Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue151/427/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/


ఇక ఏదీ దాచకుండా`

పూస గ్రుచ్చినట్టు తన అనుభవాన్నీ వివరించాడు ధనుంజయుడు. అది విని విస్మయ చిత్తుడయ్యాడు అపర్ణుడు.

‘‘దైవమా... ఇది యేమి సంభ్రమం? ఇది యేమి వింత అనుభవం. నమ్మలేకుంటినే. ఏమది? నాగరాజు తనయ ఉలూచీశ్వరిని కాపాడినావా! అశ్వత్థామ వారిని కలుసుకొంటివా...’’

‘‘మిత్రమా! నేను సత్యమే జెప్పినాను.’’ అంటూ అపర్ణుడి మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు ధనుంజయుడు.

‘‘జరిగినది ఆశ్చర్య జనకమే గాని వాస్తవము. ఇప్పటికీ నాగ రాకుమారి ఉలూచీశ్వరి రూప లావణ్యాలను మరువ లేకున్నాను’’ అన్నాడు.

‘‘ఆహాఁ... వలచినారని చెప్పండి. ఇప్పటికే నాగరాజు మీ మీద ఆగ్రహిం చెంది వున్నాడు. దివ్య నాగమణితో బాటు తన తనయను కూడ మీకు ఇచ్చునా యేమి?’’ పరిహాసంగా నవ్వాడు అపర్ణుడు.

‘‘లేదు లేదు. వలపు నాది మాత్రమే. ఆమెది కాదు సుమా! ఆ కోమలి మనసున ఏమున్నదో ఎవరికెరుక?’’

‘‘బాగు బాగు. మరి ఆ భద్రా దేవిని కూడ మరు వలేకుంటినంటిరే. ఇరువురినీ....’’

‘‘నేను క్షత్రియుడను అపర్ణా. నులుగురు భామలను వివాహమాడవచ్చును తెలుసునా?’’‘‘అనగా, ఇంకో యిద్దరు కూడ ఎక్కడో వున్నారని అర్థమా యేమి? అయిననూ యిలా నచ్చిన ప్రతి పడతి మీదా మనసు పారేసుకొనుట మీ వంటి వీరునకి తగదని నా అభిప్రాయం. మీరు నాగకన్యను వరించుట సముచితమే గాని ఆ భద్రాదేవి మీకు తగదు. ఆ పేదరాలిని మర్చి పోవుట మంచిదని నా అభిప్రాయము.’’

‘‘పొర బడితివి మిత్రమా. ఆమె నను వరించిన పేదరాలు ఎటులగును? కాని ఆమె మనసున ఏమున్నదో ఎవరి కెరుక? రాసి పెట్టి వుంటే మాకు తప్పదు గదా.’’

‘‘కొన్ని తప్పించు కోవలె ప్రభు. భద్రా దేవి మీకు సరి తూగదు. ఆమెను మరిచి పోవుట మంచిది. మీరు కోరిన ఎందరు రాకుమార్తెలు లేరు?’’

‘‘ఉన్నారు. కాని మనసును దోచిన మగువ కావాలి గదా. భద్రాదేవి.... అది మరిచి పోవు సౌందర్యమా. నీకు చీర కడితే మీ యిరువురూ అందము నందు పోటీ పడగలరు తెలుసునా?’’

‘‘అయ్యో ప్రభు. పురుషుడను నాకు చీర కట్టాలని చూడవలదు.’’ అంటూ ఫక్కున నవ్వేసాడు అపర్ణుడు. అతడి నవ్వుతో తనూ శృతి కలిపాడు ధనుంజయుడు.

‘‘అది సరి మిత్రమా. ఈ నిశీధి వేళ కూడ నీ శిరమున ఆ తలపాగా అవసరమా? తీసేయ వచ్చు గదా!’’ నవ్వు ఆపి అడిగాడు.

‘‘వీలు కాదు ప్రభు. ఇది మా వంశాచారము.’’ వెంటనే బదులిచ్చాడు అపర్ణుడు.

‘‘ఓహో... అలాంటి వంశం గురించి మేము ఎన్నడూ విన్నది లేదు. తలపాగా వంశము. మంచిది. ఆచారాలను మన్నించ వలె. ఇంతకూ నీకు ఖడ్గ విద్య ఒక్కటేనా వేరే విద్యలు కూడ వచ్చునా?’’

‘‘మలు విద్య, కర్ర సాము వచ్చును. మల్ల యుద్ధం అని, కుస్తీని అడక్కండి. నాకవంటే చిరాకు.’’

‘‘ఓహో... నీ గురువు ఎవరు?’’

‘‘మా తండ్రి గారు’’

‘‘మీ తండ్రి గారా?’’

‘‘అవును ప్రభు. మా తండ్రిగారే... వారి వద్దే అభ్యసించినాను’’

‘‘ఇంతకూ మీ తండ్రి గారి నామ ధేయము....?’’

‘‘వారే లేరిపుడు. వారి పేరుతో పనేమిలే ప్రభు!’’

కొన్ని లిప్తల కాలం అపర్ణుని ముఖాన్ని గమనించాడు ధనుంజయుడు. వెన్నెల్లో ముఖ భావాలు తెలియ రాలేదు. కాని తను ఇంతగా అతడి సొంత విషయాలు అడగటం అతనికిష్టం లేదనిపించింది. వెంటనే విషయాన్ని మారుస్తూ`

‘‘అవును గాని, చాలా సేపటిగా ఆలోచిస్తుంటి. నన్ను జంపవచ్చిన ద్రోహలు ఎవరి పనుపున వచ్చి వుంటారు? అర్థం గాకున్నది. శవము వద్ద ఆధారము కూడ ఏమీ చిక్క లేదాయె’’ అన్నాడు.

‘‘అవును ప్రభు. దొరక లేదు. ఆధారము లేక ఎవరి మీదనూ నిందారోపణలు చేయ రాదు గదా!’’ అన్నాడు నర్మ గర్భంగా అపర్ణుడు.ఆ మాటలు ధనుంజయుని ఆలోచింపజేసాయి. అపర్ణుడి మనసులో ఏదో సంశయం వుంది. చెప్పటం లేదు.

‘‘నీ పలుకులకర్థము ఏమి? నీవు ఎవరినో అనుమానిస్తున్నావనేగా? సంశయింపక చెప్పుము. ఎవరు వాళ్ళు?’’

‘‘సంశయం కాదు ప్రభు. సత్యమే. కాని ఇప్పుడు ఆధారాలు చూప లేను’’

‘‘అర్థం గాకున్నది. నేను ఆధారము అడుగను. నీకు తెలిసినది చెప్పుము.’’

కొద్ది సేపు మౌనంగా వుండి`

పిమ్మట నోరు విప్పాడు అపర్ణుడు.

‘‘వాళ్లు గూఢచారులు. నమ్మకమైన వేగులు’’ అన్నాడు.

‘‘ఎవరికి?’’

‘‘తమ ఉప సైన్యాధ్యక్షుడు బాహ్లీకునకు.’’

‘‘బాహ్లీకుడా!’’ విస్తు పోయాడు ధనుంజయుడు.

‘‘అవును ప్రభు. బాహ్లీకుడే. ఇంత వరకు వానిని ప్రభవు గాని, మీ మహా మంత్రి వాసు దేవ నాయకుల వారు గాని, మీ సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుల వారు గాని ఇసుమంతయు సంశయింపకున్నరు. బాహ్లీకుని కుచేష్టులు మీ చాయి కూడ కని పెట్ట లేకున్నారు.’’

‘‘కాని బాహ్లీకునికి సొంత వేగు ఎందుకు? ఆ అవసరం ఏమున్నది? అతడు చేస్తున్న కుచేష్టతము ఏమిటవి?’’

‘‘ప్రభూ. అవసరం ఏమిటో సహ్యాద్రి పై జరిగిన హాత్యా ప్రయత్నం జూచినారుగా. ఇంకనూ అర్థము కాలేదా?’’

అపర్ణుడు అంత నమ్మకంగా చెప్తూంటే యువరాజు ధనుంజయుడు నిశ్చేష్టుడయ్యాడు. బాహ్లీకుడి వినయ విధేయతలు శౌర్య పరాక్రమాలు తనకు తెలియనవి కావు. తన తండ్రి గారికి అతడి మీద భరోసా వున్నది. ఎవరూ అతడి రాజ భక్తిని అనుమానింపజాలరు. అలాంటి వాడిని ద్రోహీ అంటే ఎలా నమ్మేది? అపర్ణుడు బాహ్లీకుని గురించి తెలిసి నిందారోపణ చేస్తున్నాడా? తెలీక చేస్తున్నాడా తెలీకున్నది.

‘‘లేదు... లేదు మిత్రమా! నీవేదో పొరబడినట్టున్నావు. నీవు చెప్పినట్టు నిజము గనే ఆధారము లేక ఈ విషయమును నమ్మజాలను’’ అన్నాడు.

‘‘ప్రభూ! మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజము. ఇందుకే, మీరు నమ్మరని తెలిసే ఆధారము లేకుండా చెప్పనంటి. మీకు తెలుసునా? ఆ ద్రోహి తన చేతి కింద సైన్యం మొత్తాన్ని అవసరమగుచో తిరుగ బాటు చేయటానికి సర్వ సన్నద్ధంగా ఉంచుకున్నాడు. అంతర్యుద్ధానికి ఎంతో కాలం లేదు. పరిస్థితులను తనకు అనువుగా మలచు కొంటున్నాడు. రత్నగిరి గద్దె మీద కూచోవాలని కలలు కంటున్నాడు.’’
కొద్దిరోజుల క్రితం గాంధార రేడు శతానీకుడు రహస్యముగ వర్తక నౌకలో రత్నగిరి సముద్ర జలాల్లోకి వచ్చాడని, బాహ్లీకుడు ఆ నౌకలోకి వెళ్ళి శతానీకుడ్ని కలిసి, ఆ రేయంతా మంతనాలు జరిపాడని తెలిసినది. ఖచ్చితముగా వారి మధ్య ఏదో సైనిక ఒప్పందము జరిగే వుంటుంది. ఆలోచించండి యువరాజ!

మహారాజు పుట్ట వ్రణముతో నిస్సహాయుడై రాజ మందిరాన వున్నాడు. మీరు రాజధానిలో లేరు. కుట్ర దారులకి ఇంతకు మించి చక్కని అవకాశము ఏమి కావలె? మీరు తిరిగి వచ్చిన తన ఆటలు సాగవన్న భయంతోనే మిమ్మును రాజధాని బయటే అంతం చేయుటకు తన సొంత వేగుల్ని పంపించినాడు. బహుశ మీరు వెళ్ళు మార్గమందు మరికొన్ని దళాలు మీ కొరకు ఎదురు చూస్తూండ వచ్చు’’ అన్నాడు అపర్ణుడు.

ఆ మాటలకు విభ్రాంతి చెందాడు ధనుంజయుడు.

కుట్ర దారునకు ఇది అనుకూల సమయమే. అందులో ఎలాంటి సంశయమును లేదు. రత్నగిరి ఒక భయంకర యుద్ధాన్ని త్వరలో చూడనుందని అశ్వత్థామ వారు చెప్పనే చెప్పారు. కాని ఆ కుట్రదారు రాజ్యం బయటివాడు కాడు బాహ్లీకుడంటేనే నమ్మ శక్యం గాకుండా వుంది. ఇతడు చెప్పిన విషయము సత్యములైతే రానున్నది అంతర్యుద్ధము. బాహ్లీకునకు గాంధార రాజు శతానీకుని సైన్యం తోడయితే భయంకర వినాశనం తప్పదు. ఆ యుద్ధము ఎంత బీభత్సంగా వుంటుందో వూహించ లేము. అదలా వుంచితే`

ఒక సాధారణ రత్నగిరి వాసి అపర్ణుడు. అందునా బాలకుడు. ఇతడికి ఇన్ని విషయము ఎలా తెలిసినవి. తెలుసుకోవసిన అవసరం ఏమున్నది? ఒక వేళ ఇతడు గూఢచారి కాదు గదా... ఎవరి తరఫున పని చేస్తున్నాడు. గూఢచారి అయితే గూఢచర్యం వదులు కొని తన వెంట ఎందుకుంటాడు.

తేనె తుట్ట కదిలినట్టు యువరాజు ధనుంజయుని అనేక ప్రశ్నలు చుట్టు ముట్టి ఒకే మారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆలోచిస్తూ ఉత్తర దిక్కుగా చూస్తున్న ధనుంజయుడు పెద్ద ఉల్క ఒకటి మలుగులు చిమ్ముతూ నేలకు రాలటం చూసాడు. ఉల్కాపాతం రాజ్యానికి త్వరలో కీడును సూచిస్తుందంటారు. ముందు ముందు ఏమి జరగనుంది?

ఉన్నట్టుండి యువరాజు మౌనం వహించటం అపర్ణుడికి నచ్చ లేదు. ‘‘క్షమించండి ప్రభు. నేనూ మీకీ విషయము చెప్పి వుండ కూడదు. ఆధారము చూపకుండా విన్నవించిన మీరు నమ్మరని తెలిసి కూడ మనవి చేయుట నా తప్పిదమే. దీని వలన అనవసరముగా మీరు నన్ను గూఢచారినని సందేహించు పరిస్థితి ఏర్పడినది. నేను చారుడను గాను. వేగుడనూ గాను. రత్నగిరి పౌరుడను. రాజభక్తి, దేశభక్తి మెండుగా వున్న సామాన్యుడను. నేను ఏమి చేసినా అది రాజ్యం కోసం, మీ క్షేమం కోసం జేసినాను’’ అన్నాడు.

‘‘నీవు సామాన్యుడవు కావు. అంత కన్నా ఎక్కువే. చాలా ఎక్కువ. లేకున్న రాజ పరివారము, మంత్రుల, సైన్యాధికారుల గురించి ఇంత వివరముగా తెలియవు.’’

‘‘అందుకే నను మీరు సందేహ పడుతున్నారా?’’

‘‘నేను సందేహించుట లేదు మిత్రమా.’’

‘‘లేదు లేదు. మీరు సందేహించినారు. అందుకే ఆ మౌనం’’ అంటూ పడుకుని కంబళి ముసుగు తన్నేసాడు అపర్ణుడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్