Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ట్రీట్ మెంట్

treatment

"రాజేష్ నేను రమ్మనంగానే పార్క్ కు వచ్చినందుకు చాలా చాలా హాప్పీగా ఉంది. నిర్మానుష్యంగా, ఏ గొడవాలేని ఈ చెట్టుకింద మనిద్దరం మనసులు విప్పి మాట్లాడుకోవచ్చు. ఏవంటావు?"

"ఇట్స్ మై ప్లెజర్..నిజానికి ఇలాంటి అపర్చ్యునిటీ కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నాను. మన కాలేజీలో బ్యూటీ ఏంజెల్ వి. నీ కనుసన్నల్లో పడాలని ప్రతి కుర్రాడూ కల కంటాడు. నేను ఐ లవ్యూ చెప్పంగానే నీ ఎడం కాలిచెప్పు తీస్తావనుకున్నాను..అలాంటిది నన్ను ఈ పార్కుకు రమ్మనడం ఓహ్! నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను" రాజేష్ ఉబ్బి తబ్బిబ్బవుతూ మాటలను కూర్చాడు.

"అందగాడివి..డిస్టింక్షన్ తెచ్చుకునే భ్రైట్ స్టూడెంటువి, మర్యాదా మన్నన తెలిసినవాడివి..అందర్నీ చేసినట్టు, నిన్నెందుకు రఫ్ గా ట్రీట్ చేస్తాను? అయినా నీలాంటి వాళ్లని ఏ అమ్మాయి ఇష్టపడదు? అందుకే ఇలా పిలిచాను. అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకుంటూ..సివిల్స్ రాయాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నావని నాకు తెలిసింది. నేను మీ కాలేజీలో చేరినప్పటినుంచీ నీ దృష్టి నా వైపు మరలింది, ఎంతలా అంటే మళ్లీ నువ్వు పుస్తకం వంక చూడనంత. అందమైన అమ్మాయిగా నాకిది గర్వాన్ని కలిగిస్తోంది. అందమైన దాన్నయినంత మాత్రాన నాకు కట్నం తీసుకోకుండా సంబంధం రాదు. మధ్యతరగతి కేరాఫ్ గా వున్న మానాన్న భారీకట్నమిచ్చి ఘనంగా నా పెళ్లి చేయలేడు. ప్రస్తుతం మనని ఆకర్షణ కలిపింది. అది ముందు ముందు మనిద్దరి అభిరుచులూ, అభిప్రాయాలు కలిసి గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందుతుందన్నది నా ప్రగాఢ నమ్మకం. మధ్యతరగతి లో పుట్టి, మధ్యతరగతిలో పెరిగి, మధ్యతరగతిలో బతుకీడ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను చదువు మీద చాలా కాన్సంట్రేషన్ చేస్తాను. నువ్వు కూడా సివిల్స్ కి ప్రిపేరై మంచి పొజీషన్ సొంతం చేసుకోవాలి. వివాహానంతరం మనిద్దరి జీవితం అది లేదు, ఇది లేదు అని సరిపెట్టుకుంటూ కాకుండా నల్లేరు మీద బండి నడకలా హాయిగా ఆహ్లాదంగా సాగిపోవాలి. అందుకని నువ్వు చదవాలి..బాగా చదవాలి..అనుకున్నది సాధించాలి. సాధిస్తావా?"అంది ప్రత్యూష.
సాధిస్తానన్నట్టుగా తల ఊపాడు.

అంతే.. వేగంగా అతని దగ్గరకు వచ్చి గట్టిగా కౌగలించుకుని పెదాలపై తియ్యని ముద్దుని ముద్రించింది. ఇద్దరి వెచ్చని ఉఛ్వాసనిశ్వాసలు ముఖాలపై మధురిమల గిలిగింతలు రేపుతూ స్వర్గధామానికి దారి చూపుతూ ప్రేరేపిస్తున్నాయి. అతని చేతులు ఆమెలోని అణువణువునూ కాంక్షాపూరితంగా తడుముతూ, మదనోద్రేకం చెలియలికట్ట దాటుతుందనగా ఆమె అతన్నుండి విడివడి "సారీ, ఇది జస్ట్ అడ్వాన్స్. నీకూ నాకు మధ్య ఓ ప్లెజెంట్ డీడ్. నువ్వు సివిల్స్ రాసి నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నాక మనం మళ్లీ కలుద్దాం..నువ్వు అనుకున్నది సాధించగలవన్న నమ్మకం నాకుంది"అని చెప్పి హడావుడిగా హోండా ఆక్టివా ఎక్కి వెళ్లిపోయింది.

రాజేష్ జరిగింది కలా? నిజమా? అన్న మీమాంసలో చాలా సేపు అక్కడ ఉండిపోయాడు. శరీరంలోని మథుర ప్రకంపనలన్నీ అది నిజమేనంటున్నాయి.

నిదానంగా లేచెళ్లిపోయాడు.

*****

రాజేష్ కు చాలా సంతోషంగా ఉంది. సివిల్స్ కు సెలెక్ట్ అయ్యాడు. అదీ టాపర్గా. ప్రత్యూష ప్రేమను గోల్ గా పెట్టుకుని అసిధారావ్రతంలా, ధ్యేయంగా, దీక్షలా, తపస్సులా తపించి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు గర్వంగా ఆమెని కలవబోతున్నాడు. ఇంతకాలం కలవలేదు, మాట్లాడలేదు. ఇన్నాళ్లకి కలవబోతున్నాడు. మొదటిసారి కలిసినప్పుడు అద్భుతమైన అనుభూతిని ప్రెజెంట్ చేసింది. ఇప్పుడు గిఫ్ట్ గా ఏమిస్తుందో? అతనిలోని ప్రణయరూపి ‘మధురానుభూతులను ఎప్పుడెప్పుడు చవిచుడాలా’ అని  ఆత్రపడుతున్నాడు.

ప్రత్యూషను కలిశాడు. ఆమెలో ఏ మార్పూలేదు. అందం చెక్కు చెదరలేదు.

‘ప్రత్యూషా..నేను అనుకున్నది సాధించాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాను. ఇహ మన ప్రేమమయ భవిష్యత్తుకు ఢోకా లేదు..నువ్వు ఊ అంటే..మన పెళ్లి త్వరలో.."అన్నాడు ఉద్విఘ్నంగా.

"కంగ్రాట్యులేషన్స్ రాజేష్. నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధిస్తావని. ఇప్పుడు నేను చెప్పేది సావధానంగా విను. నువ్వు సివిల్స్ సాధించావంటే మనిషిగా గొప్ప పరిణతి సాధించావని అర్థం. ప్రేమకు, ఆకర్షణకు నీకిప్పటికే తేడా తెలిసుంటుంది. సాధారణంగా ప్రేమ జీవితాలని నాశనం చేస్తుందని లోకం అనుకుంటుంది. కాదని మనం ప్రూవ్ చేశాం. చాలా ఆనందంగా ఉంది. ఇహపోతే నిన్నే ప్రాణంగా, నువ్వే లోకంగా ప్రేమించే మరదలు నీకుందన్న విషయం తెలుసుకున్నాను, మీ కుటుంబానికి నువ్వే ఆధారం. ప్రేమ పేరుతో వాళ్లందరి ఆశలూ కల్లలవడం నాకిష్టం లేదు. అందుకే నీ దృష్టిని చదువు వైపు మరల్చాను. నేను ఆరోజు కాస్త అడ్వాన్స్ అయ్యాను. అది లవ్ ట్రీట్మెంట్. ఫలించింది. రోగం తగ్గాక దాక్టరును, వైద్యాన్ని మరచిపోయినట్టు, ఆ ఇన్సిడెంట్ ను మరచిపో. ఇహ నీదైన జీవితాన్ని ఆనందంగా గుడుపు. నన్ను ప్రాణాధికంగా ప్రేమించే బావ ఉన్నాడు. త్వరలో అతనితో నా పెళ్లి. నువ్వు తప్పక రావాలి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్."అని వెళ్లిపోయింది.

కొద్దిసేపు రాజేష్ మనసు శూన్యమయింది..కానీ క్రమంగా ఆ స్థానం అతని మరదలి రూపంతో భర్తీ అయిపోయింది.
సంతోషంగా ఇంటిదారి పట్టాడు..మెచ్యూర్డ్ రాజేష్! 


 

మరిన్ని కథలు
chedusneham