Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

atulitabandham

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue151/429/telugu-serials/atulitabandham/atulitabandham/

 

“ఏమిటే ఐశూ, ఇంత లేటు? ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? బయటేమో కుండపోత వర్షం... ఎలా వస్తావో ఏమిటో అని ఎంత  భయమేసిందో...” కంగారుగా అడుగుతున్న మధుబాలకి “అక్కడే లేట్ అయిందే...అమల గారి మరిది దింపాడు...” క్లుప్తంగా చెప్పి బట్టలు మార్చుకుంది.

“ఇంతకీ నువ్వెలా వచ్చావే?” ఐశ్వర్య ప్రశ్నకు, నవ్వేసింది మధుబాల.

“అసలు వెళ్ళలేదు. నా ఉద్యోగం నిన్ననే ఊడిందిలే...” అభావంగా చెప్పింది.

“ఎందుకు మధూ?” ఆశ్చర్యం గా అడిగింది ఐశ్వర్య.

“వాళ్ళకిప్పుడు మనిషి వద్దుట... అంతే చెప్పారు... రేపటి నుండీ మరోటి వెదుక్కోవాలి...అరె, పడుకుంటున్నావేమిటి? అన్నం తినవా?”

“అక్కడే తినేసానే, అమల గారు చాలా బలవంతం చేసారు... నువ్వు తిన్నావా?”

“లేదు... కాని ఆకలి కూడా లేదు... అరటి పళ్ళు ఉన్నాయి తింటానులే...”

“సారీ మధూ... నువ్వు ఎదురు చూస్తావని తెలిసి కూడా హాస్టల్ కి ఫోన్ చేసి, నీతో  ఆలస్యం అవుతుందని చెప్పలేకపోయాను... ప్లీజ్, నువ్వు కాస్త తినేయ్... రా, నే తోడుంటాగా...” మెస్ నుంచి తెచ్చిన కారేజీ విప్పి కంచం లో అన్నం వడ్డించింది మధు వద్దని అంటున్నా సరే...

ససేమిరా అన్న స్నేహితురాలిని బుజ్జగిస్తూ, అన్నం కలిపి తినిపించసాగింది...

“అమ్మ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఓ ఐశ్వర్యమ్మా, నా పిల్లల్ని నువ్వే పెంచాలమ్మా...” అంటూ నవ్వింది మధుబాల.

తానూ నవ్వేసి, “నువ్వే అమ్మవు నాకు... అన్ని విషయాల్లోనూ...” అంది ఐశ్వర్య.

కబుర్లు చెబుతూ మధూ నిద్రపోయినా ఐశ్వర్యకు ఎందుకో త్వరగా నిద్ర రాలేదు. కార్తీక్ రూపం, అతని మాటలూ గుర్తు రాసాగాయి...

***

వద్దు వద్దంటున్నా తన దగ్గర డబ్బు ఉన్నదంటూ కాలేజీ ఫీజు మధు కట్టేసింది... ఐశ్వర్యకు ఏం చేయాలో కూడా తెలియలేదు... అందుకే నెచ్చెలిని కౌగలించుకుని కన్నీరు పెట్టుకుంది.

“అయామ్ సారీ మధూ... నీ పరిస్థితీ అంతంత మాత్రమే అని తెలిసి కూడా... ప్రతీ సారీ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. నన్ను క్షమించు... నీ ఋణం ఎలా అయినా తీర్చుకుంటానే... నన్ను నమ్ము...” అంది గద్గద స్వరంతో.

వారానికి మూడు సార్లు రూపకు ట్యూషన్ చెబుతున్నప్పుడు ఏదో వంకతో వస్తున్నాడు, కార్తీక్.  వచ్చినప్పుడల్లా రూపతో మాట్లాడుతున్నా అతని చూపులు మాత్రం ఐశ్వర్య చుట్టూనే తిరిగేవి.

ఎంతో ఇబ్బందిగా ఉన్నా ఎందుకో అతను  అలా చూడటం ఒక రకమైన  గిలిగింతగా తోచేది ఐశ్వర్యకు. అయితే, కార్తీక్ జీవనవిధానం అసలు నచ్చలేదు ఆమెకు ... మంచి జీతం, మంచి హోదా... మంచినీళ్ళలా డబ్బును ఖర్చు చేసే మనస్తత్వం... వీకెండ్ పార్టీలకే బోలెడు డబ్బును తగలేస్తాడు. ‘లేని వాడు లేక ఏడుస్తుంటే, ఉన్నవాడు తినలేక చచ్చాడట!’ తన అమ్మమ్మ చెప్పే సామెత గుర్తు వచ్చింది.

రెండు వారాలు గడిచిన తరువాత ఓ శనివారం నాడు ట్యూషన్ ముగించుకుని వస్తుంటే వరండాలో ఎదురు పడ్డాడు కార్తీక్...

“అప్పుడే వెళుతున్నారు? ఇంకా ఏడే అయింది...”

“అవునండి... పాఠం చెప్పటం అయిపోయింది...”బిడియంగా చెప్పింది ఐశ్వర్య.

“సరే రండి, నేను నెహ్రూ నగర్ వెళుతున్నాను... మిమ్మల్ని  డ్రాప్ చేస్తాను...”

“నేను బస్ లో వెళతాను లెండి...” ముందుకు కదలబోయింది.

“ప్లీజ్... నేనూ అటే వెళుతున్నాను కదా... రండి...” కారు ముందు డోర్ తెరిచి పట్టుకోవటంతో ఇక సభ్యత కాదేమోనని కారెక్కింది ఐశ్వర్య.

అటువైపుగా వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని డోర్ వేసి, కారు స్టార్ట్ చేసాడు కార్తీక్.

మెల్లగా కారును పోనిస్తున్నాడు.

ఎందుకో తెలియదు కానీ ఐశ్వర్యకు కొద్దిగా అనీజీగా తోచింది. అతను తన క్లాస్ మేట్ కాదు, కొలీగ్ కాదు, స్నేహితుడూ కాదు... తగుదునమ్మా అని తాను అతని కార్లో రావటం ఏమిటి? తన మీద తనకే చిరాగ్గా అనిపించింది.

“ఏమిటి, ఏమైంది?” ఆమె ముఖంలోకే పరీక్షగా చూస్తూ అన్నాడు, కార్తీక్...

“అబ్బే, ఏం లేదు...”

“అందమైన ఆడపిల్లలు అబద్ధాలు చెప్పినా అవి అందంగానే ఉంటాయి...” ఐశ్వర్య ముఖం ఎర్రబడటంతో... “అని ఎక్కడో చదివాను...” అని ముగించాడు...

ఐశ్వర్య మాట్లాడలేదు... మౌనంగా ఉండిపోయింది...

“రేపు మీ ప్రోగ్రాం ఏమిటి?” అన్నాడు.

“ఏముంది? బట్టల ఉతుకుడు కార్యక్రమం...” చెప్పింది ఐశ్వర్య...

గలగలా నవ్వేసాడు కార్తీక్...

“ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళరా? ఆదివారం కూడా హాస్టల్ లోనే ఉంటారా?”

“అవునండి... వారంలో పెండింగ్ పనులన్నీ అప్పుడే చేసుకుంటాం కదా... బట్టల పనీ, చదువూ, బజారు పనులు లాంటివి...”

“ఓహ్... ఈ వారం నేను మా ఫ్రెండ్స్ కి చిన్న ట్రీట్ ఇస్తున్నాను... మీరూ రావాలి మరి...”

“ట్రీటా? ఇవ్వండి... మీ పార్టీకి రావటానికి నేను మీ ఫ్రెండ్ ని కాను కదా...”

