Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chettavyasanam

ఈ సంచికలో >> కథలు >> గున్నేశ్వర్రావ్-గుత్తొంకాయ్ కూర

gunnesvararao - guttonkaaya koora

"మా తల్లే .. ఎంత వినయం, ఎంత వందనం? ఈ కాలం పిల్లల్లా లేవమ్మా" అంటూ లేవదీసి అక్కున చేర్చుకుంది, కాబోయే అత్తగారు.

"అమ్మా, నేనొకసారి... మాట్లాడుతా." మెల్లిగా గొణిగాడు పెళ్ళికొడుకు,, ఇంటి దగ్గర ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయి.

" ఆ మూడుముళ్ళు పడిపోతే , ఇంక అన్నీ మాటలే అంత తొందరెందుకూ?" అంటూ కళ్ళతోనే హెచ్చరించింది.

బుద్ధిగా తలూపి .. అమ్మాయికేసి ఒక మారు చూసి బయటకు నడిచాడు. ఆ చూపులో "వెళ్ళొస్తా" అన్న మాటతో బాటు తానంటే ప్రేమ కనబడి 'ఫ్లాట్' అయిపోయింది జాను. అబ్బాయి చూపు... అందమైన ఆ  విగ్రహం గుర్తుకు వచ్చి మారు మాట్లాడకుండా ఒప్పేసుకుంది జాహ్నవి, అదే అసలు ట్విస్ట్, జాహ్నవికి వంటే రాదు సరి కదా 'వంకాయా అంటేనే ఇష్టం వుండదు మరి.

"అంతా బానే వుంది కానీ.. ఏదో కొంచెం తేడాగా వున్నట్లు లేదూ?" సందేహం వెలిబుచ్చాడు జాహ్నవి తండ్రి.'శన్క' ర్రావు.

"మీకన్నీ అనుమానాలే.. అందరూ మీలా ధుమ ధుమలాడుతూ వుండాలా ఏం? నా తల్లి బంగారు పూలతో పూజ చేసింది కనుకే బంగారలాంటి సంబంధం ... వెతుక్కుంటూ వచ్చింది. పిల్లాడు ఆరడుగుల అందగాడు, మంచి చదువూ, ఆరంకెల జీతం, ఒక్కడే కొడుకు, బాగా వున్న వాళ్ళు. పిచ్చిపిచ్చి శంకకలేం పెట్టుకోక ... మంచిరోజు చూసుకు వాళ్ళింటికెళ్ళి ముహూర్తం పెట్టించేసేయ్యండి... " ఆనందంగా అంది.
ముప్ఫై పెళ్ళి చూపుల అనుభవంతో ఆ ముప్ఫై ఏళ్ళ పెళ్ళికొడుకు జాహ్నవి పాలపడ్డాడు. మొత్తానికి ఆ రకంగా పెళ్ళిచూపుల ప్రహసనం నడిచి .. గున్నేశ్వర్రావు... జాహ్నవీ ఆలూమగలయ్యారు.

జాహ్నవికి ఓ పక్క బెదురుగానే వుంది.. పెళ్ళిచూపుల్లో 'అత్తగారూ తనకు చెప్పిన విషయాలు గుర్తొచ్చి.

"వాడికి రోజూ వంకాయ కూర లేనిదే ముద్ద దిగదు. చిన్నప్పటినుంచీ అదే అలవాటు అయిపోయింది. ఐ.ఐ.టి లో చేరిస్తే , అక్కడ వుండలేక, వంకాయ కూర లేని ఆ తిండి తినలేక... సగం లో వదిలేసి పారిపోయి వచ్చేస్తే, చదువు పాడవటం ఇష్టం లేక వాళ్ళ నాన్న, వాడికి వండి పెట్టడం కోసం నన్ను అక్కడికి పంపి పాపం ఆ నాలుగు ఏళ్ళు తను తంటాలు పడ్డారు ఒంటరిగా." కొంచెం మురిపెంగాను.. కొంచెం కోపంగాను చెప్పిన ఆ మాటలు అంత ఆనందంలోనూ కలవరపెట్టాయామెను.

"పెళ్ళిలో.. మూడు పూటలా వంకాయ కూర మెయిన్ మెనూ.. వాళ్ళు కోరిన విధంగా ఝూం ఝూమ్మని పెళ్ళి చేసాడు, శంక్కర్రావు.
పెళ్ళిలో అలకపానుపుపు మీద పెళ్ళికొడుకు అడిగిన కోరిన విని పెళ్ళికొచ్చిన వాళ్ళంతా ఒకటే నవ్వులు, ఇంతకీ ఏమడిగాడు అనుకున్నారు? పెళ్ళి కూతురు స్వహస్తాలతో చేసిన వంకాయ మెంతి కారం కూర,  అందరి నవ్వుల మధ్యా వేళా కోళాల మధ్యా ' ఆ కూర వచ్చింది.. అచ్చం తన తల్లి చేసినట్లే వుంది అంటూ తెగ ఆనందపడిపోయాడు మానవుడు, అది తన తల్లే చేసిందని తెలియక.. ఏమైనా కోనసీమ పిల్ల కోనసీమ పిల్లే. అందుకే తను పట్టుబట్టి కోనసీమ సంబంధమే చేసుకున్నానంటూ తెగ మురిసిపోయాడు.
పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన జాహ్నవిని చూసి ఎంతో ఆనందంగా, మరెంతో ఇష్టంగా దగ్గరకు తీసుకు తియ్యటి ముద్దిచ్చి... ఆ మైమరుపులో జాహ్నవి వుండగానే "బాగుంది కదూ.. లేత 'గుత్తొంకాయ్' కూరలా" పరవశంగా అన్నాడు, గున్నేశ్వరరావు.

అదిరిపడి బయటకొచ్చింది ఆ మైమరుపులోంచి.. వింతగా చూసింది. పుస్తకాల్లో, సినిమాల్లో తొలి ముద్దునీ, ప్రేయసి అధరాలనీ 'మధువు తోనో.. మరింత మధురమైన ద్రాక్షాలతోనో పోల్చడం చూసింది కానీ 'లేత గుత్తొంకాయ కూరతో..'

ఎలాగయినా అతనిలో ఆ పిచ్చి.. తగ్గించి మామూలు మనిషిని చెయ్యాలని ఆ క్షణమే కంకణం కట్టుకుంది. మూడు రాత్రులు, మనుగడుపులూ.. అంటూ పెళ్ళి వేడుకలన్నీ పూర్తయి అత్తవారింటికి .. బయలుదేరే కూతురికి హితవు చెబుతూ అరుంధతి, "తల్లీ, భర్త ప్రేమా, దాంపత్య జీవితం లోని మధురిమా అన్నీ తొలినాళ్ళ మీదనే ఆధారపడి వుంటాయ్.. మగవాడి కడుపు.."
"అమ్మా..."కంగారుగా వారించింది, జాహ్నవి.

"చ చెప్పనీ.. అన్నిటికీ తొందరే...' ఆ కడుపు 'కాదు... మగవాడి రుచి తెల్సుకు రుచికరంగా కడుపునిండా పెట్టే భార్యని ఏ మగాడయినా , చచ్చినట్లు ప్రేమించి తీరుతాడు. అబ్బాయికి వంకాయ కూరంటే పిచ్చి అట.. ఆ కారణంగానే అన్ని సంబంధాలు తప్పిపోయాయట.. నీకేమో వంకాయ పొడే గిట్టదు అందుకే నీకు చెప్పలేదు.. ఏదో ఒక ఇష్టం, వ్యసనం లేని మనిషి వుండడు. ఇదేమి.. దుర్వ్యసనం కాదు.. ప్రాణాంతకం కాదు.. పాపం మీ అత్తగారి దగ్గర ఎలా చెయ్యలో నేర్చుకు రోజూ చేసిపెట్టు"  అంటూ ఉపదేశించిన తల్లిని.. విలన్ని చూసినట్లు చూసింది, ఇంత కుట్రా? అనుకుంటూ.

మనుగుడుపులూ, మూడు నిద్దర్లూ అయి.. పెళ్ళి సందడి అంతా ముగిసి పిల్లని అత్తారింటికి తీసుకోచ్చాకా, "జానూ.. ఏది, నీ అందమైన చేతులతో ఇంకా అందమైన కూర అదే 'గుత్తి వంకాయా కూరోయ్ బావా వలపంత కూరి వండినానోయ్ బావా' అంటూ చేసి పెట్టవా ప్లీజ్" అన్న మొగుడిని వింతగా అయోమయంగా చూసింది జాహ్నవి.

"ఒరేయ్ ..ఇంక జీవితాంతం, దాని చేతి వంటే తింటావ్ గానీ కొత్త పెళ్ళి కూతురు.. ఇప్పుడు.. దానికి అలాంటి పనులేం చెప్పకు కోప్పడింది అదివిన్న తల్లి.

"అంటే .. కాస్త నీ దగ్గర ట్రైఇనింగ్  అవుతుందనీ...."నీళ్ళు నమిలేడు. ఎలాగో తంటాలు పడి నేర్చుకు భర్తని ఆనందింప చేద్దామని నా నా కష్టాలు పడి నేర్చుకుంది అత్తగారి దగ్గర, పదహారురోజుల పండుగ తర్వాత అత్తగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కోడలి 'వంటింటీ ప్రవేశానికి.  
మొదటి రోజు " ఇది నేనే చేశా రుచి చూసి చెప్పండి ఎలా వుందో?" అంటూ కంచం లో వడ్డించిన పదార్ధం ఏమిటో అర్ధం కాకపోయినా కొత్త పెళ్ళాన్ని చిన్నబుచ్చడం ఇష్టంలేక ఏమిటీ? అని అడక్కుండా నోట్లో పెట్టుకున్నాడు భయం భయం గా. అంతే...  ఆవిడ కొంచెం పక్కకి వెళ్ళగా చూసి.

"ఆ..ఆ.. అర్జెంటుగా రావాలా? ఇదిగో ఇప్పుడే వస్తున్నా" అంటూ మోగని సెల్ లో మాట్లాడి గబ గబా కంచం ముందు నుండి లేచిపోయాడు.
"సారీ రా జానూ.. అర్జెంటుగా ఆఫీస్ కి వెళ్ళాలి.. నా కోసం కూర్చోక నువ్వు తినేసేయ్" అంటూ వెళ్ళిపోయిన మొగుడిని.. చూసి అయ్యో ఇంకొంచెం ముందు పెట్టవలసినది.. పాపం తినకుండా వెళ్ళిపోయాడు అని బాధపడుతున్న కోడలికి..."వాడు నువ్వు చేసిన కూర తినలేకే వెళ్ళిపోయాడూ అని చెప్పలేక 'పిల్లాడు తినకుండా వెళ్ళిపోయాడే' అని బాధపడుతూ అప్పటికప్పుడు మళ్ళీ కూర చేసింది అతని కోసం.
ఎలాగైనా ఈ పిల్లకి ఈ కూర చెయ్యడం నేర్పాలి అనుకుంటూ.

పెళ్ళయిన వేళా విశేషం .. ఇంకా పెద్ద జీతంతో 'ఏడాదీ పాటు అమెరికా, ప్రాజెక్ట్ పని మీద భార్యా భర్తలిద్దరినీ పంపుతామన్నారు కంపెనీ వాళ్ళు, జాహ్నవి, అత్తగారు ఇద్దరి గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి..బెంగుళూరు వాళ్ళతో బ్బాటు వెళ్ళి కొన్నాళ్ళు దగ్గరుండి కోడలికి 'గుత్తొంకాయా కూర అన్ని రకాలు చెయ్యడం ఎలాగో నేర్పించి వచ్చేయొచ్చులే అని తలచిన ఆ తల్లికి ఇప్పుడేం చేయ్యాలో అర్ధం కాలేదు, అయినా కొత్త పెళ్ళాం.. కొత్త కాపురం వాడే సర్దుకుంటాడులే అని సరిపుచ్చుకుని.. మెంతి కారం, ధనియాల కారం పొడులు చేసి కోడలికి అవి ఎలా చెయ్యాలో చెప్పి... డౌట్ వస్తే ఫోన్ చేయమని ధైర్యం చెప్పి విమానం ఎక్కించింది.

కంపెనీ వాళ్ళు ఇచ్చిన చక్కని అందమైన బంగ్లా ముందర లాన్ తో సహా కారు, ఖరీదైన ఫర్నీచర్, అంతకంటే కొత్త పెళ్ళాం.. ఓహ్ చెప్పాలా అమెరికా అంటే భూతల స్వర్గమే.

అక్కడ కాస్త సర్దుకుంటూనే.. వాల్మార్ట్ కి వెళ్ళి 'నవనవ లాడే గుత్తొంకాయలు తెచ్చిన మొగుడిని చూస్తూనే కంగారు పుట్టింది జాహ్నవికి. "జానూ డియర్ చూడు ఇవి ఎంత ముద్దుగా.. ఫ్రెష్ గా నోరూరించేలా వున్నాయో, గుత్తొంకాయతో ఎన్ని రకాలు చేయవచ్చనుకున్నావ్, మెంతి కారం, ధనియాల కారం, కొత్తిమీర కారం, ఉల్లి కారం.. అంటూ అర్ధ నిమీలిత నేత్రాలతో ఆ రుచులను, పలకడన్లోనే ఆస్వాదిస్తూ అదేదో సినిమాలో సుత్తి వీరబద్ద రావు స్టైల్లో చెబుతున్న మొగుడిని చూసి మంటెక్కిపోయింది జాహ్నవికి. " నా దిబ్బ కారం, నా దిరుగుండం కారం అన్ని రకాల కారాలు బానే తెలుసు ఒక్క పెళ్ళాం మీద 'మమకారం' తప్ప అనుకుంది మంటగా..
దేముడి మీద భారం వేసి, తననలా ఇరికించిన అత్తగారిని తిట్టుకుంటూ వంకాయలు అత్తగారు ఎలా కడిగారో, ఎలా తరిగారు గుర్తుచేసుకుంటూ తరిగింది, విపరీతమైన టెన్షన్ పడుతూ వండింది. ప్చ్, మన వీర వంకాయ ప్రేమికుడికి అసలు అది వంకాయ కూరలా అనిపిస్తేనా?

మొదట్లో విసుగ్గా, అయిష్టం గా చేసినా రాను రానూ ఎలాగైనా బాగా చేసి ప్రియమైన మొగుడు గారితో 'శభాష్' అనిపించుకోవాలనే పేరాశతో, రెట్టించిన ఉత్సాహంతో వంకాయని రకరకాల ప్రయోగాలతో చిత్ర హింసలుసలు పెడుతున్న జాహ్నవిని వారించి, వారించి నివారించలేక హుతాశుడయ్యాడు.

అమెరికా అంటే భూతల స్వర్గం ఎవరికైనా కానీ మనవాడికి మాత్రం కాదు.. కారణం తనకెంతో ఇష్టమైన, ప్రాణప్రదమైన 'గుత్తొంకాయ్ కూరే' ఓహ్ అమెరికా అంటే భూతల స్వర్గం అన్నది నిజమే కదా.. అని మురిసేటంతలో ... కంచం లో భూతం లా భయపడుతోంది... రోజుకో రకంగా.  తనకోసం ఎంతో శ్రమపడి.. వాల్మార్ట్ కి వెళ్ళి, వంకాయలు, తెచ్చి అష్ట కష్తాలు పడి...ఏవో కాగితాలు, పుస్తకాలు చదివి అదీ సరిపోక నెట్ బ్రోజ్ చేసి , తల్లితో లైఫ్ లైన్ తీసుకు రకరకాలుగా తనకోసం శ్రమ పడుతున్న ఇల్లాలిని నొప్పించలేక.. అలా అని కూర అనబడే ఆ ముద్దని మింగలేక .. కక్కలేక సతమతమైపోయాడు.

"అది కాదురా పోనీ కొన్నాళ్ళు ఈ కూర వదిలేద్దాం" అనునయన్ గా అన్నాడు"

"నా వంట అంత బాగా లేదా? పాపిష్టిదాన్ని మీకు కడుపునిండా మీ కిష్టమైన కూర కూడా చేసి పెట్టలేక పోతున్నా" అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్న భార్యని చూసి తల్లడిల్లిపోయాడు.

"చూడు.. వంకాయల్ని ఇలా ముద్ద ముద్దల్లా కాదు చక్కగా కాయ కాయల్లా వుండాలి...' అంటూ చిన్న హింట్ ఇచ్చాడు.  మర్నాడు దేముడి మీద భారం వేసి , కాయలు తరిగి మైక్రో ఓవెన్ లో పెట్టి.. తరువాత వాటిని బయటకు తీసి.. విడిపోతుంటే ఏం చెయ్యాలా అని ఆలోచించి.. ఆలోచించి.. చక్కగా అవి విడిపోకుండా దారం కట్టింది. అమ్మ ఇచ్చిన కారం ఘుమ ఘుమ లాడుతూ, చక్కగా నోనూడుతూ నోరూరించగా గబ గబా వచ్చేశాడు భోజనానికి, బుజ్జి ముండలు ముద్దోస్తూ బుజ్జి బుజ్జి వంకాయలు కంచం లో దర్శనమిచ్చాయి, కొంచెం ఆశ కలిగింది బాగా కుదిరిందని ఉత్సాహంగా కంచం ముందు చేరి.. భార్యతో..

"వహ్..జాను..కూర ఘుమ ఘుమ.. అంటూ .. "కూర నోట్లో పెట్టిన గున్నేశ్వర్రావు అడుగడుగునా దారాలు తగలడంతో హతాశుడయ్యాడు.. కోపంగా ఉరిమి చూస్తున్న భర్తకి.. కాయలు విడిపోకుండా దారం కట్టిన వైనం భయం భయం గా చెప్పింది.

ఈ వెధవ కూర తమ ఇద్దరి మధ్యా .. ఇనుప గోడలా తయారయ్యింది.. పాపం తననేం అనడంలేదు కానీ సర్వస్వం కోల్పోయిన వాడిలా.. అలా వుంటే తనకు మాత్రం ఏం బాగుంటుంది?ఇపైగా అత్తగారు ఒకటే బాధపడిపోతూ రోజూ క్లాసులే, అంత చదువు చదివిన దానివి.. ఈ మాత్రం చేత కాదా?... నీ కిష్టం లేదు కనుక చెయ్యడం లేదు ' అంటూ ఆలోచనల్లోంచి బయటకొచ్చింది భర్త వెర్రి కేకతో.. ఆశగా నోట్లో పెట్టుకున్న వంకాయ బయటకు వేలాడుతోంది.. ఉరి వేయబడ్డ దానిలా, పళ్ళ మధ్య ఇరుక్కుపోయిన దారం గట్టిగా లాగడంతో నాలిక తెగి గాయం అయి అంత గావు కేక పెట్టించింది.

"అయ్యయ్యో అంటూ గబ గబా చిన్న కత్తెరతో ఆ దారం కత్తిరించేసింది.. ఆ దారపు ఆధారం కోల్పోయిన ఆ వంకాయ ఉరి నుంచి జారి కిందపడిన పార్ధివ దేహం లా అమాయకంగా 'ఠప్పునా జారిపడింది.

నాలిక తెగి రక్తం ఓడుతుండగా, లబ లబలాడుతూ చన్నీళ్ళతో నోరు కడుక్కుంటున్న భర్తని జాలిగా , నీళ్ళు నిండిన ఇంతలేసి కళ్ళతో.. భయం భయం గా చూస్తూ వుండిపోయింది.

కాస్త నెమ్మదించాకా.. బెదురు బెదురుగా దగ్గరకొచ్చిన భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకుని ..

"అది కాదురా జానూ.. చిన్నప్పటి నుండి తిని తిని బాగా బోర్ కొడుతోంది కానీ నువు ఇంక వంకాయ్ వండటం మానేసి ఇంకేదయినా ట్రై చేయి " అనునయన్ గా చెప్పాడు నోరు మండుతున్నా.

"అది కాదండీ.. రోజూ షేప్ లేకుండా ముద్ద ముద్దగా అయిపోయి కాయలన్నీ విడిపోతున్నాయి కదాని, వంకాయలో కారం కూరాకా.. కాయ చొట్టూ దారం చుట్టా విడిపోకుండా.. తింటుంటే దారం తీసేయొచ్చు కదాని ఇలా అవుతుందనుకోలేదు, సారీ అండి.. నా వల్లనే మీకు ..." అంటూ గొల్లుమంది.

"పోనీ , సెల్ టేప్ వేసి వుండాల్సింది..." ఓదారుస్తూనే మంటగా  "నిజమేనండోయ్... ఆ ఆలోచన రాలేదు సుమీ, రేపు అలా చేస్తా, అదయితే ఇలా తెగే ప్రమాదం వుండదు..." కళ్ళు తుడుచుకుంటూ ఉత్సాహంగా అన్నది.

"నా తల్లో.. ఏదో రకంగా నన్ను హింసించడానికే కంకణం కట్టుకున్నావా? ... దేముడా.. ఎందుకిలా నా మీద పగబట్టావ్?" అనుకుంటూ శతవిధాల ప్రయత్నించాడు. శ్రీమతి ఇలా వంకాయా కూరతో దాడి చెయ్యకుండ, అబ్బే .. వింటేనా? రోజురోజుకీ ఆ చిత్ర హింస భరించలేక, తట్టుకోలేక.. 'వంకాయా అన్న మాట వినబడితే కాదు కలలో కొచ్చినా అదిరిపోసాగాడు.

ఎలాగో నాలుగు నెలలు గడిచాయి.. ఉగ్రవాదం కన్నా టెర్రర్ లా మారింది అతనిలో ఈ భయం. అప్పుడొచ్చింది అతనికి మెరుపులాంటి ఐడియా, వెంటనే బాసుని బతిమాలి వారం రోజులు సెలవు తీసుకుని భార్యా సమేతుడై ఇండియా వచ్చాడు, ఇంటికి కాదు..."కాశీకి" అక్కడికి వచ్చిన వాళ్ళు తమకిష్టమైన దాన్ని వదిలేస్తారుగా.. అందుకు.

వేరే చెప్పాలా పాపం పూర్ గున్నేశ్వర్రావు... కాశీలో తనకిష్టమైన.. "వంకాయ్" వదిలేసాడనీ... ఆ విధంగా తన "చిత్ర హింసల " ప్రహసనాన్ని తప్పించుకున్నాడనీ మొత్తానికి ఆ విధంగా తన మొగుడి 'వంకాయ కూరా అనే 'పిచ్చి పిచ్చి వంటా అనే ప్రయోగాలతో వదిలించిన జాహ్నవి ఒకింత జాలి గానూ, మరింత ఆనందం గానూ నిట్టూర్చింది. "హమ్మయ్య" అనుకుంటూ      
  
    

 

 

 

 

 

మరిన్ని కథలు
nashtamlo labham