Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 గతసంచికలో ఏం జరిగిందంటే.. http://www.gotelugu.com/issue152/432/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/ 

 

ధనుంజయుడు ఒకింత చికాగ్గా చూసాడు.

‘‘మిత్రమా! ఇది అన్యాయము గదూ. నన్ను ఒంటిగా వదిలి నీవు నిద్ర పోవుట?’’ అనడిగాడు.

‘‘నిద్ర వచ్చుచున్నది ప్రభు.’’ ముసుగు లోంచే బదులిచ్చాడు అపర్ణుడు.

‘‘నిద్ర కాదు. నాపై కోపము.’’

‘‘నేను సామాన్యుడను. నాకు కోపము రాదు ప్రభు. అర్ధ రాత్రి లేపండి నేను కాపలా వుంటాను. మీరు నిద్ర పోవచ్చును. ఇక ఉదయం మీ దారి మీది, నా దారి నాది.’’

ఉలికి పడ్డాడు ధనుంజయుడు.

‘‘మిత్రమా ఏమంటివి? ఎవరి దారి వారిదా! ఇది యేమి అలుక?’’ అడిగాడు.

‘‘అలుక కాదు ప్రభు! ఆత్మాభిమానము. మీరు నను అనుమానించాక మీతో నేను రాలేను.’’

‘‘అయ్యో! అమ్మాయిలా ఈ కినుక ఏమిటయ్యా. ఆలోచించాను గాని, నిను అనుమానింప లేదు. నీవు వెళ్ళాల్సిన పని లేదు.’’

‘‘ఉదయమే వెళ్ళి పోతాను.’’

నెత్తి కొట్టుకున్నాడు ధనుంజయుడు.

ఆ తర్వాత పిలిచినా అపర్ణుడు పలుక లేదు.

బళ్ళెం ఒకటి అందుకుని కాపలా కూచున్నాడు.

అర్ధ రాత్రి దాటే సరికి అర్ధ చంద్రుడు అస్తమించి అడవంతా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. కీచు రాళ్ళ రొద కర్ణ కఠోరంగా వుంది. డొంకల వెంట మిణుగురులు ఎగురుతున్నాయి. నెగడు మండిస్తూ అప్రమత్తంగా కాపలా వున్నాడు ధనుంజయుడు. అంతలో అపర్ణుడు లేచి కాపలా బాధ్యత తను తీసుకున్నాడు. ధనుంజయుడు నిద్ర పోయాడు.

రేయి గడిచే కొద్ది చలిగాలులు అధికరించాయి. అయితే ఎలాంటి ఉపద్రవాలు ఎదురు గాకుండానే తెల్లవారింది. అడవంతా ధవళవస్త్రాలు అర వేసినట్టు తెల్లటి మంచు పరదాలు దిగాయి. సూర్యోదయమైన కొద్ది సేపటికి ధనుంజయుని మెలకువ వచ్చింది. అప్పటికే నెగడు ఆరి పోయింది. తూర్పు నుంచి సూర్యకిరణాలు దూసుకొస్తున్నాయి. ఇటు చూస్తే పక్కన అపర్ణుడు లేడు. అతడి అశ్వం ఢాకీని కూడా లేదు.

*********************************

ఉలికి పడి లేచి కూచున్నాడు ధనుంజయుడు.

అపర్ణుడు వెళ్ళి పోయాడని తెలీగానే ఎక్కడ లేని నిస్సత్తువ తనను ఆవహంచినట్టుయింది. మనసుకు బాధనిపించింది. వెళ్ళి పోవటం ఏమిటి? తను ఏమన్నాడని? కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళి పోడమేనా? జీవితాంతం తనకు తోడు వుంటాడని అశ్వత్థామ వారు చెప్పిన పలుకు అసత్యమేనా?

వెళ్ళి పోయాడు.

అలిగి వెళ్ళి పోయాడు.

ఆడపిల్లలా వీడికి ఇంత అలుక ఏమిటి?

అయినా తన పిచ్చి గాని అపర్ణుడు పురుషుడు కాదు, స్త్రీయని భీమశంకర క్షేత్రంలో తను చూసిన జవ్వని భద్రాదేవి ఇతడేనని ఒక సంశయం మనసున కుమ్మరి పురుగులా తొలుస్తూనే వున్నదే. సత్యము తెలుసుకొను లోపలే జారుకున్నాడు. అవకాశము చేజారినది.

అసలు ఈ అపర్ణుడి మీద క్షణ క్షణానికి తనలో పెరిగి పోతున్న అభిమానానికి కారణం ఏమిటి? అతడిలో ఒక్కో కోణము బయట పడే కొద్ది అతడి గొప్ప తనం అర్థమవుతోంది.