“ఎందుకు కారు? నేను ఫ్రెండ్లీ గానే పిలుస్తున్నాను... మీరే నన్ను మీ ఫ్రెండ్ గా స్వీకరించటం లేదు...”

“చూడండి, కయ్యానికీ, వియ్యానికీ ఇంకా నెయ్యానికి కూడా సమ ఉజ్జీ కావాలండి... మేమెక్కడ, మీరెక్కడ? స్నేహం చేయటానికి మన మధ్య ఎన్నెన్నో అంతరాలు...”

“భలేవారే, నాకు అలాంటి తేడాలు ఏమీ లేవండి... మన మధ్య స్నేహం పెరగాలని ఆశిస్తున్నాను... అందుకే రేపు పార్టీకి రండి... ప్లీజ్... నాకోసం...”

కరగబోతున్న మనసును చిక్కబట్టుకుంటూ, “వీలు కాదులెండి రేపు... మరెప్పుడైనా వస్తాను... మా హాస్టల్ వస్తోంది... కారాపండి...” అంది ఐశ్వర్య...

“నన్ను డిజప్పాయింట్ చేస్తున్నారు...” కినుకగా అన్నాడు కారాపుతూ...

“థాంక్స్ ఫర్ ది లిఫ్ట్ అండీ... జాగ్రత్తగా వెళ్ళండి...” కారు దిగి చేయి ఊపి హాస్టల్ లోపలి వెళ్ళిపోయింది ఐశ్వర్య.

***

భోజనం చేస్తున్నప్పుడు జరిగిందంతా చెప్పింది ఐశ్వర్య. వింటున్న మధుబాల, “పాపం పిలుస్తున్నాడుగా, వెళ్ళరాదూ?” అంది నవ్వుతూ...

“ఛ, మనకెందుకే అలాంటి పార్టీలు? అందులోనూ మగవాళ్ళతో... ఉహు...” తల అడ్డంగా తిప్పింది.

“సరే, సినిమాకి వెళదాం మనం...” అంది మధుబాల...

“మైగాడ్... నువ్వు సినిమాకా? నమ్మలేకపోతున్నాను అమ్మమ్మా.. ఇంతకీ ఏం సినిమా అది?”

“పాత సినిమా... పాండవ వనవాసం...చాలా బాగుంటుంది...”

“ఓహో... నువ్విలాంటి సినిమాలు తప్ప చూడవు కదూ? అలాగేలే వెళదాం...” చెప్పింది ఐశ్వర్య.

అయితే మర్నాడు ఉదయమే మధుబాల ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ కాల్ రావటంతో హడావుడిగా ఊరికి బయలుదేరింది, ఐశ్వర్యకు లక్ష జాగ్రత్తలు చెప్పి.

***

మధుబాల వెళ్ళేసరికే అనంతరామయ్యను   హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ఆయన స్కూలు టీచరు. ముందురోజు క్లాసులో పాఠం చెబుతూ ఉండగానే ఉధృతంగా గుండెల్లో నొప్పి వచ్చింది. ఉన్నపాటున కూలబడిపోయిన ఆయన్ని స్కూలు యాజమాన్యమే హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడినుంచి ఆయన కొడుకుకు ఫోన్ చేసి విషయం చెప్పారు.

సరియైన సమయానికి హాస్పిటల్ కి తీసుకురావటం వలన అనంతరామయ్యకు ప్రాణాపాయం తప్పింది. కాని నలబై ఎనిమిది గంటలు గడిస్తే కాని ఏమీ చెప్పలేమని అన్నారు.

మధు ఊరిలోకి రాగానే ఎదురు వచ్చిన పక్కింటి కుర్రాడు, గిరి శిష్యుడూ అయిన  సాల్మన్ ఆమె చేతిలోని బాగ్ ని అందుకున్నాడు. “ఏరా సాల్మన్, నాన్నగారికి ఎలా ఉందిరా?” ఆరాటంగా ప్రశ్నించింది మధుబాల.

“ఇప్పుడు ఫర్వాలేదు అక్కా... నిన్న చాలా సీరియస్  అన్నారు డాక్టర్ గారు...” చెప్పాడు వాడు.

ఇంట్లోకి అడుగు పెడుతూనే మధుని గట్టిగా పట్టుకుని ఏడవసాగింది పూర్ణమ్మ.

“ఊరుకో అమ్మా, ఊరుకో... గండం తప్పింది కదా...” తన కన్నీళ్లు ఆపుకుంటూ తల్లిని ఓదార్చింది, మధుబాల.

దుఃఖం నుంచి తేరుకున్నాక, తనను తాను కాస్త సంబాళించుకొని, కూతురికి కాఫీ కలిపి ఇచ్చింది పూర్ణమ్మ.

“అమ్మా, అక్కలకి  కబురు పెట్టారా?”

“వాళ్ళిద్దరికీ నిన్న అన్నయ్య ఫోన్ చేసాడమ్మా, సాయంత్రానికి వస్తారేమో...”

అక్కడే నీరసంగా పడుకుని ఉన్న నాన్నమ్మ దగ్గరికి వెళ్లి కూర్చుని ఆమె చేతిని మెల్లగా తాకింది మధుబాల. ఆమె కళ్ళు తెరచి, మధును గుర్తించింది.

“ఎప్పుడొచ్చావే బుజ్జీ?” అంది నీరసంగా...

“ఇప్పుడే నానీ... ఎలా ఉన్నావు?”

“నాకేమే, చూసావా మీ నాన్నకి గుండెల్లో నెప్పట... కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నాను... ఆ మాయదారి దేవుడు నన్ను ఎత్తుకుపోకూడదూ?” ఒక్కసారిగా దగ్గుతెర ఆమెను కమ్మేసింది.

“అయ్యయ్యో, అత్తా... ఏమిటిది?” పూర్ణమ్మ  త్వరత్వరగా వచ్చి ఆమెకు మంచి నీళ్ళు ఇచ్చి, పడుకోబెట్టింది.

హాస్పిటల్ కి వెళ్లి తండ్రిని చూడగానే మధు కళ్ళలో కన్నీరు కాలవలు కట్టింది.

బాగా చిక్కిపోయాడు తన తండ్రి... వయసు మీద పడుతోంది... జంట దయ్యాల్లా బీపీ, షుగరూ ఆయన్ను పీక్కు తింటున్నాయి. వచ్చే ఏడాది రిటైర్ అవుతాడు. ఈలోగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాలని సంబంధం కుదుర్చుకున్నారు కూడా... పక్క ఊరిలోనే స్కూలు హెడ్ మాస్టారి అమ్మాయి నిర్మలతో... నిశ్చితార్థం కూడా అయింది... ముహూర్తం వచ్చే నెలలో అనుకుంటున్నారు... ఈలోగానే ఇలా అయింది...

దీనంగా మంచం మీద పడుకుని ఉన్నాడు అనంత రామయ్య. అతని చేతికి అమర్చిన గొట్టం లోంచి సైలైన్ బాటిల్ లో ఉన్న ద్రవాలు శరీరంలోనికి వెళుతున్నాయి. నిద్రకు మందు ఇచ్చినట్టున్నారు...

తల్లినీ చెల్లెల్నీ చూసి, కుర్చీలో కూర్చుని ఉన్న గిరి లేచాడు...

“ఎలా ఉన్నావని” చెల్లెల్ని అడిగి, “ఇందాకే పడుకున్నారమ్మా...” అని తల్లితో చెప్పాడు.

“బాగా బెంగ పెట్టుకున్నాడమ్మా... ఇప్పటికి గండం దాటినట్టే... మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. కాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి... జాబ్ కి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టటమే మంచిదేమో...” దిగులుగా అన్నాడు గిరి.

గిరి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుని,  తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది, మధుబాల. చిన్నతనం నుండీ తమ కోసం ఎన్నో కష్టాలు పడ్డ చేతులు... దిగువ మధ్యతరగతి బ్రతుకులు... సరిగ్గా రాని బడి పంతుళ్ళ జీతాలు... అయినా ఏనాడూ తిండికి బట్టకూ, చదువుకూ లోటు లేకుండా చూసుకున్నాడు...

తన చిన్నప్పుడు నాన్నతో షికారుకు వెళ్లి కాలువ గట్టు మీదనుంచి జారి నీళ్ళల్లో పడి కొట్టుకు పోతూ ఉంటే ఈత రాకపోయినా ఆయన కూడా  నీళ్ళల్లో దూకి తనను పట్టుకుని గట్టు మీద కూర్చోబెట్టి తాను మునిగిపోతూ ఉంటే అటు వచ్చిన ఎవరో ఆయన్ని రక్షించారు... ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఏదైనా జాబ్ చేస్తానని ఆ తర్వాత ప్రైవేటు గా చదువుకుంటానని తానంటే అందుకు ఒప్పుకోకుండా పట్నంలో ఉంచి డిగ్రీ చదివిస్తున్నాడు...

అక్కలకి కూడా చాలా మంచి సంబంధాలే చూసి చేసాడు పెద్ద పెద్ద కట్నాలిచ్చి... అయినా ఎప్పుడూ డబ్బు కోసం గొడవలే బావలిద్దరూ.... తమను పెంచి పెద్ద చేసిన తమ తండ్రి ఈరోజు ఇలా... మళ్ళీ మధుబాల కనులు నిండు కొలనులైనాయి.

“చెల్లాయ్, ఎందుకురా కన్నీళ్లు? బాధ పడకు... నాన్న మళ్ళీ మనకి దక్కారు అంతే చాలు...నువ్వు  భోజనం చేయలేదట కదా... నేను నాన్న దగ్గరుంటాను... నువ్వు అమ్మతో వెళ్లి భోజనం చేసి కాసేపు పడుకుని రా...” సముదాయిస్తూ అన్నాడు గిరి.

“అన్నయ్యా... నాన్నకి ఏమీ ప్రమాదం లేదు కదా... చూడు ఎంత చిక్కిపోయాడో... ఎలా అయిపోయాడో...” దిగులుగా అంది మధుబాల.

“లేదురా, ఆ ప్రమాదం తప్పింది... అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్ లో ఉంచమన్నారు డాక్టర్ గారు. అంతే...డోంట్ వర్రీ...”

“సరే అన్నయ్యా...” కళ్ళు తుడుచుకుంది మధుబాల.

“నేను ఇక్కడ ఉంటానురా గిరీ, అదెప్పుడు తిందో ఏమో, చెల్లాయిని తీసుకువెళ్ళి, మీరిద్దరూ అన్నం తినేసి రండి...” అంది పూర్ణమ్మ.  

“అదేమిటమ్మా, నువ్వూ తినలేదు కదా...” అంది మధుబాల.

“ఫర్వాలేదమ్మా, అన్నయ్య నాకు తీసుకువస్తాడులే...మీరు బయలుదేరండి...” అందావిడ కుర్చీలో కూర్చుంటూ... ఆమె కళ్ళలో కదలాడుతున్న బాధను, భయాన్ని చూస్తుంటే మధుబాల మనసు నీరైపోయింది.

“అమ్మా... నాన్న తప్పకుండా కోలుకుంటారు... నువ్వలా అయిపోకే... ఎంత చిక్కిపోయావో తెలుసా? నువ్వు బాగుంటే నాన్నతో పాటుగా అందరం బాగుంటాము...” తల్లి చేయిని పట్టుకుని చెబుతూ ఉంటే, ఆర్తితో మధుబాల గొంతు పూడుకుపోయింది.

నీళ్ళు నిండిన కళ్ళతో తలూపింది పూర్ణమ్మ

***

 

 




 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam