుకుని మన వూరికేల్లిపోదాం...బంకు పెట్టుకుని బతకచ్చు” రాజుకు కంటి ముందు పదివేలే కనిపిస్త్తున్నాయి..

మరునాడు ఉద్యమం లో కూడలి దగ్గరికి రాజుతో పది మంది నించుని “మా ఉద్యమం కు పరిష్కారం చూపక పొతే ఆత్మా హత్య చేసుకుంటాం “అని గట్టిగా అరవసాగారు..

కిరసనాయలు కాన్లు ఇస్తే అందరూ మీద పోసుకున్నారు...పోలీసులు లాటీ ఛార్జ్ చేయడం మొదలు పెట్టినారు. తప్పించుకుంటూ పక్కకు పరిగెత్తబోయిన రాజు మీద ఎవరో  కాలుతున్న అగ్గిపుల్ల వేసినాడు..ఒక్క సారిగా మంటలు లేచి శరీరం కాలుతూంటే ముందుకు పరిగేట్టినాడు రాజు. మంటలకు గాలి తోడై ఇంకా పెద్దగా అయినాయి...కిందకు పడిపోయి న రాజు కు అందరూ దూరంగా జరిగారు..అంబులెన్స్ లో ఆస్పత్రి చేరినా లాభం లేకపోయింది...

ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు!! అన్న నినాదం తో ప్రభుత్వం దిగి వచ్చింది. సంప్రదింపులతో పరిష్కారం చేసుకున్నారు... ఉద్యమం సక్సస్ అయ్యింది... చనిపోయిన అతని కుటుంబానికి  లక్ష ఇస్తామని ప్రకటించినా...ఆ డబ్బు రంగి దాకా చేరనే లేదు.......
 సమస్య పరిష్కారం  రాజు చావు తోనే జరిగింది . అది కూడా ఒక ప్లాను ప్రకారమే...రాజూ పేరు కూడా గుర్తులేదు ఎవరికీ...
ఉద్యమాలు సాగుతున్నప్పుడు ఉపయోగ పడే రాజు లాటి “ఎర” లు ఎంతమందో........

మరిన్ని కథలు
gunnesvararao - guttonkaaya koora