అతడిలో ఒక క్షాత్రవ వీరుడున్నాడు. ఒక మంత్రావాది వున్నాడు. గూఢచారి వున్నాడు. వెంట వెంటనే స్పందించి నిర్ణయాలు గైకొనే ఒక మంత్రి వున్నాడు. ఇంకా ఎవరెవరున్నారో గదా. ఒక్క మనిషిలో ఇన్ని కళలు సాధ్యమేనా...? అతడ్ని పరిపూర్ణంగా తెలుసుకునే లోపలే వదిలి పోయాడే... ఎంత దూరంలో వున్నాడో, ఎటుకెళ్ళి పోయాడో గదా. అంతు లేని ఆలోచనలతో కాసేపు అలాగే కూచుండి పోయాడు.

పక్షుల కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి. దిగువ లోయ లోతట్టు ప్రాంతాల నుండి శార్థూలాల ఘర్జనలు వినవస్తున్నాయి. అడవంతా మేల్కొంది. తను ముందుగా మేల్కొని వుంటే ఇలా జరిగేది కాదేమో.

సూర్యకిరణాలు వెచ్చగా శరీరాన్ని తాకుతున్నాయి. చలి తగ్గు ముఖం పట్టింది. లేచి సొరకాయలో నీటితో ముఖ ప్రక్షాళనం గావించుకొని మంచి నీరు త్రాగాడు. ఇంతలో నెమ్మదిగా గుట్ట మీదికి వస్తున్న అశ్వం గిట్టల శబ్ధం విన్పించింది.

ఉలికి పడి అటు చూసాడు.

అశ్వం ఢాకినీ గుట్ట పైకి వస్తూ కన్పించింది.

ఆ మచ్చల అశ్వం మీద అపర్ణుడు చిరునవ్వుతో బాలభానునితో పోటీ పడుతున్నట్టున్నాడు. ఎక్కడికెళ్ళాడో గాని చక్కగా స్నానం చేసి దుస్తులు మార్చుకుని తాజాగా మరింత అందంగా కన్పిస్తున్నాడు. అపర్ణుడు తనను వదిలి పోలేదని తెలీగానే చాలా సంతోషం కలిగింది. కాని ఆ సంతోషాన్ని బయటికి చూపకుండా గంభీరంగా చూసాడు ధనుంజయుడు.

‘‘వెడలిన వాడివి వెళ్ళి పోవచ్చును గదా. మరలి వచ్చుట ఎందుకో. ఇదేమి చోద్యము?’’ స్వగతంలా పైకి అన్నాడు.

‘‘వెళ్ళి పోతానని చెప్పితినా ఏమి? ఎవరి మీద ప్రభూ ఈ అలుక?’’ అశ్వం దిగకుండానే ఓ కాలు రెండో వైపు వేసి కూచుని విలాసంగా నవ్వుతూ అడిగాడు అపర్ణుడు.

‘‘నీ మీదనే అలుక. వేరే చెప్ప వలెనా? అనృతము వేరేనా? రాతిరి నీవు చెప్పినావుగా... ఎవరి దారి వారిదంటివి. ఆత్మాభిమానమంటివి. ఉదయమే వెళ్ళి పోతానంటివి. వెళ్ళినావుగా.’’ నిష్టూరంగా అడిగాడు.

ఫక్కున నవ్వాడు అపర్ణుడు.

‘‘అయ్యో! నా మాటలు బాగుగనే గురుతున్నవి తమకు. కాని రాతిరి మాటలకు పగలు విలువనివ్వ రాదని తమకు తెలీదా ఏమి? అయినను మిమ్ము విడిచి ఎటు పోగలను? మీ అంగరక్షకునిగా ఉంటానని మాట ఇచ్చితిని గదా. మీకు తెలుసా? మాది మాట తప్పు వంశము గాదు.’’ అన్నాడు బింకంగా.

‘‘ఓహో... బెదిరించే వంశమా....’’ వెక్కిరించాడు ధనుంజయుడు.

‘‘కాదులే... భయపెట్టే వంశము.’’

‘‘భయమా... నన్నా....!’’

ఇద్దరూ ఒకేసారి నవ్వుకున్నారు.

‘‘క్షమించండి ప్రభు. గాఢ నిద్రలో వున్న మిమ్ము లేపుటకు ఇష్టం లేక నేనే వెళ్ళి స్నానాదుల ముగించుకొని వచ్చితి’’ అన్నాడు.

‘‘స్నానమా... దవ్వుల నీటి చెలమ కూడ కనబడలేదు...’’

‘‘మీకు కనబడవు. కాని అడవులన్నీ నాకు కొట్టిన పిండి గదా. నాకు తెలుసు. రండు.’’

ఎలా తెలుసని అడగలేదు ధనుంజయుడు. అడవులన్నీ తనకు కొట్టిన పిండియని చెప్పనే చెప్పాడు గతంలో. తను అశ్వాన్ని అధిరోహించి అపర్ణుడిని అనుసరించాడు. గుట్ట దిగి కాస్త దూరం ముందుకెళ్ళగానే ఎడం పక్కగా లోనకు చిన్న జల పాతం ఒకటుంది. తెలిసిన వారికి తప్ప బాటసారులకు అది కనబడదు.

 

ధనుంజయుడు కాకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి సిద్ధమైన కొద్ది సేపటికి అపర్ణుడు అరటి పండ్లు, జామ, పనప పండ్లు తీసుకొచ్చాడు. ఇద్దరూ భుజించి వలసినవి సంచిలో వేసుకుని తిరిగి ప్రయాణమయ్యారు.

అశ్వాలు రెండూ ఒకదాని వెనక ఒకటిగా ముందుకు సాగాయి. అది శంఖు మార్గం. రాళ్ళు రప్పలతో కూడిన కొండ దారి. సముద్ర మట్టానికి చాలా ఎత్తయిన ప్రాంతం. అదీ లోయ వంచ వెంట సాగేప్పుడు బహు భద్రంగా వుండాలి. ఏ మాత్రం చిన్న పొరబాటు జరిగినా అశ్వాలతో సహా అఖాతం వంటి లోయల్లోకి జారి పోవలసిందే. అలాంటి చోట బాహు నెమ్మదిగా సాగాలి. విశాలమైన దారుల్లో పరుగు తీయాల్సిందే.

ఈ మార్గం కష్ట తరం గాబట్టి భక్తుల రాకపోకలు తక్కువే. దారిలో ఒకటి రెండు భక్త బృందాలు మాత్రం ఎదురయ్యాయి.

ఎక్కడా నిలవకుండా ప్రయాణం సాగించిన ధనుంజయ, అపర్ణులు సహ్యాద్రి కనుమ తూర్పు పాదం లోని అంబా పురం చేరుకునే సరికి కను చీకటి పడింది. సందె వెన్నెల గాబట్టి అక్కడ ఆగకుండా రాజ మార్గంలో సాగి పోదామనుకున్నప్పటికీ అశ్వాలు కొండ దారుల్లో బాగా అలసిపోయి వున్నాయి. వాటి విశ్రాంతి కోసమైనా అక్కడ మజిలీ చేయాలి.

ఆ రాత్రికి అక్కడే బస చేసారిరువురు.

తిరిగి మరునాడు సూర్యోదయం తోనే ప్రయాణం ఆరంభమైంది. అంబా పురం నుండి తూర్పుగా ఏడు రోజుల ప్రయాణ దూరంలో మాళవ రాజ్య సరిహద్దు వుంది. అక్కడ నుండి ఆగ్నేయంగా చీలిన మరో మార్గం రాజధాని అవంతికి చేరుస్తుంది. నేరుగా వెళ్ళు మార్గం క్రమంగా ఉత్తరానికి తిరిగి వింధ్యా పర్వతాలకు చేరుస్తుంది.

రెండు రోజుల ప్రయాణ దూరం వరకు దారి పోడవునా పల్లెలు, గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు అక్కడక్కడా పంట భూములు ఎదురయ్యాయి. మూడో రోజు నుండి తిరిగి దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణం. మార్గమందు కౄరమృగాలకు తోడు దోపిడి దొంగ బెడద కూడ వుంటుంది గాబట్టి ఆ మహా పధంలో బాట సారులు గాని, బిడారులు గాని సమూహాలుగా కలిసి ప్రయాణం చేస్తారు. దారిలో ఎదురవుతున్న బిడారుల గుంపుల్ని చూస్తూ ముందుకు సాగిపోతున్నారు ఇద్దరూ. ఇలా ఉండగా`

అపర్ణుడిలోని మరో పార్శాన్ని కూడ దర్శించే అవకాశం ధనుంజయునికి నాలుగో రోజున చిక్కింది. అపర్ణుడికి ఏవో కొన్ని మంత్రాలు, మహిమలు వచ్చునుకున్నాడు గాని అతడెంత మాంత్రవాదో కళ్ళరా చూసే వరకు తెలుసుకోలేక పోయాడు.

*********************************

అది గోండ్వా జాతికి చెందిన ఒక సంచార తండా.

మహా పధంలో దట్టమైన అటవీ ప్రాంతంలో బాటకు కుడి పక్కన విశాలమైన మైదాన ప్రాంతాన దిగి వుంది. ఆ ప్రాంతం లోని పొదలు, మొక్కలు నరికి రాళ్ళు, రప్పలు ఏరి పారేసి తాత్కాలికంగా గుడారాలు లేపి విడిది చేసుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali