Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 

 గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue150/426/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

“ఐశూ... ఏమైంది? ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? చెప్పవే...” గాబరాగా ఆమె చేయి పట్టి ఊపుతూ అడిగింది.

 తల అడ్డంగా ఊపింది ఐశ్వర్య. “మా అక్కను బావ బలితీసుకున్నాడు మధూ... నిన్న రాత్రి అక్క చనిపోయిందట... ఈరోజు నాన్న ఫోన్ చేసారు.  అమాయకురాలైన అక్క బావ అకృత్యాలకు బలైపోయింది మధూ...” మళ్ళీ వెక్కి వెక్కి ఏడవ సాగింది ఐశ్వర్య.

 “అయ్యో...” హతాశురాలైంది మధుబాల.

“అసలు మీ అక్కకు ఏమైంది?”

“ఆ త్రాష్టుడు మా అక్కను పెళ్లి చేసుకుని మూడేళ్ళు అయింది. పద్దెనిమిది సంవత్సరాలకే అక్కకి పెళ్లి చేసారు. అరవిరిసిన పువ్వును ఒక రాక్షసుడి చేతిలో పెట్టారు. ఆ దరిద్రుడికి లేని వ్యసనం లేదు. చేసేది చిన్న ఉద్యోగమైనా ఊరంతా అప్పులే. తాగుడు, పేకాట మాత్రమే  కాకుండా ఎంతో మంది ఆడవాళ్ళతో సంబంధాలు. తత్ఫలితంగా వాడికి వచ్చిన ఎయిడ్స్ వ్యాధి అక్కకీ సోకింది. నేను ఎన్నో సార్లు నాన్నతో మొర పెట్టుకున్నాను, అక్కని మా ఇంటికి తీసుకు వచ్చేద్దామని. కాని అతను మారతాడన్న ఆశతో కొంతా, కుటుంబం పరువు పోయి నడి వీధికి ఎక్కుతుందన్న మధ్య తరగతి భయంతో కొంతా ఆయన అందుకు ఒప్పుకోలేదు.

చివరికి అక్క పరిస్థితి విషమించి, నిన్న ఆసుపత్రి లోనే చనిపోయిందిట. అటు వాడి పరిస్థితీ ఏమీ బాగుండలేదట.  నేడో రేపో వాడూ పోతాడు. అనవసరంగా మా అక్క పచ్చని బతుకు కాస్తా బుగ్గిపాలై పోయింది... మధూ... అదృష్ట వశాత్తూ అక్కకి పిల్లలు పుట్ట లేదు. లేక పోతే ఈ మహమ్మారి వ్యాధి వాళ్ళకీ సోకి ఉండేదే...” భోరున విలపించింది ఐశ్వర్య.

 “అయ్యో ఎంత పని జరిగింది?” మధు బాల కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతు పూడుకు పోయింది. ఎలాగో పెగల్చుకుంటూ, “బాధ పడకు ఐశూ... ఆమెకి మనకి ఋణం తీరి పోయి వెళ్ళి పోయింది. నిజంగా అలా జరగటం బాధా కరమే. అయితే ఊరికి వెళతావా ఐశూ?” అన్నది.

“లేదు మధూ... జరగవలసిన అనర్థం జరిగి పోయింది. దహన సంస్కారమూ అయి పోయింది... ఇప్పుడు వెళ్లి ఏం చేయాలి?” మళ్ళీ ఐశ్వర్య కళ్ళు నీటితో నిండి పోయాయి.

“ఐశూ... కూతురిగా నీకు ఒక బాధ్యత ఉంది... అక్కడ తమ పెద్ద  కూతుర్ని పోగొట్టుకున్న అమ్మా నాన్నలు ఎంత వ్యధ అనుభవిస్తున్నారో తెలుసా? నువ్వు వెళితే వాళ్లకి చాలా ఉపశమనంగా ఉంటుంది. నా మాట విని లేచి బట్టలు సర్దుకో... నిన్ను నేను బస్ ఎక్కిస్తాను. తెల్లారే సరికి ఇల్లు చేరతావు. లే...పద...”

అమ్మానాన్నలు గుర్తు వచ్చిన ఐశ్వర్యకు మరింత దుఖం వచ్చింది. నిజం! ఈ వయసులో అమ్మకి ఎంత గర్భ శోకం? అన్నయ్య కలకత్తా నుంచి ఎలాగూ రాడు. తను వెళితే కొంతైనా వాళ్లకి ఓదార్పుగా ఉంటుంది. అసలు ఎలా ఉన్నారో, తిన్నారో లేదో... అమ్మకి అసలే ఆయాసం... ఆవిడకి ఈ దుఃఖ భారంతో ఏమైనా అయితే? నాన్న మగ వాడే కాని లోపల మనసు వట్టి బేల... దగ్గరుండి చూసుకోక పోతే ఏమై పోతారు వాళ్ళు?

“అవునే... వెళతాను...” గబ గబా బాగ్ లో బట్టలు సర్దబోయి ఆగి పోయింది.

“ఏమైంది?”

“మధూ, నెలాఖరు కదా, నా దగ్గర డబ్బు లేదు...” నిస్సహాయంగా కూల బడింది.

“నా దగ్గరుందిలే  ఐశూ... పద వెళదాం... పదవ రోజు వరకూ ఉండి అమ్మా నాన్నలతో ఉంటే, వాళ్ళీ  దుఃఖం నుండి కొంచెమైనా సేద దీరుతారు. వాళ్లకి నువ్వున్నావన్న  ధైర్యం చెప్పి, బలం కలిగించి  రా...” తన పర్స్ లోంచి రెండు వేలు తీసి ఐశ్వర్య బాగ్ లో పెట్టింది మధు బాల.

“నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను మధూ... నా పుణ్య ఫలం నీవు నా స్నేహితురాలివి కావటం...” మనసారా కౌగలించుకుంది ఐశ్వర్య... ఆమె కళ్ళు తుడిచి, బయలుదేర దీసింది, మధు.

***

రోజులు గడచి పోతున్నాయి.

మధు బాల, ఐశ్వర్య ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసారు. వేరే ఇతర వ్యాపకాలు ఏవీ పెట్టుకోకుండా మనసంతా చదువు మీదనే లగ్నం చేసి చదువుకోవాలని అనుకున్నా, ఐశ్వర్యకు పరిస్థితులు సహకరించటం లేదు. పెద్ద కూతురి మీద బెంగతో తండ్రి మంచాన పడ్డాడు. నెల నెలా ఆయన పంపించే డబ్బు బాగా తగ్గి పోవటం వలన సాయంత్రం కాలేజీ అయ్యాక పార్ట్ టైం గా ట్యూషన్ తీసుకుంది ఐశ్వర్య.
రూప  అనే ఒక పన్నెండేళ్ళ పాపకు ఇంగ్లీష్, మాథ్స్ చెప్పాలి. జన్యు లోపం వలన ఆ పాప నడవ గలిగే స్థితిలో లేదు... ప్రైవేటుగా చదువుకుంటోంది. రూప అమ్మా నాన్నలు మంచి జీతం ఆఫర్ చేయటంతో, దూరమే అయినా ఐశ్వర్య,  కాలేజీ అవగానే రెండు బస్సులు మారి మరీ వెళ్ళి వస్తోంది.

మధు బాల కూడా ఒక ప్రైవేట్ జాబ్ లో చేరింది. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకూ. ఇద్దరూ ఇంచు మించుగా అర గంట తేడా లోనే హాస్టల్ కి వచ్చేస్తారు. స్నానం, భోజనం ముగించి పుస్తకాల ముందు కూర్చుంటే మళ్ళీ పన్నెండుకే పడుకోవటం. మళ్ళీ ఉదయం లేచి పరుగులు, ఉరుకులూ తప్పవు... ఒక్క ఆదివారం మాత్రం ఎక్కడికీ వెళ్ళకుండా కలిసే ఉండేవాళ్ళు ఇద్దరూ.

ఆ రోజు ఐశ్వర్య మూడ్ చాలా చిరాకుగా ఉంది. కాలేజీ ఫీజు కట్టటానికి మర్నాడే ఆఖరు తేదీ. చేతిలో ఐదు వందల కన్నా లేవు.  రూప వాళ్ళ ఇంటికి వెళ్ళే సరికే సాయంత్రం ఆరు దాటింది. రూప  అమ్మా, నాన్నా ఇద్దరూ ఇంట్లో లేరు. ఆయా పాపను అప్పటికే రెడీ చేసింది.
“గుడీవినింగ్ టీచర్...” విష్ చేసింది రూప ...

“గుడీవినింగ్ బేబీ, నిన్న చెప్పిన లెక్కలు చేసావా?” పాప తల నిమిరి, కుర్చీలో కూర్చుంది ఐశ్వర్య.

“ఓ” తలూపి, లెక్కల నోట్ బుక్ ని ఆమెకి అందించింది రూప.

“ఓ, వెరీ నైస్... ఎంత బాగా చేసావో...” బాగ్ లోంచి చాక్లెట్ తీసి అందించింది ఐశ్వర్య. ఆయా పళ్ళెంలో వేడి వేడి దోసెలు రెండు పెట్టి,  టిఫిన్ పట్టుకు వచ్చింది.

“అయ్యో రోజూ ఎందుకు?” ఇబ్బందిగా, మొహమాటంగా అంది ఐశ్వర్య.

“తీసుకోండి టీచర్... కాలేజీ నుంచి వస్తారు కదా, ఆకలేస్తుంది... ఇంట్లో ఉన్నా నాకూ ఆకలేస్తుంది. మా మమ్మీ నాకు టిఫిన్, పాలు ఇచ్చి బయటకు వెళ్ళింది... మరి మీరు మీ హాస్టల్ కి వెళ్ళే సరికి బాగా లేట్ అవుతుంది కదా... తినండి...” ప్రేమగా చెప్పింది రూప.
టిఫిన్, కాఫీ అయ్యాక, ఇంగ్లీష్ గ్రామరు, లెక్కల్లో కొత్త అధ్యాయం తీసి కొత్త పాఠం చెప్పింది ఐశ్వర్య. పాఠాల్లో పడి సమయం ఎంతయిందో కూడా తెలియలేదు. ఈలోగా వచ్చింది అమల,  రూప  వాళ్ళమ్మ.  

“ఏమ్మా ఐశ్వర్యా, బాగున్నావా? ఎలా ఉంది చదువు?” తన గదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకు వచ్చి పలకరిస్తూ కూర్చుంది అమల.
“రూప  చక్కగా చదువుతోంది మేడమ్!” చెప్పింది ఐశ్వర్య.

“అవునా? థాంక్స్ అమ్మా... ఒక్క నెల రోజుల్లోనే ఎంతో పికప్ అయింది. ఇదివరలో నేనే చెప్పేదాన్ని. కాని నాకు బయట బాధ్యతలు ఎక్కువ అయ్యాయి ఈ మధ్య... అందుకే రోజంతా ఇంట్లోనే దాని పక్కనే ఉన్నా, సాయంత్రం క్లబ్ యాక్టివిటీస్ కోసం బయటకు వెళ్ళక తప్పటం లేదు. రేపు ఆదివారం బ్లడ్ డొనేషన్ కాంప్ పెట్టాం... ఆ హడావుడిలో ఉన్నాను...” చెప్పింది అమల.
ఆమె వైపు ఆరాధనగా చూసింది ఐశ్వర్య.

“వదినా...” కొత్త గొంతు వినిపించింది గది బయట నుంచి...

“కార్తీక్ బాబాయ్...హాయ్... ఎప్పుడు వచ్చావు? రా, నా రూమ్ లోకి...” గట్టిగా పిలిచింది రూప.

“హాయ్ రూపా...” లోపలి వచ్చాడు కార్తీక్.

ఇంచు మించు ఆరడుగుల పొడవుతో, అందుకు తగ్గ దేహ ధారుడ్యంతో... మాన్లీ గా ఉన్నాడు. కళ్ళలో అదో రకమైన నిర్లక్ష్యం కనబడుతోంది.
“హాయ్ రా బేబీ, ఎలా ఉన్నావ్?” దగ్గరగా వచ్చి రూపకు షేక్ హాండ్ ఇచ్చాడు కార్తీక్.

“బాగున్నాను... వచ్చిన వెంటనే...నన్ను పలకరించలేదుగా, పో, నీతో మాట్లాడను...” బుంగ మూతి పెట్టింది రూప.

“ఏదో ఫోన్ వచ్చిందిరా... మాట్లాడుతూ ఉండి పోయాను...ఈ రోజు వర్క్ బాగా ఉందిరా... అమ్మ దార్లో కలిసింది. బాగా ఆకలేస్తోంది... ఏమైనా తినేసి వచ్చి కూర్చుందామని... సారీ రా...”

“ఊ...”

వాళ్ళు మాట్లాడుకుంటుంటే కొద్దిగా ఇబ్బంది తోచి, లేచి నిలబడింది ఐశ్వర్య.

అది గమనించిన అమల, “కార్తీక్, ఈమె ఐశ్వర్య. మన రూపకి టీచరు...” అని పరిచయం చేసింది.

“ఇంత చిన్నమ్మాయి టీచరా?  ఓ... వెరీ గ్లాడ్ టూ మీట్ యు అండీ...” చేయి చాచాడు...

మొహ మాటంగా ఆ చేయి అందుకుని వదిలేసింది ఐశ్వర్య.

“చదువుకుంటోంది... ఈ ఏడాది కష్ట పడితే డిగ్రీ చేతికి వస్తుంది...” చెప్పింది అమల.

“నేను...నేనిక  వెళతానండీ...” చెప్పింది ఐశ్వర్య.

“బయట హోరున వర్షం... ఎలా వెళతారు?” అడిగాడు కార్తీక్.

“ఓ పని చేయి ఐశ్వర్యా... ఎలాగూ ఈ రోజు బాగా లేట్ అయింది కదా... నువ్వూ కార్తీక్ తో పాటే భోజనం చేసేయ్. కార్తీక్, నువ్వు నీ కార్లో ఆ అమ్మాయిని దింపేసి వెళ్ళు...” చెప్పింది అమల.

“భోజనమా...రాగానే ఆయా టిఫిన్ ఇచ్చారు.  వద్దు... నేను బస్ లో వెళ్ళి పోతాను లెండి...” గాబరాగా అంది ఐశ్వర్య...

“అయ్యో, మొహమాట పడకమ్మా... రా... వడ్డించేస్తున్నా... రూపా నీకు అన్నం కలిపి తెస్తారా...” అని వెళ్ళి పోయింది అమల.

“టీచర్... పోనీ ఈరోజుకు నాతో ఉండి పోకూడదూ?” అడిగింది రూప.

“ఉహు...నాకు వీలు కాదమ్మా... చదువు కోవలసిన పని ఉంది... ఎప్పుడైనా ఉంటానులే...” బుజ్జగింపుగా చెప్పింది ఐశ్వర్య.
కార్తీక్ గది లోంచి వెళ్ళిపోయాడు. అమల భోజనం వడ్డించిన పళ్ళెంతో వచ్చి, “ఐశ్వర్యా, అన్నీ టేబుల్ మీద పెట్టాను. ఆయా ఉంది. కొంచెం శ్రమ అనుకోకుండా మొహమాట పడకుండా వెళ్లి భోజనం చేయమ్మా.. నేను పాపకి తినిపించి వస్తాను...” అంది. చేసేది లేక, గట్టిగా వద్దని చెప్పలేక తలూపింది ఐశ్వర్య. 

భోజనాల దగ్గర పెద్దగా మాటలు సాగ లేదు. భోజనమంటే ఎంతో ఇష్టపడే శ్వర్యకు, ప్లేట్ చుట్టూ  ఏవేవో తెలియని ఆధరువులు కనబడుతున్నా, తిండి సయించలేదు.

 ఐశ్వర్యను మధ్య మధ్యలో గమనిస్తూ భోజనం పూర్తి  చేసాడు కార్తీక్. చామన చాయగా ఉన్నా, చురుకైన కళ్ళు, ఉంగరాలు తిరిగిన జుట్టుతో, క్రీమ్ కలర్ సల్వార్ పైజమాలలో అందంగానే ఉంది ఐశ్వర్య.  గడ్డం మీద పుట్టు మచ్చ అందంగా బ్యూటీ స్పాట్ లా అనిపించింది. నవ్వుతున్నట్టున్న కళ్ళు, ప్రసన్నమైన ముఖం... పరీక్షగా చూస్తే మాత్రం  ఆ కళ్ళల్లో ఏదో దిగులు గూడు కట్టుకున్నట్టు తోచిందతనికి.
కార్తీక్ తన తల్లి దండ్రులతో వేరే చోట ఉంటాడు. ఒక ప్రైవేటు కంపెనీలో మంచి జీతంతో, మంచి హోదాలోనే ఉన్నాడు. అతని అన్నయ్యా, వదినా వేరేగా ఇక్కడ ఉంటారు. బాధ్యతలు లేక పోవటంతో జీవితాన్ని ఆనందంగా అనుభవించటమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. అమ్మా నాన్నలు పెళ్లి చేస్తామంటున్నా ఏదో ఒక కారణం వలన దాన్ని వాయిదా వేస్తూ ఉన్నాడు.

“వెళదామా?” నాప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ అప్పటికే భోజనం ముగించిన ఐశ్వర్యతో అన్నాడు. ఇంకా జోరుగా పడుతున్న వర్షాన్ని కిటికీ లోంచి దిగులుగా చూస్తూ తలూపింది, ఐశ్వర్య.

అమలకు చెప్పి అతనితో బయటకు నడిచింది ఐశ్వర్య. ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు ఎక్కమన్నట్టుగా చూస్తూ. ఒద్దికగా ఎక్కి, ముడుచుకుని కూర్చుంది. ఆమెకు ఎందుకో నెర్వస్ గా అనిపించసాగింది. పోనీ దిగి పోయి వెళదామంటే ఆగని వర్షం. నిస్సహాయంగా కూర్చుండి పోయింది. మెత్తగా సాగి పోతుంది కారు... చల్లగా ఉంది ఏసీ వలన... కమ్మని సంగీతం మంద్ర స్థాయిలో వినిపిస్తోంది.
“హలో, నా పేరు కార్తీక్... రావణాసురుడు కాదు...” ఆమె ముఖం ముందు చిటికెలు వేస్తూ అన్నాడు కార్తీక్. అతని ముఖంలో నవ్వు. కొద్దిగా రిలాక్స్ అయింది ఐశ్వర్య.

“అబ్బే, అదేం లేదు... సారీ...” అంది సర్దుకుంటూ...

“కొద్దిగా ఫ్రీగా ఉండండి... ఇబ్బందిగా ఫీల్ అవద్దు...” స్నేహంగా చెప్పాడు.

ఐశ్వర్య కూడా  బావుండదని నవ్వింది.  తన గురించి చెప్పి అతని గురించి అడిగింది. స్నేహం అన్నా, సరదాలన్నా చాలా ఇష్టమనీ, అమ్మా నాన్నా పెళ్ళికి తొందర పెడుతున్నారనీ, కానీ తనకి పెళ్లి అంటే ఇష్టం లేదనీ చెప్పాడు. తన ఇష్టాలు, అభిరుచులూ చెప్పాడు...
అతని ఫ్రీ లైఫ్ గురించి అర్థమైన ఐశ్వర్య, వారాంతానికి అతని అలవాట్లకీ, సరదాలకీ తగలేసే డబ్బును తలచు కొని బాధగా నిట్టూర్చింది... డబ్బు లేకే కదా, తన చదువు ఇబ్బందిలో పడేలా ఉందిప్పుడు...

అమల, అరుణ్ ల సేవా భావాలకీ, కార్తీక్ స్వభావానికీ ఏ మాత్రమూ పొంతన కుదిరినట్టు అనిపించలేదు. స్వంత అన్నదమ్ములలోనే స్వభావ వైరుధ్యాలు...

“నెహ్రూ నగర్ వచ్చేసాం. మీ హాస్టల్ కి ఎలా వెళ్ళాలో చెప్పండి...” అతని మాటలతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చి, గుర్తులు చెప్పసాగింది.

హాస్టల్ గేటు ముందు కారాపాడు.

“థాంక్ యు వెరీ మచ్ అండీ...” కృతజ్ఞతగా చెప్పింది ఐశ్వర్య.

“సో, మళ్ళీ ఎప్పుడు?” చిరునవ్వుతో అడిగాడు.

“మళ్ళీనా?” అయోమయంగా అడిగింది ఐశ్వర్య...

“మీరు నాకు నచ్చారు... మళ్ళీ కలవాలనిపిస్తోంది...” చెప్పేసాడు దాచుకోకుండా...

ఐశ్వర్య ముఖం ఎర్ర బడింది.

“ఓకే ఓకే కోపం వద్దు... బై...” నవ్వేసి, కారును బాక్ చేసుకున్నాడు, కార్తీక్. వెను తిరిగి గేటు తెరచు కొని హాస్టల్ లోకి వెళ్ళి పోయింది, ఐశ్వర్య. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్